ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే (PhonePe) అకౌంట్ అగ్రిగేషన్ (ఏఏ) వ్యాపారం నుంచి వైదొలిగినట్టు ప్రకటించింది. ఈ సేవలు అందించేందుకు సరిపడా భాగస్వాములను పొందలేకపోయినట్టు తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీ–ఏఏ లైసెన్స్‌ను (license) ఆర్‌బీఐకి (RBI) స్వాధీనం చేయాలని నిర్ణయించినట్టు, అకౌంట్ అగ్రిగేషన్ కార్యకలాపాలను మూసివేసే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.
తన యూజర్ల ఆమోదం మేరకు వారి ఆర్థిక సమాచారాన్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లతో పంచుకోవడం ద్వారా రుణాలు, క్రెడిట్ కార్డులు తదితర సేవలు అందించేందుకు ఈ లైసెన్స్ కింద అనుమతి ఉంటుంది. 2023 జూన్‌లో ఫోన్‌పేకు ఎన్‌బీఎఫ్‌సీ–ఏఏ లైసెన్స్ రావడం గమనార్హం.
‘‘రెండేళ్లలోపే మా ఏఏ ప్లాట్‌ఫామ్‌పై 5 కోట్ల మంది భారతీయులను చేర్చుకోవడం గర్వకారణంగా ఉంది. పోటీ ప్రాధాన్యతల దృష్ట్యా ఎక్కువ మంది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్లను మా ప్లాట్‌ఫామ్ వైపు ఆకర్షించలేకపోయాం. దీంతో ఫోన్‌పే గ్రూప్ అకౌంట్ అగ్రిగేషన్ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీనికి బదులు మార్కెట్లో ఉన్న ఇతర ఏఏలతో జట్టు కడతాం’’అని ఫోన్‌పే ప్రకటించింది. తమ ఏఏ యూజర్లకు త్వరలోనే ఈ విషయాన్ని తెలియజేస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment