ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్‌ఐలు) లాభదాయకత పుంజుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. నూతన నియంత్రణపరమైన కార్యాచరణ కింద అవి మెరుగైన రేట్లకు రుణాలు ఇచ్చే వెసులుబాటు లాభాలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది.
ప్రస్తుతం పెరుగుతున్న వడ్డీ రేట్ల క్రమం.. ఎన్‌బీఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐల లాభాలను ప్రభావితం చేయకపోవచ్చని, నిధులపై అవి వెచ్చించే అధిక వ్యయాలను, రుణాలపై అధిక వడ్డీ రేట్ల రూపంలో అధిగమించగలవని పేర్కొంది. దీంతో నికర వడ్డీ మార్జిన్లు మెరుగ్గానే ఉంటాయని తన నివేదికలో అంచనా వేసింది. రుణ రేట్లను నిర్ణయించడంలో పెరిగిన అనుకూలతే వాటి లాభదాయకతకు తోడ్పడే ముఖ్యమైన అంశంగా పేర్కొంది.
పెరిగిన రేట్లు..
ఇప్పటికే చాలా వరకు ఎన్‌బీఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐలు రుణ రేట్లను 1.5 శాతం నుంచి 2.5 శాతం వరకు పెంచినట్టు క్రిసిల్ రేటింగ్స్ డిప్యూటీ చీఫ్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. దీంతో వాటికి పెరిగిన రుణ సమీకరణ వ్యయాలను సర్దుబాటు చేసుకునేందుకు తగినంత వెసులుబాటు ఉందని చెప్పారు. అలాగే, ఆస్తుల నాణ్యత సవాళ్లను ఎదుర్కొనేందుకు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎక్కువ నిధులను పక్కన పెట్టినందున, అవసరమైతే ఆయా నిధులను కూడా వినియోగించుకోగలవన్నారు. ఆదాయ పరిమితి పెంచడం (రుణ గ్రహీతల), రుణ రేట్లను నిర్ణయించడంలో వచ్చిన వెసులుబాటు వల్ల ఎన్‌బీఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐలు ప్రస్తుత మార్కెట్లలోనే మరింతగా చొచ్చుకుపోగలవని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment