వయనాడ్‌ బరిలో ఆమె.. కాంగ్రెస్‌ పరిశీలన?! Priyanka Gandhi Vadra may contest the Wayanad Lok Sabha seat Sakshi
Sakshi News home page

ఇదేం ట్విస్ట్‌? వయనాడ్‌ బరిలో ఆమె.. పేరు పరిశీలిస్తున్న కాంగ్రెస్‌!

Published Fri, Jun 14 2024 8:11 AM | Last Updated on Fri, Jun 14 2024 11:50 AM

If Rahul Gandhi Left Congress Pick Her As Wayanad Candidate

న్యూఢిల్లీ: వయనాడా? రాయ్‌బరేలీనా?.. మరో మూడు రోజుల్లో ఏ ఎంపీ సీటు వదులుకుంటారో రాహుల్‌ గాంధీ నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. లేకుంటే.. ఆ రెండు స్థానాలకు ఆయన కోల్పోవాల్సి వస్తుంది.  ఈ విషయంలో తానూ డైలమాలో ఉన్నట్లు స్వయంగా రాహుల్‌ గాంధీనే ప్రకటించారు. దీంతో ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. 

రాయ్‌బరేలీ, వయనాడ్‌ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన రాహుల్ గాంధీ భారీ మార్జిన్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఒక్కపక్క.. తమ దగ్గరి నుంచే ఎంపీగా కొనసాగాలంటూ ఇరు రాష్ట్రాల కాంగ్రెస్‌ సీనియర్లు రాహుల్‌ను కోరుతుండడం గమనార్హం. మరోవైపు..  తన నిర్ణయం రెండు నియోజకవర్గాల ప్రజలకు సంతోషాన్ని ఇస్తుందని రాహుల్‌ తాజాగా స్పష్టం చేశారు. ఇరు చోట్లా పర్యటించిన అనంతరం వయనాడ్‌నే ఆయన వదులుకోవడం దాదాపు ఖరారు కాగా.. ఈలోపు ఆ స్థానంలో పోటీ కోసం తెరపైకి కొత్త పేరు వచ్చింది. 

రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ కొనసాగడం దాదాపుగా ఖరారైందని.. ఆయన వదిలేసే వయనాడ్‌ నుంచి కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ  ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయబోతున్నారన్నది ఆ ప్రచార సారాంశం.  జాతీయ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కు ఉన్న ప్రాధాన్యత రీత్యా రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే రాయ్‌బరేలీ సీటును వదులుకోవద్దని అమేథీ కాంగ్రెస్ ఎంపీ కిషోరీ లాల్ శర్మ ఇప్పటికే రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. అదే టైంలో రాహుల్ వయనాడ్‌ను వదులుకోవచ్చని కేరళ కాంగ్రెస్ చీఫ్ కే సుధాకరన్ కూడా సంకేతాలిచ్చారు. రాహుల్‌ గనుక ఆ నిర్ణయం తీసుకుంటే.. కేరళ నుంచి పార్టీ సీనియర్‌ను బరిలో దించురతాని సీడబ్ల్యూసీ వర్గాలు తొలుత చెప్పాయి. అయితే.. 

రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ ఆరంగేట్రంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఇటీవలి ఎన్నికల ముందు ఆమె పోటీకి దిగుతారని వార్తలు వెలువడగా ఆమె వాటిని ఖండించారు. ఇక ఇప్పుడు రాయ్‌బరేలీ, వయనాడ్‌ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ సీటు వదులుకోనున్నారన్న వార్తల నడుమ మరోసారి ప్రియాంక ఎన్నికల ఆరంగేట్రంపై ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. 

నా సోదరి వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే మోదీ 2 - 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారు
:::తాజాగా రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్య 

గతంలోనూ..
ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతారనే టాపిక్‌ ఈనాటి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచే మొదలయ్యాయి. అప్పట్లో ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తారన్న కథనాలు వెలువడగా ఆమె వాటిని ఖండించారు. ఆ తరువాత 2022 యూపీ ఎన్నికల సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తాను సీఎం అభ్యర్థిని కావచ్చని కూడా వ్యాఖ్యానించారు. ఆ తరువాత తాను నోరు జారానంటూ వివరణ ఇచ్చారు.  ఇక ఈసారి ఎన్నికల ముందు సోనియా గాంధీ తన కంచుకోట రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి తప్పుకుని రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో, ఆమె స్థానంలో ప్రియాంక బరిలో దిగుతారన్న ఊహాగానాలు బయలుదేరాయి. 

ఇక.. రాహుల్ గాంధీ అమేథీ నుంచి స్మృతీ ఇరానీపై పోటీ చేస్తారని కూడా భావించారు. ఈ విషయమై ఆలోచించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా వారిని కోరినట్టు కథనాలు వెలువడ్డాయి. గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా పేరు గాంచిన నియోజకవర్గాల నుంచి పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారట. అయితే, తాను బరిలో దిగబోనని ప్రియాంక మరోసారి స్పష్టం చేస్తూ ఊహాగానాలకు ముగింపు పలికారు. 

తనూ బరిలోకి దిగి గెలిస్తే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలు పార్లమెంటులో కాలుపెట్టినట్టు అవుతుందని, కుటుంబపాలన అంటూ విమర్శలు గుప్పిస్తున్న బీజేపీకి ఇది మరో ఆయుధంగా మారుతుందని ఆమె భావించారట. దీంతో ఇప్పుడు వయనాడ్‌ నియోజకవర్గాన్ని రాహుల్ వదులుకుంటారా? లేదా? లేదా అన్న దానిపై ప్రియాంక గాంధీ నిర్ణయం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement