చిన్న బ్యాంకులు వస్త్తున్నాయ్..!
ముంబై: బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగానే... రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) చిన్న బ్యాంకుల ఏర్పాటు దిశగా తొలి అంకానికి తెరతీసింది. ఈ బ్యాంకులను నెలకొల్పేందుకు అవసరమైన ముసాయిదా(డ్రాఫ్ట్) మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. దీంతోపాటు చెల్లింపులు ఇతరత్రా ప్రత్యేక అవసరాలకోసం ఉద్దేశించిన పేమెంట్ బ్యాంకులకు కూడా డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. స్థానికంగా చిన్న వ్యాపారులు, రైతులు, అల్పాదాయవర్గాలు, అసంఘటిత రంగానికి తక్కువమొత్తంలో రుణాలు అందించడం ఇతరత్రా కార్యకలాపాలను ప్రతిపాదిత చిన్నబ్యాంకులు నిర్వహించనున్నాయి.
అదేవిధంగా వలస కార్మికుల నుంచి డిపాజిట్ల సేకరణ, నగదును బట్వాడా(రెమిటెన్సెస్) వంటి విధులను కూడా పేమెంట్ బ్యాంకులు నిర్వర్తిస్తాయి. డిఫరెన్షియేటెడ్(ప్రత్యేక అవసరాలకోసం ఏర్పాటయ్యేవి) బ్యాంకుల విభాగంలోకి వచ్చే ఈ పేమెంట్, చిన్న బ్యాంకులను దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్)లో భాగంగా ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
తాజా బడ్జెట్‌లో చిన్న, డిఫరెన్షియేటెడ్ బ్యాంకుల ఏర్పాటుకు తగిన కార్యాచరణను ఆర్‌బీఐ రూపొందిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కాగా, పూర్తిస్థాయిలో వాణిజ్య బ్యాంకుల ఏర్పాటుకోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో మైక్రోఫైనాన్స్ కంపెనీ బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ సూత్రప్రాయ అనుమతి మంజూరు చేయడం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో 27 ప్రభుత్వ రంగ, 22 పైవేటు రంగ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిపాదిత పోస్ట్ బ్యాంక్ అనేది పేమెంట్ బ్యాంక్‌తరహాలో డిపాజిట్‌ల సేకరణ, చెల్లింపులు జరిపేవిధంగా కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవలే పేర్కొన్నారు.
మార్గదర్శకాలు ఇలా...
ప్రస్తుతం వాణిజ్య బ్యాంకుల ఏర్పాటుకు కనీసం మూలధనం రూ.500 కోట్లు కాగా, ఈ చిన్న, పేమెంట్ బ్యాంకులకు ఈ మొత్తం రూ.100 కోట్లుగా ఉండాలి.
ప్రతిపాదిత చిన్న బ్యాంకులు ఇతర వాణిజ్య బ్యాంకులమాదిరిగానే డిపాజిట్ల సమీకరణ, రుణాల జారీ వంటి విధులన్నీ చేపడతాయి. అయితే, కార్యకలాపాల్లో మాత్రం పరిమితి ఉంటుంది.
ఇక పేమెంట్ బ్యాంకులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో బ్యాంకింగ్ సేవలు, ప్రొడక్ట్‌లను అందిస్తాయి. ఇందుకోసం తమ సొంత శాఖల నెట్‌వర్క్‌తోపాటు ఇతర నెట్‌వర్క్‌లకు సంబంధించిన బిజినెస్ కరస్పాండెంట్‌లను కూడా వినియోగించుకోవచ్చు.
ఈ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులు ప్రస్తుత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పాలసీ ప్రకారం ఉంటుంది.
ఇప్పుడున్న బ్యాంకింగేతర ప్రీ-పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ సేవల సంస్థలు, బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ), కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్స్, మొబైల్ టెలిఫోన్ కంపెనీలు, సూపర్ మార్కెట్ చైన్లు, కంపెనీలు, రియల్టీ సహకార సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక చిన్న బ్యాంకుల విషయానికొస్తే... బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో పదేళ్ల అనుభవం ఉన్న భారతీయ పౌరులు(ఇక్కడ నివశించేవారు), కంపెనీలు, సొసైటీలు ప్రమోటర్లుగా వీటిని ఏర్పాటుచేసేందుకు అర్హులు.
ఎన్‌బీఎఫ్‌సీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీ(ఎంఎఫ్‌ఐ)లు, లోకల్ ఏరియా బ్యాంకులు కూడా తమ కార్యకలాపాలను చిన్న బ్యాంకులుగా మార్చుకునేందుకు వీలవుతుంది.
నిబంధనలకు అనువుగాఉంటే.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ నిపుణులు, ఎన్‌బీఎఫ్‌సీలకు చిన్న బ్యాంకుల ఏర్పాటులో ప్రాధాన్యత లభిస్తుంది.
చిన్న కస్టమర్లకు సేవలు, స్థానికంగా దృష్టిపెట్టడం వంటివి లెసైన్స్‌లు పొందేందుకు కీలకం.
బ్యాంకింగ్ సేవలు చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాలు లేదా ఈశాన్య, తూర్పు, మధ్య భారత్‌లోని జిల్లాల్లో అధికంగా కార్యకలాపాలు ఉన్న దరఖాస్తుదారులకు పేమెంట్ బ్యాంకుల ఏర్పాటులో అధిక ప్రాధాన్యత లభిస్తుంది. అయితే, బ్యాంక్ నెలకొల్పిన తర్వాత భారీగా శాఖలను విస్తరించాల్సి ఉంటుంది. ప్రధానంగా మారుమూల ప్రాంతాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి.
పేమెంట్ బ్యాంకుల కనీస మూలధనంలో 40 శాతాన్ని ప్రమోటర్లు సమకూర్చాలి. ఐదేళ్లపాటు దీన్ని వెనక్కితీసుకోకుండా లాకిన్ వ్యవధి ఉంటుంది. బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమైననాటినుంచి మూడేళ్లలో ప్రమోటర్ల వాటాను 40%కి, 10 ఏళ్లలో 30%కి, 12 ఏళ్లలో 26 శాతానికి తగ్గించుకోవాలి. చిన్న బ్యాంకులకూ ఇది వర్తిస్తుంది.
నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్), చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్)లతో సహా వాణిజ్య బ్యాంకులకు అమలు చేస్తున్న నిబధనలన్నీ చిన్న బ్యాంకులకు వర్తిస్తాయి.
రుణాల పోర్ట్‌ఫోలియోలో కనీసం 50 శాతం రూ.25 లక్షల వరకూ విలువైన రుణాలు తప్పనిసరి. ఇందులో కూడా సూక్ష్మ, చిన్న కంపెనీలకు ప్రాధాన్యమివ్వాలి.
ఈ మార్గదర్శకాలపై సూచనలు, అభిప్రాయాలను తెలిపేందుకు ఆగస్టు 28 వరకూ ఆర్‌బీఐ గడువు ఇచ్చింది.