
రామేశ్వరం: కొంతమందికి కారణం లేకుండానే ఎప్పుడూ ఏడ్చే అలవాటు ఉంటుందంటూ తమిళనాడు సీఎం స్టాలిన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన బహిరంగ సభ వేదికగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తోందని, గతంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చామని తెలిపారు.
త్రిభాషా విధానంపై స్టాలిన్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్ ఇస్తూ.. తమిళ నాయకులు నాకు లేఖలు రాస్తుంటారు. ఒక్కరు కూడా మాృతభాష తమిళంలో సంతకం చేయరు. తమిళ భాషను గౌరవించండి.. తమిళంలో సంతకం చేయండి. చాలా రాష్ట్రాల్లో మాృతభాషలో వైద్య విద్యా బోధన జరుగుతోంది. తమిళనాడులోనూ తమిళంలో వైద్య విద్యను అందించాలి. గత దశాబ్దంలో తమిళనాడు అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించాం. రైల్వే ప్రాజెక్టులకు నిధులు గణనీయంగా పెంచాం’’ అని మోదీ చెప్పారు.
‘‘తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. 2014 నుంచి అధికంగా తమిళనాడుకు ఇచ్చాం. 2014కు ముందు రైల్వే ప్రాజెక్టుకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే వచ్చేవని, ఈ ఏడాది తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ.6,000 కోట్లకు పైగా ఉందన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌లో తమిళనాడు పాత్ర చాలా గొప్పదన్న మోదీ.. ఈ రాష్ట్రం ఎంత బలంగా ఉంటే మన దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు.