లోక్ సభ ఎన్నికలలో యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ నుంచి మూడు లక్షల పైచిలుకు మెజారిటీ గెలుపు సాధించిన రాహుల్ గాంధీ.. రూల్స్ ప్రకారం ఏదో ఒక సీటును వదులుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆయన కేరళ వయనాడ్ సీటునే వదులుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం.. ఒకరు ఒక స్థానం కంటే ఎక్కువ చోట్ల నుంచి పోటీ చేయొచ్చు. కానీ, ప్రాతినిధ్యం మాత్రం ఒక్క స్థానం నుంచే వహించాలి. ఫలితాలు వెలువడిన 14 రోజుల్లో ఒక స్థానానికి కచ్చితంగా రాజీనామా చేయాలి. అలా జరగని పక్షంలో ఆ రెండు స్థానాలను ఆ వ్యక్తి కోల్పోవాల్సి వస్తుంది. అయితే అటు కేరళ, ఇటు ఉత్తర ప్రదేశ్ సీనియర్లు మాత్రం రాహుల్ తమ రాష్ట్రంలోనే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు.
సీడబ్ల్యూసీ భేటీలో యూపీ కాంగ్రెస్ నేత ఆరాధన మిశ్రా.. రాయ్‌బరేలీ గాంధీ కుటుంబానికి చెందిందని, కాబట్టి దానిని వదులుకోకూడదని సూచించారు. అయితే 80 లోక్‌సభ సీట్లున్న ఉత్తర ప్రదేశ్‌లో పార్టీని పటిష్టం చేయడానికి రాహుల్ కొనసాగాల్సిన అవసరం ఉందని పలువురు కోరారు.
మరోవైపు కేరళ నేతలు కూడా వయనాడ్ నుంచే కొనసాగాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి రెండోసారి గెలిపించినందున ఈ సీట్లోనే కొనసాగాలని కేరళ కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. అయితే. ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించడం కోసం ఈ సీటును అట్టిపెట్టుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుస్తోంది. యూపీపై దృష్టి సారించాల్సి ఉందన్న అధిష్ఠానం సూచనల మేరకు కేరళ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ తర్వాత అందుకు అంగీకరించారని తెలుస్తోంది.
మరోవైపు, రాహుల్ గాంధీ వదులుకుంటే కనుక, అదే వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీని పోటీ చేయించాలన్న విజ్ఞప్తిని కూడా గాంధీ కుటుంబం తిరస్కరించిందని చెబుతున్నారు. కేరళకు చెందిన సీనియర్ నేతను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని భావిస్తున్నారు. వచ్చేవారం రాయ్ బరేలీలో సోనియా కుటుంబం పర్యటించనుంది. ఆ తర్వాతే రాహుల్ గాంధీ ఏ సీటును వదులుకుంటారనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జూన్ 17వ తేదీలోపు దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment