
రిస్క్ వెయిటేజీని తగ్గించిన ఆర్‌బీఐ
బ్యాంక్‌లు మంజూరు చేసే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), సూక్ష్మ రుణాలపై రిస్క్ వెయిటేజీని ఆర్‌బీఐ తగ్గించింది. కన్జ్యూమర్ మైక్రోఫైనాన్స్ రుణా లు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఇచ్చే రుణాలపై 25 శాతం తగ్గించడంతో రిస్క్ వెయిట్ 100కు దిగొచ్చింది. దీంతో ఆయా రుణాల కోసం బ్యాంక్‌లు పక్కన పెట్టాల్సిన నిధుల పరిమాణం తగ్గుతుంది. తద్వారా బ్యాంక్‌ల లిక్విడిటీ మెరుగవుతుంది. ఆయా విభాగాలకు రుణ వితరణ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
2023 నవంబర్‌లో ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ రుణ సంస్థలకు రిస్క్ వెయిటేజీని ఆర్‌బీఐ పెంచడం గమనార్హం. అప్పటి నుంచి వాటి రుణ వితరణ కుంటుపడింది. ఎన్‌బీఎఫ్‌సీలకు వాణిజ్య బ్యాంక్‌ల రుణాలపై రిస్క్ వెయిట్‌ను 25 శాతం పాయింట్లను పెంచింది. అదే ఏడాది వ్యక్తిగత రుణాలకు సైతం 25 శాతం మేర వెయిట్‌ను పెంచి 125 చేసింది. గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం రుణాలకు మాత్రం మినహాయింపునిచ్చింది. కఠిన నిబంధనలతో ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంక్‌ల నుంచి రుణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ రుణాలకు గతంలో పెంచిన మేర వెయిటేజీని తాజా తగ్గించగా, దీన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు.
భారత్‌పై టారిఫ్‌ల ప్రభావం తక్కువే
ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని (ఏపీఏసీ) ఇతర దేశాలతో పోలిస్తే ఎగుమతుల కోసం అమెరికాపై భారత్ ఆధారపడటం తక్కువగానే ఉంటోంది కాబట్టి, కొన్ని రంగాలు మినహా చాలా రంగాలపై ప్రతిపాదిత టారిఫ్‌ల ప్రభావం మరీ అంతగా ఉండకపోవచ్చని మూడీస్ రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఆహారోత్పత్తులు, జౌళి, ఫార్మా మొదలైన ఉత్పత్తులకు టారిఫ్ రిసు్కలు ఉండొచ్చని వివరించింది.
ఇదీ చదవండి: రూ.8.6 లక్షల కోట్ల ఎగుమతులు
తాము రేటింగ్ ఇచ్చే భారతీయ కంపెనీలు చాలా మటుకు దేశీ మార్కెట్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయని, అవి అమెరికా మార్కెట్‌పై ఆధారపడటం తక్కువేనని పేర్కొంది. టారిఫ్‌ల విషయంలో అమెరికాతో అత్యధిక వ్యత్యాసాలున్న ఏపీఏసీ దేశాల్లో భారత్, వియత్నాం, థాయ్‌లాండ్ మొదలైనవి ఉన్నట్లు వివరించింది. ఎల్రక్టానిక్స్, మోటర్ సైకిల్స్, ఫుడ్, టెక్స్‌టైల్స్ విభాగాలు ఎక్కువగా అమెరికాపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో వివాదానికి తావివ్వకుండా, ద్వైపాక్షిక చర్చల ద్వారా బేరసారాలాడుకోవడం ద్వారా ప్రభుత్వాలు టారిఫ్‌ల విషయంలో వివేకవంతంగా వ్యవహరించే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment