రాయ్‌బరేలీ ఎంపీగానే రాహుల్ గాంధీ
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ స్థానాల్లో ఎంపీగా విజయం సాధించిన రాహుల్ గాంధీ ఇకపై రాయ్‌బరేలీ నుంచే కొనసాగుతారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. రెండింటా గెలిస్తే చట్టం ప్రకారం ఒక స్థానంలోనే కొనసాగాలి కాబట్టి రాయ్‌బరేలీ నుంచే రాహుల్ గాంధీ కొనసాగుతారని స్పష్టంచేశారు.
ఎంతో అంతర్మథనం, చర్చల తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించిన రాహుల్‌కు ఖర్గే ధన్యవాదాలు తెలిపారు. రాయ్‌బరేలీ స్థానంతో రాహుల్ కుటుంబానికి తరతరాలుగా అనుబంధం ఉందని గుర్తుచేశారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా రాయ్‌బరేలీ నుంచే రాహుల్ కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు. వయనాడ్ ప్రజల ప్రేమాభినాలు రాహుల్‌కు లభించాయన్నారు.
కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రియాంకా గాంధీ ఎంతో సహకరించారని ఖర్గే అభినందించారు. రాహుల్ ఏ స్థానం వదులుకోవాలన్న అంశంపై కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్, ప్రియాంకా గాం«దీ, కె.సి.వేణుగోపాల్ తదితరులు సోమవారం ఢిల్లీలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ అనంతరం ఖర్గే, రాహుల్ మీడియాతో మాట్లాడారు. రాయ్‌బరేలీతోపాటు వయనాడ్‌తో తనకు భావోద్వేగపూరిత అనుబంధం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. వయనాడ్‌ను వదులుకోవడం చాలా కఠిన నిర్ణయమేనని వెల్లడించారు.
గత ఐదేళ్లపాటు వయనాడ్ ఎంపీగా కొనసాగడం అద్భుతమైన అనుభవం అని చెప్పారు. వయనాడ్ ప్రజలు తనకు అండగా నిలిచారని, సంక్షోభ సమయాల్లో తనకు కొత్త శక్తిని ఇచ్చారని కొనియాడారు. వారిని ఎప్పటికీ మర్చిపోలేనని వ్యాఖ్యానించారు. ఇకపై కూడా వయనాడ్‌ను సందర్శిస్తూనే ఉంటానని, అక్కడి ప్రజలకు ఇచి్చన హామీలను నెరవేరుస్తానని ఉద్ఘాటించారు. ఐదేళ్లపాటు ఎంతో ప్రేమాభిమానాలు పంచిన వయనాడ్ ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు తెలియజేశారు. వయనాడ్ నుంచి తన సోదరి ప్రియాంక పోటీ చేస్తుందని తెలిపారు. తమకు ఇద్దరు ఎంపీలు ఉన్నట్లుగా భావించాలని వయనాడ్ ప్రజలకు రాహుల్ సూచించారు.
సంతోషంగా ఉంది: ప్రియాంకా గాంధీ
వయనాడ్ నుంచి తాను పోటీ చేయాలని పార్టీ తీసుకున్న నిర్ణయంపై ప్రియాంకా గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా రాయ్‌బరేలీ, అమేథీలో పనిచేశానని, ఆ బంధం ఎట్టి పరిస్థితుల్లోనూ తెగిపోదని అన్నారు. ఆ బంధాన్ని కొనసాగించేందుకు తాను, రాహుల్ ఉన్నామని చెప్పారు. రాయ్‌బరేలీ, వాయనాడ్‌లో తనతోపాటు రాహుల్ ఉంటూ ఇద్దరం కలిసి పనిచేస్తామని తెలిపారు. రాహుల్ అందుబాటులో లేరన్న అభిప్రాయం వయనాడ్ ప్రజల్లో కలగకుండా చూస్తానని ప్రియాంక గాంధీ చెప్పారు.
తొలిసారిగా పోటీ చేస్తున్న ప్రియాంక
ప్రియాంకా గాంధీ 2019లో క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. అతిత్వరలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ లేదా ఆమేథీ లేదా వారణాసిలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, పోటీకి దూరంగానే ఉన్నారు. ప్రచారంలో పాల్గొన్నారు. రాయ్‌బరేలీ, ఆమేథీలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. రాహుల్ ఖాళీ చేస్తున్న వయ నాడ్ రాడ్ స్థానానికి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరుగనుంది. 52 ఏళ్ల ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment