సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాను ఆగస్ట్ 1లోగా ఖాళీ చేయాలంటూ ప్రియంక గాంధీకి కేంద్రం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బంగాళాను బీజేపీ ఎంపీ, మీడియా సెల్ ఇన్‌ఛార్జి అనిల్ బలూనికి కేటాయిస్తూ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన గురుద్వారాలోని రాకాబ్ గంజ్ రోడ్‌లో ఉంటున్నారు. అయితే అనారోగ్య కారణాలతో తన నివాసాన్ని మార్చాలంటూ బలూని విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నప్పటికీ అనేక జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచించారు. ఈ నేపథ్యంలోనే బలూనీకి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు ఉన్న లోథీ బంగాళాను కేటాయిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. (ప్రభుత్వ నివాసం ఖాళీ చేయాలని లేఖ )
'బంగళా ఖాళీ ఏర్పడినప్పుడు అర్హత ఉన్న మరొకరికి కేటాయించడం అనేక సందర్భాల్లో చూశాం.. ఇది కూడా అలాంటిదే దీన్ని రాద్ధాంతం చేయనవసరం లేదు. ప్రియాంక గాంధీ ఖాళీ చేసిన వెంటనే బలూని అక్కడికి మారతారు' అని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేయాలని ఇటీవల పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ నోటిసులు జారీ చేసింది. ఆగస్ట్ 1 తర్వాత కూడా బంగళాలో కొనసాగితే ప్రియాంక వాద్రా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది. ప్రియాంక గాంధీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్‌పీజీ భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. (ప్రియాంకకు నోటీసులు.. కాంగ్రెస్ స్పందన)
Comments
Please login to add a commentAdd a comment