
శ్రీగంగానగర్ (రాజస్థాన్): వేసవికాలం రాకముందే దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల వడగాడ్పులకు జనం విలవిలలాడిపోతున్నారు. వేసవి ప్రవేశించకముందే ఇలా ఉంటే, ఇక మున్ముందు ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే మనదేశంలోని ఒక జిల్లాలో వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఆ సమయంలో అక్కడికి ఎవరైనా వెళితే మాడిమసైపోవాల్సిందే..
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లా(Sri Ganganagar District)లో వేసవిలో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతం భారత్‌లో అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా గుర్తించారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ జిల్లాలో వేసవికాలం దడ పుట్టిస్తుంది. గతంలో ఈ జిల్లా బికనీర్‌లో భాగంగా ఉండేది. ఆ తరువాత దీనిని మరో జిల్లాగా మార్చారు. శ్రీగంగానగర్ జిల్లాకు దక్షిణాన బికనీర్, పశ్చిమాన పాకిస్తానీ పంజాబ్, ఉత్తరాన భారత పంజాబ్ ప్రాంతంలోని ఫాజిల్కా జిల్లాలు ఉన్నాయి.
వేసవి కాలంలో శ్రీగంగానగర్ జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 45 డిగ్రీలకుపైగా ఉంటుంది. ఫలితంగా జిల్లాలో మధ్యాహ్నం సమయంలో రోడ్లపై ఒక్కరు కూడా కనిపించరు. రాజస్థాన్(Rajasthan)లోని ఈ జిల్లా గోధుమ, ఆవాలు, పత్తి పంటలకు ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్‌లో అత్యధిక సంఖ్యలో పంజాబీ ప్రజలు ఈ జిల్లాలో నివసిస్తున్నారు. ఇక్కడి మహిళలు ఎంబ్రాయిడరీ చేసిన స్కార్ఫ్‌లను ధరిస్తుంటారు. శ్రీ గంగానగర్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలకు ఒక కారణం ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చే వేడిగాలులు కారణంగా ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 50 డిగ్రీలు కూడా దాటుతుంటాయి. శ్రీగంగానగర్‌లో సగటు ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు అటుఇటుగా నమోదువుతుంటుంది.
ఇది కూడా చదవండి: ఏప్రిల్ 19 నుంచి కట్రా- శ్రీనగర్ ‘వందేభారత్’