New national education policy
-
గ్రీన్విచ్ కంటే ముందే మనకో కాలమానం!
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆరో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పుస్తకంలో పలు మార్పులు చేసింది. గ్రీన్విచ్ కాలమానం కంటే ముందే మన దేశానికి సొంత కాలమానం ఉందని, దీనిని ‘మధ్య రేఖ’ అని పిలుస్తారని పేర్కొంది. బీఆర్ అంబేద్కర్ అనుభవాలను, ఎదుర్కొన్న కుల వివక్ష పాఠాన్ని కూడా కుదించింది. హరప్పా నాగరికతను కొత్త పాఠ్య పుస్తకంలో ‘సింధు–సరస్వతి’గా పేర్కొంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాల విద్య కోసం కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్–2023కు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ కొత్త సిలబస్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో 6వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పలు మార్పులు చేసింది. గ్రీన్విచ్ కాలమానమే ప్రధాన కాలమానం కాదని, దానికంటే శతాబ్దాల ముందు యూరప్, భారత్‌లకు సొంత కాలమానాలున్నాయని పేర్కొంది. దానిని మధ్య రేఖ (మిడిల్ లైన్) అని పిలిచేవారని, అది ఖగోళ శాస్త్రానికి ప్రసిద్ధి చెందిన ఉజ్జయినీ నగరం (ఉజ్జయిన్) గుండా వెళ్లిందని వివరించింది. అలాగే కొత్త పాఠ్యపుస్తకంలో ‘భారత నాగరికత ప్రారంభం’ అనే అధ్యాయంలో సరస్వతి నదికి ప్రముఖ స్థానం ఉందని, ప్రజలను వర్ణాలుగా విభజించారని, శూద్రులను, స్త్రీలను వేదాలను అధ్యయనం చేయనీయలేదని పాత పాఠ్య పుస్తకంలో ఉండగా.. వ్యవసాయదారుడు, నేత, కుమ్మరి, బిల్డర్, వడ్రంగి, వైద్యుడు, నర్తకి, మంగలి, పూజారివంటి వృత్తులను వేదాల్లో పేర్కొన్నట్లు కొత్త పుస్తకాల్లో పేర్కొంది. పాత పుస్తకంలోని నాలుగు అధ్యాయాల్లో ఉన్న చాణక్యుడి అర్థశాస్త్రం, గుప్తులు, పల్లవులు, చాళుక్యుల రాజవంశాలు, అశోకుడు చంద్రగుప్త మౌర్యుల రాజ్యాల కథనాలను కొత్త పుస్తకంలో తొలగించింది. -
ఎన్ఈపీలో ప్రతి భారతీయ భాషకు తగు గౌరవం
న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ద్వారా దేశంలోని ప్రతి భాషకూ సముచిత గౌరవం లభిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం భాషపై రాజకీయం చేసే వారు తమ దుకాణాలను మూసేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. శక్తి సామర్థ్యాల ఆధారంగా కాకుండా భాష ప్రాతిపదికన ప్రతిభను అంచనా వేయడం వల్ల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఎన్ఈపీ ప్రారంభమై మూడో వార్షికోత్సవా న్ని పురస్కరించుకుని ఏర్పాటైన ‘అఖిల భారతీయ శిక్షా సమాగమ్’నుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘మాతృభాషలో విద్యా బోధన ద్వారా భారతీయ విద్యార్థులకు న్యాయం చేసే కొత్త రూపానికి నాంది పలుకుతోంది. సామాజిక న్యాయం దిశగా ఇది చాలా ముఖ్యమైన అడుగు’అని ప్రధాని అన్నారు. ప్రపంచంలోని అనేక భాషలు, వాటి ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి.. అనేక అభివృద్ధి చెందిన ముఖ్యంగా యూరప్ దేశాలు విద్యాబోధన స్థానిక భాషల్లో జరుగుతున్నందునే ఒక అడుగు ముందుకు వేశాయని చెప్పారు. మన దేశంలో అనేక ప్రాచీన భాషలున్నప్పటికీ, వాటిని వెనుకబాటుకు చిహ్నంగా చూపుతు న్నారని, ఇంగ్లిష్ మాట్లాడలేని వారిని విస్మరించారని, వారి ప్రతిభను గుర్తించడం లేదని మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఎన్ఈపీ రాకతో దేశం ఇప్పుడు ఈ నమ్మకాన్ని విస్మరించడం ప్రారంభించింది. ఐక్యరాజ్యసమితిలో కూడా నేను భారతీయ భాషలోనే మాట్లాడతాను’ అని చెప్పారు. సామాజిక శాస్త్రాల నుంచి ఇంజినీరింగ్ విద్య వరకు అన్ని సబ్జెక్టుల్లోనూ భారతీయ భాషల్లోనే బోధిస్తున్నారని తెలిపారు. భాషపై విద్యార్థులు పట్టుసాధించగలిగితే, ఎలాంటి అవరోధాలు లేకుండా వారిలో నైపుణ్యం, ప్రతిభ బయటికొస్తాయని ప్రధాని అన్నారు. ప్రపంచం భారతదేశాన్ని కొత్త అవకాశాల వేదికగా చూస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలంటే అనేక దేశాలు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నా యని వెల్లడించారు. ఇప్పటికే టాంజానియా, అబుధాబిల్లో ఐఐటీ క్యాంపస్‌లు నెలకొల్పార ని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శ్రీ (ఎస్హెచ్ఆర్ఐ) పథకం కింద మొదటి ఇన్స్టాల్మెంట్ నిధులను విడుదల చేశారు. -
ఎన్ఈపీతో ‘ప్రాక్టికల్’ బోధన
గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకున్నారు. అఖిల భారత ఉపాధ్యాయుల సదస్సులో ప్రధాని మాట్లాడుతూ కొత్త జాతీయ విద్యా విధానంతో (ఎన్ఈపీ) బోధనలో సమూల మార్పులు వస్తాయని చెప్పారు. ఒకప్పుడు విద్యార్థులు పుస్తకాలు చూసీ బట్టీ పట్టడమే ఉండేదని కానీ ఈ కొత్త విద్యావిధానం ప్రాక్టికల్ లెర్నింగ్‌పై దృష్టి పెట్టిందని అన్నారు. దీనిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ప్రాథమిక విద్య విద్యార్థులకు వారి వారి మాతృభాషలోనే ఉండాలని అప్పుడే విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలు వెలికి వస్తాయని చెప్పారు. మన దేశంలో ఆంగ్ల భాషలో బోధనకే అధిక ప్రాధాన్యం ఉందని ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించడానికి ఇష్టపడుతున్నారని ప్రధాని చెప్పారు. దీని వల్ల గ్రామాల్లోని ప్రతిభ ఉన్న ఉపాధ్యాయులు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారికి సరైన అవకాశాలు రావడం లేదన్నారు. ఎన్ఈపీతో ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని ప్రధాని మోదీ వివరించారు. ప్రభుత్వ పథకాల్లో వివక్షకు తావు లేదు గాంధీనగర్‌లో మహాత్మా మందిర్ ప్రారంభోత్సవంతో పాటు రూ.4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకి ప్రధాని శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభు త్వ పథకాల్లో కుల, మత వివక్షకు తావు లేదని అర్హులైన అందరికీ అవి చేరుతున్నాయని చెప్పారు. నిజమైన లౌకికవాదం ఉన్న చోట వివక్ష కనిపించదని అన్నారు. అందరూ సంతోషంగా ఉండడానికి కృషి చేయడం కంటే మించిన సామాజిక న్యాయం మరోటి లేదని అభిప్రాయపడ్డారు. 70% మంది మహిళల సాధికారతకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ఒక పనిముట్టులా నిలిచిందని ప్రభుత్వ పథకాలన్నీ నూటికి నూరు శాతం లబ్ధి దారులకు చేరేలా చర్యలు చేపట్టామన్నారు. -
విదేశీ వర్సిటీలకు మరింత స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: విదేశీ విశ్వవిద్యాలయాలకు భారత ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. తొలిసారిగా అవి భారత్‌లో సొంతంగా క్యాంపస్‌లు నెలకొల్పేందుకు, అడ్మిషన్ల విధానం, ఫీజుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. నిధులను సొంత దేశాలకు బదిలీచేసేందుకు తదితర నిబంధనలకు సంబంధించిన ముసాయిదా ప్రతిని యూజీసీ విడుదలచేసింది. అయితే ఆ వర్సిటీలో భారతీయ క్యాంపస్‌లలో కోర్సులకు సంబంధించి ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలి. ఆన్లైన్, దూర విద్యా కోర్సులకు అనుమతి ఇవ్వబోమని యూజీసీ చైర్పర్సన్ జగదీశ్ చెప్పారు. విదేశీ వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థ(హెచ్ఈఐ)లు ఇక్కడ క్యాంపస్‌ల ఏర్పాటు అనుమతులను యూజీసీ నుంచి తీసుకోవాలి. సంబంధిత వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాక ఈ నెల చివరికల్లా తుది నిబంధనలను రూపొందిస్తారు. ముసాయిదా ప్రకారం విదేశీ వర్సిటీలు తమ కోర్సుల్లో విద్యార్థుల అడ్మిషన్లు, ఫీజులపై స్వీయనియంత్రణ కల్గిఉంటాయి. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా.. ‘నూతన జాతీయ విద్యావిధానంలో పేర్కొన్నట్లు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయి విద్యాబోధన భారతీయ విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. విదేశీ వర్సిటీలతో అనువైన ఫీజుల్లోనే అంతర్జాతీయ విద్యార్హతలు మన విద్యార్థులకు దఖలుపడతాయి. వర్సిటీలు స్వదేశానికి పంపే నిధులకు ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్(ఫెమా) చట్టం,1999 వర్తిస్తుంది. ఇవి తమ వార్షిక ఆడిట్ యూజీసీకి సమర్పిస్తారు’ అని జగదీశ్ అన్నారు. ర్యాంక్‌లు పొందిన వాటికే.. అత్యున్నత ర్యాంక్ పొందిన వర్సిటీలకే భారత్‌లో క్యాంపస్‌ల ఏర్పాటుకు అవకాశమిస్తారు. అంటే ప్రపంచం మొత్తంలో 500 లోపు ర్యాంక్ లేదా సబ్జెక్ట్ వారీగా ర్యాంక్ లేదా స్వదేశంలో దిగ్గజ వర్సిటీలకే భారత్‌లో అవకాశం దక్కనుంది. తర్వాత వాటి దరఖాస్తుల పరిశీలనకు యూజీసీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటుచేయనుంది. దేశంలో న్యాక్ గ్రేడ్ పొందిన దేశీ వర్శిటీల సమన్వయంతో ఈ వర్సిటీలు పనిచేసే వీలుంది. దరఖాస్తు చేసిన 45 రోజుల్లో అనుమతులు లభిస్తాయి. కమిషన్ సూచించిన సమయంలో క్యాంపస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫీజులు తదితర వివరాలను ప్రవేశాలకు 60 రోజుల ముందే వెల్లడించాలి. సరైన సంస్కరణలతో దేశీయ వర్సిటీలను బలోపేతం చేయాల్సిందిపోయి విదేశీ వర్సిటీలు తేవడం ఏంటని కొందరు విద్యావేత్తలు పెదవివిరిచారు. ‘ప్రభుత్వ నూతన విద్యా విధానం ప్రకారం యూజీసీకే చరమగీతం పాడనున్నారు. అలాంటి యూజీసీ నేతృత్వంలో సంస్కరణలు తేవడం ఏంటి ?. గతంలో విదేశీ వర్సిటీల బిల్లును 2012–13 కాలంలో యూపీఏ సర్కార్ తెచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఆనాడు దీనిని బీజేపీ, వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యసభ స్థాయీ సంఘం కూడా తప్పుబట్టింది. ఇప్పుడు అదే బీజేపీ ఇప్పుడు ఇలా విరుద్ధంగా వ్యవహరిస్తోంది’ అని విద్యావేత్త, ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ అభా దేవ్ అన్నారు. -
ఐఐటీల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించండి
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ఉన్నత విద్యా సంస్థలుసహా టెక్నికల్, నాన్–టెక్నికల్ విద్యా సంస్థల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించాలని అధికార భాషా పార్లమెంట్ కమిటీ సిఫార్సు చేసింది. ఇంగ్లిష్ భాష వాడకాన్ని కాస్త తగ్గించి భారతీయ భాషలకు తగిన ప్రాధాన్యతను కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ కమిటీ సిఫార్సులు పంపింది. ఇంగ్లిష్‌ను ఐచ్ఛికంగా వాడాలని హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన 11వ నివేదికను ఇటీవలే రాష్ట్రపతికి సమర్పించింది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అధికారిక లేదా ప్రాంతీయ భాషలనే వాడాలన్న సూచన మేరకు ఈ సిఫార్సులు చేసినట్లు కమిటీ ఉపాధ్యక్షుడు, బీజేడీ నేత భర్తృహరి మహతాబ్ చెప్పారు. ‘ఐక్యరాజ్యసమితి అధికారిక భాషల్లో హిందీని చేర్చాలి. ఏ–కేటగిరీ రాష్ట్రాల్లో హిందీకి ‘100 శాతం’ ప్రాధాన్యత ఇవ్వాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాల యాలు, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీలోనే బోధించాలి. వేరే రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో అక్కడి స్థానిక భాషల్లో బోధించాలి. వలస వాసనను వదిలించుకుంటూ విదేశీ భాష ఇంగ్లిష్‌ను కాస్త పక్కనబెట్టాలి’ అని కమిటీ సిఫార్సు చేసింది. ‘ హిందీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతాల్లో ఉన్న బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ వర్సిటీ, జమియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం వర్సిటీలలో పూర్తిగా హిందీలోనే బోధిస్తే మేలు. ఇక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీస్‌లు, మంత్రిత్వ శాఖల మధ్య లేఖలు, ఫ్యాక్స్‌లు ఈ–మెయిల్లలో హిందీ లేదా స్థానిక భాషలను వాడాలి. అధికారిక కార్యక్రమాల్లో, ప్రసంగాల్లో, ఆహ్వాన పత్రాల్లో సులభంగా ఉండే హిందీ/స్థానిక భాషలనే వాడాలి’ అని సూచించింది. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హరియాణా, హిమాచల్, రాజస్థాన్, ఢిల్లీ ఏ–కేటగిరీలో ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ బి–కేటగిరీలో ఉన్నాయి. మిగతావి సి –కేటగిరీలో ఉన్నాయి. -
Teachers Day 2022: మాతృభాషలో బోధనతో ప్రతిభకు పదును
న్యూఢిల్లీ: పాఠశాల స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిలషించారు. మాతృభాషలో బోధిస్తే పిల్లల్లో సైన్స్, సాహిత్యం, సామాజిక శాస్త్రాలకు సంబంధించి నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పాఠ్యాంశాలను వారు సులువుగా అర్థం చేసుకోగలుగుతారన్నారు. నూతన జాతీయ విద్యావిధానంలో పాఠశాల, ఉన్నత విద్యలో భారతీయ భాషలకు ప్రాధాన్యం లభించిందని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన జాతీయ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు. తమ గ్రామం నుంచి కాలేజీలో చదువుకునేందుకు వెళ్లిన మొదటి బాలికగా నిలవడం వెనుక ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహమే కారణమని చెప్పారు. వారికి తానెంతో రుణపడి ఉంటానన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము 46 మంది ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు అందజేశారు. వీరిలో హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులున్నారు. -
స్వదేశం నుంచే విదేశీ విద్య
సాక్షి, అమరావతి: విదేశీ విశ్వవిద్యాలయాల్లోని అత్యున్నత విద్యను ఇకపై స్వదేశం నుంచే అభ్యసించే అవకాశం మన విద్యార్థులకు కలగబోతోంది. కేంద్ర ప్రభుత్వ నూతన జాతీయ విద్యావిధానంలో చేసిన నిర్ణయాల ఫలితంగా ఆయా విదేశీ వర్సిటీల అనుబంధ విద్యావిభాగాలు మన దేశంలోనే కొలువుదీరనున్నాయి. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలు సాధించేలా.. అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించేందుకు వీలుగా నూతన జాతీయ విద్యావిధానంలో కొత్త నిబంధనలు పొందుపరిచిన సంగతి తెలిసిందే. విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ.. డ్యూయెల్ డిగ్రీ ప్రోగ్రాములతో పాటు విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడికి అనుగుణంగా ‘ట్విన్నింగ్’ కార్యక్రమాల కోసం పలు కొత్త నిబంధనలను కేంద్రం రూపొందించింది. వీటిని యూజీసీ 2020 ఏప్రిల్‌లోనే నోటిఫై చేసి విదేశీ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానం పలికింది. ట్విన్నింగ్, డ్యూయెల్ డిగ్రీ కోర్సుల అమలుకు, పరస్పర సహకారానికి ముందుకు రావాలని కోరింది. ఈ నిబంధనల ప్రకారం.. దేశంలోని విద్యార్థులు దేశీయ వర్సిటీలు, విదేశీ వర్సిటీలు అందించే డ్యూయెల్ డిగ్రీలను ఒకేసారి అందుకోగలుగుతారు. దీనికి విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి సానుకూల స్పందన లభించినట్లు యూజీసీ వెల్లడించింది. ఇప్పటికే స్కాట్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోవ్ విద్యా సంబంధిత అనుసంధానంపై సుముఖత వ్యక్తపరచగా, ఆస్ట్రేలియాలోని డాకిన్ యూనివర్సిటీ కూడా ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలకు తోడ్పాటునందిస్తుందని తెలిపింది. ఇవే కాకుండా.. అనేక ఇతర విదేశీ వర్సిటీలు తమ శాటిలైట్ క్యాంపస్ (అనుబంధ విభాగాలు)లను భారత్‌లో ఏర్పాటుచేయడానికి ముందుకు వస్తున్నట్లు యూజీసీ పేర్కొంది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్‌లాండ్ తమ శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటుపై సానుకూలత వ్యక్తపరచడంతో పాటు వచ్చే నెలలో ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. అంతేకాక.. జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీ, ఫ్రాన్స్‌లోని మరో యూనివర్సిటీ కూడా దేశంలో శాటిలైట్ వర్సిటీ క్యాంపస్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. జపాన్‌లోని వివిధ వర్సిటీలు కూడా తమ ఆసక్తిని వ్యక్తపరిచినట్లు యూజీసీ వర్గాలు తెలిపాయి. ఉన్నత విద్య అంతర్జాతీయకరణకు వీలుగా జాతీయ నూతన విద్యావిధానంలో చేసిన కొత్త నిర్ణయాలతో విద్యా సంబంధిత వ్యవహారాలు మరింత బలోపేతమవుతాయంటూ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి అభిప్రాయపడుతూ పరస్పర మార్పిడి ప్రక్రియకు సానుకూలతను తెలిపింది. వేల్స్‌లోని బంగోర్ వర్సిటీ, సోస్ యూనివర్సిటీ ఆఫ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ కూడా ఉన్నత విద్యా వ్యవహారాల్లో పరస్పర మార్పిడి ప్రక్రియకు ముందుకొస్తున్నాయి. ఇక జర్మనీలోని యూనివర్సిటీ జెనా, దక్షిణాఫ్రికాలోని డర్బన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలు సహ దాదాపు 48 విదేశీ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యలో పరస్పర సహకారానికి ప్రతిపాదించాయి. ఎంఐటి, స్టాన్ఫోర్డ్లు కూడా సంసిద్ధత ఇక అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ (ఎంఐటీ), స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలు కూడా తమ విభాగాల ఏర్పాటుకు ముందుకొస్తుండడంతో దేశంలోని విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డ్యూయెల్ డిగ్రీ ప్రోగ్రాముల ద్వారా ఆయా వర్సిటీల కోర్సులను కూడా మన విద్యార్థులు స్వదేశంలో చదువుతూనే వాటినీ అభ్యసించడానికి వీలవుతుందని చెబుతున్నారు. ఇవే కోర్సులను విదేశాల్లోని ఆయా వర్సిటీలలో చదవాలంటే లక్షల్లో డబ్బు వెచ్చించడంతోపాటు అనేక వ్యయప్రయాసలకోర్చవలసి ఉంటుందని వివరిస్తున్నారు. కానీ, ఇక్కడే ఆయా డిగ్రీ కోర్సుల అధ్యయనంతో పైచదువుల కోసం విదేశీ వర్సిటీల్లో మన విద్యార్థులు సులభంగా ప్రవేశాలు పొందే అవకాశముంటుందంటున్నారు. -
పల్లెటూరును చదివేద్దాం
సాక్షి, అమరావతి: ఐఐటీ ప్రవేశ పరీక్షలో టాప్ 50 ర్యాంకులు సాధించిన వారిలో నవీన్ ఒకడు. ప్రముఖ ఐఐటీలో సీటు కూడా వచ్చింది. రెండో సంవత్సరంలో తాను చదవాల్సిన కోర్సుల్లో ‘అండర్ స్టాండింగ్ రూరల్ అండ్ లోకల్ ఎకానమీ, లైవ్లీహుడ్’ అనేది ఒక సబ్జెక్ట్. ఈ కోర్సులో ప్రత్యేక అసైన్మెంట్గా అతడు ఏదో ఒక గ్రామాన్ని సందర్శించి, స్థానికంగా అందరితో చర్చించి.. గ్రామంలో ప్రస్తుతం పంచాయతీ పాలన ఎలా కొనసాగుతోంది? ఏం చేస్తే మరింత సమర్థవంతంగా పాలన సాగుతుంది? తదితర విషయాలపై వీడియో ప్రజెంటేషన్ లేదా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్న పరిష్కార మార్గాలు సూచిస్తే.. గ్రామీణాభివృద్ధిలో ఇటు ప్రభుత్వాలు, అటు స్వచ్ఛంద సంస్థలు వాటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా పల్లె ప్రాంతాలకు వేగంగా అభివృద్ధి ఫలాలను అందివ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. సమగ్ర పరిశీలనే లక్ష్యం కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా డిగ్రీ, పీజీ స్థాయిలో గ్రామాల్లో స్థానిక పరిస్థితులపై అధ్యయానికి సంబంధించి పలు కోర్సులను ప్రవేశపెట్టబోతుంది. ఐఐటీలతో సహా ప్రముఖ యూనివర్సిటీల విద్యార్థులు ఆయా కోర్సుల్లో భాగంగా గ్రామాలను స్వయంగా సందర్శిస్తారు. స్థానికంగా ఉండే స్వయం సహాయక సంఘాల మహిళలతో, ఉపాధి హామీ పథకం కూలీలతో భేటీ అవుతారు. స్థానిక పరిస్థితులపై సర్వే చేసి, గ్రామ అభివృద్ధి ప్రణాళికల తయారీలో భాగస్వామ్యులవుతారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి కొన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. గ్రామంలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల గుర్తింపు.. వాటికి నిధుల సమీకరణ గురించి పరిశీలిస్తారు. గ్రామంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వాటి నిర్వహణలో ఉన్న లోపాలు, పరిష్కారాల గురించి అధ్యయనం చేస్తారు. మొత్తంగా విద్యార్థులు తాము నేర్చుకున్న పాఠాలు, పరిశీలన ఆధారంగా గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ నివేదిక అందజేయాల్సి ఉంటుంది. సీసీసీ కోర్సులు ఇలా.. గ్రామీణ ప్రజల జీవనశైలి, గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆధ్యయనానికి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) ప్రధానంగా నాలుగు రకాల (ఇవి కాకుండా ఇంకా ఉంటాయి) కోర్సులను రూపొందించింది. వాటి వివరాలను అన్ని ఉన్నత విద్యా సంస్థలకు అందజేసింది. యూనివర్సిటీ, ఉన్నత విద్యా సంస్థల్లో ఏ కోర్సు చదివే విద్యార్థులైనా కామన్‌గా ‘కంపల్సరీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కోర్సు (సీసీసీ)’ పేరుతో ఉన్న ఈ కోర్సుల్లో కొన్నింటిని తప్పనిసరిగా చదవాల్సిందే. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు మొత్తం కోర్సులో సగం సమయం గ్రామాల్లోనే గడపాల్సి ఉంటుంది. వేగంగా అభివృద్ధికి బాటలు పట్టణ ప్రాంతాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ–ప్రైవేట్ సేవలు అందుబాటులోకి తీసుకు రావడం కోసం ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు, సామాజిక సేవా సంస్థలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల నుంచి వచ్చే సూచనలు కీలకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. తద్వారా భవిష్యత్‌లో ప్రభుత్వాలు మరింత వేగంగా గ్రామీణ ప్రాంతాల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని విద్య, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. అప్రిసియేషన్ ఆఫ్ రూరల్ సొసైటీ: గ్రామీణ ప్రజల జీవనశైలి – కొన్నిరకాల కట్టుబాట్లకు ప్రజలు ఇచ్చే విలువ – గ్రామాల్లో అందుబాటులో ప్రత్యేక వనరులు తదితర అంశాలపై ఈ కోర్సు ఉంటుంది. అండర్ స్టాండింగ్ రూరల్ అండ్ లోకల్ ఎకానమీ, లైవ్లీహుడ్: గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం,ఇతర వృత్తులతో పాటు ఉపాధి కోసం వలసలు తదితర అంశాలుంటాయి. రూరల్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగామ్స్: గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ఉంటుంది. రూరల్ అండ్ లోకల్ ఇనిస్టిట్యూషన్స్: గ్రామాల్లో పంచాయతీ పాలన సాగుతున్న తీరు, గ్రామ సభ ఏర్పాటు, గ్రామ స్థాయిలో అధికార వ్యవస్థ తదితర అంశాలుంటాయి. కొత్త ఐడియాలకు ఆహ్వానం పలకడమే ప్రజా ప్రతినిధులు, అధికారుల వ్యవస్థ ఎంత శ్రద్ధ పెట్టినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలు దశాబ్దాల తరబడి అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటిపై మరింత ఫోకస్ అవసరం. విద్యార్థులనూ భాగస్వామ్యం చేయడం ద్వారా ఆ సమస్యల మూలాలను అన్వేషించడాకి అవకాశం ఉంటుంది. మన విద్యా విధానంలో ఇప్పటికే కొంత మేర గ్రామీణ అంశాలు ఉన్నప్పటికీ అది నామమాత్రమే. ఇప్పుడు ఉన్నత విద్యలో క్రెడిట్ బేస్డ్ సిస్టమ్‌లో డిజైన్ చేసిన కోర్సుల వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి కొత్త ఐడియాల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. నేటి ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఈ రకమైన ఒరవడి విద్యార్థి దశలోనే కల్పించడం ద్వారా భారతదేశ గ్రామీణ వ్యవస్థలో పెను మార్పులు రావడానికి దోహదపడుతుంది. – ఎం.ప్రసాదరావు,రిటైర్డు ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ -
దేశ నిర్మాణమనే మహాయజ్ఞంలో... ఎన్‌ఈపీది కీలక భూమిక
న్యూఢిల్లీ: దేశ నిర్మాణమనే మహాయజ్ఞంలో కీలక భూమిక పోషిస్తున్న వాటిలో నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యువత తమ ఆకాంక్షలను నేరవేర్చుకోవడానికి దేశం వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎన్ఈపీని అమలు చేయడానికి టీచర్లు, ప్రిన్సిపాల్స్, విధాననిర్ణేతలు తీవ్రంగా శ్రమించారని కితాబిచ్చారు. ‘భవిష్యత్తులో ఎంత ఉన్నత స్థాయికి చేరుకుంటామనేది ప్రస్తుతం యువతకు మనమెలాంటి విద్యను అందిస్తున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. దేశం మొత్తం మీతో ఉందని, మీ ఆకాంక్షలకు అండగా నిలుస్తుందనే భరోసాను కొత్త ఎన్ఈపీ యువతకు ఇస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. గురువారం కొత్తగా ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ– ఏఐ) కార్యక్రమం యువతను భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా తీర్చిదిద్దుతుందని, ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు బాటలు వేస్తుందని అన్నారు. ఆకడమిక్ బ్యాంక్ ఆప్ క్రెడిట్ (ఏబీసీ) పథకాన్ని ప్రధాని ప్రకటించారు. దీని ప్రకారం ఉన్నతవిద్యలో ఒక విద్యార్థి తనకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. భిన్న యూనివర్శిటీలకు మారొచ్చు. వరుసగా ఇన్నేళ్లు చదవాలని కాకుండా... తను కోరుకున్నపుడు కోర్సులో చేరడం, మధ్యలో నిలిపివేయడం చేయవచ్చు. అతని రికార్డులన్నీ ఏబీసీలో నిక్షిప్తమవుతాయి. అలాగే 3, 5, 8వ తరగతుల విద్యార్థులకు సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన సమర్థత ఆధారిత మూల్యాంకనం (సఫల్)ను గురువారం మోదీ ఆరంభించారు. మాతృభాషకు పెద్దపీట మాతృభాషకు, ప్రాంతీయ భాషలకు కూడా ఎన్ఈపీ ప్రాధాన్యమిస్తోందనే అంశాన్ని ఎత్తిచూపుతూ... ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కాలేజీలు ఐదు భారతీయ భాషల్లో (హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ) విద్యాబోధనను ప్రారంభించనుండటం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇంజనీరింగ్ పాఠ్యాంశాలను 11 భాషల్లోకి అనువదించడానికి ఒక టూల్‌ను అభివృద్ధి చేయడం జరిగింది. మాతృభాషలో చదువుల కు ప్రాధాన్యమిస్తే... పేద, గ్రామీణ, గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపగలం. భారత సంకేత భాషకు తొలిసారిగా భాష హోదా ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఎవరైనా తాము నేర్చుకునే భాషల్లో ఒకటిగా దీన్ని ఎంచుకోవచ్చు’ అని పేర్కొన్నారు. -
ప్రాంతీయ భాషలకు పెద్దపీట
న్యూఢిల్లీ: ప్రాంతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించేలా నూతన జాతీయ విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) తీసుకొచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యా వ్యవస్థలో భాషాపరమైన అవరోధాలను తొలగించడానికి ‘మిషన్ మోడ్’లో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు, పేదలకు తగిన అవకాశాలు దక్కుతాయని, వారి జీవితాలు మెరుగవుతాయని తెలిపారు. విద్యా రంగం కోసం కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనల సమర్థ అమలుపై బుధవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలో, ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ విషయాలను(కంటెంట్) ప్రాంతీయ భాషల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత భాషా నిపుణులపై ఉందన్నారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో ఇది సాధ్యమేనని సూచించారు. జ్ఞానానికి, పరిశోధనలకు పరిమితులు విధించుకోవడం అంటే దేశానికి పెద్ద అన్యాయం చేసినట్లేనని తేల్చిచెప్పారు. అంతరిక్షం, అణుశక్తి, డీఆర్డీఓ, వ్యవసాయం తదితర కీలక రంగాల్లో ప్రతిభావంతులైన మన యువతకు తలుపులు తెరిచి ఉన్నాయని ప్రధానమంత్రి వివరించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ప్రపంచ దేశాల సరసన భారత్ ‘‘కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యం తర్వాత విద్యా, నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలపైనే ఎక్కువ దృష్టి పెట్టాం. ఉపాధి, వ్యాపార సామర్థ్యాన్ని విద్యతో అనుసంధానించడమే లక్ష్యంగా మేము సాగిస్తున్న ప్రయత్నాలకు ఈ బడ్జెట్ మరింత ఊతం ఇస్తుంది. మా ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వైజ్ఞానిక ప్రచురణలు, పీహెచ్డీ స్కాలర్లు, స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లో భారత్ స్థానం సంపాదించింది. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీలో ప్రపంచంలోని మొదటి 50 దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. తన స్థానాన్ని క్రమంగా మెరుగుపర్చుకుంటోంది. ఇక మన ఇంధనం హైడ్రోజన్ భారత్ స్వావలంబన సాధించిన దేశంగా మారాలంటే యువతకు తమపట్ల తమకు విశ్వాసం ఉండాలి. అది జరగాలంటే వారు ఆర్జించిన విద్య, విజ్ఞానం పట్ల పూర్తి నమ్మకం పెంచుకోవాలి. విద్యా వ్యవస్థలో ప్రాంతీయ భాషలకు చాలా ప్రాధాన్యం ఉంది. సబ్జెక్టును అర్థం చేసుకోవడంలో భాష ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య దాకా అత్యత్తమ కంటెంట్‌ను మన ప్రాంతీయ భాషల్లో తీసుకురావాలి. మెడికల్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్.. అన్ని సబ్జెక్టుల్లో ప్రపంచ స్థాయి కంటెంట్ ప్రాంతీయ భాషల్లో రావాలి. కేవలం భాష అన్న ఒక్క అవరోధం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని నైపుణ్యాలను వృథా కానివ్వొద్దు. దేశ అభివృద్ధి ప్రయాణంలో పల్లె ప్రజలను, పేద వర్గాలను సైతం కలుపుకొని వెళ్లాలి. ప్రి–నర్సరీ నుంచి పీహెచ్డీ స్థాయి దాకా జాతీయ విద్యా విధానంలోని అన్ని ప్రతిపాదనలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో మన విద్యార్థులకు, యువ సైంటిస్టులకు కొత్త అవకాశాలు నానాటికీ పెరుగుతున్నాయి. పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు, ఉన్నత విద్యా సంస్థల్లో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద ఐఐటీ–వారణాసి, ఐఐటీ–ఖరగ్‌పూర్, ఐఐఎస్ఈఆర్–పుణేలో పరంశివాయ్, పరంశక్తి, పరబ్రహ్మ అనే మూడు సూపర్ కంప్యూటర్లు ఏర్పాటు చేశాం. మరో 12 సంస్థల్లో సూపర్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రతిపాదన ఉంది. దీనికి రూ.50 వేల కోట్లు కేటాయించాం. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంది. ఇందులో భాగంగానే బడ్జెట్లో హైడ్రోజన్ మిషన్‌ను ప్రకటించాం. హైడ్రోజన్ వాహనాన్ని ఇప్పటికే పరీక్షించాం. రవాణా రంగంలో ఇంధనంగా హైడ్రోజన్‌ను ఉపయోగించడంపై దృష్టి పెట్టాలి’’ అని ప్రధాని మోదీ కోరారు. -
పేదలకు సులభ జీవనం అందించండి
న్యూఢిల్లీ: భారతదేశం తన యువతకు కావాల్సిన సదుపాయాలను (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అందిస్తుందని, అనుభవం, నైపుణ్యం, నవీన ఆవిష్కరణల ద్వారా వారు దేశంలోని పేదలకు సులభతర జీవనాన్ని(ఈజ్ ఆఫ్ లివింగ్) అందించాలని ప్రధాని మోదీ కోరారు. ఆయన శనివారం ఢిల్లీ ఐఐటీ 51వ వార్షిక స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానంగా నిరుపేదల కోసం కొత్త ఆవిష్కరణలు చేయాలని యువతకు సూచించారు. కోవిడ్ అనంతరం భిన్నమైన ప్రపంచాన్ని మనం చూడబోతున్నామని, ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని తెలిపారు. నాణ్యతపై కచ్చితంగా దృష్టి పెట్టాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ఐఐటీ విద్యార్థులకు ఉద్బోధించారు. మీ శ్రమ ద్వారా భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని అన్నారు.బ్రాండ్ ఇండియాకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ద్వారా మంచి పాలన అందించవచ్చనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఈ టెక్నాలజీ పేదల వరకూ చేరుతోందన్నారు. సాంకేతికత ద్వారా సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తూ అవినీతికి అడ్డుకట్ట వేశామని మోదీ పేర్కొన్నారు. ఎన్ఈపీ అతిపెద్ద సంస్కరణ: రమేశ్ ఐఐటీకి చెందిన 2,019 మంది గ్రాడ్యుయేట్లకు శనివారం డిగ్రీలు అందజేశారు. విద్యార్థులను ఉద్దేశించి విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రసంగించారు. స్నాతకోత్సవం అంటే విద్యాభ్యాసం పూర్తయినట్లు కాదని, ఉద్యోగ రంగంలోకి అడుగపెట్టేందుకు ఇదొక గట్టి పునాది లాంటిదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద సంస్కరణ అని అభివర్ణించారు. -
అది దేశ విద్యా విధానం
న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) కేవలం ప్రభుత్వ విధానం కాదని.. అది మొత్తంగా భారత దేశ విద్యా విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం కూడా దేశ విదేశాంగ, రక్షణ విధానాలతో సమానమైన ప్రాముఖ్యత కలిగినదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అమలులో సాధ్యమైనంతగా మార్పుచేర్పులకు వీలు కల్పించాలని, ఈ విద్యా విధానానికి సంబంధించిన అన్ని అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ‘రోల్ ఆఫ్ ఎన్ఈపీ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్’అనే అంశంపై సోమవారం జరిగిన గవర్నర్ల సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ విద్యా విధానంపై సంబంధిత వర్గాలకు అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉండటం సహజమేనని ప్రధాని పేర్కొన్నారు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ‘విద్యా విధానంలో భాగమైన ప్రతీ వ్యక్తి అభిప్రాయాలను గౌరవిస్తాం. ప్రశ్నలకు జవాబిస్తాం. అనుమానాలను నివృత్తి చేస్తాం’అని స్పష్టం చేశారు. చాలా ప్రశ్నలు ఎన్ఈపీ అమలుకు సంబంధించే ఉన్నాయన్నారు. దేశ విద్యా విధానం ఆ దేశ ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందని అభివర్ణించారు. ఈ విద్యా విధానాన్ని రూపొందించిన తీరు తరహాగానే.. అమలులోనూ సాధ్యమైనంత సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించాలని సూచించారు. సదస్సులో రాష్ట్రాల గవర్నర్లతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రాల విద్యా శాఖల మంత్రులు, వర్సిటీల వైస్ చాన్సెలర్లు పాల్గొన్నారు. ఎన్ఈపీ–2020పై సెప్టెంబర్ 25 లోపు యూనివర్సిటీల్లో వర్చువల్ సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. నూతన విద్యా విధానాన్ని పాఠశాల ఉపాధ్యాయుల నుంచి, ప్రఖ్యాత విద్యావేత్తల వరకు అంతా స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు. అకడమిక్, వొకేషనల్, టెక్నికల్ సహా అన్ని అంశాలను, అలాగే, పాలనాపరమైన అనవసర జాప్యాలను నివారించే చర్యలను కూడా నూతన ఎన్ఈపీలో సమగ్రంగా పొందుపర్చారన్నారు. కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు దశలవారీగా స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలనే ఆలోచన వెనుక.. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించాలి, సమర్థ్ధతకు పట్టం కట్టాలనే ఉద్దేశం ఉందని ప్రధాని మోదీ వివరించారు. ‘ఈ స్ఫూర్తిని విజయవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది’అన్నారు. చదవడం కన్నా నేర్చుకోవడంపై, విశ్లేషణాత్మక ఆలోచనాధోరణిని పెంపొందించుకోవడంపై ఈ నూతన విద్యా విధానంలో ప్రధానంగా దృష్టి పెట్టారన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న పుస్తకాలు, సిలబస్, పరీక్షల ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు ఈ విధానంలో ఉన్నాయన్నారు. చిన్న క్లాసుల నుంచే వృత్తి విద్యకు, శిక్షణకు ప్రాధాన్యతనిచ్చి, వారిని దేశీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధ్దం చేయడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. ‘స్వావలంబ భారత్’లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా ఈ నూతన ఎన్ఈపీ రూపొందిందన్నారు. గతంలో విద్యార్థులు తమకు ఆసక్తి లేని అంశాలను బలవంతంగా నేర్చుకోవాల్సి వచ్చేదని, నూతన విద్యా విధానంలో ఆ సమస్యకు పరిష్కారం చూపామని వివరించారు. 21వ శతాబ్దపు నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా భారత్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నూతన విద్యా విధాన స్థూల రూపకల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా జోక్యం చేసుకోలేదన్నారు. విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకు ఈ విధానంలో సముచిత ప్రాధాన్యతనిచ్చారన్నారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన వర్సిటీలు భారత్‌లో తమ కేంద్రాలను ప్రారంభించేలా నూతన విధానంలో అవకాశం కల్పించామన్నారు. దీనివల్ల మేధో వలస సమస్య కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ‘పరిశోధన’కు నిధులు పెంచాలి పరిశోధన, అభివృద్ధి’పై ప్రభుత్వ నిధులను భారీగా పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే...భారత్ ఈ రంగంలో అతి తక్కువ నిధులను కేటాయిస్తోందన్నారు. పరిశోధన, సృజనాత్మక ఆవిష్కరణలపై భారీగా పెట్టుబడులు పెట్టడం భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థకు అత్యావశ్యకమన్నారు. నూతన విద్యా విధానంపై సోమవారం వర్చువల్‌గా జరిగిన గవర్నర్ల సదస్సునుద్దేశించి ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్’కు జీడీపీలో అమెరికా 2.8%, దక్షిణ కొరియా 4.2%, ఇజ్రాయెల్ 4.3% నిధులను కేటాయిస్తుండగా, భారత్ మాత్రం జీడీపీలో 0.7% నిధులను మాత్రమే కేటాయిస్తోందన్నారు. -
విద్యా విధానం.. ముసాయిదానే!
ఆమోదించక ముందే విమర్శలా? * అందరి అభిప్రాయాలతోనే తుది రూపు * సరైన దిశలోనే రాష్ట్ర విద్యారంగం * కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సాక్షి, హైదరాబాద్: నూతన జాతీయ విద్యా విధానంపై ప్రకటించిన ముసాయిదాను కేంద్రం ఇంకా ఆమోదించలేదని, ఇది కేవలం వివిధ వర్గాల నుంచి సేకరించిన సలహాలు, సూచనల సంకలనం మాత్రమేనని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ఇంకా ఆమోదించని విధానా న్ని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని పేర్కొన్నారు. నూతన విద్యా విధానంపై విస్తృత చర్చ కోసమే ముసాయిదాను బహిర్గతపరిచామని చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నూతన విధ్యా విధానానికి తుదిరూపు ఇస్తామన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30 కల్పిస్తున్న మైనారిటీ విద్యా సంస్థల స్థాపన,నిర్వహణ హక్కులను కేంద్రం హరించబోతోందన్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. నూతన విద్యా విధానంపై సెప్టెంబర్ 15 వరకు సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. నూతన విద్యా విధానంపై రాష్ట్రాల అభిప్రాయ సేకరణలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేయాలని కడియం కోరారని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ పరిశీలిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ఆదర్శ, కస్తూర్బా గాంధీ, సంక్షేమ వసతి గృహాల పాఠశాలల విజయాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యారంగం పరంగా రాష్ట్రం సరైన దిశలో వెళుతోందని ప్రశంసించారు. రాష్ట్రానికి ఐదు వరాలివ్వండి: కడియం ప్రతి రాష్ట్రంలో ఓ ఐఐఎం ఉండాలని కేంద్రం విధానమని, రాష్ట్రానికి కూడా ఐఐఎం మంజూరు చేయాలని ప్రకాశ్ జవదేకర్‌ను కోరినట్లు కడియం తెలిపారు. దీన్ని 2017-18 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని పేర్కొన్నారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదాన్ని ప్రధాని మోదీ ప్రకటించగానే బాలికల కోసం కేంద్రం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోందని ఆశించామని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవన్నారు. దేశ వ్యాప్తంగా బాలికల కోసం జిల్లాకో ప్రత్యేక విద్యా సంస్థ ఏర్పాటు చేసి 1వ తరగతి నుంచి పీజీ వరకు విద్యను అందించాలని ప్రతిపాదించామని, దీనిపై పరిశీలన జరుపుతామని జవదేకర్ ఇచ్చారని తెలిపారు. కేంద్రం సహకారంతో దేశవ్యాప్తంగా మధ్నాహ్న భోజన పథకాన్ని 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకే అందిస్తున్నరని, ఇకపై 12వ తరగతి విద్యార్థులకు కూడా వర్తింపచేసేందుకు కేంద్ర సహకరించాలని కోరినట్లు వివరించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే బోధిస్తున్నారని, ఆ తర్వాత సమీపంలో జూనియర్ కాలేజీలు లేక విద్యార్థినులు చదువు మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 12వ తరగతి వరకు విద్యను అందించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. సరైన శిక్షణ లేకనే.. దేశ వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పడిపోవడానికి కారణం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోవడమేనని, ఉపాధ్యాయుల శిక్షణకు అవసరమైన నిధులు, సదుపాయాలను కేంద్రం కల్పించాలని కోరినట్లు కడియం వివరించారు. ఈ ఐదు ప్రతిపాదనల పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కేంద్ర సంస్థలైన ఎన్సీఈఆర్టీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈలు ఇష్టారాజ్యంగా ఇంజనీరింగ్, బీఈడీ, డీఈడీ కాలేజీలను మంజూరు చేస్తున్నాయని, రాష్ట్రాల అవసరాల మేరకే కొత్త విద్యా సంస్థలను మంజూరు చేసేలా ఈ సంస్థల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తామని జవదేకర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.