
లోక్‌సభలో ప్రధాన్ వ్యాఖ్యలు
మండిపడ్డ డీఎంకే ఎంపీలు
నాలుక అదుపులో పెట్టుకో: స్టాలిన్
తమిళ ప్రజలకు ఘోర అవమానమిది
మోదీ సమర్థిస్తారా అని ప్రశ్నించిన సీఎం
మంత్రిపై హక్కుల తీర్మానం: కనిమొళి
వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్న ప్రధాన్
విద్యార్థుల భవితతో చెలగాటమా?
డీఎంకేకు నిజాయితీ లేదన్న మంత్రి
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు, తమిళనాడులోని అధికార డీఎంకేకు మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న రగడ పార్లమెంటునూ తాకింది. ‘అనాగరికులు’ అంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. వాటిపై డీఎంకే ఎంపీల నిరసనలు, ఆందోళనలతో సోమవారం రెండో విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజు లోక్‌సభ అట్టుడికిపోయింది. తమిళుల ఆత్మగౌరవాన్ని మంత్రి దారుణంగా దెబ్బతీశారంటూ డీఎంకే ఎంపీ కనిమొళి దుయ్యబట్టారు. ఆయనపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు.
ప్రధాన్ వ్యాఖ్యలపై తమిళనాడు అంతటా డీఎంకే శ్రేణులు నిరసనకు దిగాయి. ఆయన దిష్టి బొమ్మలు తగలబెట్టాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రివి అహంకారపూరిత వ్యాఖ్యలు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి’’ అంటూ హెచ్చరించారు. ‘‘తమిళ ప్రజలందరినీ మంత్రి ఘోరంగా అవమానించారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ సమర్థిస్తారా?’’ అని ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలు దారుణమంటూ కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు కూడా లోక్‌సభ ప్రాంగణంలో దుయ్యబట్టాయి.
డీఎంకేకు నిజాయితీ లేదు!
సభ ప్రారంభం కాగానే నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అంశాన్ని డీఎంకే సభ్యులు లేవనెత్తారు. దాన్ని తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం పీఎంశ్రీ పథకంపై ప్రశ్నకు ప్రధాన్ బదులిస్తూ డీఎంకే ఎంపీల తీరుపై తీవ్రంగా స్పందించారు. వారికి నిజాయితీ లేదంటూ ఆక్షేపించారు. ‘‘కర్ణాటక, హిమాచల్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా పీఎంశ్రీని అమలు చేస్తున్నాయి. అది తమకూ అంగీకారమేనని పలువురు డీఎంకే ఎంపీలు నాతో స్వయంగా చెప్పారు. ఈ మేరకు స్టాలిన్ కూడా ప్రకటన చేశారు.
తర్వాత ఏ ’సూపర్ సీఎం’ జోక్యం చేసుకున్నాడో గానీ, ఉన్నట్టుండి యూటర్న్ తీసుకున్నారు. కేవలం భాషాపరమైన వివాదాలు సృష్టించడమే పనిగా ఫక్తు రాజకీయాలు చేస్తున్నారు. తమిళ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. విద్యార్థుల భవితవ్యం దృష్ట్యా స్వార్థాన్ని పక్కనపెట్టి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, ఎన్‌ఈపీకి అంగీకరించాలని హితవు పలికారు. వీటిపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు.
ఎన్‌ఈపీ అంగీకారమేనని ప్రధాన్‌తో తామెన్నడూ చెప్పలేదన్నారు. ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. నిరసనలు, నినాదాలు, ఆందోళనలతో హోరెత్తించారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే ప్రయత్నాలు మానుకోవాలంటూ డిమాండ్ చేశారు. శాంతించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా వెనక్కు తగ్గలేదు. దాంతో సభ కాసేపు వాయిదా పడింది. మళ్లీ సమావేశమయ్యాక కూడా రగడ కొనసాగింది. కేంద్రానికి వ్యతిరేకంగా డీఎంకే సభ్యులు నినాదాలు కొనసాగించారు. ఎన్‌ఈపీని, హిందీ తప్పనిసరంటున్న త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ముందునుంచీ వ్యతిరేకిస్తోందని కనిమొళి అన్నారు.
ప్రధాన్ వ్యాఖ్యలు, ప్రత్యేకంచి ఒక పదం తమను తీవ్రంగా బాధించిందని ఆవేదన వెలిబుచ్చారు. దాంతో మంత్రి స్పందిస్తూ, ‘‘నా సోదరి రెండు అంశాలు లేవనెత్తారు. తమిళనాడు ప్రభుత్వం, ఎంపీలు, తమిళ ప్రజలను ఉద్దేశించి నేనలాంటి పదం వాడకుండా ఉండాల్సిందని అన్నారు. ఆ పదాన్ని వెనక్కు తీసుకుంటున్నా’’ అని ప్రకటించారు. అవి రికార్డుల్లోకి వెళ్లబోవని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ తమిళ ప్రజలను అవమానించేలా ప్రధాన్ దారుణ వ్యాఖ్యలు చేశారన్నారు. విద్యావిధానం వంటి అంశాలను ఏ రాష్ట్రంపైనా బలవంతంగా రుద్దరాదని కనిమొళి అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. మంత్రి తమను అబద్ధాలకోరులు అనడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు అంగీకరించేదే లేదని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కూడా అన్నారు. ‘‘హిందీని మాపై రుద్దడాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈ విషయంలో రాష్ట్రంలో అన్ని పార్టీలదీ ఒకే వైఖరి’’ అని స్పష్టం చేశారు.
మీపై చర్యలు తప్పవ్
మారన్‌పై స్పీకర్ ఆగ్రహం
డీఎంకే సభ్యుడు దయానిధి మారన్‌పై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. ఎన్‌ఈపీపై డీఎంకే సభ్యుల ఆందోళన సందర్భంగా పోడియం వద్ద మారన్ ఏవో వ్యాఖ్యలు చేశారు. వాటిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఆయనపై కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు. ‘‘మాట్లాడేటప్పుడు కాస్త నోరు జాగ్రత్త. మీ వ్యాఖ్యలు రికార్డులకు ఎక్కి ఉంటే తక్షణమే చర్యలు తీసుకునేవాడిని’’ అంటూ హెచ్చరించారు. మారన్‌పై చర్యలకు తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజుకు సూచించారు. లేదంటే తానే చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. సభ గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తనను సహించే ప్రసక్తే లేదని స్పీకర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment