సాక్షి, హైదరాబాద్: విదేశీ విశ్వవిద్యాలయాలకు భారత ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. తొలిసారిగా అవి భారత్‌లో సొంతంగా క్యాంపస్‌లు నెలకొల్పేందుకు, అడ్మిషన్ల విధానం, ఫీజుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. నిధులను సొంత దేశాలకు బదిలీచేసేందుకు తదితర నిబంధనలకు సంబంధించిన ముసాయిదా ప్రతిని యూజీసీ విడుదలచేసింది. అయితే ఆ వర్సిటీలో భారతీయ క్యాంపస్‌లలో కోర్సులకు సంబంధించి ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలి.
ఆన్‌లైన్, దూర విద్యా కోర్సులకు అనుమతి ఇవ్వబోమని యూజీసీ చైర్‌పర్సన్ జగదీశ్ చెప్పారు. విదేశీ వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థ(హెచ్‌ఈఐ)లు ఇక్కడ క్యాంపస్‌ల ఏర్పాటు అనుమతులను యూజీసీ నుంచి తీసుకోవాలి. సంబంధిత వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాక ఈ నెల చివరికల్లా తుది నిబంధనలను రూపొందిస్తారు. ముసాయిదా ప్రకారం విదేశీ వర్సిటీలు తమ కోర్సుల్లో విద్యార్థుల అడ్మిషన్లు, ఫీజులపై స్వీయనియంత్రణ కల్గిఉంటాయి.
నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా..
‘నూతన జాతీయ విద్యావిధానంలో పేర్కొన్నట్లు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయి విద్యాబోధన భారతీయ విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. విదేశీ వర్సిటీలతో అనువైన ఫీజుల్లోనే అంతర్జాతీయ విద్యార్హతలు మన విద్యార్థులకు దఖలుపడతాయి. వర్సిటీలు స్వదేశానికి పంపే నిధులకు ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్‌మెంట్(ఫెమా) చట్టం,1999 వర్తిస్తుంది. ఇవి తమ వార్షిక ఆడిట్ యూజీసీకి సమర్పిస్తారు’ అని జగదీశ్ అన్నారు.
ర్యాంక్‌లు పొందిన వాటికే..
అత్యున్నత ర్యాంక్ పొందిన వర్సిటీలకే భారత్‌లో క్యాంపస్‌ల ఏర్పాటుకు అవకాశమిస్తారు. అంటే ప్రపంచం మొత్తంలో 500 లోపు ర్యాంక్ లేదా సబ్జెక్ట్ వారీగా ర్యాంక్ లేదా స్వదేశంలో దిగ్గజ వర్సిటీలకే భారత్‌లో అవకాశం దక్కనుంది. తర్వాత వాటి దరఖాస్తుల పరిశీలనకు యూజీసీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటుచేయనుంది. దేశంలో న్యాక్ గ్రేడ్ పొందిన దేశీ వర్శిటీల సమన్వయంతో ఈ వర్సిటీలు పనిచేసే వీలుంది. దరఖాస్తు చేసిన 45 రోజుల్లో అనుమతులు లభిస్తాయి. కమిషన్ సూచించిన సమయంలో క్యాంపస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫీజులు తదితర వివరాలను ప్రవేశాలకు 60 రోజుల ముందే వెల్లడించాలి.
సరైన సంస్కరణలతో దేశీయ వర్సిటీలను బలోపేతం చేయాల్సిందిపోయి విదేశీ వర్సిటీలు తేవడం ఏంటని కొందరు విద్యావేత్తలు పెదవివిరిచారు. ‘ప్రభుత్వ నూతన విద్యా విధానం ప్రకారం యూజీసీకే చరమగీతం పాడనున్నారు. అలాంటి యూజీసీ నేతృత్వంలో సంస్కరణలు తేవడం ఏంటి ?. గతంలో విదేశీ వర్సిటీల బిల్లును 2012–13 కాలంలో యూపీఏ సర్కార్ తెచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఆనాడు దీనిని బీజేపీ, వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యసభ స్థాయీ సంఘం కూడా తప్పుబట్టింది. ఇప్పుడు అదే బీజేపీ ఇప్పుడు ఇలా విరుద్ధంగా వ్యవహరిస్తోంది’ అని విద్యావేత్త, ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ అభా దేవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment