
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఏఐసీసీ కార్యాలయం వెలుపల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలతో కూడిన పోస్టర్లను 24 గంటల్లోనే దుండగులు తొలగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఈ పనికి పాల్పడిందని, చౌకబారు రాజకీయాలతో దిగజారిందని కాంగ్రెస్ ఆరోపించింది. ‘మోదీ ప్రభుత్వం పనికిమాలిన రాజకీయాలు చేస్తోంది. గత రాత్రి ఇక్కడ ఏర్పాటు చేసిన పోస్టర్లను తెల్లారేసరికి తొలగించా’రని కాంగ్రెస్ నేత జగదీష్ శర్మ ఆరోపించారు.
కాగా, ఏఐసీసీ కార్యాలయం ఎదుట వెలిసిన ఈ పోస్టర్లపై రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రాల ఫోటోలతో పాటు దేశ ప్రజలు రాహుల్, ప్రియాంక నాయకత్వాలను కోరుతున్నారని, తమది అతివాద సిద్ధాంతం కాదని, నవ్య ధోరణులతో కూడిన ఆలోచనా విధానమనే నినాదాలను పొందుపరిచారు.
మరోవైపు విదేశీ ఆస్తులను అక్రమంగా కలిగిఉన్నారనే మనీల్యాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా బుధవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. వాద్రాకు ఈడీ సమన్లకు సంబంధించి కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలతో విరుచుకుపడింది. యూపీఏ హయంలో రాబర్ట్ వాద్రా భారీగా లబ్దిపొందారని, ఈ మొత్తంతో వాద్రా విదేశాల్లో కోట్లాది రూపాయలతో విలాసవంతమైన ఆస్తులను కొనుగోలు చేశారని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment