draft guidelines
-
అవాంఛిత కాల్స్ నిబంధనలపై అభిప్రాయాలకు గడువు పెంపు
న్యూఢిల్లీ: అవాంఛిత మార్కెటింగ్ కాల్స్, మెసేజీల కట్టడి కోసం రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును కేంద్రం ఆగస్టు 8 వరకు పెంచింది. వివిధ ఫెడరేషన్లు, అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాల నుంచి అభ్యర్ధనలు వచ్చిన మీదట ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే వచ్చిన సలహాలు, అభిప్రాయాలను పరిశీలిస్తున్నట్లు వివరించింది. వాస్తవానికి ఈ డెడ్‌లైన్ జూలై 21తో ముగిసింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా అన్‌రిజిస్టర్డ్ మార్కెటర్లు ప్రైవేట్ నంబర్ల నుంచి చేసే ప్రమోషనల్ కాల్స్, మెసేజీలను కట్టడి చేయడం ఈ మార్గదర్శకాల లక్ష్యం. టెల్కోలు, నియంత్రణ సంస్థలు తదితర వర్గాలతో సంప్రదింపుల మేరకు వీటిని రూపొందించారు. -
ఉన్నత విద్యలో హెరిటేజ్, కల్చర్
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఇండియన్ హెరిటేజ్ (భారతీయ వారసత్వం), కల్చర్ (సంస్కృతి) ఆధారిత కోర్సుల అమలుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుడుతోంది. శాస్త్రీయ నృత్యం, ఆయుర్వేదం, భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, మానవ విలువలు, వేద గణితం, యోగా తదితర కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. బహుళ ప్రవేశ నిష్క్రమణలతో స్వల్పకాలిక క్రెడిట్–ఆధారిత కోర్సులుగా వీటిని అమలు చేయనున్నట్లు పేర్కొంది. జాతీయ నూతన విద్యావిధానం–2020 ప్రకారం భారతీయ వారసత్వం, సంస్కృతీ, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి వీలుగా భారతీయ సనాతన వారసత్వ సంపద ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియచేయడమే లక్ష్యంగా ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు యూజీసీ పేర్కొంది. ఆయుర్వేదం, శాస్త్రీయ నృత్య రూపాలు, భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, సార్వజనీన మానవ విలువలు, వేద గణితం, యోగా వంటి కోర్సుల కోసం కరిక్యులమ్ ఫ్రేమ్వర్కును రూపొందించనుంది. ఈ కోర్సులతో విదేశీ విద్యార్థులను భారతదేశానికి ఆకర్షించడమే లక్ష్యంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. 3 విభాగాలుగా ఈ కోర్సులను యూజీసీ ప్రతిపాదించింది. పరిచయ స్థాయి, మధ్యంతర స్థాయి, అధునాతన స్థాయిగా వీటిని విభజించనుంది. కోర్సులను అందించే సంబంధిత ఉన్నత విద్యాసంస్థలు వాటికి నిర్దిష్ట అర్హత పరిస్థితులను నిర్ణయించడానికి యూజీసీ అనుమతించింది. ఆయా ప్రోగ్రాములు ఫ్లెక్సిబుల్ హైబ్రిడ్ (ఆన్లైన్–ఆఫ్‌లైన్ కాంబినేషన్) కింద అందించనున్నారు. ఆయా ఉన్నత విద్యాసంస్థలు కోర్సులకు సంబంధించి సంబంధిత ముఖ్యమైన సాహిత్యం గ్రంథాలు నేర్చుకున్న పండితుల సహకారం తీసుకుని పాఠ్యాంశాలను అభివృద్ధి చేయాలని సూచించింది. ఆయా ప్రోగ్రాములను రూపొందించేటపుడు బోధనా విధానాల్లోనూ ఆధునిక నాలెడ్జ్ సిస్టమ్‌తో అనుసంధానం ఉండాలని స్పష్టం చేసింది. బోధన వివిధ మాధ్యమాల్లో ఉంటుంది. ఉపన్యాసాలు, ఆడియో–వీడియో కంటెంట్, గ్రూపు చర్చలు, ఆచరణాత్మక సెషన్లు, విహారయాత్రలు కూడా బోధనలో భాగంగా ఉంటాయి. అభ్యాసకులకు క్రెడిట్లను అందించడానికి రెండు రకాల మూల్యాంకన విధానాలు పాటిస్తారు. నిరంతర, సమగ్ర అంచనా (సీసీఏ), పీరియాడికల్ మూల్యాంకనాలను అనుసరించనున్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు ఆయా ఉన్నత విద్యా సంస్థలే సర్టిఫికెట్లను మంజూరు చేస్తాయి. ఆ సర్టిఫికెట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ)లో డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి. -
వివాద్ సే విశ్వాస్–2 స్కీము ముసాయిదా
న్యూఢిల్లీ: ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన వివాద్ సే విశ్వాస్ 2 స్కీము ముసాయిదాను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, కాంట్రాక్టర్లు, ప్రజలు దీనిపై మార్చి 8లోగా తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు. ముసాయిదా ప్రకారం వివాదంపై విచారణ దశను బట్టి కాంట్రాక్టర్లకు సెటిల్మెంట్ మొత్తాన్ని ఆఫర్ చేస్తారు. ఒకవేళ న్యాయస్థానం లేదా ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసి ఉంటే .. క్లెయిమ్ అమౌంటులో 80 శాతం లేదా ఉత్తర్వుల్లో పేర్కొన్న దానిలో 60 శాతం మొత్తం ఆఫర్ చేయవచ్చు. ఇక పనులు నిలిపివేసినా లేదా రద్దయిన కాంట్రాక్టులకు సంబంధించి ఇది నికరంగా క్లెయిమ్ చేసిన దానిలో 30 శాతంగా ఉంటుంది. వివాదాస్పద కాంట్రాక్టుపై లిటిగేషన్, పనులు కొనసాగుతుంటే ఇది 20 శాతానికి పరిమితమవుతుంది. ఒకవేళ మొత్తం క్లెయిమ్ అమౌంటు రూ. 500 కోట్లు దాటిన పక్షంలో ఆర్డరు ఇచ్చిన సంస్థలకు కాంట్రాక్టరు ఇచ్చే సెటిల్మెంట్ ఆఫర్‌ను తిరస్కరించే ఆప్షను ఉంటుంది. కానీ, అందుకు తగిన కారణాన్ని చూపాలి. సంబంధిత శాఖ, విభాగం కార్యదర్శి లేదా కంపెనీ అయితే సీఈవో దీన్ని ఆమోదించాలి. -
విదేశీ వర్సిటీలకు మరింత స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: విదేశీ విశ్వవిద్యాలయాలకు భారత ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. తొలిసారిగా అవి భారత్‌లో సొంతంగా క్యాంపస్‌లు నెలకొల్పేందుకు, అడ్మిషన్ల విధానం, ఫీజుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. నిధులను సొంత దేశాలకు బదిలీచేసేందుకు తదితర నిబంధనలకు సంబంధించిన ముసాయిదా ప్రతిని యూజీసీ విడుదలచేసింది. అయితే ఆ వర్సిటీలో భారతీయ క్యాంపస్‌లలో కోర్సులకు సంబంధించి ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలి. ఆన్లైన్, దూర విద్యా కోర్సులకు అనుమతి ఇవ్వబోమని యూజీసీ చైర్పర్సన్ జగదీశ్ చెప్పారు. విదేశీ వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థ(హెచ్ఈఐ)లు ఇక్కడ క్యాంపస్‌ల ఏర్పాటు అనుమతులను యూజీసీ నుంచి తీసుకోవాలి. సంబంధిత వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాక ఈ నెల చివరికల్లా తుది నిబంధనలను రూపొందిస్తారు. ముసాయిదా ప్రకారం విదేశీ వర్సిటీలు తమ కోర్సుల్లో విద్యార్థుల అడ్మిషన్లు, ఫీజులపై స్వీయనియంత్రణ కల్గిఉంటాయి. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా.. ‘నూతన జాతీయ విద్యావిధానంలో పేర్కొన్నట్లు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయి విద్యాబోధన భారతీయ విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. విదేశీ వర్సిటీలతో అనువైన ఫీజుల్లోనే అంతర్జాతీయ విద్యార్హతలు మన విద్యార్థులకు దఖలుపడతాయి. వర్సిటీలు స్వదేశానికి పంపే నిధులకు ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్(ఫెమా) చట్టం,1999 వర్తిస్తుంది. ఇవి తమ వార్షిక ఆడిట్ యూజీసీకి సమర్పిస్తారు’ అని జగదీశ్ అన్నారు. ర్యాంక్‌లు పొందిన వాటికే.. అత్యున్నత ర్యాంక్ పొందిన వర్సిటీలకే భారత్‌లో క్యాంపస్‌ల ఏర్పాటుకు అవకాశమిస్తారు. అంటే ప్రపంచం మొత్తంలో 500 లోపు ర్యాంక్ లేదా సబ్జెక్ట్ వారీగా ర్యాంక్ లేదా స్వదేశంలో దిగ్గజ వర్సిటీలకే భారత్‌లో అవకాశం దక్కనుంది. తర్వాత వాటి దరఖాస్తుల పరిశీలనకు యూజీసీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటుచేయనుంది. దేశంలో న్యాక్ గ్రేడ్ పొందిన దేశీ వర్శిటీల సమన్వయంతో ఈ వర్సిటీలు పనిచేసే వీలుంది. దరఖాస్తు చేసిన 45 రోజుల్లో అనుమతులు లభిస్తాయి. కమిషన్ సూచించిన సమయంలో క్యాంపస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫీజులు తదితర వివరాలను ప్రవేశాలకు 60 రోజుల ముందే వెల్లడించాలి. సరైన సంస్కరణలతో దేశీయ వర్సిటీలను బలోపేతం చేయాల్సిందిపోయి విదేశీ వర్సిటీలు తేవడం ఏంటని కొందరు విద్యావేత్తలు పెదవివిరిచారు. ‘ప్రభుత్వ నూతన విద్యా విధానం ప్రకారం యూజీసీకే చరమగీతం పాడనున్నారు. అలాంటి యూజీసీ నేతృత్వంలో సంస్కరణలు తేవడం ఏంటి ?. గతంలో విదేశీ వర్సిటీల బిల్లును 2012–13 కాలంలో యూపీఏ సర్కార్ తెచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఆనాడు దీనిని బీజేపీ, వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యసభ స్థాయీ సంఘం కూడా తప్పుబట్టింది. ఇప్పుడు అదే బీజేపీ ఇప్పుడు ఇలా విరుద్ధంగా వ్యవహరిస్తోంది’ అని విద్యావేత్త, ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ అభా దేవ్ అన్నారు. -
స్కూళ్లలో ఇక పిజ్జా, బర్గర్లు బంద్!
