
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde)పై పేరడీ పేరిట కామెంట్లు చేసిన కేసులో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు ముంబై పోలీసులు ఝలక్ ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని.. విచారణకు హాజరయ్యేందుకు కాస్త గడువు ఇవ్వాలని కునాల్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు.
షిండే పరువుకు భంగం కలిగించారనే ప్రధాన అభియోగంతో పాటు మరికొన్నింటిని కమ్రాపై ముంబై పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన మార్చి 31వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే.. ఒకవైపు ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ఉన్న కునాల్ కమ్రా(Kunal Kamra).. మరోవైపు తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ గడువు పొడిగింపు కోరాడు. ఏప్రిల్ 3వ తేదీన విచారణకు హాజరవుతానని విజ్ఞప్తి చేశాడు. కానీ, పోలీసులు అందుకు అంగీకరించలేదు.
ముంబైలోని హాబిటాట్ స్టూడియో(Habitat Studio)లో జరిగిన ఈవెంట్‌లో కునాల్ కమ్రా ప్రదర్శన ఇచ్చాడు. ఈ క్రమంలో ఏక్‌నాథ్ షిండేను ద్రోహిగా వర్ణించడంతో షిండే శివసేన యువ విభాగం భగ్గుమంది. కునాల్‌కు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగింది. అదే టైంలో.. హాబిటాట్ స్టూడియోపై దాడికి దిగి విధ్వంసానికి పాల్పడింది. ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వెంటనే బెయిల్ లభించింది.
షిండేపై కునాల్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో సహా కూటమి ప్రభుత్వ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. థాక్రే శివసేన, ఎస్పీ పార్టీలు కునాల్‌కు మద్ధతుగా నిలిచాయి. షిండేకు క్షమాపణలు చెప్పాలంటూ సీఎం ఫడ్నవిస్ కోరగా.. అందుకు కునాల్ నిరాకరించాడు. కోర్టు కోరితేనే క్షమాపణలు చెబుతానంటూ తెగేసి చెప్పాడు. మరోవైపు కునాల్ వ్యంగ్యాన్ని తాను అర్థం చేసుకోగలనంటూనే.. దేనికైనా పరిమితి ఉంటుందంటూ షిండే మండిపడ్డారు. అదే టైంలో స్టూడియోపై తన పార్టీ విభాగం జరిపిన దాడిని ఖండిస్తూ.. చర్యకు ప్రతిచర్య ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.
ఈలోపు.. శివసేన(షిండే) ఎమ్మెల్యే ముర్జి పటేల్ ఫిర్యాదుతో మంబై పోలీసులు కునాల్ కమ్రాపై కేసు నమోదు చేసి విచారణకు రావాలంటూ నోటీసులు పంపించారు.