న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఇటీవల అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం చేయడంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ)పై ప్రభావం చూపనుంది. కఠిన నిబంధనల వల్ల రుణాల మంజూరు నెమ్మదించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్‌బీఎఫ్‌సీ రంగ వృద్ధి ఒక మోస్తరుగానే ఉండనుంది. 16–18 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో ఉత్పత్తుల్లో వైవిధ్యం, రుణాల ప్రొఫైల్ వంటివి వృద్ధి వ్యూహాల్లో కీలకంగా ఉండగలవని ఒక ప్రకటనలో తెలిపింది.
పటిష్టమైన స్థూల, సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు .. రిటైల్ రుణాల వృద్ధికి ఊతమివ్వగలవని వివరించింది. రిటైల్‌గా గృహాలు, వాహనాలు, కన్జూమర్ డ్యూరబుల్స్ మొదలైన వాటిపై చేసే వ్యయాలు పటిష్టంగా ఉండటంతో ప్రైవేట్ వినియోగమనేది దీర్ఘకాలిక సగటుకు పైన కొనసాగుతోందని క్రిసిల్ రేటింగ్స్ ఎండీ గుర్‌ప్రీత్ చత్వాల్ తెలిపారు. అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం అయినప్పటికీ హామీతో కూడుకున్న రుణాలపై ప్రభావం ఉండబోదని పేర్కొన్నారు. ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (హెచ్‌ఎఫ్‌సీ) ప్రభావం ఉండదని తెలిపారు. పటిష్టమైన అమ్మకాల దన్నుతో వాహన రుణాల విభాగం ఈ ఆర్థిక సంవత్సరం 18–19 శాతం వృద్ధి చెందగలదని వివరించారు.
వచ్చే ఏడాది గృహ రుణాలు 14 శాతం అప్..
ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం) ప్రస్తుతం గృహ, వాహన రుణాలకు చెరో 25–27 శాతం వాటా ఉన్నట్లు క్రిసిల్ తెలిపింది. ఈ రెండూ స్థిరంగా వృద్ధి చెందగలవని వివరించింది. అఫోర్డబుల్ గృహ రుణాలపై (రూ. 25 లక్షల కన్నా లోపు) హెచ్‌ఎఫ్‌సీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం హోమ్ లోన్ సెగ్మెంట్ 12–14 శాతం వృద్ధి చెందగలదని క్రిసిల్ తెలిపింది. వాహన రుణాల విభాగం 2024–25 మధ్యకాలంలో స్థిరంగా 17–18 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీ ఏయూఎంలో అసురక్షిత రుణాల సెగ్మెంట్ మూడో అతి పెద్ద విభాగంగా ఉంది. మరోవైపు, బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల నిధుల సమీకరణ వ్యయాలు 25–50 బేసిస్ పాయింట్ల మేర పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. అయితే, అవి ఎంత మేర బ్యాంకు రుణాలపై ఆధారపడి ఉన్నాయనే అంశంపై వాటి ఆర్థిక పనితీరు మీద ప్రభావం ఉంటుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment