చిన్న వ్యాపారాలపైనే అధిక దృష్టి
‘సాక్షి’ ఇంటర్వ్యూ: శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ ఎండీ సుందర రాజన్
- వడ్డీరేట్లలో ఒడిదుడుకులు పాతమాట
- అన్నిఅంశాలూ పరిశీలించాకే బ్యాంకింగ్ లెసైన్స్‌కు దరఖాస్తు
- గోల్డ్ పోర్ట్‌ఫోలియోపై ఆందోళన లేదు
- దేశవ్యాప్త విస్తరణపై దృష్టి
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపారంలో దూసుకుపోతున్న శ్రీరామ్ గ్రూప్ ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలోకి అడుగు పెట్టే యోచనలో ఉంది. పెద్ద పెద్ద కార్పొరేట్లే బ్యాంకింగ్ లెసైన్స్ నుంచి తప్పుకుంటున్న తరుణంలో శ్రీరామ్ గ్రూప్ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో ‘సాక్షి’ తెలుసుకునే ప్రయత్నం చేసింది. వడ్డీరేట్లు, భవిష్యత్తు వ్యాపార విస్తరణపై శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ మేనేజింగ్ డెరైక్టర్ జి.ఎస్.సుందర రాజన్‌తో ఇంటర్వ్యూ విశేషాలు....
ఆర్‌బీఐ నిబంధనలు అనుకూలంగా లేవని కొన్ని పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు అంటున్నాయి. నిజమా?
ఆర్‌బీఐ మార్గదర్శకాల ఆధారంగానే శ్రీరామ్ క్యాపిటల్ బ్యాంక్ లెసైన్స్‌కు దాఖలు చేసింది. ఆర్‌బీఐ ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, లెసైన్స్ కోసం అర్హత ఉన్న సంస్థల తుది జాబితా విడుదల చేసేదాకా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయం.
టాటా, వీడియోకాన్ వంటి సంస్థలు బ్యాంక్ లెసైన్స్ దరఖాస్తులను ఉపసంహరించుకున్నాయి? మీరేం చేయబోతున్నారు?
ప్రస్తుతం బ్యాంకింగ్ లెసైన్స్‌ల గురించి ఎలాంటి వ్యాఖ్యానాలు చేయం.
బంగారం ధరల్లో ఒడిదుడుకుల కారణంగా గోల్డ్ లోన్స్ సంస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గోల్డ్ లోన్ వ్యాపారంపై వ్యూహం చెప్పండి?
గత ఐదేళ్లుగా శ్రీరామ్ సిటీ గోల్డ్‌లోన్ వ్యాపారం స్థిరంగా వృద్ధి చెందుతోంది. ఈ వ్యాపారం బాగుండటంతో మా సంస్థ కొనసాగే వరకు దీన్ని కొనసాగిస్తాము. ఇందుకోసమే బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నా ఎల్‌టీవీ విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదు. మా మొత్తం రుణాల్లో గోల్డ్ లోన్స్ వాటా 25 శాతంగా ఉండే విధంగా చూస్తాం.
నికర వడ్డీ లాభదాయకత విషయంలో ఎన్‌బీఎఫ్‌సీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి? శ్రీరామ్ పరిస్థితి ఎలా ఉంది?
వ్యాపార విభాగాన్ని బట్టి మా వడ్డీ లాభదాయకత 9 నుంచి 11 శాతం వరకు ఉంది. ఇప్పటికే ఉన్న బంగారం, ద్విచక్ర, ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్‌తో పాటు ఇప్పుడు ఎంఎస్‌ఎంఈ రంగంపై అధికంగా దృష్టిసారిస్తుండటంతో 2013-14లో కూడా ఇదే విధమైన వడ్డీ లాభదాయకతను కొనసాగించగలమన్న నమ్మకం ఉంది.
ప్రస్తుతం ఏ రంగంపై ఎక్కువ దృష్టిపెడుతున్నారు?
చిన్న, సూక్ష్మస్థాయి వ్యాపారాలను గుర్తించి ఆ వ్యాపారస్తులకు రుణాలను అందించడంలో శ్రీరామ్ ప్రత్యేక గుర్తింపును పొందింది. దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడం ద్వారా ఇలాంటి సూక్ష్మ, చిన్నస్థాయి వ్యాపారాలకు ఆర్థిక తోడ్పాటును అందించడం ద్వారా ఈ సమాజాభివృద్ధికి మా వంతు సహాయం చేస్తాం. స్వల్పకాలిక లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక దృష్టితోనే వ్యాపార విస్తరణ ప్రణాళికలను చేపడతాం.
వ్యాపార విస్తరణకు మూలధనం అవసరమా?
వచ్చే మూడేళ్లలో 25 నుంచి 30 శాతం వ్యాపారాభివృద్ధికి సరిపోయే మూలధనం ఉంది. వ్యాపార అవసరాల కోసం ఎన్‌సీడీల ద్వారా నగదును సమీకరిస్తామే కాని స్వల్ప కాలానికి ఎలాంటి అదనపు మూలధనం అవసరం లేదు.
భవిష్యత్తులో వడ్డీరేట్ల కదలికలు ఎలా ఉండొచ్చు?
అంతర్జాతీయ పరిణామాలు ప్రభావం చూపుతున్న తరుణంలో భవిష్యత్తు వడ్డీరేట్ల కదలికలను అంచనా వేయడం కష్టంతో కూడుకున్న అంశమే. కాని కొద్ది నెలలుగా ఆర్‌బీఐ ఆచితూచి సమతూకంగా వ్యవహరిస్తోంది. ఈ అంశాలను బట్టి చూస్తే వడ్డీరేట్లలో ఒడిదుడుకులనేవి గతించిన అంశంగానే పరిగణిస్తున్నాం.