![Delhi Elections 2025: BJP May Take Action Against Ramesh Bidhuri](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/8/Ramesh%20Bidhuri_0.jpg.webp?itok=BKxN_UdW)
న్యూఢిల్లీ: మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన బీజేపీ నేత రమేష్ బిదురి(Ramesh Bidhuri)పై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఆయన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ సీఎం అతిషితో పాటు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇటు ఆప్, అటు కాంగ్రెస్‌లు దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. ఈ పరిణామాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.
ఈ పరిస్థితుల్లో ఆయన్ని ఎన్నికల నుంచి తప్పించడమో లేదంటే నియోజకవర్గాన్ని మార్చడమో చేయాలని ఆలోచిస్తున్నారట.ఈ అంశంపై రెండుసార్లు భేటీ జరిగినట్లు సమాచారం. ఇక బీజేపీ ఈ మధ్యే తొలి జాబితా విడుదల చేయగా.. కల్కాజీ నుంచి సీఎం అతిషిపైనే రమేష్ బిదురిని బీజేపీకి పోటీకి దింపింది. ఈ క్రమంలోనే ఓ సభలో పాల్గొన్న ఆయన అతిషిపైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని అభ్యర్థిగా కొనసాగించడం పార్టీకి మంచిది కాదని బీజేపీ భావిస్తోందట!.
కల్కాజీ నియోజకవర్గంలో రమేష్ బిదురిని తప్పించి.. ఆ స్థానంలో మహిళా అభ్యర్థిని అతిషిపై నిలపాలని బీజేపీ(BJP) అనుకుంటోంది. ఈ మేరకు రమేష్‌తోనూ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుజ్జర్ సామాజికవర్గపు బలమైన నేతగా పేరున్న రమేష్ బిదురి గతంలో.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పని చేశారు.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
రమేష్ బిదురి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గితే.. నియోజకవర్గంలోని రోడ్లను ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
.. సీఎం ఆతీషి ఆమె తండ్రినే మార్చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరును వినియోగిస్తున్నారు. అంతేకాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆమె తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు’’ అంటూ రమేశ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Comments
Please login to add a commentAdd a comment