small banks
-
తగ్గనున్న చిన్న బ్యాంకుల రుణ వృద్ధి..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) రుణ వృద్ధి 25–27 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇది 28 శాతంగా నమోదైంది. ఎస్ఎఫ్బీలు విభాగాలవారీగా, భౌగోళికంగా కార్యకలాపాలు విస్తరిస్తే రుణ వృద్ధి మెరుగుపడుతుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదిక పేర్కొంది.క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఎస్‌ఎఫ్‌బీల మూలధన నిల్వలు సమృద్ధిగానే ఉన్నప్పటికీ తక్కువ వ్యయాలతో డిపాజిట్లను సేకరించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో రుణ వృద్ధికి అవసరమయ్యే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ, డిపాజిట్యేతర వనరులను అన్వేషిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా ఉన్న సూక్ష్మరుణాలతో పాటు తనఖాలు, అన్సెక్యూర్డ్ రుణాలు మొదలైన కొత్త మార్గాల్లో రుణ వృద్ధిని మెరుగుపర్చుకునేందుకు చిన్న బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని నివేదిక తెలిపింది. కొత్త అసెట్స్ విభాగాల్లో రుణ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం 40 శాతం వరకు ఉండొచ్చని, సంప్రదాయ విభాగాల్లో ఇది 20 శాతంగా ఉండొచ్చని సంస్థ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు.ఇదీ చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు యాపిల్ కంటెంట్మరిన్ని విశేషాలు..నెట్‌వర్క్‌పరంగా ఎస్‌ఎఫ్‌బీల బ్రాంచీల సంఖ్య ఈ ఏడాది మార్చి నాటికి రెట్టింపై 7,400కి చేరింది. తూర్పు రాష్ట్రాల్లో శాఖల సంఖ్య అత్యధికంగా ఉంది. 2019 మార్చి నాటికి మొత్తం శాఖల్లో తూర్పు రాష్ట్రాల్లో 11 శాతం ఉండగా ప్రస్తుతం ఇది 15 శాతానికి పెరిగింది. సగానికి పైగా శాఖలు, గణనీయంగా వృద్ధి అవకాశాలున్న గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి.గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం బ్యాంకింగ్ రంగానికి పూర్తి భిన్నంగా, ఎస్ఎఫ్బీల్లో రుణ వృద్ధికన్నా బల్క్ డిపాజిట్ల వృద్ధి 30 శాతం అధికంగా నమోదైంది. 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ డిపాజిట్లు 22 శాతమే. చౌకగా ఉండే కరెంట్–సేవింగ్స్ డిపాజిట్ల వాటా 35 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది.ఎస్ఎఫ్బీలు టర్మ్ డిపాజిట్లపై ఆధారపడటం ఇకపైనా కొనసాగనుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీ లోన్ల విభాగంలో రూ.6,300 కోట్ల లావాదేవీలు జరగ్గా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.9,000 కోట్లకు చేరాయి. -
అధికంగా వడ్డీ ఇస్తున్న చిన్న బ్యాంకులు
Best FD Rates: దేశంలో చాలా మంది అధిక రాబడుల కోసం ఇప్పుడు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. సాంప్రదాయ పెట్టుబడి మార్గాలను వదిలి కొత్త ఎంపికల కోసం చూస్తున్నారు. అయితే, మొత్తం పెట్టుబడిని మార్కెట్లో పెట్టే బదులు కొంత భాగాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ వంటి వాటిలో మదుపు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.మరి ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీ తక్కువ వస్తుంది కదా అని అపోహ పడవద్దు. ఫిక్స్డ్ డిపాజిట్ సురక్షితమైన పెట్టుబడి ఎంపిక మాత్రమే కాకుండా వడ్డీ కూడా బాగానే వస్తుంది. కొన్ని బ్యాంకులు ఇప్పటికీ ఎఫ్డీపై 9.5 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ఎఫ్డీపై ఎక్కువ వడ్డీ ఇస్తాయి.ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులతో పోలిస్తే చిన్న బ్యాంకులు కస్టమర్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీపై 9.5 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. ఎఫ్డీపై ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తున్నాయో ఇక్కడ తెలియజేస్తున్నాం.నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం ఎఫ్డీపై దేశంలోనే అత్యధిక వడ్డీని ఇస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ బ్యాంకులో 3 సంవత్సరాల కాలానికి ఎఫ్డీ ఖాతాను తెరిస్తే సంవత్సరానికి 9.5 శాతం వడ్డీని ఇస్తుంది.సూర్య స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీపై అత్యధిక వడ్డీ ఇచ్చే విషయంలో రెండవ స్థానంలో ఉంది. ఈ బ్యాంకు 3 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 9.1 శాతం వడ్డీని ఇస్తోంది.ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 3 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 9.1 శాతం వడ్డీని అందిస్తోంది.జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 3 సంవత్సరాల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8.75 శాతం వడ్డీ లభిస్తుంది.సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీని అందించే బ్యాంకుల జాబితాలో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఉన్నాయి. ఈ రెండు బ్యాంకులు మూడేళ్ల ఎఫ్డీలపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఆఫర్ 3 సంవత్సరాల వ్యవధిలో చేసిన బ్యాంక్ ఎఫ్డీలకు కూడా వర్తిస్తుంది. -
డిపాజిటర్లకు మరింత రక్షణ
న్యూఢిల్లీ: నిధుల సంక్షోభాల్లో చిక్కుకున్న బ్యాంకు డిపాజిటర్లకు గరిష్టంగా రూ.5లక్షల వరకు బీమా సదుపాయం కల్పించే డీఐసీజీసీ సవరణ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 90 రోజుల్లోపు సంక్షోభాల్లోని బ్యాంకు డిపాజిటర్లకు చెల్లింపులు ప్రారంభమవుతాయి. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్టానికి చేసిన సవరణలను కేంద్ర సర్కారు సోమవారం నోటిఫై చేసింది. ఈ నెల మొదట్లో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (సవరణ) బిల్లు 2021కి పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటికే డిపాజిట్ల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) డిపాజిటర్లకు ఊరట లభించనుంది. ప్రస్తుతానికి బ్యాంకులు విఫలం అయితే డిపాజిట్లకు డీఐసీజీసీ కింద చెల్లింపులకు 8–10 ఏళ్ల సమయం తీసుకుంటోంది. బ్యాంకు డిపాజిటర్లకు గతంలో రూ.లక్ష వరకే బీమా సదుపాయం ఉండేది. పీఎంసీ బ్యాంకు, యస్ బ్యాంకు తదితర సంక్షోభాలతో బీమ సదుపాయాన్ని రూ.5లక్షలకు పెంచుతూ కేంద్ర సర్కారు గతేడాది నిర్ణయం తీసుకుంది. అంతేకాదు 2020 ఫిబ్రవరి 4 నుంచే పెంచిన కవరేజీ అమల్లోకి కూడా వచ్చింది. ఇందుకు సంబంధించి చట్టంలోనూ మార్పులను తీసుకొచ్చింది. ‘‘మొదటి 45 రోజుల సమయంలో బ్యాంకు అన్ని ఖాతాల వివరాలను తీసుకోవాలి. ఈ సమయంలోనే డిపాజిట్ దారులు క్లెయిమ్ చేసుకోవాలి. తర్వాత ఈ వివరాలను డీఐసీజీసీకి పంపుతారు. 90వ రోజు నుంచి డిపాజిట్లకు చెల్లింపులు మొదలువతాయి’’ అని ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. -
చిన్న బ్యాంకా.. మాకొద్దు!
సాక్షి, బిజినెస్ విభాగం: చిన్న బ్యాంకుల లైసెన్స్‌లు ఇస్తాం తీసుకోండి బాబూ అని ఆర్బీఐ పిలిచి మరీ అవకాశం ఇచ్చినా... పట్టణాల్లోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి ఏ మాత్రం స్పందన లేదు. చిన్న బ్యాంకులు మాకొద్దులేనన్న తీరులో అవి స్పందిస్తున్నాయి. నిజానికి ఆర్బీఐ చర్య సహకార బ్యాంకుల వ్యవస్థను అస్థిరపరిచేదిగా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు చాలా బలంగా ఉండగా... అదే సమయంలో మూడంచెల గ్రామీణ కోఆపరేటివ్ వ్యవస్థ అధిక మొండి బకాయిలు (ఎన్పీఏ), నష్టాలతో సతమతం అవుతోంది. తాజా పరిణామంపై నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ (నాఫ్కబ్) సీఈవో సుభాష్ గుప్తా స్పందిస్తూ... ‘‘కోపరేటివ్ బ్యాంకులపై గాంధీ కమిటీ తన నివేదిక విడుదల చేసినప్పుడు ఆ సిఫారసులను జనరల్‌బాడీ ఆమోదించలేదు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను బ్యాంకులుగా మార్చడం వల్ల కోఆపరేటివ్ నిర్మాణం బలహీనపడుతుంది. కనుక దీనికి మేం సానుకూలంగా లేం’’ అని తెలిపారు. బ్యాంకులుగా మారే సత్తా... అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పెద్దవిగా ఉన్న కొన్నింటి ఆర్థిక సామర్థ్యం చూస్తే వాటికి పూర్తి స్థాయి బ్యాంకులుగా మారే సత్తా దండిగా ఉంది. సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంకు, కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంకు, షామ్రో వితల్ కోఆపరేటివ్ బ్యాంకులు ఈ సామర్థ్యం ఉన్నవే. సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.58,500 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేయగా, రూ.241 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంకు మొత్తం వ్యాపార పరిమాణం 2016 ఆర్థిక సంవత్సరానికి రూ.26,369 కోట్లు, నికర లాభం రూ.460 కోట్లుగా ఉండడం గమనార్హం. పెద్ద బ్యాంకుల స్థాయి వ్యాపారం వీటికి ఉండటం గమనార్హం. కోఆపరేటివ్ నమూనా తమకు చక్కగా సరిపోతుందని, అతిపెద్ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుగా దీర్ఘకాలిక డిపాజిట్ల జారీ ద్వారా రూ.300 కోట్లను సమీకరిస్తున్నామని సారస్వత్ బ్యాంకు చైర్మన్ గౌతం ఠాకూర్ తెలిపారు. ఎన్పీఏలు తక్కువే 2017 మార్చి నాటికి మన దేశంలో 1,562 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, 94,384 రూరల్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల మొత్తం డిపాజిట్లు 2017 మార్చి 31 నాటికి రూ.4,43,500 కోట్లుగా ఉంటే, అడ్వాన్సులు (రుణాలు) రూ.2,61,200 కోట్లుగా ఉండడం గమనించాల్సిన అంశం. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల కంటే ఎన్పీఏల విషయంలో కోఆపరేటివ్ బ్యాంకుల పరిస్థితే మెరుగ్గా ఉంది. స్థూల ఎన్పీఏలు 7.1%, నికర ఎన్పీఏలు రూ.2.7%గా ఉన్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ఉమ్మడి నికర లాభం పన్ను అనంతరం రూ.3,900 కోట్లుగా ఉంది. గతంలో ఆర్బీఐ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల విషయంలో ఉదారంగా వ్యవహరించింది. ఫలితంగా 1993–2004 మధ్యలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, బలహీన ఆర్థిక పనితీరు వంటి అంశాలలో ఆర్బీఐ తన వైఖరి మార్చుకుంది. దాంతో విలీనాలు, వైదొలగడా లు వంటివి జరిగాయి. దాంతో 2004 మార్చి నాటికి 1,926 కోపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా, ఆ సంఖ్య 2017 మార్చి నాటికి 1,526కు తగ్గుముఖం పట్టింది. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లో ఎక్కువగా విలీనాలు చోటు చేసుకున్నాయి. కోపరేటివ్ బ్యాంకుల నిర్మాణమిదీ... కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ రెండు కేటగిరీలు. 1. అర్బన్ కోపరేటివ్ 2. రూరల్ కోపరేటివ్. రూరల్ కోఆపరేటివ్ విభాగంలో మళ్లీ, షార్ట్ (మీడియం టర్మ్ కూడా కలుపుకుని), లాంగ్‌టర్మ్ క్రెడిట్ కేటగిరీలుగా విభజన ఉంది. షార్ట్ టర్మ్ రూరల్ క్రెడిట్ కేటగిరీ తిరిగి మూడంచెలుగా ఉంటుంది. ఇవి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు, డీసీసీబీలు, పీఏసీఎస్‌లు. లాంగ్‌టర్మ్ కోఆపరేటివ్ బ్యాంకులు... స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ప్రైమరీ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకులుగా వర్గీకరణ ఉంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఈ వ్యవస్థ నుంచి తప్పుకుంటే మిగిలినవి మరింత బలహీనంగా మారిపోతాయన్న ఆందోళన ఉంది. 2016 మార్చికి డిస్ట్రిక్స్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల (డీసీసీబీ) మొత్తం ఎన్పీఏలు రూ.22,400 కోట్లు, స్టేట్ కోఆ పరేటివ్ బ్యాంకుల ఎన్పీఏలు రూ.5,147 కోట్లు. -
చిన్న బ్యాంకులు వస్త్తున్నాయ్..!
ముంబై: బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగానే... రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) చిన్న బ్యాంకుల ఏర్పాటు దిశగా తొలి అంకానికి తెరతీసింది. ఈ బ్యాంకులను నెలకొల్పేందుకు అవసరమైన ముసాయిదా(డ్రాఫ్ట్) మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. దీంతోపాటు చెల్లింపులు ఇతరత్రా ప్రత్యేక అవసరాలకోసం ఉద్దేశించిన పేమెంట్ బ్యాంకులకు కూడా డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. స్థానికంగా చిన్న వ్యాపారులు, రైతులు, అల్పాదాయవర్గాలు, అసంఘటిత రంగానికి తక్కువమొత్తంలో రుణాలు అందించడం ఇతరత్రా కార్యకలాపాలను ప్రతిపాదిత చిన్నబ్యాంకులు నిర్వహించనున్నాయి. అదేవిధంగా వలస కార్మికుల నుంచి డిపాజిట్ల సేకరణ, నగదును బట్వాడా(రెమిటెన్సెస్) వంటి విధులను కూడా పేమెంట్ బ్యాంకులు నిర్వర్తిస్తాయి. డిఫరెన్షియేటెడ్(ప్రత్యేక అవసరాలకోసం ఏర్పాటయ్యేవి) బ్యాంకుల విభాగంలోకి వచ్చే ఈ పేమెంట్, చిన్న బ్యాంకులను దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్)లో భాగంగా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తాజా బడ్జెట్లో చిన్న, డిఫరెన్షియేటెడ్ బ్యాంకుల ఏర్పాటుకు తగిన కార్యాచరణను ఆర్బీఐ రూపొందిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కాగా, పూర్తిస్థాయిలో వాణిజ్య బ్యాంకుల ఏర్పాటుకోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో మైక్రోఫైనాన్స్ కంపెనీ బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడీఎఫ్సీలకు ఆర్బీఐ సూత్రప్రాయ అనుమతి మంజూరు చేయడం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో 27 ప్రభుత్వ రంగ, 22 పైవేటు రంగ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిపాదిత పోస్ట్ బ్యాంక్ అనేది పేమెంట్ బ్యాంక్తరహాలో డిపాజిట్ల సేకరణ, చెల్లింపులు జరిపేవిధంగా కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవలే పేర్కొన్నారు. మార్గదర్శకాలు ఇలా... ప్రస్తుతం వాణిజ్య బ్యాంకుల ఏర్పాటుకు కనీసం మూలధనం రూ.500 కోట్లు కాగా, ఈ చిన్న, పేమెంట్ బ్యాంకులకు ఈ మొత్తం రూ.100 కోట్లుగా ఉండాలి. ప్రతిపాదిత చిన్న బ్యాంకులు ఇతర వాణిజ్య బ్యాంకులమాదిరిగానే డిపాజిట్ల సమీకరణ, రుణాల జారీ వంటి విధులన్నీ చేపడతాయి. అయితే, కార్యకలాపాల్లో మాత్రం పరిమితి ఉంటుంది. ఇక పేమెంట్ బ్యాంకులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో బ్యాంకింగ్ సేవలు, ప్రొడక్ట్‌లను అందిస్తాయి. ఇందుకోసం తమ సొంత శాఖల నెట్‌వర్క్‌తోపాటు ఇతర నెట్‌వర్క్‌లకు సంబంధించిన బిజినెస్ కరస్పాండెంట్లను కూడా వినియోగించుకోవచ్చు. ఈ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులు ప్రస్తుత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పాలసీ ప్రకారం ఉంటుంది. ఇప్పుడున్న బ్యాంకింగేతర ప్రీ-పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ సేవల సంస్థలు, బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ), కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్స్, మొబైల్ టెలిఫోన్ కంపెనీలు, సూపర్ మార్కెట్ చైన్లు, కంపెనీలు, రియల్టీ సహకార సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక చిన్న బ్యాంకుల విషయానికొస్తే... బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో పదేళ్ల అనుభవం ఉన్న భారతీయ పౌరులు(ఇక్కడ నివశించేవారు), కంపెనీలు, సొసైటీలు ప్రమోటర్లుగా వీటిని ఏర్పాటుచేసేందుకు అర్హులు. ఎన్బీఎఫ్సీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీ(ఎంఎఫ్ఐ)లు, లోకల్ ఏరియా బ్యాంకులు కూడా తమ కార్యకలాపాలను చిన్న బ్యాంకులుగా మార్చుకునేందుకు వీలవుతుంది. నిబంధనలకు అనువుగాఉంటే.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ నిపుణులు, ఎన్‌బీఎఫ్‌సీలకు చిన్న బ్యాంకుల ఏర్పాటులో ప్రాధాన్యత లభిస్తుంది. చిన్న కస్టమర్లకు సేవలు, స్థానికంగా దృష్టిపెట్టడం వంటివి లెసైన్స్‌లు పొందేందుకు కీలకం. బ్యాంకింగ్ సేవలు చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాలు లేదా ఈశాన్య, తూర్పు, మధ్య భారత్‌లోని జిల్లాల్లో అధికంగా కార్యకలాపాలు ఉన్న దరఖాస్తుదారులకు పేమెంట్ బ్యాంకుల ఏర్పాటులో అధిక ప్రాధాన్యత లభిస్తుంది. అయితే, బ్యాంక్ నెలకొల్పిన తర్వాత భారీగా శాఖలను విస్తరించాల్సి ఉంటుంది. ప్రధానంగా మారుమూల ప్రాంతాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. పేమెంట్ బ్యాంకుల కనీస మూలధనంలో 40 శాతాన్ని ప్రమోటర్లు సమకూర్చాలి. ఐదేళ్లపాటు దీన్ని వెనక్కితీసుకోకుండా లాకిన్ వ్యవధి ఉంటుంది. బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమైననాటినుంచి మూడేళ్లలో ప్రమోటర్ల వాటాను 40%కి, 10 ఏళ్లలో 30%కి, 12 ఏళ్లలో 26 శాతానికి తగ్గించుకోవాలి. చిన్న బ్యాంకులకూ ఇది వర్తిస్తుంది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్), చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)లతో సహా వాణిజ్య బ్యాంకులకు అమలు చేస్తున్న నిబధనలన్నీ చిన్న బ్యాంకులకు వర్తిస్తాయి. రుణాల పోర్ట్‌ఫోలియోలో కనీసం 50 శాతం రూ.25 లక్షల వరకూ విలువైన రుణాలు తప్పనిసరి. ఇందులో కూడా సూక్ష్మ, చిన్న కంపెనీలకు ప్రాధాన్యమివ్వాలి. ఈ మార్గదర్శకాలపై సూచనలు, అభిప్రాయాలను తెలిపేందుకు ఆగస్టు 28 వరకూ ఆర్బీఐ గడువు ఇచ్చింది.