అది అబద్ధం: ప్రియాంక గాంధీ | Priyanka Gandhi Says No More Time To Vacate Lutyens Bungalow In Delhi | Sakshi
Sakshi News home page

అది పూర్తిగా అసత్యపు వార్త : ప్రియాంక గాంధీ

Published Tue, Jul 14 2020 2:34 PM | Last Updated on Tue, Jul 14 2020 3:17 PM

Priyanka Gandhi Says No More Time To Vacate Lutyens Bungalow In Delhi - Sakshi

సాక్షి,ఢిల్లీ: ఢిల్లీలోని 35, లోడీ ఎస్టేట్స్‌లో ఉన్న తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ప్రభుత్వ బంగ్లాలో ఆగస్టు తర్వాత మరికొంత కాలం నివాసం ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆమెపై వస్తున్న వార్తలను ఖండించారు. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని ప్రభుత్వ బంగళాను ఆగస్టు లోపు ఖాళీ చేయాలని జూలై1న పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కోరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంగళవారం  ప్రియాంక గాంధీ స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. ‘ఇది పూర్తిగా అసత్యపు వార్త. బంగళాలో ఉండేందుకు కాల పరిమితి పెంచాలని నేను ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్థన పెట్టుకోలేదు. నేను జూలై 1న పొందిన లేఖ ప్రకారం ఆగస్టు 1లోగా లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేస్తాను’ అని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. (ప్రియాంక బంగ్లా బీజేపీ ఎంపీకి కేటాయింపు)

ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా కూడా స్పందిస్తూ.. ‘మాపై వస్తున్న వార్తలు  నిజం కాదు. బంగళాలో ఉండేందుకు మేము ఎటువంటి పొడగింపు అడగలేదు. నెల రోజుల్లో బంగ్లాను ఖాళీ చేయాలని లేఖ వచ్చింది. ఆ మేరకు మేము ఇంటి సామాన్లను ప్యాక్‌ చేశాము. ప్రభుత్వం ఇచ్చిన గడువు కంటే వారం రోజుల ముందుగానే ఖాళీ చేస్తాము’ అని ఆయన ట్విటర్‌లో తెలిపారు. (‘ద్వేషం, ప్రతీకారానికి నిదర్శనం’)

దీనిపై పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ.. ‘నిజాలు ఎప్పుడూ వాటంతట అవే బయటకు వస్తాయి. కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత జూలై 4న నాకు ఫోన్‌చేసి 35, లోడీ ఎస్టేట్స్‌లోని బంగళాను మరో కాంగ్రెస్‌ ఎంపీకి కేటాయించాలని కోరారు. దాంతో ప్రియాంక గాంధీ అక్కడే కొనసాగడానికి వీలుంటుందని తెలిపారు. ప్రతి విషయాన్ని సంచలనం చేయొద్దు’ అని ఆయన ట్విటర్‌లో అన్నారు. ప్రియాంక తనపై వస్తున్న వార్తలను అసత్యమని ఖండించిన తర్వాత మంత్రి స్పందించటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement