Priyanka Gandhi Vadra
-
Delhi Elections: రమేష్ బిదురిపై బీజేపీ చర్యలు!
న్యూఢిల్లీ: మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన బీజేపీ నేత రమేష్ బిదురి(Ramesh Bidhuri)పై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఆయన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ సీఎం అతిషితో పాటు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇటు ఆప్, అటు కాంగ్రెస్‌లు దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. ఈ పరిణామాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.ఈ పరిస్థితుల్లో ఆయన్ని ఎన్నికల నుంచి తప్పించడమో లేదంటే నియోజకవర్గాన్ని మార్చడమో చేయాలని ఆలోచిస్తున్నారట.ఈ అంశంపై రెండుసార్లు భేటీ జరిగినట్లు సమాచారం. ఇక బీజేపీ ఈ మధ్యే తొలి జాబితా విడుదల చేయగా.. కల్కాజీ నుంచి సీఎం అతిషిపైనే రమేష్ బిదురిని బీజేపీకి పోటీకి దింపింది. ఈ క్రమంలోనే ఓ సభలో పాల్గొన్న ఆయన అతిషిపైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని అభ్యర్థిగా కొనసాగించడం పార్టీకి మంచిది కాదని బీజేపీ భావిస్తోందట!.కల్కాజీ నియోజకవర్గంలో రమేష్ బిదురిని తప్పించి.. ఆ స్థానంలో మహిళా అభ్యర్థిని అతిషిపై నిలపాలని బీజేపీ(BJP) అనుకుంటోంది. ఈ మేరకు రమేష్‌తోనూ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుజ్జర్ సామాజికవర్గపు బలమైన నేతగా పేరున్న రమేష్ బిదురి గతంలో.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పని చేశారు.ఇంతకీ ఆయన ఏమన్నారంటే..రమేష్ బిదురి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గితే.. నియోజకవర్గంలోని రోడ్లను ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. .. సీఎం ఆతీషి ఆమె తండ్రినే మార్చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరును వినియోగిస్తున్నారు. అంతేకాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆమె తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు’’ అంటూ రమేశ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
Year Ender 2024: ఎనిమిది ఘటనలు.. రాజకీయాల్లో పెనుమార్పులు
ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా నూతన సంవత్సరం-2025 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని గంటల్లోనే 2024 ముగియనుంది. తరువాత జనం నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోనున్నారు. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు చోటుచేసుకోబోతున్నప్పటికీ, భారత రాజకీయాలకు 2024 ప్రధానమైనదిగా నిలిచింది. 2024లో ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్లడం, 24 ఏళ్లు ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ఎన్నికల్లో ఓడిపోవడం వంటి ఘటనలు ఎప్పటికీ మరచిపోలేనివిగా నిలిచాయి.లోక్‌సభ ఎన్నికలు- 20242024 సార్వత్రిక ఎన్నికలకు(General Elections) ఓటింగ్ ఏప్రిల్ 19- జూన్ ఒకటి మధ్య ఏడు దశల్లో జరిగింది. ఈసారి ఎన్నికల ఫలితాలు పలు రాజకీయ పార్టీలకు షాకింగ్‌గా నిలిచాయి. కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. భారత మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయిన ఘనత ప్రధాని మోదీ దక్కించుకున్నారు.అయోధ్యలో బీజేపీ ఓటమి2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. 400 ఫిగర్ దాటుతుందనే నినాదం అందుకున్న బీజేపీ 240 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లకు గాను బీజేపీకి 37 సీట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి రెండు సీట్లు, అప్నాదళ్కి ఒక సీటు లభించాయి. దేశంలోనే అత్యంత హాట్ సీటుగా నిలిచిన అయోధ్య లోక్‌సభ స్థానంలో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.జైలుకెళ్లిన కేజ్రీవాల్ఎక్సైజ్ పాలసీ ‘స్కామ్’కు సంబంధించిన అవినీతి కేసులో అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్‌ను మద్యం కుంభకోణంలో 2024, మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసును ఈడీ, సీబీఐ రెండూ విచారించాయి. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12న సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ తాను ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ సెప్టెంబర్ 17న రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది.హేమంత్ సోరెన్ జైలు జీవితం2024లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అవినీతి కుంభకోణంలో జనవరిలో జైలుకు వెళ్లారు. ఆ తర్వాత చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు. అయితే ఆ తర్వాత బెయిల్ పొందిన హేమంత్ సోరెన్ తిరిగి సీఎం పదవిని చేపట్టారు. ఈఘటనల దరిమిలా చంపై సోరెన్ జెంఎంఎంను వీడి, భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం మరోసారి విజయం సాధించి, హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు.నవీన్ పట్నాయక్ ఓటమిఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఒడిశా రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరొందిన నవీన్ పట్నాయక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి 51 సీట్లకు తగ్గగా, బీజేపీకి 78 సీట్లు రావడంతో పట్నాయక్ 24 ఏళ్ల పాలనకు తెరపడింది.ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రంనెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) ఈ ఏడాది రాజకీయాల్లో క్రియాశీలక అరంగేట్రం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదిలి రాయ్‌బరేలీ స్థానానికి ఎంపీగా కొనసాగారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ప్రియాంక గాంధీని వయనాడ్ స్థానం నుండి బరిలోకి దింపింది. ఈ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ 64.99శాతం ఓట్లతో విజయం సాధించి తొలిసారి పార్లమెంటుకు చేరుకున్నారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలుఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమికి నిరాశే ఎదురైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి మహారాష్ట్ర ప్రజలు మద్దతు పలికారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 288 స్థానాలకు గానూ 230 స్థానాల్లో విజయం సాధించింది. మహాకూటమిలో భాగమైన బీజేపీ 132 సీట్లు, శివసేన 57 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 41 సీట్లు గెలుచుకున్నాయి. మరోవైపు ఎంవీఏ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొత్తం మీద 46 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దాదాపు 48 ఏళ్లుగా మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం విశేషం.ఢిల్లీ సీఎంగా అతిశీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీ సీఎం ఎవరనేదానిపైనే చర్చ జరిగింది. మనీష్ సిసోడియాకు ఢిల్లీ సీఎం పదవి ఇవ్వవచ్చని అంతా భావించారు. అయితే అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా కూడా అన్ని పదవులకు రాజీనామా చేశారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఢిల్లీ సీఎం పదవికి అతిశీ పేరును ప్రతిపాదించారు. అందరి అంగీకారంతో అతిశీ ఢిల్లీ సీఎం అయ్యారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: 180 ఐఏఎస్‌లు, 200 ఐపీఎస్‌ల ఎంపిక.. టాప్‌లో ఏ రాష్ట్రం? -
ఈసారి బంగ్లాదేశ్ బ్యాగ్..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తనదైన శైలిలో బ్యాగులతో సందేశానిచ్చే ప్రయ త్నం కొనసాగిస్తున్నారు. పాలస్తీనా అని ముద్రించి ఉన్న బ్యాగుతో సోమవారం ఆమె పార్లమెంట్ సమావేశాలకు హాజరైన విషయం తెలిసిందే. అలాగే, మంగళవారం బంగ్లాదేశ్‌లోని హిందువులు, క్రైస్తవులకు అండగా ఉంటాం(వియ్ స్టాండ్ విత్ ది హిందూస్ అండ్ క్రిస్టియన్స్ ఆఫ్ బంగ్లాదేశ్) అని రాసి ఉన్న బ్యాగుతో వచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులపై అత్యా చారా లను నిరసిస్తూ మంగళవారం పార్లమెంట్ ఆవరణ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలతోపాటు ప్రియాంక కూడా ఈ బ్యాగ్‌ను ధరించి పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు జరగాలంటూ వారు నినాదాలు చేశారు. కాగా, బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న అఘాయి త్యాలపై సోమవారం లోక్‌సభలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వ మద్దతుతోనే ఇవి సాగుతున్నాయని ఆరోపించారు. అంతకు ముందు, వారం క్రితం ఆమె మరో బ్యాగుతో పార్లమెంట్ వద్ద కనిపించారు. ఆ బ్యాగుపై ప్రధాని మోదీ, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీలు కలిసున్న చిత్రంతోపాటు ‘మోదీ అదానీ భాయీభాయీ’అని ముద్రించి ఉంది. प्रियंका के आने से विपक्ष में, कांग्रेस में एक जोश तो आया है, अंततः कोई तो बांग्लादेश के अल्पसंख्यकों के हितों की बात कर रहा है #PriyankaGandhi pic.twitter.com/awMqbrEVbe— Pooja Tiwari (@Irony_Pooja) December 17, 2024 -
మోదీ ప్రసంగం... యమా బోరు: ప్రియాంక
న్యూఢిల్లీ: లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం విసుగు తెప్పించిందని కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని ప్రసంగంలో కొత్త విషయం ఒక్కటీ లేదు. అన్నీ దశాబ్ధాల నాటి పాత విషయాలు. రెండు గణితం క్లాసులు ఒకేసారి విన్నంత బోర్‌గా ఫీలయ్యా’’ అన్నారు. ‘‘మోదీ ప్రసంగం చూసి జేపీ నడ్డా చేతులు నలుపుకున్నారు. అమిత్ షా తలపట్టుకున్నారు. పీయూష్ గోయెల్ నిద్రమత్తులోకి వెళ్లారు. ఇలాంటివి నేనెప్పుడూ చూడలేదు. మోదీ కొత్త అంశాలను ఆసక్తికరంగా చెప్పి ఉండాల్సింది’’ అన్నారు. ‘‘విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు మోదీ, అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సభలో ఎందుకు లేరు? అవినీతిని ఉపేక్షించమంటూ చెప్పే ప్రభుత్వం అదానీ అంశంపై చర్చకు ఎందుకు అంగీకరించడం లేదు’’ అని ఆమె ప్రశ్నించారు. -
సంవిధాన్.. సంఘ్ కా విధాన్ కాదు
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం అంటే సంఘ్ విధానం కాదన్న సంగతి ప్రధాని నరేంద్ర మోదీ అర్థం చేసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా అన్నారు. భారత్ కా సంవిధాన్ సంఘ్ కా విధాన్ కాదని తేల్చిచెప్పారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆమె శుక్రవారం లోక్‌సభలో 32 నిమిషాలపాటు హిందీ భాషలో మాట్లాడారు. రాజ్యాంగంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. న్యాయం, ఐక్యత, భావప్రకటనా స్వేచ్చకు రాజ్యాంగం ఒక రక్షణ కవచమని ఉద్ఘాటించారు. అలాంటి మహోన్నత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రియాంక ఇంకా ఏం మాట్లాడారంటే... నెహ్రూ పాత్రను ఎవరూ చెరిపేయలేరు ‘‘ఆర్థిక న్యాయానికి, రైతులకు, పేదలకు భూములు పంపిణీకి చేయడానికి మన రాజ్యాంగమే పునాది వేసింది. బీజేపీ నేతలు తరచుగా జవహర్లాల్ నెహ్రూను వేలెత్తి చూపుతున్నారు. వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నెహ్రూపై నిందలు వేస్తున్నారు. దేశం కోసం మీరేం చేస్తున్నారో చెప్పకుండా నెహ్రూను విమర్శిస్తే లాభం లేదు. గతంలో అది జరిగింది, ఇది జరిగింది అని బీజేపీ సభ్యుల విమర్శలు చేస్తున్నారు. రాజకీయ న్యాయం గురించి మాట్లాడుతున్నారు. డబ్బు బలంతో ప్రభుత్వాలను పడగొట్టింది మీరు కాదా? మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యాంగం అమలు కాలేదు. బీజేపీకి నిజంగా ధైర్యం ఉంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు అసలు నిజం ఏమిటో బయటపడుతుంది. మోదీకి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు గతంలో రాజులు మారువేషాల్లో ప్రజల్లోకి వెళ్లేవారని చదువుకున్నాం. తమ పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో రాజులు స్వయంగా తెలుసుకొనేవారట. తమపై ప్రజల ఆరోపణలు ఏమిటో గ్రహించేవారట. ఇప్పటి రాజు(నరేంద్ర మోదీ) వేషాలు మార్చేయడంలో ఆరితేరిపోయారు. కానీ, ప్రజల్లో వెళ్లే ధైర్యం గానీ, ఆరోపణలు వినే ధైర్యం గానీ ఆయనకు లేదు. మన ప్రధానమంత్రి రాజ్యాంగం ఎదుట తలవంచి నమస్కరించారు. రాజ్యాంగానికి నుదురు తాకించారు. సంభాల్, హథ్రాస్, మణిపూర్‌లో న్యాయం కోసం ఆక్రోశించినప్పుడు ఆయన మనసు చలించలేదు. ఆయన నుదుటిపై చిన్న ముడత కూడా పడలేదు. రాజ్యాంగాన్ని మోదీ అర్థం చేసుకోలేదు.భయాన్ని వ్యాప్తి చేసినవారు భయంతో బతుకుతున్నారు దేశంలో కుల గణన జరగాలన్నదే ప్రజల అభిమతం. అందుకోసం వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభించాలి. కేవలం ఒక్క బిలియనీర్(గౌతమ్ అదానీ) కోసం దేశ ప్రజలంతా కష్టాలు అనుభవించాలా? దేశంలో అసమానతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. బ్రిటిష్ పాలనలో ఉన్నట్లుగానే నేడు భయం అంతటా ఆవహించింది. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాం«దీజీ భావజాలం కలిగిన వ్యక్తులు ఒకవైపు, బ్రిటిషర్లతో అంటకాగిన భావజాలం కలిగిన వ్యక్తులు మరోవైపు ఉన్నారు. భయానికి ఒక లక్షణ ఉంది. భయాన్ని వ్యాప్తి చేసేవారే ఆదే భయానికి బాధితులవుతారు. ఇది సహజ న్యాయం. నేడు దేశంలో భయాన్ని వ్యాప్తి చేసినవారు అదే భయంతో బతుకున్నారు. చర్చకు, విమర్శకు భయపడుతున్నారు’’ అని ప్రియాంక అన్నారు. -
ఆమె పైనే అందరి దృష్టి
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ పార్టీకి అదనపు బలంగా మారబోతున్నారు. గాంధీ–నెహ్రూ కుటుంబ వారసత్వంతో పాటు ఇందిరాగాంధీ ఆహార్యంతో భవిష్యత్తు భారత రాజకీయాలపై ఆమె చూపించబోయే ప్రభావంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.2004 లోక్‌సభ ఎన్నికలలో రాయబరేలి నుండి పోటీ చేసిన తల్లి సోనియాగాంధీ, అమేథీ నుండి పోటీ చేసిన అన్న రాహుల్ గాంధీల తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత అడపా దడపా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే 2022లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా – ఉత్తరప్రదేశ్ ఇన్చార్జిగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తీవ్ర ప్రచారం చేసినా తన పార్టీని ఘోర పరాజయం నుండి కాపాడలేక పోయారు. కానీ 2022లో జరిగిన హిమాచల్‌ప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో అన్నీ తానై అధికార బీజేపీని ఓడించడానికి దోహద పడ్డారు. ఈ విజయం... ఆ తర్వాత జరిగిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర శాసనసభల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవటానికి స్ఫూర్తినిచ్చింది. 18వ లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మహిళల మెడలో మంగళ సూత్రాలు మాయం చేస్తారనే మోదీ విమర్శలకు ధీటుగా స్పందించారామె. ‘ఈ దేశ ప్రజల కోసం నా తల్లి సోనియా గాంధీ తన మంగళ సూత్రాన్ని త్యాగం చేసింద’ని మోదీ విమర్శలను తిప్పి కొట్టిన తీరు ఓటర్లను ఆకర్షించినట్లుంది. మరి 4లక్షల మెజారిటీని ఓటర్లు కట్టబెట్టారంటే మామూలు సంగతి కాదు.లోక్‌సభలో విపక్షం నుండి ప్రభుత్వంపై బలమైన విమర్శలతో విరుచుకుపడే సుప్రియా సూలే, మహువా మొయిత్రాకి తోడుగాప్రియాంక గాంధీ చేరడం విపక్ష ‘ఇండియా’ కూటమికి రాజకీయంగా కలిసి వచ్చే అంశమే. రాహుల్ గాంధీ ఉత్తర భారత్ నుండి, ప్రియాంక గాంధీ దక్షిణ భారతం నుండి ప్రాతినిధ్యం వహించటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చూడాలి. ఇంతకు ముందు దక్షిణాదికి చెందిన తెలంగాణలోని మెదక్ నుండి ఇందిరా గాంధీ, కర్ణాటకలోని బళ్లారి నుండి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. – డా‘‘ తిరునహరి శేషు ‘ రాజకీయ విశ్లేషకులు, వరంగల్ -
కసవు చీరలో మెరిసిన ప్రియాంక.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది ఘన విజయం సాధించారు. ఇవాళ(గరువారం (నవంబర్ 28, 2024న)) ఆమె లోక్‌సభలో కసవు చీర ధరించి చేతిలో భారత రాజ్యంగ కాపీని పట్టుకొని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా కేరళ చీరలో ఆమె ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకట్టుకుంది. కేరళ వారసత్వానికి చిహ్నమైన ఆ చీరతో ఎంపీగా బాధ్యతలను స్వీకరించి శతాబ్దాల నాటి గొప్ప చరిత్రను మరోసారి వెలుగెత్తి చాటారు. ఈ కసవు చీరతో కేవలం కేరళ సంస్కాృతినే గాక నాటి పూర్వీకుల మూలాలని గుర్తుచేశారు ప్రియాంక. ఈ సందర్భంగా కసవు చీర, దాని ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలుసుకుందామా..!కసవు చీర అనేది కేరళలో ఉండే హిందూ, బౌద్ధ, జైన సంస్కృతుల నాటిది. ఏనుగు దంతాలతో కూడిన బంగారు కసవు చీరను పురాతన కాలంలో రాయల్టీకి చిహ్నంగా ప్రభువులు ధరించేవారు. మలయాళీ వేడుకల్లో అంతర్భాగం ఈ చీరలు. ఈ చీరతోనే అక్కడ అసలైన పండుగ వాతావరణ వస్తుంది. నిజానికి సాంప్రదాయ కసవు చీర చేతితో నేసిన పత్తితో తయారు చేస్తారు. అంతేగాదు దీనిలో నిజమైన బంగారం, వెండి దారాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం రంగు దారాలను చౌక ధరల్లో లభించేలా ఈ కసవు చీరలను నేస్తున్నారు. ఈ చీరకు జీఐ ట్యాగ్ కూడా లభించింది. నిజానికి ఈ చీరలు నేయడం అత్యంత సంక్లిష్టత, నైపుణ్యంతో కూడిన చేనేత పని. ఈ చీరలు మూడు ప్రధాన చేనేత కేంద్రాలు బలరామపురం, చెందమంగళం , కుతంపుల్లిల వద్ద ప్రసిద్ధిగాంచింది. కుతంపుల్లి చీరల్లో జరీతోపాటు ఏనుగు దంతాకృతి ఉంటుంది. ఒక్కొసారి మానవ బొమ్మలు వంటి మూలాంశాలు ఉంటాయి. ఈ చీరకు ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటంటే మోహినియాట్టం వంటి నృత్య ప్రదర్శనల సమయంలో, కేవలం కసవు వస్త్రాలు మాత్రమే నృత్యకారులు ధరిస్తారు. ఇలా అలాగే కైకొట్టికళి, తిరువాతిరక్కళి వంటి నృత్యాలలో మహిళా ప్రదర్శకులు సాంప్రదాయ ఎరుపు బ్లౌజుతో కూడా కసవు చీరలను ధరిస్తారు.(చదవండి: ఫేస్ యోగా"తో..సెలబ్రిటీల మాదిరి ముఖాకృతి సొంతం!) -
వయనాడ్‌లో ప్రియాంకం
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భారీ విజయంతో బోణీ కొట్టారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో అనివార్యమైన వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో 6,22,338 ఓట్లు సాధించారు. కాగా తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరి కన్నా 4,10,931 ఓట్లు ఎక్కువ సాధించారు.ప్రియాంకతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అత్యధికంగా 6,47,445 ఓట్లు సాధించడం విశేషం. ఆనాడు రాహుల్ 3,64,422 ఓట్ల తేడాతో గెలిస్తే శనివారం ప్రియాంక అంతకుమించిన మెజారిటీతో జయకేతనం ఎగరేయడం గమనార్హం. వయనాడ్‌లో గెలిచిన తర్వాత ప్రియాంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఢిల్లీలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వయనాడ్ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ‘ఎక్స్’వేదికగా వయనాడ్ ఓటర్లకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రియతమ సోదరసోదరీమణులారా.. వయనాడ్‌లో మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయా. రాబోయే రోజుల్లో ఈ గెలుపు మీ విజయమని మీరు భావించేలా పనిచేస్తా. మీ కోసం నేను పోరాడతా. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నా. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా తల్లి సోనియా, భర్త రాబర్ట్, రత్నాల్లాంటి పిల్లలు రైహాన్, మిరాయా... మీరు నాకు ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదు. నా సోదరుడు రాహుల్.. నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి. నాకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు’’అని ప్రియాంక వ్యాఖ్యానించారు. తన విజయం కోసం కృషిచేసిన యూడీఎఫ్ కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలు, వలంటీర్లకు రుణపడి ఉన్నానని ప్రియాంక అన్నారు. ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ వయనాడ్‌లో 74 శాతంగా నమోదైన పోలింగ్ ఈసారి నవంబర్ ఉప ఎన్నికల్లో 65 శాతానికి తగ్గింది. ప్రియాంకతో పోటీపడిన సత్యన్ మోకెరికి 2,11,407 ఓట్లు, బీజేపీ నాయకురాలు నవ్యా హరిదాస్‌కు కేవలం 1,09,939 ఓట్లు పడ్డాయి. నిఖార్సయిన నేత సోదరుడితో కలిసి ప్రచారవేదికల్లో సరదాగా సంభాషించినా, తండ్రి మరణం, తల్లి నిర్వేదంపై మనసుకు హత్తుకునేలా మాట్లాడి, ప్రజాసమస్యలపై గళమెత్తి తనలోని నిఖార్సయిన రాజకీయనేత పార్శా్యలను అద్భుతంగా ఆవిష్కరించి ఓటర్ల మనసును చూరగొన్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 99 సీట్లు సాధించడంలో ప్రియాంక కృషి కూడా ఉంది. ‘‘ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తేమోగానీ రాజకీయాలకు కొత్తకాదు’’అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ ప్రాచుర్యం పొందాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2019 జనవరిలో ఉత్తరప్రదేశ్ తూర్పు రీజియన్ ఎన్నికల ప్రచారబాధ్యతలను మోశారు. మొత్తం రాష్ట్రానికి జనరల్ సెక్రటరీ(ఇన్చార్జ్)గానూ పనిచేశారు. 1972 జనవరి 12న జని్మంచిన ప్రియాంక ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ పాఠశాలల్లో చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో డిగ్ర పట్టా పొందారు. బుద్దుని బోధనలపై పీజీ చేశారు. My dearest sisters and brothers of Wayanad, I am overwhelmed with gratitude for the trust you have placed in me. I will make sure that over time, you truly feel this victory has been your victory and the person you chose to represent you understands your hopes and dreams and…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 23, 2024ఎట్టకేలకు లోక్‌సభకు పార్టీ ప్రచారకర్త నుంచి పార్లమెంట్‌దాకా 52 ఏళ్ల ప్రియాంక స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగించారు. టీనేజర్‌గా ఉన్నపుడు తండ్రి ప్రధాని హోదాలో పార్లమెంట్లో ప్రసంగిస్తున్నపుడు పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పుడు తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌తో కలిసి పార్లమెంట్ మెట్లు ఎక్కబోతున్నారు. యూపీఏ ప్రభుత్వాల హయాంలో కాంగ్రెస్ హవా కొనసాగినా ప్రియాంక ఏనాడూ తేరగా పదవులు తీసుకోలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఓటర్ల మెప్పుపొందాకే రాజ్యాంగబద్ధ హోదాకు అర్హురాలినని ఆనాడే చెప్పారు. అందుకే దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాసరే ఏనాడూ పదవులు తీసుకోలేదు. నెహ్రూ–గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన 10వ సభ్యురాలుగా ప్రియాంక నిలిచారు. ఆమె కంటే ముందు వారి కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాం«దీ, ఫిరోజ్ గాం«దీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాం«దీ, సోనియా గాం«దీ, మేనకా గాం«దీ, రాహుల్ గాం«దీ, వరుణ్ గాంధీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో అధికారంలోలేని ప్రస్తుత తరుణంలో సోదరుడు రాహుల్‌తో కలసి పార్లమెంట్ వేదికగా ప్రజా గొంతుకను బలంగా వినిపించాల్సిన తరుణం వచ్చింది. -
బీజేపీ నేతలు ప్రజానుబంధం ఏనాడో తెంచుకున్నారు
వయనాడ్: వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ వాద్రా విమర్శలను పెంచారు. ఆదివారం నైకెట్టి, సుల్తాన్ బతేరీ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆమె ఎన్నికల ప్రచారర్యాలీల్లో గిరిజనులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ ఇక్కడున్న పెద్దవాళ్లలో చాలా మందికి మా నాన్నమ్మ ఇందిరాగాంధీ బాగా తెలిసే ఉంటుంది. గిరిజనులతో ఆమెకు ఎంతో అనుబంధం ఉండేది. ఇక్కడి భూమి, అడవులు, నేల, నీరుతో గిరిజనులు అవినాభావ సంబంధం ఉంది. పేదల అభ్యున్నతి కోసమే అటవీ చట్టం, గ్రామీణ ఉపాధ హామీ పథకం, విద్యాహక్కుచట్టం తెచ్చాం. అదే బీజేపీ నేతలు సొంతవాళ్లనే పట్టించుకుంటూ గిరిజనులను, జనాలను గాలికొదిలేసింది. అసలు బీజేపీ నేతలు ప్రజలతో బంధాన్ని ఏనాడో తెంచుకున్నారు’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. -
Priyanka Gandhi: సొంతబిడ్డల్లా సంరక్షిస్తా
వయనాడ్(కేరళ): కేరళలో వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యరి్థగా బరిలో దిగిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం ప్రచారంలో పాల్గొన్నారు. పిల్లల ఆలనాపాలనా తల్లి ఎంత శ్రద్ధగా, జాగ్రత్తగా చూస్తుందో అదేరీతిలో తాను పౌరుల బాగోగులను పట్టించుకుంటానని ప్రియాంక వ్యాఖ్యానించారు. మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలాంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అకంపదం, పొథుకల్లు పట్టణాల్లో ప్రియాంక ప్రసంగించారు. ‘‘గెలిపించి నాకొక అవకాశం ఇస్తే మీ సమస్యలపై ఒక్క పార్లమెంట్లోనేకాదు వేర్వేరు సందర్భాల్లో ప్రతి ఒక్క భిన్న వేదికపై పోరాడతా. గతంలో గెలిపించిన రాహుల్‌పై వయనాడ్ ప్రజలకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నన్ను గెలిపిస్తే నా కుటుంబానికి ఇంత మద్దతుగా ఉన్న మీకందరికీ సాయపడతా’’అని ఓటర్లునుద్దేశించి అన్నారు. ‘‘మోదీ ప్రభు త్వం సాయం అందక వయనాడ్‌లోని కొండలు, గ్రామీణ ప్రాంత రైతులు, చిరువ్యాపారులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. బీజేపీ విభజన, విద్వేష రాజకీయాలే ఇందుకు కారణం’’అని అన్నారు. వయనాడ్ స్థానానికి నవంబర్ 13వ తేదీన పోలింగ్ జరగనుంది. -
ప్రధానమంత్రి పదవి ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు
న్యూఢిల్లీ: దేశంలో 140 కోట్ల మంది ప్రజలకు నరేంద్ర మోదీ పదేపదే డొల్ల హామీలు ఇస్తూ ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గురించి ఆందోళనను పక్కనపెట్టి, ప్రధాని పదవి గౌరవాన్ని పెంచడంపై ఇకనైనా దృష్టి పెట్టాలని మోదీకి హితవు పలికారు. ఈ మేరకు ప్రియాంక శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సత్యమే దేవుడు, సత్యమేవ జయతే అని జాతిపిత మహాత్మాగాంధీ తరచుగా బోధిస్తూ ఉండేవారని పేర్కొన్నారు. వేలాది సంవత్సరాల మన సంస్కృతికి సత్యమే ఆధారమని ఉద్ఘాటించారు. ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పడం, డొల్ల హామీలు ఇవ్వడం సరైందని కాదని స్పష్టంచేశారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాయన్ని వెల్లడించారు. గ్యారంటీలతో ప్రజల సొమ్మును ప్రజలకు అందజేస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ ఎన్నో హామిలిచ్చారని, వాటిలో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మోదీ హామీలన్నీ బూటకమేనని తేలిపోయిందన్నారు. ‘అచ్చే దిన్’ ఎక్కడున్నాయో చెప్పాలని నిలదీశారు. -
ఎన్నికల్లో పోటీ చేయడమే కొత్త.. ప్రజా పోరాటాలు కొత్త కాదు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ప్రజా పోరాటాలు తనకు కొత్త కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారి తరఫున ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నానని గుర్తుచేశారు. రాజ్యాంగం నిర్దేశించిన విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, న్యాయం కోసం పోరాటం సాగించానని, అదే తన జీవితానికి కేంద్ర బిందువు అని వెల్లడించారు. ఈ మేరకు వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు రాసిన బహిరంగ లేఖను ప్రియాంక శనివారం విడుదల చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ వారికి ప్రతినిధిగా వ్యవహరించారని తెలియజేశారు. వయనాడ్ ప్రజలతో కలిసి పనిచేస్తానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. నవంబర్ 13న జరిగే ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని వయనాడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని ఉద్ఘాటించారు. ప్రజా సేవకురాలిగా తన ప్రయాణానికి వయనాడ్ ప్రజలే మార్గదర్శకులు, గురువులు అని ప్రియాంక స్పష్టంచేశారు. తన సోదరుడు రాహుల్ గాం«దీపై చూపిన ప్రేమానురాగాలే తనపైనా చూపించాలని కోరారు. సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, అరుదైన వనరులను బహుమతిగా పొందిన వయనాడ్‌కు ప్రజాప్రతినిధి కావడం తన అదృష్టంగా, గర్వకారణంగా భావిస్తానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. -
ప్రియాంక నామినేషన్
వయనాడ్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీకి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం రాత్రి కేరళకు చేరుకున్న ప్రియాంక బుధవారం వయనాడ్ జిల్లా కేంద్రమైన కాల్పెట్టా నగరంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, కర్నాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిగా హాజరైన జన వాహినిని ఉద్దేశించి ప్రియాంక ప్రసంగించారు. మొదటిసారిగా 1989లో 17 ఏళ్ల వయసులో తన తండ్రి రాజీవ్ గాం«దీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. అప్పటినుంచి 35 ఏళ్లుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నానని తెలిపారు. తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌తోపాటు కాంగ్రెస్ నేతల కోసం ప్రచారం చేశానని వెల్లడించారు. తన విజయం కోసం తాను ప్రచారం చేసుకోవడం ఇదే తొలిసారి అని ఉద్ఘాటించారు. వయనాడ్‌లో పోటీ చేసే అవకాశం కలి్పంచిన మల్లికార్జున ఖర్గేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రియాంక పేర్కొన్నారు. ఉప ఎన్నికలో తనను గెలిపించాలని కోరారు. వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా, గొప్ప గౌరవంగా భావిస్తానని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. మొత్తం ప్రపంచమంతా తన సోదరుడు రాహుల్ గాం«దీకి వ్యతిరేకంగా మారిన సమయంలో వయనాడ్ ప్రజలు మాత్రం ఆయనకు అండగా నిలిచారని చెప్పారు. తన కుటుంబమంతా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. వయనాడ్‌ను విడిచి వెళ్తున్నందుకు రాహుల్ బాధపడుతున్నారని వెల్లడించారు. రాహుల్‌కు, ప్రజలకు బంధాన్ని తాను మరింత బలోపేతం చేస్తానన్నారు. వయనాడ్‌కు ఇద్దరు ఎంపీలు: రాహుల్ తన చెల్లెలు ప్రియాంక బాగోగుల మీరే చూసుకోవాలి అంటూ వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతు ఇచి్చనట్లుగానే తన సోదరికి సైతం ఇవ్వాలన్నారు. వయనాడ్‌కు తాను అనధికారిక ఎంపీనని, ప్రియాంక అధికారిక ఎంపీ అవుతుందని చెప్పారు. పార్లమెంట్లో వయనాడ్‌కు ఇద్దరు ఎంపీలు ఉంటారని స్పష్టంచేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... ప్రియాంకా గాం«దీని ఆశీర్వదించాలని వయనాడ్ ఓటర్లను కోరారు. రోడ్ షో అనంతరం ప్రియాంకా గాంధీ వయనాడ్ కలెక్టరేట్‌కు చేరుకొని, నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, కె.సి.వేణుగోపాల్ ఉన్నారు. నామినేషన్ తర్వాత ప్రియాంక, రాహుల్ పుత్తుమల శ్మశాన వాటికను సందర్శించారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులరి్పంచారు. ప్రియాంక గాంధీ ఆస్తులు రూ.12 కోట్లు తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. నామినేషన్‌తోపాటు అఫిడవిట్‌ను బుధవారం ఎన్నికల అధికారికి సమరి్పంచారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు ఉందని తెలియజేశారు. అలాగే రూ.1.15 కోట్ల విలువైన 4,400 గ్రాముల బంగారం ఉన్నట్లు వెల్లడించారు. ఇక స్థిరాస్తుల విలువ రూ.7.74 కోట్లుగా పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో సొంతంగా కొన్న ఇంటి విలువను రూ.5.63 కోట్లుగా ప్రస్తావించారు. అలాగే రూ.15.75 లక్షల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రియాంకా గాం«దీపై గతంలో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అటవీ శాఖ నుంచి ఆమెకు నోటీసు అందింది. భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
ఎట్టకేలకు ప్రియాంక బరిలోకి : ఇందిర వారసత్వాన్ని నిలుపుకుంటుందా?
కాంగ్రెస్ శ్రేణుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. తమ ప్రియతమ నేత ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న కోరిక నెరవేరబోతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కొన్నేళ్లుగా, తన సోదరుడు రాహుల్ గాంధీకి అండగా ఉంటూ పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ప్రియాంక ఇక గాంధీ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచారానికి బాధ్యత వహించిన, రాజకీయాల్లోకి అధికారిక ప్రవేశించినప్పటికీ ఎన్నికల సమరంలోకి దూకడం మాత్రం ఇదే ప్రథమం. రాహుల్ గాంధీ విజయం సాధించి (రెండు చోట్ల గెల్చిన సందర్భంగా ఇక్కడ రాజీనామా చేయాల్సి వచ్చింది) కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. పలువురు కాంగ్రెస్ పెద్ద సమక్షంలో బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ గురించి కొన్ని అంశాలను పరిశీలిద్దాం.రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రియాంక గాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె. ఆమె ముత్తాత దివంగత జవహర్ లాల్ నెహ్రూ , దేశానికి స్వాతంత్ర ఉద్యమ నేత. దేశ తొలి ప్రధానమంత్రి. ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ , తండ్రి రాజీవ్ గాంధీ ఇద్దరూ నెహ్రూ అడుగుజాడల్లో నడిచినవారే. ఇద్దరూ ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేసిన వారే. అంతేకాదు ఇద్దరూ పీఎంలుగా పదవిలో ఉన్నపుడే హత్యకు గురయ్యారు. 1984లో కేవలం 12 సంవత్సరాల వయస్సులో, నానమ్మ ఇందిర అంగరక్షకులచే హత్యకు గురి కావడాన్ని చూసింది., రాహుల్ గాంధీకి 14 ఏళ్లు. ఆ దుఃఖంనుంచి తేరుకోకముందే ఏడేళ్లకు తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో జరిగిన ఆత్మాహుతి దాడిలో తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని పొగొట్టుకుంది. అప్పటికి ప్రియాంకకు కేవలం 19 ఏళ్లు. అంత చిన్న వయసులోనే తల్లికి, సోదరుడుకి అండగా నిలబడింది. ఆ సమయంలోనే ఇందిర గాంధీ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తుందని అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ పండితులు భావించారు. కానీ అనూహ్యంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలను పుచ్చుకున్నారు. ఇక ప్రియాంక 25 సంవత్సరాల వయస్సులో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో పెళ్లి తరువాత రాజకీయాలకు చాలా దూరంగా ఉంది. బిడ్డల పెంపకంలో నిమగ్నమైంది.అయితే 1990ల చివరి నాటికి, కాంగ్రెస్ కష్టాలు మొదలైనాయి. ప్రియాంక రంగంలోకి దిగినప్పటికీ ఆమె పాత్ర తెరవెనుకకు మాత్రమే పరిమితమైంది. సోదరుడు రాహుల్‌కు మద్దతు ఇస్తూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పరోక్షంగా రాహుల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సమయంలో ఆమె ప్రదర్శించిన రాజకీయ నైపుణ్యం, ప్రజలతోసులువుగా మమేకం కావడం సీనియర్ నాయకులను, ప్రజలను ఆకట్టుకుంది. స్టార్ క్యాంపెయినర్‌గా నిలిచింది. బ్యాక్‌రూమ్ వ్యూహకర్తగా, ట్రబుల్షూటర్గా, కాంగ్రెస్‌కు టాలిస్ మాన్‌గా పేరు తెచ్చుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంది. దీంతో ముఖ్యంగా పేద ప్రజలతో ఆమెలో అలనాటి ఇందిరమ్మను చూశారు.అంతేకాదు సామాజిక సమస్యలు, ఉద్యమాల పట్ల ఆమె స్పందించిన తీరు, చూపించిన పరిణితి ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా 2008లో, ఆమె తన తండ్రి ,రాజీవ్ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినిని జైలులో కలుసుకోవడం, ఆమెతో సంభాషించడం విశేషంగా నిలిచింది. అలాగే ఇటీవలి ఎన్నికల్లో మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొని రాయబరేలీలో సోదరుడు రాహుల్‌ని, అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కిషోరీ లాల్ శర్మను గెలిపించి అమేథీని దక్కించుకుని పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి. చివరికి ఇన్నాళ్లకు కేరళనుంచి ఎన్నికల సమరంలోకి దిగింది ప్రియాంక గాంధీ వాద్రా. అనేక సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య దేశాన్ని ఏలి శక్తివంతమైన మహిళగా ఖ్యాతికెక్కిన ఇందిదా గాంధీ వారసత్వాన్ని నిలుబెట్టుకుందా? ప్రజల ఆదరణను నోచుకుంటుందా? బహుళ ప్రజాదరణ నేతగా ఎదుగుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ప్రియాంక చదువు,కుటుంబం1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ.మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రియాంక గాంధీ, భర్త రాబర్ట్ వాద్రాపై మనీ లాండరింగ్, వివాదాస్పద భూముల కొనుగోళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని వాద్రా ఖండిచారు. అలాగే ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశించినవని పార్టీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. -
ప్రియాంక ప్రత్యర్థి సత్యన్ మొకెరి
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీపై పోటీకి వామపక్ష ఎల్డీఎఫ్ సత్యన్ మొకెరిని ఎంపిక చేసింది. సీపీఐకి చెందిన మొకెరి కొజికోడ్ జిల్లాలోని నాదపురం మాజీ ఎమ్మెల్యే. వ్యవసాయ రంగానికి చెందిన సమస్యలపై పనిచేసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. వయనాడ్‌లో సత్యన్ మొకెరి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా ఉంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వమ్ గురువారం ప్రకటించారు. మొకెరి 2014 వయనాడ్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఐ.షానవాజ్ చేతిలో దాదాపు 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచి రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచి్చన విషయం తెలిసిందే. నవంబరు 13న వయనాడ్‌లో పోలింగ్ జరగనుంది. -
Mallikarjun Kharge: ఎదురొడ్డి నిల్చున్నారు
న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రబోధించిన అంకితభావం, విలువలున్న రాహుల్ గాంధీ దేశంలో తమ వాణిని వినిపించలేకపోయిన కోట్లాది మందికి గొంతుకగా మారారని రాహుల్‌ను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పొగడ్తల్లో ముంచెత్తారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ 54వ పుట్టినరోజు వేడుకను పార్టీ కీలక నేతలు జరిపారు. ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, కోశాధికారి అజయ్ మాకెల్ తదితరుల సమక్షంలో రాహుల్ కేక్ కట్‌చేశారు. పెద్దసంఖ్యలో అక్కడికొచ్చిన కార్యకర్తలు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవద్దని సామాజిక, దాతృత్వ కార్యక్రమాల్లో నిమగ్న మవ్వాలని పార్టీ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. ‘‘ కాంగ్రెస్ పాటించే సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వం, తపన అన్నీ మీలో ప్రతిబింబిస్తున్నాయి. ప్రతి ఒక్కరి కన్నీటి కష్టాలు తుడిచేసి సత్యానికి ఉన్న శక్తిని చాటుతున్నారు’ అని ఖర్గే ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘‘ నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సమాజం కోసం పరితపించే విలక్షణమైన వ్యక్తి, నా స్నేహితుడు, మార్గదర్శకుడు, నేత’ అంటూ ప్రియాంకా ట్వీట్‌చేశారు. ‘‘ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజల పట్ల మీకున్న అంకితభావం దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్‌చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
వయనాడ్ నుంచి ప్రియాంక
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ స్థానాల్లో ఎంపీగా విజయం సాధించిన రాహుల్ గాంధీ ఇకపై రాయ్‌బరేలీ నుంచే కొనసాగుతారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. రెండింటా గెలిస్తే చట్టం ప్రకారం ఒక స్థానంలోనే కొనసాగాలి కాబట్టి రాయ్‌బరేలీ నుంచే రాహుల్ గాంధీ కొనసాగుతారని స్పష్టంచేశారు. ఎంతో అంతర్మథనం, చర్చల తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించిన రాహుల్‌కు ఖర్గే ధన్యవాదాలు తెలిపారు. రాయ్‌బరేలీ స్థానంతో రాహుల్ కుటుంబానికి తరతరాలుగా అనుబంధం ఉందని గుర్తుచేశారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా రాయ్‌బరేలీ నుంచే రాహుల్ కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు. వయనాడ్ ప్రజల ప్రేమాభినాలు రాహుల్‌కు లభించాయన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రియాంకా గాంధీ ఎంతో సహకరించారని ఖర్గే అభినందించారు. రాహుల్ ఏ స్థానం వదులుకోవాలన్న అంశంపై కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్, ప్రియాంకా గాం«దీ, కె.సి.వేణుగోపాల్ తదితరులు సోమవారం ఢిల్లీలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ అనంతరం ఖర్గే, రాహుల్ మీడియాతో మాట్లాడారు. రాయ్‌బరేలీతోపాటు వయనాడ్‌తో తనకు భావోద్వేగపూరిత అనుబంధం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. వయనాడ్‌ను వదులుకోవడం చాలా కఠిన నిర్ణయమేనని వెల్లడించారు. గత ఐదేళ్లపాటు వయనాడ్ ఎంపీగా కొనసాగడం అద్భుతమైన అనుభవం అని చెప్పారు. వయనాడ్ ప్రజలు తనకు అండగా నిలిచారని, సంక్షోభ సమయాల్లో తనకు కొత్త శక్తిని ఇచ్చారని కొనియాడారు. వారిని ఎప్పటికీ మర్చిపోలేనని వ్యాఖ్యానించారు. ఇకపై కూడా వయనాడ్‌ను సందర్శిస్తూనే ఉంటానని, అక్కడి ప్రజలకు ఇచి్చన హామీలను నెరవేరుస్తానని ఉద్ఘాటించారు. ఐదేళ్లపాటు ఎంతో ప్రేమాభిమానాలు పంచిన వయనాడ్ ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు తెలియజేశారు. వయనాడ్ నుంచి తన సోదరి ప్రియాంక పోటీ చేస్తుందని తెలిపారు. తమకు ఇద్దరు ఎంపీలు ఉన్నట్లుగా భావించాలని వయనాడ్ ప్రజలకు రాహుల్ సూచించారు. సంతోషంగా ఉంది: ప్రియాంకా గాంధీ వయనాడ్ నుంచి తాను పోటీ చేయాలని పార్టీ తీసుకున్న నిర్ణయంపై ప్రియాంకా గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా రాయ్‌బరేలీ, అమేథీలో పనిచేశానని, ఆ బంధం ఎట్టి పరిస్థితుల్లోనూ తెగిపోదని అన్నారు. ఆ బంధాన్ని కొనసాగించేందుకు తాను, రాహుల్ ఉన్నామని చెప్పారు. రాయ్‌బరేలీ, వాయనాడ్‌లో తనతోపాటు రాహుల్ ఉంటూ ఇద్దరం కలిసి పనిచేస్తామని తెలిపారు. రాహుల్ అందుబాటులో లేరన్న అభిప్రాయం వయనాడ్ ప్రజల్లో కలగకుండా చూస్తానని ప్రియాంక గాంధీ చెప్పారు. తొలిసారిగా పోటీ చేస్తున్న ప్రియాంక ప్రియాంకా గాంధీ 2019లో క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. అతిత్వరలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ లేదా ఆమేథీ లేదా వారణాసిలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, పోటీకి దూరంగానే ఉన్నారు. ప్రచారంలో పాల్గొన్నారు. రాయ్‌బరేలీ, ఆమేథీలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. రాహుల్ ఖాళీ చేస్తున్న వయ నాడ్ రాడ్ స్థానానికి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరుగనుంది. 52 ఏళ్ల ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
వయనాడ్ బరిలో ఆమె.. కాంగ్రెస్ పరిశీలన?!
న్యూఢిల్లీ: వయనాడా? రాయ్బరేలీనా?.. మరో మూడు రోజుల్లో ఏ ఎంపీ సీటు వదులుకుంటారో రాహుల్ గాంధీ నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. లేకుంటే.. ఆ రెండు స్థానాలకు ఆయన కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయంలో తానూ డైలమాలో ఉన్నట్లు స్వయంగా రాహుల్ గాంధీనే ప్రకటించారు. దీంతో ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. రాయ్‌బరేలీ, వయనాడ్ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన రాహుల్ గాంధీ భారీ మార్జిన్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఒక్కపక్క.. తమ దగ్గరి నుంచే ఎంపీగా కొనసాగాలంటూ ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ సీనియర్లు రాహుల్‌ను కోరుతుండడం గమనార్హం. మరోవైపు.. తన నిర్ణయం రెండు నియోజకవర్గాల ప్రజలకు సంతోషాన్ని ఇస్తుందని రాహుల్ తాజాగా స్పష్టం చేశారు. ఇరు చోట్లా పర్యటించిన అనంతరం వయనాడ్‌నే ఆయన వదులుకోవడం దాదాపు ఖరారు కాగా.. ఈలోపు ఆ స్థానంలో పోటీ కోసం తెరపైకి కొత్త పేరు వచ్చింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ కొనసాగడం దాదాపుగా ఖరారైందని.. ఆయన వదిలేసే వయనాడ్ నుంచి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయబోతున్నారన్నది ఆ ప్రచార సారాంశం. జాతీయ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కు ఉన్న ప్రాధాన్యత రీత్యా రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే రాయ్‌బరేలీ సీటును వదులుకోవద్దని అమేథీ కాంగ్రెస్ ఎంపీ కిషోరీ లాల్ శర్మ ఇప్పటికే రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. అదే టైంలో రాహుల్ వయనాడ్‌ను వదులుకోవచ్చని కేరళ కాంగ్రెస్ చీఫ్ కే సుధాకరన్ కూడా సంకేతాలిచ్చారు. రాహుల్ గనుక ఆ నిర్ణయం తీసుకుంటే.. కేరళ నుంచి పార్టీ సీనియర్‌ను బరిలో దించురతాని సీడబ్ల్యూసీ వర్గాలు తొలుత చెప్పాయి. అయితే.. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ ఆరంగేట్రంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఇటీవలి ఎన్నికల ముందు ఆమె పోటీకి దిగుతారని వార్తలు వెలువడగా ఆమె వాటిని ఖండించారు. ఇక ఇప్పుడు రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ సీటు వదులుకోనున్నారన్న వార్తల నడుమ మరోసారి ప్రియాంక ఎన్నికల ఆరంగేట్రంపై ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. నా సోదరి వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే మోదీ 2 - 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారు:::తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య గతంలోనూ..ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతారనే టాపిక్ ఈనాటి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచే మొదలయ్యాయి. అప్పట్లో ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తారన్న కథనాలు వెలువడగా ఆమె వాటిని ఖండించారు. ఆ తరువాత 2022 యూపీ ఎన్నికల సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తాను సీఎం అభ్యర్థిని కావచ్చని కూడా వ్యాఖ్యానించారు. ఆ తరువాత తాను నోరు జారానంటూ వివరణ ఇచ్చారు. ఇక ఈసారి ఎన్నికల ముందు సోనియా గాంధీ తన కంచుకోట రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి తప్పుకుని రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో, ఆమె స్థానంలో ప్రియాంక బరిలో దిగుతారన్న ఊహాగానాలు బయలుదేరాయి. ఇక.. రాహుల్ గాంధీ అమేథీ నుంచి స్మృతీ ఇరానీపై పోటీ చేస్తారని కూడా భావించారు. ఈ విషయమై ఆలోచించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా వారిని కోరినట్టు కథనాలు వెలువడ్డాయి. గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా పేరు గాంచిన నియోజకవర్గాల నుంచి పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారట. అయితే, తాను బరిలో దిగబోనని ప్రియాంక మరోసారి స్పష్టం చేస్తూ ఊహాగానాలకు ముగింపు పలికారు. తనూ బరిలోకి దిగి గెలిస్తే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలు పార్లమెంటులో కాలుపెట్టినట్టు అవుతుందని, కుటుంబపాలన అంటూ విమర్శలు గుప్పిస్తున్న బీజేపీకి ఇది మరో ఆయుధంగా మారుతుందని ఆమె భావించారట. దీంతో ఇప్పుడు వయనాడ్ నియోజకవర్గాన్ని రాహుల్ వదులుకుంటారా? లేదా? లేదా అన్న దానిపై ప్రియాంక గాంధీ నిర్ణయం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
నీ సోదరిగా గర్విస్తున్నా..నువ్వెంత ధీశాలివో మాకు తెలుసు!
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మిత్ర పక్షాలతో ఇండియా కూటమిగా ఏర్పడి ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అంటూ నినదించిన బీజేపీకి భారీ షాకిచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 328 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 99 సీట్లు సాధించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే 47 సీట్లు ఎక్కువ సాధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఎక్స్‌వేదికపై స్పందించారు. తన సోదరుడు రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు.You kept standing, no matter what they said and did to you…you never backed down whatever the odds, never stopped believing however much they doubted your conviction, you never stopped fighting for the truth despite the overwhelming propaganda of lies they spread, and you never… pic.twitter.com/ev7QYFI1PR— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 5, 2024 ‘వారు (బీజేపీ నేతలు) ఎంతఅవమానించినా, అవహేళన చేసినా, దూషించినా చాలా దృఢంగా నిలబడ్డావు. అవహేళనలు, కష్టాలను చూసి ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. నీ నమ్మకాన్ని ఎంతగా అనుమానించినా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎంతగా నీపై అవాస్తవాలు, అబద్ధాలతో విపరీతమైన ప్రచారం చేసినా సత్యం కోసం నీ పోరు ఆగలేదు. కోపం ద్వేసం, నీ దరి చేరనీయలేదు. సంయమనం కోల్పోలేదు. ప్రతిరోజూ నీపై ద్వేషాన్ని కుమ్మరించినా నీ గుండెల్లోని ప్రేమ, దయతోనే, నిజం కోసం పోరాడావు. ఇది వాళ్లందరికీ ఇపుడు అర్థం అవుతుంది. కానీ నువ్వెంత ధీశాలివో ఎల్లపుడూ మాలో కొందరికి తెలుసు. నేను సోదరిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. ఈసందర్భంగా ఒక కార్టూన్‌ను కూడా షేర్ చేశారు. కాగా బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ఇప్పటికీ సగం సీట్లతో సరిపెట్టుకోవచ్చు, కానీ రాహుల్, ప్రియాంకా ద్వయం మాత్రం స్టార్ క్యాంపెయినర్లుగా నిలిచి బీజేపీ ఆశలకు భారీగా గండి కొట్టారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ తమ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, తన వ్యక్తిత్వాన్ని యావద్దేశానికి చాటి చెప్పారు రాహుల్‌గాంధీ. అంతేకాదు తల్లి, చెల్లి పట్ల బాధ్యతగా, ప్రేమగా ఉంటూ అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాగే ప్రియాంకా 2024 ఎన్నికలలో ప్రసంగాల్లో బాగా రాణించారు. తన తండ్రి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ప్రసంగాలాతో ఓటర్లను ఆకర్షించారు. కాంగ్రెస్‌విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కాంగ్రెస్ కంచుకోటలైన, అమేథీ ,రాయ్‌బరేలీలలో కాంగ్రెస్ ప్రచారాన్ని లీడ్ చేశారు. అంతేకాదు గాంధీ కుటుంబ విధేయుడు కిషోరి లాల్ శర్మ విజయం కోసం శ్రమించారు. తద్వారా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఓడించి 2019లో రాహుల్ గాంధీ ఓటమికి స్వీట్ రివెంజ్ తీర్చుకున్నారు. -
Lok Sabha Election 2024: ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
రాయ్‌బరేలీ: కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న అబద్ధాలు, మోసపూరిత విధానాలతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని, వారంతా మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల సమస్యలు, రైతన్నలు వెతలు, నిరుద్యోగుల దుర్భర బతుకుల గురించి మాట్లాడకుండా, కేవలం అనవసర విషయాలు మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో జరిగిన పరిణామాలపై వాస్తవాల ఆధారంగా కాకుండా కేవలం సొంత ఊహాలపై ఆధారపడి ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, ప్రజలంటే ఆయనకు గౌరవం లేదని తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో తన సోదరుడు రాహుల్ గాంధీ విజయం కోసం శ్రమిస్తూ ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ఉన్న ప్రియాంక గాంధీ బుధవారం పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రధాని మోదీకి నిజంగా ధైర్యం ఉంటే దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతాంగం కష్టాలపై మాట్లాడాలని సవాలు విసిరారు. ప్రియాంక ఇంకా ఏం చెప్పారంటే.. బీజేపీ అంచనాలు తల్లకిందులే.. మీడియాలో గానీ, రాజకీయ ప్రచార వేదికలపై గానీ ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదు. తమ కష్టనష్టాలపై చర్చ జరగాలని, పరిష్కార మార్గాలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపడానికి, ధరలు తగ్గించడానికి, రైతులు, కారి్మకుల సంక్షేమానికి, తమ కష్టాలు కడతేర్చడానికి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకోవాలని వారు ఆశిస్తున్నారు. దేశంలో ‘మార్పు’ గాలులు బలంగా వీస్తున్నాయి. ఎన్డీయేకు 400 సీట్లు, బీజేపీకి సొంతంగా 370 వస్తాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చివరకు వారి అంచనాలన్నీ తల్లకిందులవుతాయి. మోదీ సమాధానం చెప్పగలరా? దేశంలో నిరుద్యోగం గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రధాని మోదీ ఈ సమస్యను పట్టించుకోకుండా, కాంగ్రెస్ వస్తే ప్రజల ఆస్తులు లాక్కుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏయే సంస్థలను నిర్మించిందో, ఏయే పథకాలను సొంతంగా ప్రారంభించిందో నరేంద్ర మోదీ చెప్పగలరా? కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచి్చన పథకాల పేర్లు మార్చడం తప్ప ఆయన చేసిందేముంది? రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం.. ఈ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలే ప్రకటిస్తున్నారు. వారి ఆటలు సాగనివ్వం. రాజ్యాంగాన్ని కచి్చతంగా కాపాడుకుంటాం. మనకు ఓటు హక్కు రాజ్యాంగమే ఇచి్చంది. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు రాజ్యాంగమే ఇచి్చంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగమే బలోపేతం చేసింది. రాజ్యాంగాన్ని మార్చేసి, ప్రజల హక్కులు కాలరాస్తామంటే మేము సహించబోము. ప్రధానమంత్రి కాబట్టి నవ్వలేకపోతున్నాంకాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఇళ్లు, బంగారం, భూములు, గేదెలు దోచుకుంటారని ప్రధానమంత్రి అంటున్నారు. నిజంగా ప్రధానమంత్రి కాకుండా ఇంకెవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే బిగ్గరగా నవ్వుకునేవాళ్లం. ప్రధానమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలి కాబట్టి దురదృష్టవశాత్తూ నవ్వుకోలేకపోతున్నాం. అబద్ధాలను కూడా నిజాలుగా ప్రజలను నమ్మించడంలో నరేంద్ర మోదీ ఆరితేరిపోయారు. -
Lok sabha elections 2024: కాంగ్రెస్‌లో ప్రియాంకం
ప్రియాంకా గాంధీ వాద్రా. తండ్రి రాజీవ్ హత్యకు గురైనప్పుడు సమాజంతో పాటు మొత్తం ప్రపంచంపైనే కోపం పెంచుకున్న అమ్మాయి. ఎదిగే కొద్దీ క్షమాగుణం విలువను తెలుసుకున్నారు. ప్రధాని పదవి స్వీకరించాలని తల్లి సోనియాను కాంగ్రెస్ నేతలంతా కోరితే తననూ హత్య చేస్తారని భయపడి ఏడ్చిన సగటు యువతి. ఇప్పుడదే కాంగ్రెస్‌కు ట్రబుల్ షూటర్‌గా మారారు. అచ్చం నానమ్మ ఇందిర పోలికలను పుణికిపుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తారా, రారా అన్న చర్చ ఆమె పద్నాలుగో ఏట నుంచే మొదలైంది! తనకు రాజకీయాలు సరిపడవని మొదట్లో గట్టిగా నమ్మారామె. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా తలమునకలయ్యారు. గాంధీల కంచుకోటైన యూపీలోని రాయ్‌బరేలీలో తల్లికి బదులుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారంటూ ప్రచారమూ జరుగుతోంది. రాజకీయ జీవితం ప్రియాంక తొలుత క్రియాశీల రాజకీయాల్లో అంతగా పాల్గొనలేదు. తల్లి, సోదరుల లోక్‌సభ నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీలకు వెళ్లేవారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో సోనియాకు ప్రచార నిర్వాహకురాలిగా వ్యవహరించారు. రాహుల్ ప్రచారాన్ని కూడా పర్యవేక్షించారు. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని పది అసెంబ్లీ సీట్లలో ప్రచారం మొదలుకుని సీట్ల కేటాయింపులు, అంతర్గత పోరును పరిష్కరించడం దాకా అన్నీ తానై వ్యవహరించారు. 2019లో యూఈ తూర్పు భాగానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత యూపీ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. మహిళలకు 40 శాతం టికెట్ల డిమాండ్‌తో ‘లడ్కీ హూ, లడ్ సక్తీ హూ’ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే చవిచూసింది. ఆ అనుభవం తన జీవితంలో స్థితప్రజ్ఞత తీసుకొచి్చందంటారు ప్రియాంక. అయితే 2022 హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి సారథ్యం వహించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లోనూ క్రియాశీల పాత్ర పోషించారు. హిందీ సాహిత్యం.. బౌద్ధం... ప్రియాంక 1972 జనవరి 12న జని్మంచారు. డెహ్రాడూన్ వెల్హామ్ బాలికల పాఠశాలలో చదివారు. తర్వాత భద్రతా కారణాలతో రాహుల్‌తో పాటు ఢిల్లీలోని డే స్కూల్‌కు మారారు. ఇందిర హత్యానంతరం ఇద్దరూ ఇంట్లోనే చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీ జీసస్ అండ్ మేరీ నుంచి ప్రియాంక సైకాలజీలో డిగ్రీ చేశారు. బౌద్ధ అధ్యయనంలో మాస్టర్స్ చేశారు. నానమ్మను అత్యంత శక్తివంతమైన మహిళగా చెబుతారు. బాల్యంలో నానమ్మతో రాహులే ఎక్కువగా గడపడం చూసి ఈర‡్ష్య పడేదాన్నంటూ నవ్వేస్తారు. ప్రియాంక బాల్యం ఎక్కువగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తల్లి తేజీ బచ్చన్‌తో గడిచింది. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ కవిత్వం చదివి హిందీ సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ప్రేమ్‌చంద్ సాహిత్యాన్ని ఇష్టపడతారు. ఖాళీ దొరికితే పుస్తకాలు పట్టుకుంటారు. బౌద్ధ తత్వశా్రస్తాన్ని ఆచరిస్తారు. 1999లో రాజకీయాల్లోకి రావాల్సి వచి్చనప్పుడు పది రోజులపాటు మెడిటేషన్ చేసి నిర్ణయం తీసుకున్నారు. 1997లో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను పెళ్లాడారు. వారికిద్దరు పిల్లలు. ప్రియాంక రేడియో ఆపరేటర్ కూడా! -
అమాయకుల ఇళ్లపైకే బుల్డోజర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా నిప్పులు చెరిగారు. బుల్డోజర్లతో అమాయక ప్రజల ఇళ్లను కూలి్చవేస్తున్నారని, ప్రభుత్వ నిర్వాకం వల్ల నేరగాళ్లు మాత్రం నిక్షేపంగా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఆమె శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో తన సోదరుడు రాహుల్ గాంధీతోపాటు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రైతుల మొర ఆలకించే తీరిక పాలకులకు లేదా? అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్‌లో రైతులపైకి జీపులు నడిపించి చంపిన నాయకుల ఇళ్లపైకి, మహిళలను వేధించిన దుర్మార్గుల ఇళ్లపైకి, ప్రశ్నాపత్రాలను లీక్ చేసినవారి ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్లడం లేదని ధ్వజత్తారు. అమాయకుల ఇళ్లు మాత్రమే బల్డోజర్ల కింద నలిగిపోతున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులు, రైతులకు అన్యాయం జరుగుతుండడం వల్లే యాత్రలో ‘న్యాయ్’ పదాన్ని చేర్చామన్నారు. ఆదివారం ఆగ్రాలో యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఆ పిల్లలు రీల్స్ చూడరు: రాహుల్ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఇక యువత రోజుకు 12 గంటలు మొబైల్ ఫోన్లు చూడక ఏం చేస్తారని రాహుల్ ప్రశ్నించారు. ఆయన శనివారం యూపీలోని సంభాల్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో మాట్లాడారు. రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారని యువతను ప్రశ్నించగా 12 గంటలని బదులిచ్చారు. దాంతో రాహుల్ ఈ మేరకు స్పందించారు. సంపన్నులు, బడా వ్యాపారవేత్తల పిల్లలు ఫోన్లలో రీల్స్ చూడరని, రోజంతా డబ్బులు లెక్కపెట్టుకొనే పనిలోనే ఉంటారని అన్నారు. శనివారం యూపీలోని మొరాదాబాద్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్, ప్రియాంక -
వినోదం కోసమే ఆమె మధ్యప్రదేశ్‌కు వస్తారు
భోపాల్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో సినిమాల గురించి మాట్లాడటంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకా గాంధీకి ప్రజాస్వామ్యం అన్నా ప్రజలన్నా గౌరవం లేదన్నారు. మధ్యప్రదేశ్‌కు ఆమె వినోదం కోసమే వస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలను ముఖ్యమైన విషయంగా కాంగ్రెస్ భావించడం లేదు. నటన, జై– వీరూ లేదా ప్రధాని మోదీపై సినిమా తీయడమే ఎన్నికల అంశమని అనుకుంటున్నారా అని ప్రియాంకా గాంధీని అడగాలనుకుంటున్నా. ఎన్నికలను ఆమె తమాషా అనుకుంటున్నారు. ఇది ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే’అని పేర్కొన్నారు. ఓటమిని ఊహించిన కాంగ్రెస్ నేతలు ఇటువంటి వ్యాఖ్యలకు దిగుతున్నారన్నారు. గురువారం దటియా నియోజకవర్గంలోని జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక.. సీఎం చౌహాన్‌ను ప్రపంచ ప్రఖ్యాత నటుడిగా అభివర్ణించారు. ఆయన అమితాబ్‌ను సైతం మించిపోయేవారన్నారు. అభివృద్ధిని గురించి ప్రస్తావించినప్పుడల్లా కమెడియన్లా ప్రవర్తిస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని సైతం ఆమె వదల్లేదు. ప్రతిపక్షంలో ఉండగా తనను వేధించారని చెప్పుకుని మోదీ ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయనపై మేరే నామ్ పేరుతో సినిమా కూడా తీయొచ్చని ప్రియాంక అన్నారు. -
బీజేపీకి సీఎం అభ్యర్థే లేరు
జైపూర్: రాజస్తాన్‌లో బీజేపీ చెల్లాచెదురయిందని, అందుకే ఆ పార్టీకి సీఎం అభ్యర్థే లేకుండాపోయారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. దుంగార్పూర్ జిల్లా సగ్వారాలో శుక్రవారం ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. బీజేపీకి సీఎం అభ్యర్థి దొరక్క ప్రధాని మోదీ చేసేది లేక తన పేరుతోనే ఓట్లభ్యర్థిస్తున్నారన్నారు. మతం, మనోభావాలను వాడుకుంటూ ఓట్లడిగే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం కారణంగా రైతులతోపాటు ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. ‘దేశంలో రైతుల సరాసరి ఆదాయం రోజుకు కేవలం రూ.27 మాత్రమే కాగా, ప్రధాని మోదీ ప్రత్యేక మిత్రుడు అదానీ మాత్రం రోజుకు రూ.16 వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం వద్ద రైతు రుణాలు రద్దు చేసేందుకు మాత్రం డబ్బుల్లేవు’అని ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వెన్నుచూపుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల కోసం ద్రవ్యోల్బణ సహాయక శిబిరాలను నిర్వహిస్తుందని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ నిలిపివేస్తుందని ప్రియాంకా గాంధీ ప్రజలను హెచ్చరించారు. -
భారత జాతీయతకే తీరని అవమానం..సిగ్గుగా ఉంది: ప్రియాంక గాంధీ ధ్వజం
ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యం, అహింస అనే ధర్మాలకు ప్రతీక అయిన భారత దేశం దీనికి దూరంగా ఉండటం సిగ్గు చేటు అంటూ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విటర్ ద్వారా ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. అహింస, సత్యం అనే సిద్దాంతాల పునాదుల మీదే మన దేశం ఆవిష్కృతమైంది. ఈ సిద్ధాంతాల కోసమే స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. దేశానికి స్వేచ్ఛని ప్రసాదించారు. మన జాతీయతకు నిదర్శనమైన ఈ సూత్రాలకోసం జీవితమంతా నిలబడిన దేశానికి భిన్నంగా మోదీ సర్కార్ వ్యవహరించిందంటూ ట్వీట్ చేశారు. పాలస్తీనాలో వేలాది మంది పురుషులు మహిళలు, పిల్లలను హత మార్చడాన్ని మౌనంగా చూస్తూ ఉండటం భారత దేశ మూల సూత్రాలకే విరుద్ధమని మండిపడ్డారు. కంటికి కన్ను అనే విధానం మొత్తం ప్రపంచాన్ని అంధత్వంలోని నెట్టేస్తుందన్న గాంధీజీ కోట్‌ను తన ప్రకటనకు ప్రియాంక జోడించారు. కాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో బాధితులకు ఎలాంటి అవరోధం లేకుండా సహాయ కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన ‘మానవతావాద సంధి’ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసిన ఉగ్రవాద సంస్థ హమాస్ పేరును ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడమే ఇందుకు కారణమని భారత్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-హమాస్ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో ఎలాంటి అవరోధాలు లేకుండా సహాయ కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ జోర్డాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. గాజా స్ట్రిప్‌కు సహాయం అందించాలని ,పౌరులకు రక్షణ కల్పించాలని కూడా తీర్మానం డిమాండ్ చేసింది. పౌరుల రక్షణ. చట్టపరమైన, మానవతా బాధ్యతలకు సమర్థన’ అనే పేరిట ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికాతో సహా 40కిపైగా దేశాలు మద్ధతుగా నిలిచాయి. అనుకూలంగా 120 దేశాలు, వ్యతిరేకంగా 14 దేశాలు ఓటువేశాయి. 45 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకేతోపాటు పలు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. “An eye for an eye makes the whole world blind” ~ Mahatma Gandhi I am shocked and ashamed that our country has abstained from voting for a ceasefire in Gaza. Our country was founded on the principles of non-violence and truth, principles for which our freedom fighters laid down… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 28, 2023