న్యూఢిల్లీ: పాఠశాల ప్రాంగణాల్లో జంక్ ఫుడ్ అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. స్కూళ్లలో జంక్ ఫుడ్ అమ్మడం, అందుబాటులో ఉంచడం నియంత్రిస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ముసాయిదా మార్గదర్శకాలను జారీచేసింది. పాఠశాల విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. పాఠశాల ప్రాంగణానికి 50 మీటర్ల పరిధిలోనూ అత్యధిక కొవ్వు, సాల్ట్, షుగర్ విలువలున్న ఆహార పదార్థాలు అమ్మకుండా నియంత్రించాలని ఆదేశించింది. చిప్స్, రెడీ టు ఇట్ న్యూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, షూగర్ స్వీటెన్డ్ కార్బొనేటెడ్లు, శీతల పానీయాలు, నాన్- కార్బొనేటెడ్ డ్రింక్స్, ఆలూ ఫ్రైస్ వంటి ఆహార పదార్థాలు స్కూల్ ప్రాంగణాల్లో అమ్మకుడదని ఆదేశాలు ఇచ్చింది. పాఠశాల ప్రాంగణాల్లో క్యాంటీన్ పాలసీని, స్కూల్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ ను ఏర్పాటుచేసి.. అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల వల్ల తలెత్తే దుష్ర్పరిణామాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎఫ్ఎస్ఎస్ఐ సూచించింది. -
చిన్న బ్యాంకులు వస్త్తున్నాయ్..!
ముంబై: బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగానే... రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) చిన్న బ్యాంకుల ఏర్పాటు దిశగా తొలి అంకానికి తెరతీసింది. ఈ బ్యాంకులను నెలకొల్పేందుకు అవసరమైన ముసాయిదా(డ్రాఫ్ట్) మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. దీంతోపాటు చెల్లింపులు ఇతరత్రా ప్రత్యేక అవసరాలకోసం ఉద్దేశించిన పేమెంట్ బ్యాంకులకు కూడా డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. స్థానికంగా చిన్న వ్యాపారులు, రైతులు, అల్పాదాయవర్గాలు, అసంఘటిత రంగానికి తక్కువమొత్తంలో రుణాలు అందించడం ఇతరత్రా కార్యకలాపాలను ప్రతిపాదిత చిన్నబ్యాంకులు నిర్వహించనున్నాయి. అదేవిధంగా వలస కార్మికుల నుంచి డిపాజిట్ల సేకరణ, నగదును బట్వాడా(రెమిటెన్సెస్) వంటి విధులను కూడా పేమెంట్ బ్యాంకులు నిర్వర్తిస్తాయి. డిఫరెన్షియేటెడ్(ప్రత్యేక అవసరాలకోసం ఏర్పాటయ్యేవి) బ్యాంకుల విభాగంలోకి వచ్చే ఈ పేమెంట్, చిన్న బ్యాంకులను దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్)లో భాగంగా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తాజా బడ్జెట్లో చిన్న, డిఫరెన్షియేటెడ్ బ్యాంకుల ఏర్పాటుకు తగిన కార్యాచరణను ఆర్బీఐ రూపొందిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కాగా, పూర్తిస్థాయిలో వాణిజ్య బ్యాంకుల ఏర్పాటుకోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో మైక్రోఫైనాన్స్ కంపెనీ బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడీఎఫ్సీలకు ఆర్బీఐ సూత్రప్రాయ అనుమతి మంజూరు చేయడం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో 27 ప్రభుత్వ రంగ, 22 పైవేటు రంగ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిపాదిత పోస్ట్ బ్యాంక్ అనేది పేమెంట్ బ్యాంక్తరహాలో డిపాజిట్ల సేకరణ, చెల్లింపులు జరిపేవిధంగా కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవలే పేర్కొన్నారు. మార్గదర్శకాలు ఇలా... ప్రస్తుతం వాణిజ్య బ్యాంకుల ఏర్పాటుకు కనీసం మూలధనం రూ.500 కోట్లు కాగా, ఈ చిన్న, పేమెంట్ బ్యాంకులకు ఈ మొత్తం రూ.100 కోట్లుగా ఉండాలి. ప్రతిపాదిత చిన్న బ్యాంకులు ఇతర వాణిజ్య బ్యాంకులమాదిరిగానే డిపాజిట్ల సమీకరణ, రుణాల జారీ వంటి విధులన్నీ చేపడతాయి. అయితే, కార్యకలాపాల్లో మాత్రం పరిమితి ఉంటుంది. ఇక పేమెంట్ బ్యాంకులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో బ్యాంకింగ్ సేవలు, ప్రొడక్ట్‌లను అందిస్తాయి. ఇందుకోసం తమ సొంత శాఖల నెట్‌వర్క్‌తోపాటు ఇతర నెట్‌వర్క్‌లకు సంబంధించిన బిజినెస్ కరస్పాండెంట్లను కూడా వినియోగించుకోవచ్చు. ఈ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులు ప్రస్తుత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పాలసీ ప్రకారం ఉంటుంది. ఇప్పుడున్న బ్యాంకింగేతర ప్రీ-పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ సేవల సంస్థలు, బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ), కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్స్, మొబైల్ టెలిఫోన్ కంపెనీలు, సూపర్ మార్కెట్ చైన్లు, కంపెనీలు, రియల్టీ సహకార సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక చిన్న బ్యాంకుల విషయానికొస్తే... బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో పదేళ్ల అనుభవం ఉన్న భారతీయ పౌరులు(ఇక్కడ నివశించేవారు), కంపెనీలు, సొసైటీలు ప్రమోటర్లుగా వీటిని ఏర్పాటుచేసేందుకు అర్హులు. ఎన్బీఎఫ్సీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీ(ఎంఎఫ్ఐ)లు, లోకల్ ఏరియా బ్యాంకులు కూడా తమ కార్యకలాపాలను చిన్న బ్యాంకులుగా మార్చుకునేందుకు వీలవుతుంది. నిబంధనలకు అనువుగాఉంటే.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ నిపుణులు, ఎన్‌బీఎఫ్‌సీలకు చిన్న బ్యాంకుల ఏర్పాటులో ప్రాధాన్యత లభిస్తుంది. చిన్న కస్టమర్లకు సేవలు, స్థానికంగా దృష్టిపెట్టడం వంటివి లెసైన్స్‌లు పొందేందుకు కీలకం. బ్యాంకింగ్ సేవలు చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాలు లేదా ఈశాన్య, తూర్పు, మధ్య భారత్‌లోని జిల్లాల్లో అధికంగా కార్యకలాపాలు ఉన్న దరఖాస్తుదారులకు పేమెంట్ బ్యాంకుల ఏర్పాటులో అధిక ప్రాధాన్యత లభిస్తుంది. అయితే, బ్యాంక్ నెలకొల్పిన తర్వాత భారీగా శాఖలను విస్తరించాల్సి ఉంటుంది. ప్రధానంగా మారుమూల ప్రాంతాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. పేమెంట్ బ్యాంకుల కనీస మూలధనంలో 40 శాతాన్ని ప్రమోటర్లు సమకూర్చాలి. ఐదేళ్లపాటు దీన్ని వెనక్కితీసుకోకుండా లాకిన్ వ్యవధి ఉంటుంది. బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమైననాటినుంచి మూడేళ్లలో ప్రమోటర్ల వాటాను 40%కి, 10 ఏళ్లలో 30%కి, 12 ఏళ్లలో 26 శాతానికి తగ్గించుకోవాలి. చిన్న బ్యాంకులకూ ఇది వర్తిస్తుంది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్), చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)లతో సహా వాణిజ్య బ్యాంకులకు అమలు చేస్తున్న నిబధనలన్నీ చిన్న బ్యాంకులకు వర్తిస్తాయి. రుణాల పోర్ట్‌ఫోలియోలో కనీసం 50 శాతం రూ.25 లక్షల వరకూ విలువైన రుణాలు తప్పనిసరి. ఇందులో కూడా సూక్ష్మ, చిన్న కంపెనీలకు ప్రాధాన్యమివ్వాలి. ఈ మార్గదర్శకాలపై సూచనలు, అభిప్రాయాలను తెలిపేందుకు ఆగస్టు 28 వరకూ ఆర్బీఐ గడువు ఇచ్చింది.