
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీపై పోటీకి వామపక్ష ఎల్డీఎఫ్ సత్యన్ మొకెరిని ఎంపిక చేసింది. సీపీఐకి చెందిన మొకెరి కొజికోడ్ జిల్లాలోని నాదపురం మాజీ ఎమ్మెల్యే. వ్యవసాయ రంగానికి చెందిన సమస్యలపై పనిచేసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. వయనాడ్‌లో సత్యన్ మొకెరి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా ఉంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వమ్ గురువారం ప్రకటించారు.
మొకెరి 2014 వయనాడ్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఐ.షానవాజ్ చేతిలో దాదాపు 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచి రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచి్చన విషయం తెలిసిందే. నవంబరు 13న వయనాడ్‌లో పోలింగ్ జరగనుంది.