
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి శివసేన ఆగ్రహానికి గురైన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు మద్రాసు హైకోర్టు మద్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై కునాల్ కమ్రా షోలు చేసే స్టూడియో కూల్చివేసిన ఘటనలో అరెస్టై బెయిల్ పై విడుదలైన శివసేన పార్టీ యువసేన జనరల్ సెక్రటరీ నేత రాహుల్ కనాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కునాల్ కమ్రా బెయిల్ పై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూనే.. కునాల్ కమ్రా మహారాష్ట్రకు వచ్చినప్పుడు గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు శివసేన సిద్ధంగా ఉందంటూ ప్రతీకార చర్య వ్యాఖ్యలు చేశారు. జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడిన రాహుల్ కనాల్.. ‘ కునాల్ కమ్రాకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ తీర్పుతో కునాల్ కు ఊరట లభించింది. ఇది కేవల ఏప్రిల్ 7 వరకు మాత్రమే. ఆ తర్వాత కునాల్ చట్టపరమైన సమస్యలు తప్పవు. ఈ క్రమంలో ముంబైకి రాక తప్పదు. అప్పుడు నేను కునాల్ గ్రాండ్ వెల్ కమ్ ఏర్పాటు చేస్తా.. అది కూడా శివ సేన స్టైల్ లోనే ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న కునాల్ కు అక్కడ ఎవరు రక్షణ కల్పిస్తున్నారన్నది అనవసరం. షిండే పై చేసిన వ్యాఖ్యలకు గాను ముంబైకు కునాల్ తప్పకుండా రావాల్సి ఉంటుంది. అప్పుడు అతని మామూలు ‘ వెల్ కమ్’ ఉండదు’ అంటూ కామెంట్స్ చేశారు.
అంతకుముందు తాను విచారణకు హాజరుకావడానికి కొంత సమయం కావాలని ముంబై పోలీసుల్ని కునాల్ కమ్రా కోరగా దాన్ని వారు నిరాకరించారు. అయితే తనకు ప్రాణ హాని ఉందంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు కునాల్ కమ్రా. ఈ కేసులో కునాల్ కమ్రాకు గత శుక్రవారం మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు.
ముంబైలోని హాబిటాట్ స్టూడియో(ల జరిగిన ఈవెంట్‌లో కునాల్ కమ్రా ఓ షో చేస్తూ ఏక్‌నాథ్ షిండేను ద్రోహిగా వర్ణించడంతో షిండే శివసేన యువ విభాగం భగ్గుమంది. కునాల్‌కు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగింది. అదే టైంలో.. హాబిటాట్ స్టూడియోపై దాడికి దిగి విధ్వంసానికి పాల్పడింది. ఈ కేసులో రాహుల్ కనాల్ తో పాటు 11 మందిని అరెస్టు చేయగా, వారికి బెయిల్ కూడా లభించింది.