న్యూఢిల్లీ: నిధుల సంక్షోభాల్లో చిక్కుకున్న బ్యాంకు డిపాజిటర్లకు గరిష్టంగా రూ.5లక్షల వరకు బీమా సదుపాయం కల్పించే డీఐసీజీసీ సవరణ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 90 రోజుల్లోపు సంక్షోభాల్లోని బ్యాంకు డిపాజిటర్లకు చెల్లింపులు ప్రారంభమవుతాయి.
డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్టానికి చేసిన సవరణలను కేంద్ర సర్కారు సోమవారం నోటిఫై చేసింది. ఈ నెల మొదట్లో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (సవరణ) బిల్లు 2021కి పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటికే డిపాజిట్ల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) డిపాజిటర్లకు ఊరట లభించనుంది.
ప్రస్తుతానికి బ్యాంకులు విఫలం అయితే డిపాజిట్లకు డీఐసీజీసీ కింద చెల్లింపులకు 8–10 ఏళ్ల సమయం తీసుకుంటోంది. బ్యాంకు డిపాజిటర్లకు గతంలో రూ.లక్ష వరకే బీమా సదుపాయం ఉండేది. పీఎంసీ బ్యాంకు, యస్ బ్యాంకు తదితర సంక్షోభాలతో బీమ సదుపాయాన్ని రూ.5లక్షలకు పెంచుతూ కేంద్ర సర్కారు గతేడాది నిర్ణయం తీసుకుంది. అంతేకాదు 2020 ఫిబ్రవరి 4 నుంచే పెంచిన కవరేజీ అమల్లోకి కూడా వచ్చింది. ఇందుకు సంబంధించి చట్టంలోనూ మార్పులను తీసుకొచ్చింది.
‘‘మొదటి 45 రోజుల సమయంలో బ్యాంకు అన్ని ఖాతాల వివరాలను తీసుకోవాలి. ఈ సమయంలోనే డిపాజిట్ దారులు క్లెయిమ్ చేసుకోవాలి. తర్వాత ఈ వివరాలను డీఐసీజీసీకి పంపుతారు. 90వ రోజు నుంచి డిపాజిట్లకు చెల్లింపులు మొదలువతాయి’’ అని ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment