Non-Banking Financial Company
-
బ్యాంక్ లైసెన్స్‌లు కోరుకోవడం అసాధారణం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఒకవైపు నియంత్రణపరమైన ప్రయోజనాలను అనుభవిస్తూనే మరోవైపు బ్యాంకింగ్ లైసెన్స్ కోరుకోవడం అనుచితమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎన్బీఎఫ్సీలపై సీఐఐ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వడ్డీ రేట్లపై నియంత్రణ సంస్థ (ఆర్బీఐ) ఇచి్చన స్వేచ్ఛను కొన్ని సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) దురి్వనియోగం చేస్తున్నాయని, అధిక రేట్లను వసూలు చేస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. పీర్ టు పీర్ (పీటుపీ) రుణ ప్లాట్‌ఫామ్‌లు లైసెన్స్ మార్గదర్శకాల పరిధిలో లేని వ్యాపార విధానాలను అనుసరిస్తుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి ఉల్లంఘనలను ఆమోదించేది లేదని హెచ్చరించారు. ఎన్బీఎఫ్సీలు బ్యాంక్‌లుగా మారే విషయంలో వస్తున్న డిమాండ్‌పై రాజేశ్వరరావు మాట్లాడారు. టాప్ టైర్ ఎన్‌బీఎఫ్‌సీలకు సైతం నియంత్రణ విధానాలు యూనివర్సల్ బ్యాంకుల మాదిరిగా లేవని స్పష్టం చేస్తూ, ఎన్బీఎఫ్సీలు కొన్ని ప్రయోజనాలను అనుభవిస్తున్నట్టు చెప్పారు. ‘‘ఎన్బీఎఫ్సీలు కీలక సంస్థలుగా మారి ప్రత్యేకమైన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కనుక అవి బ్యాంక్‌గా మారాలని అనుకోవడం సముచితం కాదు’’అని రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న బజాజ్ ఫిన్సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్‌లు ఎందుకు కోరుకోరాదంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాజేశ్వరరావు మాట్లాడడం గమనార్హం. బ్యాంక్‌గా ఎందుకు మారకూడదు? ఆర్బీఐ పటిష్ట నియంత్రణల మధ్య ఎన్బీఎఫ్సీలు పెద్ద సంస్థలుగా, బలంగా మారినట్టు సంజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్ గురించి ఎందుకు ఆలోచించకూడదు?. ముఖ్యంగా ఈ ఎన్బీఎఫ్సీలు పదేళ్లకు పైగా సేవలు అందిస్తూ, నిబంధనలను సరిగ్గా అమలు చేస్తూ, తమను తాము నిరూపించుకున్నాయి’’అని సంజీవ్ బజాజ్ అన్నారు. దీనికి రాజేశ్వరావు స్పందిస్తూ.. ‘‘యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్‌లను ఆన్‌టాప్ విధానం కిందకు కొన్నేళ్ల క్రితం ఆర్బీఐ మార్చింది. కానీ, ఏ ఒక్క సంస్థ కూడా బ్యాంక్‌గా పనిచేసేందుకు ఆమోదం పొందలేదు’’అని చెప్పారు. ప్రవేశించడం, తప్పుకోవడానికి సంబంధించి ఎలాంటి అవరోధాలు ఎన్‌బీఎఫ్‌సీలకు లేవని, యూనివర్సల్ బ్యాంక్ ఏర్పాటుకు రూ.1,000 కోట్ల అవసరం ఉంటే, ఎన్బీఎఫ్సీ ఏర్పాటుకు ఇది రూ.10 కోట్లుగానే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బ్యాంక్‌లపై ఎక్కువగా ఆధారపడకుండా ఇతర మార్కెట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని రాజేశ్వరరావు సూచించారు. -
పసిడి రుణాల ఎన్బీఎఫ్సీలదే హవా..
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి గట్టి పోటీ ఉంటున్నప్పటికీ పసిడి రుణాలిచ్చే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) వ్యాపార కార్యకలాపాలు పటిష్టంగా సాగుతున్నాయి. కరోనా సమయంతో పోలిస్తే కాస్తంత తగ్గినా మార్కెట్లో అవి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నాయి. క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రకారం 2021 మార్చి నుంచి 2023 సెపె్టంబర్ మధ్య కాలంలో మార్కెట్ పరిమాణం రూ. 2.5 లక్షల కోట్లకు చేరగా, వాటి మార్కెట్ వాటా 61 శాతంగా నమోదైంది. కరోనా విస్తృతంగా ఉన్న 2022 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 2 లక్షల కోట్లుగా ఉండగా, పసిడి రుణాల ఎన్‌బీఎఫ్‌సీల వాటా 64 శాతంగా ఉండేది. ఆ తర్వాత 2023 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రూ. 2.3 లక్షల కోట్లకు చేరగా, వాటి వాటా 62 శాతానికి పరిమితమైంది. మార్కెట్లో మూడింట రెండొంతుల వాటా ప్రైవేట్ సంస్థలదే ఉన్నప్పటికీ.. అత్యధికంగా పసిడి రుణాలిచి్చన సంస్థగా (రూ. 1.3 లక్షల కోట్లు) ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు ఉంది. వాటా పెంచుకుంటున్న బ్యాంకులు.. బ్యాంకులు కూడా క్రమంగా పసిడి రుణాల మార్కెట్లో తమ వాటాను పెంచుకుంటున్నాయి. రూ. 2.5 లక్షల కోట్ల మార్కెట్లో 39 శాతం వాటాను (1 శాతం వృద్ధి) దక్కించుకున్నాయి. అలాగే, గత మూడేళ్లుగా వ్యవసాయేతర బంగారు రుణాలపై.. ముఖ్యంగా రూ. 3 లక్షల పైబడిన లోన్స్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కొత్త ప్రాంతాల్లో మరిన్ని శాఖలను ఏర్పాటు చేయడం, ఆన్లైన్లో రుణాలివ్వడం, ఇంటి వద్దకే సర్వీసులు అందించడం వంటి వ్యూహాలతో పసిడి రుణాల ఎన్బీఎఫ్సీలు ముందుకెడుతున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ బి. మాళవిక తెలిపారు. బంగారం ధరల పెరుగుదల కూడా ఎన్‌బీఎఫ్‌సీల పోర్ట్‌ఫోలియో వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్ లోన్స్ ఏయూఎం వృద్ధికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటున్నాయని క్రిసిల్ పేర్కొంది. కస్టమర్లు చేజారిపోకుండా ఎన్బీఎఫ్సీలు తగు ప్రయత్నాలు చేస్తుండటం, చిన్న..మధ్య స్థాయి రుణాలపై దృష్టి పెట్టడం, శాఖల నెట్‌వర్క్‌ను పెంచుకోవడం ద్వారా కస్టమర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుండటం ఇందుకు దోహదపడుతున్నట్లు వివరించింది. -
బ్యాంక్లపైనే ఆధారపడొద్దు
ముంబై: నిధుల సమీకరణ మార్గాలను విస్తృతం చేసుకోవాలని, బ్యాంక్‌లపై ఆధారపడడాన్ని పరిమితం చేసుకోవాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలకు) ఆర్బీఐ సూచించింది. బలమైన కార్పొరేట్ గవర్నెన్స్ విధానాల ద్వారా బ్యాలన్స్ షీట్లు పటిష్టం చేసుకుని, మోసాలు, డేటా చోరీల నుంచి రక్షణ కలి్పంచుకోవాలని కోరింది. దేశ బ్యాంకింగ్ రంగం, ఎన్బీఎఫ్సీలు బలంగా ఉన్నాయంటూ.. అధిక నగదు నిష్పత్తి, మెరుగుపడిన ఆస్తుల నాణ్యత, లాభాల్లో బలమైన వృద్ధిని ప్రస్తావించింది. ఈ మేరకు బ్యాంకింగ్ రంగంపై ఆర్బీఐ ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య పరస్పర అనుసంధానత పెరిగిన నేపథ్యంలో.. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల సమీకరణ మార్గాలను విస్తృతం చేసుకోవాలి. బ్యాంక్‌లపై అధికంగా ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. కస్టమర్లకు సేవల విషయంలో మరింత కృషి చేయాలి’’అని ఆర్బీఐ కోరింది. సైబర్ దాడుల రిస్క్ నూతన టెక్నాలజీల అమలు నేపథ్యంలో సైబర్ దాడులు, డేటా చోరీ, నిర్వహణ వైఫల్యాలు పెరిగినట్టు పేర్కొంది. మెరుగైన పాలన, రిస్క్ నిర్వహణ విధానాల ద్వారా బ్యాలన్స్ షీట్లను పటిష్టం చేసుకుని, పెరుగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఆకాంక్షలను చేరుకునే విధంగా ఉండాలని కోరింది. ‘‘ఈ విధమైన సాంకేతిక, సైబర్ భద్రతా రిస్క్‌లను గుర్తించి, వాటి ముప్పును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. బలమైన గవర్నెన్స్, రిస్క్ నిర్వహణ విధానాల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి’’అని సూచించింది. -
ఆచితూచి రుణాలివ్వండి..!
న్యూఢిల్లీ: ఆర్బీఐ సూచించిన విధంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు రుణ వితరణలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎర్రటి గీతను (హద్దులను/పరిమితులను) గౌరవించాలని, అత్యుత్సాహంతో దూకుడుగా వ్యవహరించరాదని కోరారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌కార్డ్ రుణ విభాగంలో (అన్సెక్యూర్డ్) బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు గడిచిన కొన్నేళ్లలో భారీ వృద్ధిని చూపిస్తుండడం తెలిసిందే. ఫలితంగా ఈ విభాగంలో ఎన్పీఏలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రిస్క్ నియంత్రణకు గాను ఆర్బీఐ ఇటీవలే నిబంధనలు కఠినతరం చేయడం తెలిసే ఉంటుంది. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్‌ల రుణాలకు గాను రిస్క్ వెయిటేజీని 0.25 శాతం మేర పెంచింది. దీనివల్ల బ్యాంకుల వరకే రూ.84,000 కోట్లను అదనంగా పక్కన పెట్టాల్సి రావచ్చని అంచనా. ‘డేట్ విత్ టెక్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి సీతారామన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఉత్సాహం మంచిదే. కానీ, కొన్ని సందర్భాల్లో ఇదీ మరీ ఎక్కువైతే జీర్ణించుకోవడం కష్టం. దీంతో జాగ్రత్తగా ఉండాలని, దూకుడుగా వ్యవహరించడం ద్వారా తర్వాత రిస్‌్కలు చవిచూడొద్దన్న ఉద్దేశంతోనే ఆర్బీఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలను అప్రమత్తం చేసింది’’అని మంత్రి సీతారామన్ వివరించారు. డేటా సురక్షితం అకౌంట్ అగ్రిగేటర్లతో (ఏఏ) పంచుకునే కస్టమర్ల డేటా దేశంలో పూర్తి సురక్షితంగా ఉంటుందని మంత్రి సీతారామన్ హామీనిచ్చారు. డేటా భద్రత విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనను తొలగించే ప్రయత్నం చేశారు. ‘‘అకౌంట్ అగ్రిగేటర్లు డేటా బ్యాంక్ కలిగి ఉంటారనే అభిప్రాయాలు ఉండేవి. నిజానికి వారు డేటా కలిగి ఉండరు. వారి ద్వారా డేటా బదిలీ అవుతుంది. ఏఏ ద్వారా బ్యాంక్ కానీ, కస్టమర్ కానీ డేటా కలిగి ఉండరు. కేవలం రుణాల మంజూరీకే దీన్ని వినియోగించుకుంటారు’’అని మంత్రి చెప్పారు. -
ఎన్బీఎఫ్సీ వృద్ధి అంతంతే..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఇటీవల అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం చేయడంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ)పై ప్రభావం చూపనుంది. కఠిన నిబంధనల వల్ల రుణాల మంజూరు నెమ్మదించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీ రంగ వృద్ధి ఒక మోస్తరుగానే ఉండనుంది. 16–18 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో ఉత్పత్తుల్లో వైవిధ్యం, రుణాల ప్రొఫైల్ వంటివి వృద్ధి వ్యూహాల్లో కీలకంగా ఉండగలవని ఒక ప్రకటనలో తెలిపింది. పటిష్టమైన స్థూల, సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు .. రిటైల్ రుణాల వృద్ధికి ఊతమివ్వగలవని వివరించింది. రిటైల్‌గా గృహాలు, వాహనాలు, కన్జూమర్ డ్యూరబుల్స్ మొదలైన వాటిపై చేసే వ్యయాలు పటిష్టంగా ఉండటంతో ప్రైవేట్ వినియోగమనేది దీర్ఘకాలిక సగటుకు పైన కొనసాగుతోందని క్రిసిల్ రేటింగ్స్ ఎండీ గుర్ప్రీత్ చత్వాల్ తెలిపారు. అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం అయినప్పటికీ హామీతో కూడుకున్న రుణాలపై ప్రభావం ఉండబోదని పేర్కొన్నారు. ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (హెచ్ఎఫ్సీ) ప్రభావం ఉండదని తెలిపారు. పటిష్టమైన అమ్మకాల దన్నుతో వాహన రుణాల విభాగం ఈ ఆర్థిక సంవత్సరం 18–19 శాతం వృద్ధి చెందగలదని వివరించారు. వచ్చే ఏడాది గృహ రుణాలు 14 శాతం అప్.. ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం) ప్రస్తుతం గృహ, వాహన రుణాలకు చెరో 25–27 శాతం వాటా ఉన్నట్లు క్రిసిల్ తెలిపింది. ఈ రెండూ స్థిరంగా వృద్ధి చెందగలవని వివరించింది. అఫోర్డబుల్ గృహ రుణాలపై (రూ. 25 లక్షల కన్నా లోపు) హెచ్ఎఫ్సీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం హోమ్ లోన్ సెగ్మెంట్ 12–14 శాతం వృద్ధి చెందగలదని క్రిసిల్ తెలిపింది. వాహన రుణాల విభాగం 2024–25 మధ్యకాలంలో స్థిరంగా 17–18 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొంది. ఎన్బీఎఫ్సీ ఏయూఎంలో అసురక్షిత రుణాల సెగ్మెంట్ మూడో అతి పెద్ద విభాగంగా ఉంది. మరోవైపు, బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల నిధుల సమీకరణ వ్యయాలు 25–50 బేసిస్ పాయింట్ల మేర పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. అయితే, అవి ఎంత మేర బ్యాంకు రుణాలపై ఆధారపడి ఉన్నాయనే అంశంపై వాటి ఆర్థిక పనితీరు మీద ప్రభావం ఉంటుందని వివరించింది. -
క్రెడిట్ కార్డు.. కొంచెం కష్టమే!
ముంబై: క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణ మంజూరీల వంటి అన్సెక్యూర్డ్ రుణాలు ఇకపై మరింత కఠినతరం కానున్నాయి. ఈ విషయమై బ్యాంకులకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరీలు ఇటీవలి కాలంలో పెరుగుతుండడం, ఈ నేపథ్యంలో ఆయా రుణ మంజూరీ పట్ల బ్యాంకింగ్ జాగరూకత పాటించడం ఆర్బీఐ తాజా ఆదేశాల లక్ష్యం. హై రిస్క్ వెయిటేజ్ అన్సెక్యూర్డ్ వినియోగ రుణాలపై 25 శాతం పెంచాలన్నది ఈ ఆదేశాల ప్రధానాంశం. అంటే కొన్ని వ్యక్తిగత రుణాల విషయంలో బ్యాంకింగ్ కేటాయింపులు మరింత పెంచాల్సి ఉంటుందన్నమాట. అటువంటి క్రెడిట్ మరింత ఖరీదైనదిగా మారడంతో ఇది బ్యాంకుల రుణ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. తాజా నిర్ణయం వల్ల క్రెడిట్ కార్డ్ రుణాలపై రిస్క్ వెయిటేజ్ బ్యాంకులపై 150 శాతానికి, ఎన్బీఎఫ్సీలపై 125 శాతానికి పెరుగుతుంది. కాగా గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం, బంగారు ఆభరణాల ద్వారా పొందే రుణాలపై కొత్త నిబంధనలు వర్తించవని రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. 2023 సెపె్టంబర్ చివరి నాటికి పర్సనల్ లోన్ల విభాగంలో బ్యాంక్ రుణ బకాయిలు రూ. 48,26,833 కోట్లు. ఇది 2022 అదే నెలతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరిగింది. -
భారీ వృద్ధిపై గోద్రేజ్ క్యాపిటల్ కన్ను
చెన్నై: బ్యాంకింగేతర ఆర్థిక సేవల్లోని గోద్రేజ్ క్యాపిటల్ తన రుణ పుస్తకాన్ని భారీగా పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉంది. 2028 నాటికి రుణ పుస్తకాన్ని రూ.50,000 కోట్లకు చేర్చే దిశగా పనిచేస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో మనీష్ షా ప్రకటించారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ నూరు శాతం అనుబంధ సంస్థగా గోద్రేజ్ క్యాపిటల్ 2020లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్రేక్ఈవెన్ సాధించినట్టు (లాభ, నష్టాల్లేని స్థితి) మనీషా తెలిపారు. 2028 నాటికి రూ.50,000 కోట్ల రుణ ఆస్తులను చేరుకునేందుకు వీలుగా తమకు అదనంగా రూ.4,000 కోట్ల నిధులు అవసరం అవుతాయని చెప్పారు. ‘‘2020 అక్టోబర్‌లో లైసెన్స్ లభించింది. 2028 నాటికి ఏయూఎంను రూ.50,000 కోట్లకు చేర్చాలని అనుకుంటున్నాం. 2024 మార్చి నాటికి ఏయూఎం రూ.10,000 కోట్లను చేరుతుంది. హోల్డింగ్ కంపెనీ (గోద్రేజ్ ఇండస్ట్రీస్) నుంచి రూ.2,000 కోట్లు అందుకున్నాం. రూ.50,000 కోట్ల పుస్తకాన్ని చేరుకునేందుకు ఏటా రూ.1,000 కోట్ల చొప్పున నిధులు అవసరం అవుతాయి’’అని చెన్నైలో మీడియా ప్రతినిధులకు షా తెలిపారు. 2026 నాటికి రూ.30,000 కోట్ల ఏయూఎంకు చేరుకుంటామన్నారు. ఎంఎస్ఎంఈ, గృహ రుణాలు తమ ప్రాధాన్య విభాగాలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.7,700 కోట్ల రుణాల్లో ఎంఎస్ఎంఈలకు ఇచ్చినవి రూ.4,000 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. మిగిలిన మొత్తం గృహ రుణాలుగా పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ రుణ ఆస్తుల్లో రూ.5–50 కోట్ల మధ్య ఆదాయం కలిగినవి ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈలు తమ వ్యాపారాన్ని సమగ్రంగా వృద్ధి చేసుకునేందుకు వీలుగా త్వరలోనే ‘నిర్మన్’ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్టు షా ప్రకటించారు. నిర్మన్ సేవల కోసం అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్, ఆన్‌ష్యూరిటీ, జోల్‌విట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు చెప్పారు. తద్వారా ఎంఎస్ఎంఈలకు ఆన్లైన్ మార్కెట్ అవకాశాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. -
ఎన్బీఎఫ్సీల్లో పరిపాలన మరింత బలపడాలి
ముంబై: పరిపాలనా ప్రమాణాలను బలోపేతం చేసుకోవాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలను (హెచ్ఎఫ్సీలు) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కోరారు. ఎంపిక చేసిన పెద్ద ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల ఎండీలు, సీఈవోలతో గవర్నర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వరంగంలోని ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల చీఫ్‌లు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న సంస్థలు ఈ రంగంలోని మొత్తం ఆస్తుల్లో సగం నిర్వహిస్తుండడం గమనార్హం. బ్యాంకింగ్ సేవలు చేరువ కాని లేదా అందుబాటులో లేని వర్గాలకు రుణాలను అందిస్తూ ఈ సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను ఆర్బీఐ గవర్నర్ గుర్తిస్తూ.. అనుకూల సమయాల్లో అలసత్వానికి చోటు ఇవ్వొద్దని అప్రమత్తం చేశారు. పరిపాలనా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ.. నిబంధనల అమలు, రిస్క్ నిర్వహణ, అంతర్గత ఆడిట్ల యంత్రాంగం విషయమై భరోసా అవసరమన్నారు. ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తమ నిధుల కోసం ఎక్కువగా బ్యాంకులపై ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ మార్గాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాల్లో ఉండే రిస్క్, ఐటీ వ్యవస్థలు, సైబర్ భద్రత మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి సారించారు. ఎన్పీఏలకు మరిన్ని కేటాయింపులు చేయడం ద్వారా బ్యాలన్స్ షీట్ల బలోపేతం, ఒత్తిడిలోని రుణ ఆస్తులను పర్యవేక్షించడం, బలమైన లిక్విడిటీ, అస్సెట్ లయబిలిటీ మధ్య సమతుల్యం, రుణాలకు సంబంధించి పారదర్శకమైన రేట్లు, మెరుగైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలోఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్ రావు, స్వామినాథన్, ఎన్‌హెచ్‌బీ ఎండీ ఎస్కే హోతా కూడా పాల్గొన్నారు. -
ఎన్బీఎఫ్సీ ఎంఎఫ్‌ఐల లాభాలు పెరుగుతాయ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) లాభదాయకత పుంజుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. నూతన నియంత్రణపరమైన కార్యాచరణ కింద అవి మెరుగైన రేట్లకు రుణాలు ఇచ్చే వెసులుబాటు లాభాలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. ప్రస్తుతం పెరుగుతున్న వడ్డీ రేట్ల క్రమం.. ఎన్బీఎఫ్సీలు, ఎంఎఫ్‌ఐల లాభాలను ప్రభావితం చేయకపోవచ్చని, నిధులపై అవి వెచ్చించే అధిక వ్యయాలను, రుణాలపై అధిక వడ్డీ రేట్ల రూపంలో అధిగమించగలవని పేర్కొంది. దీంతో నికర వడ్డీ మార్జిన్లు మెరుగ్గానే ఉంటాయని తన నివేదికలో అంచనా వేసింది. రుణ రేట్లను నిర్ణయించడంలో పెరిగిన అనుకూలతే వాటి లాభదాయకతకు తోడ్పడే ముఖ్యమైన అంశంగా పేర్కొంది. పెరిగిన రేట్లు.. ఇప్పటికే చాలా వరకు ఎన్బీఎఫ్సీలు, ఎంఎఫ్ఐలు రుణ రేట్లను 1.5 శాతం నుంచి 2.5 శాతం వరకు పెంచినట్టు క్రిసిల్ రేటింగ్స్ డిప్యూటీ చీఫ్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. దీంతో వాటికి పెరిగిన రుణ సమీకరణ వ్యయాలను సర్దుబాటు చేసుకునేందుకు తగినంత వెసులుబాటు ఉందని చెప్పారు. అలాగే, ఆస్తుల నాణ్యత సవాళ్లను ఎదుర్కొనేందుకు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎక్కువ నిధులను పక్కన పెట్టినందున, అవసరమైతే ఆయా నిధులను కూడా వినియోగించుకోగలవన్నారు. ఆదాయ పరిమితి పెంచడం (రుణ గ్రహీతల), రుణ రేట్లను నిర్ణయించడంలో వచ్చిన వెసులుబాటు వల్ల ఎన్బీఎఫ్సీలు, ఎంఎఫ్ఐలు ప్రస్తుత మార్కెట్లలోనే మరింతగా చొచ్చుకుపోగలవని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
బ్యాంకుల పర్యవేక్షణ మరింత పటిష్టం
ముంబై: కొంగొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా ఆర్థిక రంగ సంస్థలను తీర్చిదిద్దే దిశగా రిస్కు అధారిత పర్యవేక్షణ (ఆర్బీఎస్) విధానాన్ని సమీక్షించాలని, పటిష్టం చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ ప్రక్రియ కోసం సాంకేతిక నిపుణులు/కన్సల్టెంట్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. బ్యాంకులు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో పాటు దేశవ్యాప్త ఆర్థిక సంస్థల పర్యవేక్షణకు ఆర్బీఎస్ విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఉపయోగిస్తోంది. అసెట్ క్వాలిటీ, లిక్విడిటీ, ఆర్థిక సామర్థ్యాలు, గవర్నెన్స్ మొదలైన అంశాలను మదింపు చేసేందుకు ఇది తోడ్పడుతోంది. -
చిన్న వ్యాపారాలపైనే అధిక దృష్టి
‘సాక్షి’ ఇంటర్వ్యూ: శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ ఎండీ సుందర రాజన్ వడ్డీరేట్లలో ఒడిదుడుకులు పాతమాట అన్నిఅంశాలూ పరిశీలించాకే బ్యాంకింగ్ లెసైన్స్‌కు దరఖాస్తు గోల్డ్ పోర్ట్‌ఫోలియోపై ఆందోళన లేదు దేశవ్యాప్త విస్తరణపై దృష్టి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపారంలో దూసుకుపోతున్న శ్రీరామ్ గ్రూప్ ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలోకి అడుగు పెట్టే యోచనలో ఉంది. పెద్ద పెద్ద కార్పొరేట్లే బ్యాంకింగ్ లెసైన్స్ నుంచి తప్పుకుంటున్న తరుణంలో శ్రీరామ్ గ్రూప్ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో ‘సాక్షి’ తెలుసుకునే ప్రయత్నం చేసింది. వడ్డీరేట్లు, భవిష్యత్తు వ్యాపార విస్తరణపై శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ మేనేజింగ్ డెరైక్టర్ జి.ఎస్.సుందర రాజన్‌తో ఇంటర్వ్యూ విశేషాలు.... ఆర్బీఐ నిబంధనలు అనుకూలంగా లేవని కొన్ని పెద్ద ఎన్బీఎఫ్సీలు అంటున్నాయి. నిజమా? ఆర్బీఐ మార్గదర్శకాల ఆధారంగానే శ్రీరామ్ క్యాపిటల్ బ్యాంక్ లెసైన్స్‌కు దాఖలు చేసింది. ఆర్బీఐ ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, లెసైన్స్ కోసం అర్హత ఉన్న సంస్థల తుది జాబితా విడుదల చేసేదాకా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయం. టాటా, వీడియోకాన్ వంటి సంస్థలు బ్యాంక్ లెసైన్స్ దరఖాస్తులను ఉపసంహరించుకున్నాయి? మీరేం చేయబోతున్నారు? ప్రస్తుతం బ్యాంకింగ్ లెసైన్స్‌ల గురించి ఎలాంటి వ్యాఖ్యానాలు చేయం. బంగారం ధరల్లో ఒడిదుడుకుల కారణంగా గోల్డ్ లోన్స్ సంస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గోల్డ్ లోన్ వ్యాపారంపై వ్యూహం చెప్పండి? గత ఐదేళ్లుగా శ్రీరామ్ సిటీ గోల్డ్‌లోన్ వ్యాపారం స్థిరంగా వృద్ధి చెందుతోంది. ఈ వ్యాపారం బాగుండటంతో మా సంస్థ కొనసాగే వరకు దీన్ని కొనసాగిస్తాము. ఇందుకోసమే బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నా ఎల్టీవీ విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదు. మా మొత్తం రుణాల్లో గోల్డ్ లోన్స్ వాటా 25 శాతంగా ఉండే విధంగా చూస్తాం. నికర వడ్డీ లాభదాయకత విషయంలో ఎన్బీఎఫ్సీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి? శ్రీరామ్ పరిస్థితి ఎలా ఉంది? వ్యాపార విభాగాన్ని బట్టి మా వడ్డీ లాభదాయకత 9 నుంచి 11 శాతం వరకు ఉంది. ఇప్పటికే ఉన్న బంగారం, ద్విచక్ర, ఎంటర్ప్రైజ్ ఫైనాన్స్‌తో పాటు ఇప్పుడు ఎంఎస్ఎంఈ రంగంపై అధికంగా దృష్టిసారిస్తుండటంతో 2013-14లో కూడా ఇదే విధమైన వడ్డీ లాభదాయకతను కొనసాగించగలమన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం ఏ రంగంపై ఎక్కువ దృష్టిపెడుతున్నారు? చిన్న, సూక్ష్మస్థాయి వ్యాపారాలను గుర్తించి ఆ వ్యాపారస్తులకు రుణాలను అందించడంలో శ్రీరామ్ ప్రత్యేక గుర్తింపును పొందింది. దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడం ద్వారా ఇలాంటి సూక్ష్మ, చిన్నస్థాయి వ్యాపారాలకు ఆర్థిక తోడ్పాటును అందించడం ద్వారా ఈ సమాజాభివృద్ధికి మా వంతు సహాయం చేస్తాం. స్వల్పకాలిక లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక దృష్టితోనే వ్యాపార విస్తరణ ప్రణాళికలను చేపడతాం. వ్యాపార విస్తరణకు మూలధనం అవసరమా? వచ్చే మూడేళ్లలో 25 నుంచి 30 శాతం వ్యాపారాభివృద్ధికి సరిపోయే మూలధనం ఉంది. వ్యాపార అవసరాల కోసం ఎన్సీడీల ద్వారా నగదును సమీకరిస్తామే కాని స్వల్ప కాలానికి ఎలాంటి అదనపు మూలధనం అవసరం లేదు. భవిష్యత్తులో వడ్డీరేట్ల కదలికలు ఎలా ఉండొచ్చు? అంతర్జాతీయ పరిణామాలు ప్రభావం చూపుతున్న తరుణంలో భవిష్యత్తు వడ్డీరేట్ల కదలికలను అంచనా వేయడం కష్టంతో కూడుకున్న అంశమే. కాని కొద్ది నెలలుగా ఆర్బీఐ ఆచితూచి సమతూకంగా వ్యవహరిస్తోంది. ఈ అంశాలను బట్టి చూస్తే వడ్డీరేట్లలో ఒడిదుడుకులనేవి గతించిన అంశంగానే పరిగణిస్తున్నాం.