చిన్న బ్యాంకా.. మాకొద్దు! | RBI allows Urban Co-operative Banks to become Small Finance Banks | Sakshi
Sakshi News home page

చిన్న బ్యాంకా.. మాకొద్దు!

Published Tue, Jun 12 2018 12:37 AM | Last Updated on Tue, Jun 12 2018 8:20 AM

RBI allows Urban Co-operative Banks to become Small Finance Banks - Sakshi

సాక్షి, బిజినెస్‌ విభాగం: చిన్న బ్యాంకుల లైసెన్స్‌లు ఇస్తాం తీసుకోండి బాబూ అని ఆర్‌బీఐ పిలిచి మరీ అవకాశం ఇచ్చినా... పట్టణాల్లోని అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకుల నుంచి ఏ మాత్రం స్పందన లేదు. చిన్న బ్యాంకులు మాకొద్దులేనన్న తీరులో అవి స్పందిస్తున్నాయి.

నిజానికి ఆర్‌బీఐ చర్య సహకార బ్యాంకుల వ్యవస్థను అస్థిరపరిచేదిగా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. కోఆపరేటివ్‌ బ్యాంకింగ్‌ రంగంలో అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు చాలా బలంగా ఉండగా... అదే సమయంలో మూడంచెల గ్రామీణ కోఆపరేటివ్‌ వ్యవస్థ అధిక మొండి బకాయిలు (ఎన్‌పీఏ), నష్టాలతో సతమతం అవుతోంది.

తాజా పరిణామంపై నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంక్స్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీస్‌ (నాఫ్‌కబ్‌) సీఈవో సుభాష్‌ గుప్తా స్పందిస్తూ... ‘‘కోపరేటివ్‌ బ్యాంకులపై గాంధీ కమిటీ తన నివేదిక విడుదల చేసినప్పుడు ఆ సిఫారసులను జనరల్‌బాడీ ఆమోదించలేదు. అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులను బ్యాంకులుగా మార్చడం వల్ల కోఆపరేటివ్‌ నిర్మాణం బలహీనపడుతుంది. కనుక దీనికి మేం సానుకూలంగా లేం’’ అని తెలిపారు.

బ్యాంకులుగా మారే సత్తా...
అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకుల్లో పెద్దవిగా ఉన్న కొన్నింటి ఆర్థిక సామర్థ్యం చూస్తే వాటికి పూర్తి స్థాయి బ్యాంకులుగా మారే సత్తా దండిగా ఉంది. సారస్వత్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు, కాస్మోస్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు, షామ్రో వితల్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు ఈ సామర్థ్యం ఉన్నవే. సారస్వత్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.58,500 కోట్ల రూపాయల టర్నోవర్‌ నమోదు చేయగా, రూ.241 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

కాస్మోస్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు మొత్తం వ్యాపార పరిమాణం 2016 ఆర్థిక సంవత్సరానికి రూ.26,369 కోట్లు, నికర లాభం రూ.460 కోట్లుగా ఉండడం గమనార్హం. పెద్ద బ్యాంకుల స్థాయి వ్యాపారం వీటికి ఉండటం గమనార్హం. కోఆపరేటివ్‌ నమూనా తమకు చక్కగా సరిపోతుందని, అతిపెద్ద అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకుగా దీర్ఘకాలిక డిపాజిట్ల జారీ ద్వారా రూ.300 కోట్లను సమీకరిస్తున్నామని సారస్వత్‌ బ్యాంకు చైర్మన్‌ గౌతం ఠాకూర్‌ తెలిపారు.
 
ఎన్‌పీఏలు తక్కువే
2017 మార్చి నాటికి మన దేశంలో 1,562 అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు, 94,384 రూరల్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు ఉన్నాయి. అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకుల మొత్తం డిపాజిట్లు 2017 మార్చి 31 నాటికి రూ.4,43,500 కోట్లుగా ఉంటే, అడ్వాన్సులు (రుణాలు) రూ.2,61,200 కోట్లుగా ఉండడం గమనించాల్సిన అంశం. షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల కంటే ఎన్‌పీఏల విషయంలో కోఆపరేటివ్‌ బ్యాంకుల పరిస్థితే మెరుగ్గా ఉంది. 

స్థూల ఎన్‌పీఏలు 7.1%, నికర ఎన్‌పీఏలు రూ.2.7%గా ఉన్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకుల ఉమ్మడి నికర లాభం పన్ను అనంతరం రూ.3,900 కోట్లుగా ఉంది. గతంలో ఆర్‌బీఐ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకుల విషయంలో ఉదారంగా వ్యవహరించింది.

ఫలితంగా 1993–2004 మధ్యలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, బలహీన ఆర్థిక పనితీరు వంటి అంశాలలో ఆర్‌బీఐ తన వైఖరి మార్చుకుంది. దాంతో విలీనాలు, వైదొలగడా లు వంటివి జరిగాయి. దాంతో 2004 మార్చి నాటికి 1,926 కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకులు ఉండగా, ఆ సంఖ్య 2017 మార్చి నాటికి 1,526కు తగ్గుముఖం పట్టింది. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రా ల్లో ఎక్కువగా విలీనాలు చోటు చేసుకున్నాయి.


కోపరేటివ్‌ బ్యాంకుల నిర్మాణమిదీ...
కోఆపరేటివ్‌ క్రెడిట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రెండు కేటగిరీలు. 1. అర్బన్‌ కోపరేటివ్‌ 2. రూరల్‌ కోపరేటివ్‌. రూరల్‌ కోఆపరేటివ్‌ విభాగంలో మళ్లీ, షార్ట్‌ (మీడియం టర్మ్‌ కూడా కలుపుకుని), లాంగ్‌టర్మ్‌  క్రెడిట్‌ కేటగిరీలుగా విభజన ఉంది. షార్ట్‌ టర్మ్‌ రూరల్‌ క్రెడిట్‌ కేటగిరీ తిరిగి మూడంచెలుగా ఉంటుంది.

ఇవి స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు, డీసీసీబీలు, పీఏసీఎస్‌లు. లాంగ్‌టర్మ్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు... స్టేట్‌ కోఆపరేటివ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్స్, ప్రైమరీ కోఆపరేటివ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకులుగా వర్గీకరణ ఉంది. అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు ఈ వ్యవస్థ నుంచి తప్పుకుంటే మిగిలినవి మరింత బలహీనంగా మారిపోతాయన్న ఆందోళన ఉంది. 2016 మార్చికి డిస్ట్రిక్స్‌ సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంకుల (డీసీసీబీ) మొత్తం ఎన్‌పీఏలు రూ.22,400 కోట్లు, స్టేట్‌ కోఆ పరేటివ్‌ బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.5,147 కోట్లు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement