ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఒకవైపు నియంత్రణపరమైన ప్రయోజనాలను అనుభవిస్తూనే మరోవైపు బ్యాంకింగ్ లైసెన్స్ కోరుకోవడం అనుచితమని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎన్‌బీఎఫ్‌సీలపై సీఐఐ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వడ్డీ రేట్లపై నియంత్రణ సంస్థ (ఆర్‌బీఐ) ఇచి్చన స్వేచ్ఛను కొన్ని సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్‌ఐలు) దురి్వనియోగం చేస్తున్నాయని, అధిక రేట్లను వసూలు చేస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.
పీర్ టు పీర్ (పీటుపీ) రుణ ప్లాట్‌ఫామ్‌లు లైసెన్స్ మార్గదర్శకాల పరిధిలో లేని వ్యాపార విధానాలను అనుసరిస్తుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి ఉల్లంఘనలను ఆమోదించేది లేదని హెచ్చరించారు. ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంక్‌లుగా మారే విషయంలో వస్తున్న డిమాండ్‌పై రాజేశ్వరరావు మాట్లాడారు. టాప్ టైర్ ఎన్‌బీఎఫ్‌సీలకు సైతం నియంత్రణ విధానాలు యూనివర్సల్ బ్యాంకుల మాదిరిగా లేవని స్పష్టం చేస్తూ, ఎన్‌బీఎఫ్‌సీలు కొన్ని ప్రయోజనాలను అనుభవిస్తున్నట్టు చెప్పారు.
‘‘ఎన్‌బీఎఫ్‌సీలు కీలక సంస్థలుగా మారి ప్రత్యేకమైన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కనుక అవి బ్యాంక్‌గా మారాలని అనుకోవడం సముచితం కాదు’’అని రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న బజాజ్ ఫిన్‌సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంక్ లైసెన్స్‌లు ఎందుకు కోరుకోరాదంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాజేశ్వరరావు మాట్లాడడం గమనార్హం.
బ్యాంక్‌గా ఎందుకు మారకూడదు?
ఆర్‌బీఐ పటిష్ట నియంత్రణల మధ్య ఎన్‌బీఎఫ్‌సీలు పెద్ద సంస్థలుగా, బలంగా మారినట్టు సంజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంక్ లైసెన్స్ గురించి ఎందుకు ఆలోచించకూడదు?. ముఖ్యంగా ఈ ఎన్‌బీఎఫ్‌సీలు పదేళ్లకు పైగా సేవలు అందిస్తూ, నిబంధనలను సరిగ్గా అమలు చేస్తూ, తమను తాము నిరూపించుకున్నాయి’’అని సంజీవ్ బజాజ్ అన్నారు. దీనికి రాజేశ్వరావు స్పందిస్తూ.. ‘‘యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్‌లను ఆన్‌టాప్ విధానం కిందకు కొన్నేళ్ల క్రితం ఆర్‌బీఐ మార్చింది.
కానీ, ఏ ఒక్క సంస్థ కూడా బ్యాంక్‌గా పనిచేసేందుకు ఆమోదం పొందలేదు’’అని చెప్పారు. ప్రవేశించడం, తప్పుకోవడానికి సంబంధించి ఎలాంటి అవరోధాలు ఎన్‌బీఎఫ్‌సీలకు లేవని, యూనివర్సల్ బ్యాంక్ ఏర్పాటుకు రూ.1,000 కోట్ల అవసరం ఉంటే, ఎన్‌బీఎఫ్‌సీ ఏర్పాటుకు ఇది రూ.10 కోట్లుగానే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్‌బీఎఫ్‌సీలు తమ నిధుల అవసరాల కోసం బ్యాంక్‌లపై ఎక్కువగా ఆధారపడకుండా ఇతర మార్కెట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని రాజేశ్వరరావు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment