కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది ఘన విజయం సాధించారు. ఇవాళ(గరువారం (నవంబర్ 28, 2024న)) ఆమె లోక్‌సభలో కసవు చీర ధరించి చేతిలో భారత రాజ్యంగ కాపీని పట్టుకొని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా కేరళ చీరలో ఆమె ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకట్టుకుంది. కేరళ వారసత్వానికి చిహ్నమైన ఆ చీరతో ఎంపీగా బాధ్యతలను స్వీకరించి శతాబ్దాల నాటి గొప్ప చరిత్రను మరోసారి వెలుగెత్తి చాటారు. ఈ కసవు చీరతో కేవలం కేరళ సంస్కాృతినే గాక నాటి పూర్వీకుల మూలాలని గుర్తుచేశారు ప్రియాంక. ఈ సందర్భంగా కసవు చీర, దాని ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలుసుకుందామా..!
కసవు చీర అనేది కేరళలో ఉండే హిందూ, బౌద్ధ, జైన సంస్కృతుల నాటిది. ఏనుగు దంతాలతో కూడిన బంగారు కసవు చీరను పురాతన కాలంలో రాయల్టీకి చిహ్నంగా ప్రభువులు ధరించేవారు. మలయాళీ వేడుకల్లో అంతర్భాగం ఈ చీరలు. ఈ చీరతోనే అక్కడ అసలైన పండుగ వాతావరణ వస్తుంది. నిజానికి సాంప్రదాయ కసవు చీర చేతితో నేసిన పత్తితో తయారు చేస్తారు.
అంతేగాదు దీనిలో నిజమైన బంగారం, వెండి దారాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం రంగు దారాలను చౌక ధరల్లో లభించేలా ఈ కసవు చీరలను నేస్తున్నారు. ఈ చీరకు జీఐ ట్యాగ్ కూడా లభించింది. నిజానికి ఈ చీరలు నేయడం అత్యంత సంక్లిష్టత, నైపుణ్యంతో కూడిన చేనేత పని. ఈ చీరలు మూడు ప్రధాన చేనేత కేంద్రాలు బలరామపురం, చెందమంగళం , కుతంపుల్లిల వద్ద ప్రసిద్ధిగాంచింది. కుతంపుల్లి చీరల్లో జరీతోపాటు ఏనుగు దంతాకృతి ఉంటుంది.
ఒక్కొసారి మానవ బొమ్మలు వంటి మూలాంశాలు ఉంటాయి. ఈ చీరకు ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటంటే మోహినియాట్టం వంటి నృత్య ప్రదర్శనల సమయంలో, కేవలం కసవు వస్త్రాలు మాత్రమే నృత్యకారులు ధరిస్తారు. ఇలా అలాగే కైకొట్టికళి, తిరువాతిరక్కళి వంటి నృత్యాలలో మహిళా ప్రదర్శకులు సాంప్రదాయ ఎరుపు బ్లౌజుతో కూడా కసవు చీరలను ధరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment