microfinance
-
తెలుగు రాష్ట్రాల్లో ముత్తూట్ మైక్రోఫిన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైక్రోఫైనాన్స్ రంగంలో ఉన్న ముత్తూట్ మైక్రోఫిన్ తెలంగాణలో అడుగుపెడుతోంది. భువనగిరి, జనగాం, హన్మకొండ, పరకాలలో శాఖలను ఈ నెలలో తెరుస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. జూన్‌లోగా ఆంధ్రప్రదేశ్‌కు సేవలను విస్తరిస్తామని ముత్తూట్ మైక్రోఫిన్ సీఈవో సదాఫ్ సయీద్ వెల్లడించారు. కొచ్చి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ముత్తూట్ మైక్రోఫిన్ 18 రాష్ట్రాలకు విస్తరించింది. 1,424 శాఖలతో సేవలు అందిస్తోంది. సుమారు 33 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. -
దక్షిణాదిపై యస్ బ్యాంక్ మరింత దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ దక్షిణాదిలో కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోను శాఖలను విస్తరిస్తోంది. ప్రస్తుతం 25గా ఉన్న బ్రాంచీల సంఖ్యను మార్చి ఆఖరు నాటికి 29కి పెంచుకోనున్నట్లు, తదుపరి మరో రెండు కొత్త శాఖలను ప్రారంభించనున్నట్లు బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా తమకు 1,200 పైచిలుకు శాఖలు ఉండగా.. దక్షిణాదిలో 216 ఉన్నాయన్నారు. మైక్రోఫైనాన్స్ విభాగంలోకి ప్రవేశించడంపైనా కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కుదిరితే ఏదైనా సూక్ష్మ రుణాల సంస్థను కొనుగోలు చేస్తామని లేదా సొంతంగానైనా కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. పేటీఎం పరిణామాలపై స్పందిస్తూ దానికి సంబంధించి నాలుగు బ్యాంకులకు వచ్చే వ్యాపారంలో తమకు పాతిక శాతం వాటా రాగలదని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విభాగంపైనా (ఎంఎస్ఎంఈ) దృష్టి పెడుతున్నామన్నారు. ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలో దీని వాటా 30 శాతంగా ఉండగా వచ్చే రెండు, మూడేళ్లలో 35 శాతం వరకు పెంచుకోనున్నట్లు ప్రశాంత్ కుమార్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లలో 18 శాతం, రుణాల్లో 15 శాతం వరకు వృద్ధిని అంచనా వేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ మార్కెట్‌పై స్పందిస్తూ డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 16.6 శాతం వృద్ధి చెంది రూ. 8,887 కోట్లకు చేరాయని, స్థూల రుణాలు 24 శాతం వృద్ధితో రూ. 11,157 కోట్లకు పెరిగాయని ప్రశాంత్ కుమార్ చెప్పారు. కొత్త కాసా (కరెంట్ అకౌంటు, సేవింగ్స్ అకౌంటు) అకౌంట్లు 14 శాతం వృద్ధి చెందాయన్నారు. దక్షిణాదిలో తమ కాసా డిపాజిట్లలో నగరానికి 14 శాతం వాటా ఉందని పేర్కొన్నారు. -
కుటుంబాలకు మరిన్ని రుణాలు!
కోల్‌కతా: కుటుంబాల రుణ అవసరాల పరంగా మరింత విస్తరించి, తమ పంపిణీల పోర్ట్‌ఫోలియోను వృద్ధి చేసుకోడానికి సూక్ష్మ ఆర్థిక సంస్థలు (ఎంఎఫ్ఐలు) దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్ (ఎంఎఫ్ఐఎన్) సీఈఓ, డైరెక్టర్ అలోక్ మిశ్రా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 7.3 కోట్ల తక్కువ ఆదాయ రుణగ్రహీతలు ఉన్నారని, వీరు నాలుగు లక్షల కోట్ల రూపాయల బకాయి ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎంఎఫ్ఐ రంగానికి రూ. 13 లక్షల కోట్ల పోర్ట్‌ఫోలియో విస్తరణ సామర్థ్యం ఉందని ఆయన పేర్కొంటూ, ఈ నేపథ్యంలో వృద్ధికి భారీ అవకాశం ఉందని అన్నారు. ఒక్క పశి్చమ బెంగాల్లో 65 లక్షల మంది రుణగ్రహీతలకు సంబంధించి మొత్తం రూ. 35,000 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయని అన్నారు. మొత్తం పోర్ట్‌ఫోలియోలో తొమ్మిది శాతం పశ్చిమ బెంగాల్‌కు చెందినవేనని చెప్పారు. లఘు ఎంఎఫ్ఐలకు రీఫైనాన్సింగ్ కోసం మాత్రమే ఉద్దేశించిన ఒక ప్రత్యేక ఆర్థిక సంస్థ ఏర్పాటును ఈ రంగం కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. అసోసియేషన్ ఆఫ్ మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఏఎంఎఫ్ఐ)పశి్చమ బెంగాల్ విభాగం ఈ నెల 22వ నిర్వహించనున్న 8వ ఈస్టర్న్ ఇండియా మైక్రోఫైనాన్స్ సమ్మిట్ సందర్భంగా అలోక్ మిశ్రా ఎంఎఫ్ఐ రంగానికి సంబంధించి ఈ కీలక అంశాలను వెల్లడించారు. ఈ రంగానికి చెందిన మరికొందరు చెబుతున్న అంశాలు ఇవీ... ► ప్రస్తుతం దేశంలో ఎంఎఫ్ఐ కవరేజీ తక్కువగా ఉందని ఆరోహన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఎండీ మనోజ్ నంబియార్ తెలిపారు.ఈ రంగం మరింత విస్తరించాల్సి ఉందని పేర్కొన్నారు. ► చారిత్రాత్మకంగా ఎంఎఫ్ఐ రంగంలో మొండిబకాయిల (ఎన్పీఏ) సగటు స్థాయిలు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని వీఎఫ్ఎస్ క్యాపిటల్ ఎండీ కులదీప్ మైథీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిలో ఎంఎఫ్ఐలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మైథీ చెప్పారు. -
ఆశీర్వాద్ మైక్రోకు సెబీ బ్రేకులు
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ.. మణప్పురం ఫైనాన్స్ అనుబంధ సంస్థ ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాజాగా సెబీ బ్రేకు వేసింది. సంస్థ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అయితే వెబ్సైట్లో సెబీ ఇందుకు కారణాలను వెల్లడించలేదు. ఈక్విటీ జారీ ద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణకు వీలుగా ఆశీర్వాద్ మై క్రో 2023 అక్టోబర్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. సాధారణంగా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన 30 రోజుల్లోగా సెబీ పరిశీలనా పత్రాన్ని జారీ చేస్తుంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు అనుమతిస్తుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఆశీర్వాద్ మైక్రో పే ర్కొంది. 2008లో తమిళనాడులో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం 1,684 బ్రాంచీలతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించింది. గతేడాది(2022–23)కల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 10,041 కోట్లకు చేరాయి. ఈ వార్తల నేపథ్యంలో మణప్పురం ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం పతనమై రూ. 168 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 163 వద్ద కనిష్టాన్ని తాకింది. -
ముత్తూట్ మైక్రోఫిన్ నేలచూపు.. ఐపీఓలో మదుపర్లకు నిరాశ
ఇటీవలే పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ముత్తూట్ పాపచన్ గ్రూప్ అనుబంధ సంస్థ ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ లిస్టింగ్‌లో ఇన్వెస్టర్లను నిరాశ పరచింది. ఇష్యూ ధర రూ. 291తో పోలిస్తే బీఎస్ఈలో 4.5 శాతం తక్కువగా రూ. 278 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆపై ఒక దశలో 9 శాతంవరకూ పతనమై రూ. 265 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 8.5 శాతం నష్టంతో రూ. 266 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 5.4 శాతం డిస్కౌంట్‌తో రూ. 275 వద్ద లిస్టయ్యింది. చివరికి 8.6 శాతం క్షీణతతో రూ. 266 వద్ద నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 4,539 కోట్లుగా నమోదైంది. 11 రెట్లుపైగా స్పందన లభించిన ఐపీవో ద్వారా కంపెనీ రూ. 960 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ముత్తూట్ ఫిన్‌కార్ప్ ప్రమోట్ చేసిన కంపెనీ ప్రధానంగా మైక్రోఫైనాన్స్ సరీ్వసులు అందిస్తోంది. -
అనన్య సామాన్య స్వతంత్రం
అనన్య బిర్లాకు చెందిన సూక్ష్మరుణ కంపెనీ (ఎంఎఫ్ఐ) స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో రెండో అతి పెద్ద ‘ఎంఎఫ్ఐ’గా గుర్తింపు పొందనుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా గెలుపు జెండా ఎగరేసిన అనన్య బిర్లా సింగర్, రైటర్, యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్... ఏకంగా అయిదు సింగిల్స్‌లో డబుల్ ప్లాటినమ్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. అనన్య గానప్రతిభ గురించి చెప్పుకోవడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే. ‘లెట్ దేర్ బి లవ్’ ‘ఎవ్రీ బడీ లాస్ట్’ పాటలతో అమెరికన్ నేషనల్ టాప్ 40 పాప్ రేడియో షో జాబితాలో చోటు సాధించిన ఫస్ట్ ఇండియన్ ఆర్టిస్ట్‌గా ఘనత సాధించింది. అనన్యకు చిన్నవయసు నుంచే సంగీతం అంటే ఇష్టం. పదకొండు సంవత్సరాల వయసులో సంతూర్ ప్లే చేయడం నేర్చుకుంది. ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ కోసం ‘యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్’లో చేరిన అనన్య డిగ్రీ పూర్తి కాకుండానే చదువు మానేసింది. యూనివర్శిటీలో చదువు సంగతి ఎలా ఉన్నా సంగీతంలో మాత్రం ఎటు చూసినా అనన్య పేరు వినిపించేది. పాడడంతో పాటు కవితలు, పాటలు కూడా రాసేది. గిటార్ ప్లే చేయడం నేర్చుకుంది. ‘లివిన్ ది లైఫ్’ తన డెబ్యూ సింగిల్. యూట్యూబ్‌లో 14 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్‌లో నిలిచింది. కునాల్ కోహ్లీ స్పై థ్రిల్లర్ ‘శ్లోక్’లో నటిగా ఆకట్టుకుంది. ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు సంగీత, సాహిత్య కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేది అనన్య. ఆందోళన, కుంగుబాటుతో సతమతం అవుతున్న యువత కోసం స్టూడెంట్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన తరువాత మానసిక సమస్యలతో బాధపడే వారికి సహాయం అందించడానికి ‘ఎంపవర్’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 24“7 ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్‌లైన్ ద్వారా వేలాది మంది ప్రజలకు మేలు జరిగింది. అమెరికాకు చెందిన ప్రసిద్ధ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నేషనల్ అలయెన్స్ ఆన్ మెంటల్ ఇల్నెస్’ అంబాసిడర్‌గా నియమితురాలైంది. ‘అనన్య బిర్లా ఫౌండేషన్’తో సేవాకార్యక్రమా లను విస్తృతం చేసింది. సంగీతం అంటే అపారమైన అనురక్తి ఉన్న అనన్య వ్యాపారరంగంలో తొలి అడుగు వేసినప్పుడు... ‘అనన్య లోకం వేరు. ఆమె ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించడం కష్టం’ అనే గుసగుసలు వినిపించాయి. అప్పటి వరకు అనన్య పేరు పక్కన సంగీతానికి సంబంధించిన విశేషణాలు కనిపించేవి. తరువాత స్వతంత్ర మైక్రోఫిన్, ఫౌండర్ అనేది ఆమె పేరు పక్కన కనిపించడం మొదలైంది. గ్రామీణ ప్రాంతాలలో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి ‘స్వతంత్ర’ను ఏర్పాటు చేశారు. తన నాయకత్వ లక్షణాలతో ‘స్వతంత్ర’ను అగ్రగామిగా నిలిపింది అనన్య. బెస్ట్ స్టార్టప్‌లకు ఇచ్చే ‘గోల్డ్ అవార్డ్’ను గెలుచుకుంది. 2016లో గ్లోబల్ లగ్జరీ ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇకై ఏషియాకు సీయీవోగా బాధ్యతలు చేపట్టింది. ఫోర్బ్స్ ఆసియాస్ ఉమెన్ జాబితాలో అనన్య పేరు చోటు చేసుకుంది. ‘స్వతంత్ర’ వ్యవస్థాకురాలిగా అనన్య ఆఫీస్ గదికే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో పర్యటించేది. ఇండోర్‌లో ఒక పేదింటి మహిళ ‘స్వతంత్ర’ సహకారంతో ఇల్లు కట్టుకోగలిగింది. ఆమెతో మాట్లాడినప్పుడు అనన్యకు ఎంతో సంతోషంగా అనిపించింది. అనన్య అపురూప విజయాలు చూసినప్పుడు ‘ఏ పని చేసే వాళ్లు ఆ పని చేస్తే మంచిది’ ‘రెండు పడవల మీద కాలు వద్దు’ లాంటి మాటలు, సామెతలు బిత్తర పోతాయి. పనిమీద అనురక్తి, అంకితభావం ఉంటే ఒక రంగానికి చెందిన వారు మరో రంగంలో విజయం సాధించవచ్చు అని చెప్పడానికి అనన్య బిర్లాలాంటి వాళ్లు పెద్ద ఉదాహరణ. పెద్దింటి అమ్మాయి పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా కూతురు అయిన అనన్య బిర్లా బాల్యం నియమ నిబంధనలు, రక్షణ వలయాల మ«ధ్య గడిచింది. చిన్నప్పుడే అనన్యకు బాడీగార్డ్ ఉండేవాడు. మిగతా అమ్మాయిల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడానికి లేదు. ఈ రూల్స్‌తో తనకు ఊపిరి ఆడేది కాదు. ఒత్తిడికి గురయ్యేది. ఇంత ఒత్తిడిలోనూ తనదైన కలలు కనేది. ‘అసలు నేనేమిటి?’ అనే ప్రశ్నకు ఆమెకు సంగీతంలో జవాబు దొరికింది. సంగీతం తనలోని ఒంటరితనాన్ని పోగొట్టడమే కాదు ఆత్మబలాన్ని ఇచ్చింది. ‘పెద్దింటి అమ్మాయి’ అనే పేరు కంటే స్వేచ్ఛాప్రపంచాన్నే అనన్య ఇష్టపడేది. ‘పెద్ద యూనివర్శిటీలో పెద్ద చదువు చదవాలి. పెద్దింటి కుటుంబానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి... ఇలా నా గురించి అనుకునేవారు. అయితే నా ఆలోచనలు దీనికి భిన్నంగా ఉండేవి. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచేది. అయితే తల్లిదండ్రులు మాత్రం నాకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉన్నారు. నా అభిప్రాయాలకు విలువ ఇచ్చారు’ అంటుంది అనన్య. -
రూ.3.51 లక్షల కోట్లకు ఎంఎఫ్ఐ పరిశ్రమ
కోల్‌కతా: సూక్ష్మరుణ సంస్థల పోర్ట్‌ఫోలియో (రుణాల విలువ) గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 21.3 శాతం వృద్ధి చెంది రూ.3.51 లక్షల కోట్లకు చేరుకుంది. 2021–22 చివరికి సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ) నిర్వహణలోని పోర్ట్‌ఫోలియో విలువ రూ.2.89 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం రుణ ఖాతాలు ఈ పరిశ్రమలో 2022 మార్చి నాటికి 1,239 లక్షలుగా ఉంటే, 2023 మార్చి నాటికి 1,363 లక్షలకు చేరినట్టు పరిశ్రమ స్వీయ నియంత్రణ మండలి ‘సాధాన్’ ఈడీ, సీఈవో జిజి మామెన్ తెలిపారు. ఈ గణాంకాలు కరోనా ప్రభావం నుంచి పరిశ్రమ బయటపడినట్టు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమ ఇప్పుడు వృద్ధి బాటలో నడుస్తున్నట్టు చెప్పారు. నూతన నియంత్రణ నిబంధనలు సూక్ష్మ రుణ సంస్థలు సైతం మార్కెట్లో పోటీ పడే అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. ఇది ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్‌ఐల పోర్ట్‌ఫోలియోలో ప్రతిఫలిస్తోందన్నారు. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంఎఫ్ఐ రంగం మొత్తం రుణ వితరణలు రూ. 3,19,948 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంలో ఉన్న రూ.2,53,966 కోట్లతో పోలిస్తే 26 శాతం పెరిగింది. ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు రూ.1,24,063 కోట్లను పంపిణీ చేయగా, బ్యాంకు లు రూ.1,16,402 కోట్లను మంజూరు చేశాయి’’ అని మామెన్ వెల్లడించారు. రుణ ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడినట్టు చెప్పారు. -
సూక్ష్మ రుణ సంస్థల రుణాలు రూ.3.25 లక్షల కోట్లు
కోల్‌కతా: సూక్ష్మ రుణ సంస్థలకు (ఎంఎఫ్ఐ) సంబంధించి వసూలు కావాల్సిన రుణాల పోర్ట్‌ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రూ.3.25 లక్షల కోట్లకు పెరిగింది. 2022 మార్చి నాటికి ఇది రూ.2.7 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 20 శాతం పెరిగినట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ రంగం 1.32 లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు ఎంఫిన్ సీఈవో అలోక్ మిశ్రా తెలిపారు. సూక్ష్మ రుణ రంగానికి స్వీయ నియంత్రణ మండలిగా ఎంఫిన్‌కు ఆర్బీఐ గుర్తింపు ఉంది. కరోనా కారణంగా 2021, 2022లో రుణ వసూళ్ల సామర్థ్యంపై ప్రభావం పడిందని, ప్రస్తుతం వసూళ్లు 97 శాతానికి మెరుగుపడ్డాయని మిశ్రా చెప్పారు. ఇది కరోనా సమయంలో 70 శాతంగా ఉందన్నారు. ఎంఎఫ్ఐ సంస్థల పరిధిలో మొత్తం 6.2 కోట్ల మంది రుణ లబ్ధిదారులుగా ఉన్నారని.. దేశ జీడీపీకి ఎంఎఫ్ఐ రంగం 2.7 శాతం సమకూరుస్తున్నట్టు చెప్పారు. ఎంఎఫ్‌ఐల మొత్తం రుణాల్లో రూ.38,000 కోట్లు (17 శాతం) పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి ఉన్నట్టు తెలిపారు. 2022 మార్చిలో ఆర్బీఐ ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐ రంగానికి ప్రకటించిన మార్గదర్శకాలపై మిశ్రా స్పందిస్తూ.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ–ఎంఫిన్‌లు, ఎన్బీఎఫ్సీ మధ్య తగిన పోటీకి అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. ఎన్బీఎఫ్సీ–ఎంఫిన్ సంస్థలు వసూలు చేసే సగటు వడ్డీ రేటు రుణంపై ప్రస్తుతం 24 శాతంగా ఉంటుందని తెలిపారు. గతంలో ఇది 22.5 శాతమే ఉండేదంటూ, ఆర్బీఐ రెపో రేటు పెంచినందున ఎంఫిన్‌లు వసూలు చేసే వడ్డీ రేటు కూడా పెరిగినట్టు వివరించారు. ఎంఫిన్ పరిధిలో 47 సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. -
రూ.2.9 లక్షల కోట్లకు ఎంఎఫ్ఐ రుణ ఆస్తులు!
ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) పరిధిలోని రుణాల పోర్ట్‌ఫోలియో గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) 10 శాతానికి పైగా వృద్ధి చెంది రూ.2.9 లక్షల కోట్లకు చేరినట్టు క్రెడిట్ సమాచార సంస్థ ‘క్రిఫ్ హై మార్క్’ తెలిపింది. 2021 మార్చి నాటికి రుణాల పోర్ట్‌పోలియో రూ.2.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే మార్చి చివరికి స్థూల రుణాలు 8.6 శాతం పెరిగినట్టు తన తాజా నివేదికలో వివరించింది. దీని ప్రకారం.. సూక్ష్మ రుణాల్లో బ్యాంకులు 37.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు 33.3 శాతం వాటాను శాసిస్తున్నాయి. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల వాటా 17.1 శాతంగా ఉంది. 2021–22 చివరి మూడు నెలల్లో రూ.191 లక్షల రుణాలు మంజూరయ్యాయి. అంతకుముందు త్రైమాసికం గణాంకాలతో పోలిస్తే రుణ వితరణలో 15.5 శాతం వృద్ధి కనిపించింది. కానీ, 2020–21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోలిస్తే రుణాల మంజూరు 17.2 శాతం తగ్గింది. కస్టమర్ల బేస్ వార్షికంగా 1.7 శాతం, త్రైమాసికంగా 3.4 శాతం చొప్పున పెరిగింది. 2020 మార్చి నాటికి పట్టణ ప్రాంతాల్లో 5.7 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 13.5 శాతం చొప్పన వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా మొత్తం సూక్ష్మ రుణాల్లో 83.4 శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆస్తుల నాణ్యత 30 రోజులకు పైగా బకాయి ఉన్న సూక్ష్మ రుణాలు 2021 డిసెంబర్ నాటికి 9.2 శాతంగా ఉంటే, 2022 మార్చి నాటికి 6 శాతానికి తగ్గాయి. 90 రోజులకు పైగా బకాయి ఉన్న రుణ ఆస్తులు 3.7 శాతం నుంచి 2.7 శాతానికి దిగొచ్చాయి. -
స్పందన స్ఫూర్తి క్యూ2 ఫలితాలు
న్యూఢిల్లీ: మైక్రోఫైనాన్స్ కంపెనీ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్(ఎస్‌ఎస్‌ఎఫ్‌ఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసిక ఫలితాలను ఆలస్యంగా విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో లాభాలను కోల్పోయి నష్టాలలోకి ప్రవేశించింది. వెరసి రూ. 58 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2020–21) క్యూ2లో దాదాపు రూ. 67 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లోనూ కంపెనీ రూ. 54 కోట్ల నికర లాభం సాధించింది. అయితే క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం రూ. 354 కోట్ల నుంచి రూ. 396 కోట్లకు పుంజుకుంది. క్యూ1లో అందుకున్న రూ. 435 కోట్లతో పోలిస్తే ఆదాయం క్షీణించింది. అప్పటి ఎండీ, వ్యవస్థాపకురాలి రాజీనామాతో యాజమాన్యంలో చేపట్టిన మార్పుల కారణంగా క్యూ2 ఫలితాలను ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ 2021 నవంబర్ 12నే వెల్లడించింది. వెంటనే అమల్లోకి వచ్చే విధంగా కంపెనీ ఎండీ, వ్యవస్థాపకురాలు పద్మజ గంగిరెడ్డి 2021 నవంబర్ 2న రాజీనామా చేసిన విషయం విదితమే. దీంతో కంపెనీ వెనువెంటనే మేనేజ్మెంట్ కమిటీని పునర్వ్యవస్థీకరించింది. ఫలితాల విడుదల నేపథ్యంలో స్పందన స్ఫూర్తి షేరు బీఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 415 వద్ద ముగిసింది. -
సూక్ష్మ రుణాలపై కోవిడ్ –19 దెబ్బ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో సూక్ష్మ రుణ (మైక్రోఫైనాన్స్) రంగంపై కోవిడ్–19 తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జనవరి–మార్చిలో పరిశ్రమ రూ.69,719 కోట్ల రుణాలను వినియోగదార్లకు మంజూరు చేయగా.. ఏప్రిల్–జూన్‌లో ఇది రూ.6,046 కోట్లకే పరిమితమైంది. అంటే మార్చి త్రైమాసికంతో పోలిస్తే జూన్ త్రైమాసికంలో రుణాలు 91 శాతం తగ్గాయి. అలాగే 2019 జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఇది 88 శాతం తగ్గింది. సూక్ష్మ రుణ పరిశ్రమ భారత్‌లో జూన్ నాటికి రూ.2,26,600 కోట్లుగా ఉంది. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఇది 2.4 శాతం తగ్గుదల. ఆర్బీఐ నుంచి లైసెన్స్ కలిగిన క్రెడిట్ బ్యూరో అయిన సీఆర్ఐఎఫ్ హై మార్క్ మూడు నెలలకోసారి మైక్రోలెండ్ పేరుతో భారత్‌లో సూక్ష్మరుణ రంగ సమాచారాన్ని ముద్రిస్తోంది. బ్యాంకులదే పైచేయి.. మైక్రోలెండ్ నివేదిక ప్రకారం.. మొత్తం పరిశ్రమలో బ్యాంకుల వాటా అత్యధికంగా 41.62 శాతం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ–మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ వాటా 30.89 కాగా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వాటా 17.54 శాతం. ఇతరులకు 9.96 శాతముంది. ఈ సంస్థలు 2020 జనవరి– మార్చి త్రైమాసికంలో 189 లక్షల లోన్లను జారీ చేశాయి. జూన్ త్రైమాసికానికి వచ్చేసరికి 21 లక్షల లోన్లకే పరిమితమయ్యాయి. రూ.60,000 ఆపైన ఇచ్చే రుణాల్లో బ్యాంకులదే హవా. ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు రూ.30–40 వేల మధ్య ఉండే రుణాల్లో పోటీపడుతున్నాయి. 2020 జనవరి–మార్చిలో రూ.40 వేలు, ఆపైన విలువగల లోన్ల వాటా 70 శాతముంటే.. ఏప్రిల్–జూన్‌లో రూ.20 వేలలోపు విలువగల లోన్ల వాటా 60 శాతముంది. జనవరి–మార్చిలో రూ.20 వేలలోపు విలువగల లోన్ల వాటా 15 శాతమే. నిలిచిన వసూళ్లు.. ఈ ఏడాది జనవరి– మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో బ్యాంకులు ఇచ్చిన రుణాల విలువ 88 శాతం తగ్గితే, ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు విషయంలో ఇది 97 శాతం తగ్గుదల నమోదైంది. ఇక ఏప్రిల్–జూన్‌లో ఇచ్చిన రుణాల్లో విలువ పరంగా 68.77 శాతం వాటాతో బ్యాంకుల హవా కొనసాగుతోంది. ఈ విషయంలో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్‌ఐల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులే ముందున్నాయి. సగటు లోన్ విలువ ఏడాదిలో రూ.31,700 నుంచి రూ.34,200లకు ఎగసింది. రుణాల్లో రైట్ ఆఫ్ అయిన మొత్తం 1.3 శాతం నుంచి ఏకంగా 2.9 శాతానికి చేరింది. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు సమయంలోనూ పరిశ్రమ దెబ్బతిన్నదని, ఇప్పుడు కోవిడ్–19 తన ప్రతాపం చూపిస్తోందని నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో వసూళ్లతోపాటు కొత్త వ్యాపారమూ తగ్గిందని తెలిపింది. దేశ ఆర్థికాభివృద్ధితోనే పరిశ్రమ పురోగమిస్తుదని అభిప్రాయపడింది. -
మైక్రోఫైనాన్స్ రుణాల్లో 43% వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో మైక్రోఫైనాన్స్ రంగం రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 1,66,284 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 43.1 శాతం వృద్ధి నమోదు చేసింది. మైక్రోఫైనాన్స్ సంస్థల నెట్వర్క్ ఎంఎఫ్ఐఎన్ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొత్తం మైక్రోఫైనాన్స్ ఖాతాలు వార్షిక ప్రాతిపదికన 24.3 శాతం పెరిగి 8.91 కోట్లకు చేరాయి. మైక్రో ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోలో బ్యాంక్‌యేతర ఆర్థిక సంస్థల కోవకి చెందిన సూక్ష్మ రుణాల సంస్థల (ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐ) వాటా రూ. 60,631 కోట్లు(36.5%). ‘మైక్రోఫైనాన్స్ సంస్థలు జరిపే రుణాల వితరణలో సుమారు 81% లావాదేవీలు నగదు రహిత విధానంలోనివే. కొన్ని ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్‌ఐలైతే ఏకంగా 100 శాతం నగదురహిత విధానంలో రుణాల వితరణ నమోదు చేశాయి‘ అని ఎంఎఫ్ఐఎన్ సీఈవో హర్‡్ష శ్రీవాస్తవ తెలిపారు. 50 ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు అక్టోబర్–డిసెంబర్ మధ్యకాలంలో 77 లక్షల ఖాతాదారులకు రూ. 19,199 కో ట్ల రుణాలు మంజూరు చేశాయి. రూ.8,235 కోట్లు సమీకరించాయి. అత్యధికంగా ఈశాన్య రాష్ట్రాల్లో .. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్‌ఐల రుణాల పోర్ట్‌ఫోలియో అత్యధికంగా కేంద్రీకృతమై ఉంది. ఇక దక్షిణాది వాటా 25 శాతం కాగా, ఉత్తరాది 14%, పశ్చిమ రాష్ట్రాలు 15%, మధ్య భారతంలో 9%గా ఉంది. మొత్తం సూక్ష్మ రుణాల రంగంలో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్‌ఐల వాటా 36.5%, బ్యాంకులది 32.2%, చిన్న ఫైనాన్స్ బ్యాంకులది 18.2%, ఎన్‌బీఎఫ్‌సీలది 10.7%, ఎంఎఫ్‌ఐల వాటా 2.4%గా ఉంది. -
51% వృద్ధి సాధించిన సూక్ష్మరుణ రంగం
న్యూఢిల్లీ: సూక్ష్మరుణ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో ఈ పరిశ్రమ 51 శాతం వృద్ధి చెందిందని మైక్రో పైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నెట్వర్క్ (ఎమ్‌ఎఫ్‌ఐఎన్) తాజానివేదిక పేర్కొంది. ఈ క్యూ2 నాటికి ఈ రంగం స్థూల రుణ పోర్ట్‌ఫోలియో(జీఎల్పీ) రూ.1,46,741 కోట్లని ఈ నివేదిక పేర్కొంది. ఈ రుణాల్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–సూక్ష్మ రుణ సంస్థల(ఎన్బీఎఫ్సీ–ఎమ్ఎఫ్ఐ) వాటా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉందని వివరించింది. సూక్ష్మరుణ రంగం సంబంధించి ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., ∙ఈ క్యూ2 చివరి నాటికి సూక్ష్మరుణ సంబంధిత ఖాతాల సంఖ్య 27 శాతం వృద్ధితో 7.77 కోట్లకు పెరిగాయి. దీంట్లో ఎన్బీఎఫ్సీ–ఎమ్ఎఫ్ఐ వాటా 33 శాతం వృద్ధితో 3.43 కోట్ల ఖాతాలకు ఎగసింది. ∙ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి మొత్తం సూక్ష్మ రుణ రంగం రుణాల్లో ఎన్బీఎఫ్సీ–ఎమ్ఎఫ్ఐల వాటా 37 శాతం(రూ.54,018 కోట్లుగా) ఉంది. రెండో స్థానంలో బ్యాంక్‌లు నిలిచాయి. బ్యాంక్‌ల రుణాలు 33 శాతంగా (రూ.48,200 కోట్లు) ఉన్నాయి. ∙మొత్తం సూక్ష్మ రుణాల్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ల వాటా 17 శాతంగా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వాటా 12 శాతంగా ఉంది. ∙గత ఏడాది నుంచి సూక్ష్మ రుణ రంగం పోర్ట్‌ఫోలియో ఆరోగ్యకరమైన మెరుగుదలను సాధిస్తోంది. ఇది శుభసూచకం. ఇదే తీరు మరికొన్ని క్వార్టర్ల పాటు కొనసాగనున్నది. -
సూక్ష్మసేద్యం అనుమతులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూక్ష్మసేద్యానికి బ్రేక్ పడింది. రైతులు చుక్కచుక్కనూ సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి నిధులలేమి సమస్యగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క దరఖాస్తుకు కూడా ఉద్యానశాఖ అనుమతివ్వలేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రెండేళ్లుగా నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 60 శాతం చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో సూక్ష్మసేద్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రెండేళ్ల నుంచి రూ.200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. భారీ సబ్సిడీతో ప్రోత్సాహం ఇచ్చినా.. ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇస్తుంది. బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. ఎకరానికి సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ. 25–30 వేల వరకు ఖర్చు కానుంది. నాలుగు ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే రూ. లక్షకు పైగానే ఖర్చుకానుంది. అయితే ఈ సూక్ష్మసేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కపైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీంతో రైతులు సూక్ష్మసేద్యం ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. 2016–17లో కేవలం 10,550 మంది రైతులు 32,710 ఎకరాలకు దరఖాస్తు చేసుకోగా, 2017–18లో ఏకంగా 3.85 లక్షల ఎకరాలకు 1.16 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరికి సూక్ష్మసేద్యాన్ని మంజూరు చేసింది. సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం నాబార్డు నుంచి రూ. 800 కోట్లు రుణంగా తీసుకుంది. ఆ సొమ్ము అంతా కూడా గతేడాది నాటికి చెల్లింపులకు పూర్తయింది. ఇంకా రూ.200 కోట్లు కేంద్రం వాటా పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. పెండింగ్‌లో దరఖాస్తులు... ఇప్పటివరకు నిధులు పెండింగ్‌లో ఉండిపోవడం, ఈ ఏడాది బడ్జెట్లో సూక్ష్మసేద్యం పథకానికి కేటాయించిన రూ.127 కోట్లలో ఒక్క పైసా విడుదల చేయకపోవడంతో ఉద్యానశాఖ సందిగ్ధంలో పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1.20 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. నిధులు లేకపోవడంతో వాటి అనుమతులకు బ్రేక్ పడింది. తమ వాటాగా ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై తమకు కేంద్రం మెమో కూడా ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే సూక్ష్మసేద్యంలో తెలంగాణ వెనుకబడిందని కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల విడుదల చేసిన జాతీయ వ్యవసాయ గణాంక నివేదికలోనూ స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ తెలంగాణలో కేవలం 3.31 లక్షల ఎకరాల్లోనే సూక్ష్మసేద్యంతో రైతులు సాగు చేస్తున్నారని వెల్లడించింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. సూక్ష్మసేద్యం అమలుకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.800 కోట్ల రుణం తీసుకొచ్చినా పెద్దగా మార్పురాలేదన్న ఆరోపణలున్నాయి. -
పల్లె బాట పట్టండి...
♦ ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటునివ్వండి ♦ మైక్రోఫైనాన్స్ సంస్థలకు ♦ గవర్నర్ నరసింహన్ సూచన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సూక్ష్మ రుణ (మైక్రోఫైనాన్స్) సంస్థలు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటునిచ్చేలా కార్యకలాపాలు విస్తరించాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వినూత్న ఆవిష్కరణలు చేసే సామర్ధ్యం గల యువతకు కొదవలేదని.. కానీ సరైన ఆర్థిక సహకారం అందక వారి నైపుణ్యాలు మరుగున పడిపోతున్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మైక్రోఫైనాన్స్ సంస్థలు అలాంటివారికి తోడ్పాటునివ్వడంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సహకారం’ అనే అంశంపై మంగళవార మిక్కడ జరిగిన మైక్రోఫైనాన్స్ సంస్థల జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. గతంలో మైక్రోఫైనాన్స్ సంస్థలు వడ్డీ వ్యాపారుల ధోరణిలో వ్యవహరించడం వల్లే వాటిని నియంత్రించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్డినెన్స్ తేవాల్సి వచ్చిందని నరసింహన్ చెప్పారు. ఆ తర్వాత సూక్ష్మ రుణాల రంగంలో క్రమ శిక్షణ, స్వీయ నియంత్రణ వచ్చాయన్నారు. ఒకవేళ మళ్లీ పాత ధోరణులకు మళ్లితే గతంలోలాగా కఠిన చర్యలు ఎదురవక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం సాంకేతిక పురోగతి, ప్రభుత్వ మద్దతు, మొబైల్ బ్యాంకింగ్ వంటి అంశాల ఊతంతో పురోగమిస్తున్న మైక్రోఫైనాన్స్ రంగం అన్ని వర్గాలను చేరువయ్యేలా క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. 84 శాతం ఎగిసిన సూక్ష్మ రుణాలు .. రుణ పరిమితులను పెంచడం తదితర ఇటీవలి పరిణామాల నేపథ్యంలో సూక్ష్మ రుణాలు 2014-15తో పోలిస్తే 2015-16లో ఏకంగా 84 శాతం ఎగిసి రూ. 53,000 కోట్ల పైగా చేరాయని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ ప్రెసిడెంట్ సునీల్ కనోడియా తెలిపారు. చిన్న సంస్థల రుణ అవసరాలకు తోడ్పాటునిచ్చేందుకు ఆగస్టులో పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ వెల్లడించారు. ఈ సదస్సులో అసోచామ్, కన్సల్టెన్సీ సంస్థ ఈఅండ్‌వై రూపొందించిన నాలెడ్జ్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. -
సైకిళ్ల కొనుగోళ్లకు నిరుపేదలకు రుణాలివ్వాలి: హీరో సైకిల్స్
హైదరాబాద్: దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేదలు సైకిళ్లు కొనుగోలు చేయడానికి వారికి మైక్రోఫైనాన్స్ ద్వారా తగిన ఆర్థిక తోడ్పాటునందించాల్సిన అవసరం ఉందని హీరో సైకిల్స్ కో-చైర్మన్, ఎండీ పంకజ్ ముంజాల్ పేర్కొన్నారు. ఇందుకు తాము ఆర్థిక సంస్థలతో భాగస్వాములు కావడానికి సిద్ధంగా వున్నామని చెప్పారు. దేశంలోదారిద్య్రరేఖకు దిగువన 40 కోట్లమంది ప్రజలున్నారని, సైకిళ్లు వారికి అందించగలిగితే వారి జీవనానికి అవి ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రపతి 79వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో ముంజాల్ పాల్గొన్నారని హీరో సైకిల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రణబ్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి భవన్ సిబ్బందికి 50 కస్టమైజ్డ్ హీరో సైకిళ్లను బహుమతిగా ప్రదానం చేశామని పేర్కొంది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఉన్న రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయ పిల్లలకు స్కాలర్షిప్లను ముంజాల్ ప్రదానం చేశారని వివరించింది. -
అవసరానికి అప్పిచ్చేవారేరి..?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో మూడేళ్లుగా మైక్రోఫైనాన్స్ కంపెనీల కార్యకలాపాలు లేనే లేవు. కొత్త రుణాల ఊసే లేదు. పాత రుణాలైతే రూ.7,000 కోట్ల మేర పేరుకుపోయి ఉన్నాయి. వాటి వసూలు కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరి దీని ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతోంది? దీనివల్ల జరిగిందేంటి? సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్... (ఎంఎఫ్ఐఎన్) సీఈఓ అలోక్ ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే... ‘‘దీనివల్ల బాగా నష్టపోతున్నది జనమే. రుణాల అవసరం ఉన్నవాళ్లే. ఎందుకంటే ఏటా సూక్ష్మ రుణ సంస్థలిచ్చిన వేల కోట్ల రూపాయల రుణాల్ని ఇప్పుడు ఎవ్వరూ ఇవ్వటం లేదు. ఆ లోటును ఇతర రుణ సంస్థలు గానీ, ప్రభుత్వం గానీ భర్తీ చేయలేదు. దీంతో గ్రామాల్లో ప్రధానంగా రుణం కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చింది. వీటన్నిటితో పాటు సూక్ష్మ రుణాలు లభ్యం కాకపోవటం వల్ల ఆయా వర్గాల్లో వినిమయ శక్తి దాదాపు 19 శాతం పడిపోయింది. ఇది మేం చెబుతున్న మాట కాదు. ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్‌కు చెందిన ఇద్దరు చేసిన అధ్యయన ఫలితం. ఆర్బీఐ మద్దతుతో నడుస్తున్న ఈ సంస్థ అధ్యయనం రాష్ట్రంలో సూక్ష్మ రుణాలకు సంబంధించి అనేక కోణాల్ని బయటపెట్టింది’’ అని. స్వీయ నియంత్రిత సంస్థలకు (ఎస్ఆర్ఓ) ఉండాల్సిన మార్గదర్శకాలను ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నేపథ్యంలో ఎంఎఫ్ఐఎన్ కూడా ఆ కేటగిరీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికనుగుణంగా బైలాస్‌లో తగు మార్పులు చేసేందుకు మంగళవారమిక్కడ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీన్ని పురస్కరించుకుని సోమవారం అలోక్ ప్రసాద్ విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు. మిగిలిన రాష్ట్రాల్లో భేష్ ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో సూక్ష్మ రుణాలు వేగంగా పెరుగుతున్నాయని, 2012-13తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల పెరుగుదల 50-55 శాతంగా ఉందని ప్రసాద్ చెప్పారు. రికవరీ రేటు కూడా 99 శాతాన్ని మించి ఉందన్నారు. ‘‘రుణదాత-రుణగ్రహీత మధ్య సంబంధం బావుందనటానికి ఈ రీపేమెంట్ శాతమే గట్టి నిదర్శనం. మైక్రోఫైనాన్స్ బిల్లును పార్లమెంటరీ స్థాయీసంఘం అన్ని పరీక్షలూ చేసి ఓకే చేసింది. అయితే ఎన్నికల కారణంగా ఈ పార్లమెంటులో అది ఆమోదం పొందకపోవచ్చు. కానీ అన్ని పార్టీలూ దీనికి మద్దతిస్తున్నాయి’’ అని తెలియజేశారు. ఎంఎఫ్ఐలు జాతీయ వినియోగ బ్యాంకులుగా మారుతాయని నచికేత్ మోర్ కమిటీ పేర్కొందంటూ... దీన్నిబట్టి రుణ వితరణలో ఎంఎఫ్‌ఐల ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల పరిధిలో కొన్ని రుణ వసూళ్లు జరిగాయి. ఆ సందర్భంగా తెలిసిందేంటంటే రుణ గ్రహీతలు ఎంఎఫ్‌ఐల కార్యకలాపాలను గట్టిగా కోరుకుంటున్నారు’’ అని చెప్పారు. క్రెడిట్ బ్యూరోల పరిధిలో... ఆర్బీఐ నిబంధనల నేపథ్యంలో 2010 నుంచీ ఎంఎఫ్‌ఐల కార్యకలాపాలు పూర్తిగా మారిపోయాయని అలోక్ చెప్పారు. ‘‘ఎంఎఫ్ఐ రుణాలు తీసుకుంటున్న వారి వివరాలన్నిటినీ రెండు క్రెడిట్ బ్యూరోలు నమోదు చేస్తున్నాయి. ఈ వివరాలు వారానికోసారి అప్డేట్ అవుతాయి. దీనివల్ల ఒకే వ్యక్తి ఎక్కువ లోన్లు తీసుకోవటం వంటివి ఉండవు. ఆ వ్యక్తి రుణ చరిత్ర కూడా కంపెనీకి ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పటికి 12 కోట్ల రుణ రికార్డులు వీటివద్ద నమోదయ్యాయి’’ అని వివరించారు. దేశంలో సూక్ష్మ రుణాలకు ఏటా రూ.12 లక్షల కోట్ల మేర డిమాండ్ ఉందని, కానీ దీన్ని ప్రస్తుత సంస్థలు తీర్చలేకపోతున్నాయని చెప్పారు. -
ఉత్పాదకత ఉంటేనే సూక్ష్మ రుణాలు
ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు రుణాలిచ్చేటప్పుడు ఉత్పాదకతను విస్మరించాయని, వినియోగవస్తువులకు విరివిగా రుణాలివ్వటం వల్లే జనం అప్పుల ఊబిలో కూరుకుపోయారని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పురి స్పష్టం చేశారు. ఒక రుణాన్ని తీర్చడానికి మరో రుణం తీసుకోవడం వంటి చర్యల వల్ల వారు రుణ ఊబిలో కూరుకుపోయారని, తాము తొలుత ఉత్పాదకతపై ఒక స్పష్టతకు వచ్చిన తరవాతే వారికి రుణాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తమ బ్యాంకు చేపట్టిన సస్టెయినబుల్ లైవ్లీహుడ్ ఇనీషియేటివ్ (ఎస్ఎల్ఐ) కార్యక్రమం కింద ఇప్పటిదాకా 20 లక్షల మందికి రుణాలిచ్చినట్లు పురి తెలియచేశారు. ఈ సందర్భంగా రాజస్థాన్ రాజధాని జైపూర్ శివారు గ్రామం చోములో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న కోటి కుటుంబాల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టామని పురి చెప్పారు. తమ బ్యాంకుకు చక్కని ఆర్థిక మూలాలతో పాటు మంచి మనసు కూడా ఉందని ఈ కార్యక్రమం నిరూపిస్తుందని చెప్పారు. గ్రామీణ రుణాలకు సంబంధించి 2003 నుంచి వివిధ ఫార్ములాలను అనుసరిస్తూ... ఒక దశలో బిజినెస్ కరస్పాండెంట్లను కూడా నియమించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు... 2010 నుంచి ఎస్ఎల్ఐ ద్వారా వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఎస్ఎల్ఐ కింద గ్రామాలను ఎంపిక చేసుకొని అక్కడ సొంత సిబ్బందిని పంపి, వారి ద్వారా గ్రామస్తులకు ఆర్థిక సూత్రాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమంలో ఒక భాగం. తరువాత వారికి ఏయే అంశాలపై అవగాహన ఉందో తెలుసుకున్నాక, రుణంతో పాటు అవసరాన్ని బట్టి వారికి ఆయా అంశాల్లో ఉచిత శిక్షణ కూడా అందచేస్తారు. స్వయం సహాయక సంఘాలను, జాయింట్ లయబిలిటీ గ్రూపుల్ని ఏర్పాటు చేసి... ఆయా గ్రూపులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. తద్వారా వారు తీసుకున్న రుణాన్ని ఉత్పాదకత కోసం ఉపయోగించే వీలుంటుంది. ఇలా చేయటం వల్ల తగిన ఆదాయం వస్తుంది కాబట్టి తిరిగి చెల్లించడానికి వారికెలాంటి ఇబ్బందీ ఉండదని ఆదిత్యపురి చెప్పారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధుల్ని చోము దగ్గరి ఫతేపురా గ్రామానికి తీసుకెళ్లి, అక్కడ మహిళా సంఘాలు పొందుతున్న శిక్షణను, రుణ వితరణ విధానాన్ని చూపించారు. బృందాలతో ప్రత్యక్షంగా మాట్లాడించారు. రుణం తీసుకోవాలనుకుంటున్న మహిళా గ్రూపుల్ని మొదట తాము ఆర్థిక సూత్రాలపై చైతన్యవంతం చేస్తామని, సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని వాయిదా చెల్లించడంతో పాటు కొంత మొత్తాన్ని ప్రతినెలా రికరింగ్ డిపాజిట్ చేసుకునేలా తామే సేవింగ్స్, ఆర్డీ ఖాతాలన్నీ కూడా వారి పేరిట తెరుస్తామని హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ఐ విభాగ అధిపతి మనోహర రాజ్ చెప్పారు. దానివల్ల ఆయా మహిళలు కొన్నాళ్లపాటు దాచుకున్నాక అవసరమైన వస్తువులను కొనుక్కునే అవకాశం ఉంటుందని చెప్పారాయన. గ్రామంలో మహిళలతో మాట్లాడినప్పుడు తాము నెలకు రూ.4,000 నుంచి రూ.4,500 వరకు సంపాదిస్తున్నామని, దాన్లో రూ.1,300 వాయిదా చెల్లించడానికి పోగా మిగిలిన దాంట్లో కనీసం నెలకు రూ.1,000 వరకు పొదుపు చేయగలుతున్నట్లు చెప్పారు. తదనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆదిత్య పురి, భారతదేశంలో కార్పొరేట్లు, అధికాదాయం కలిగిన వ్యక్తులను మినహాయిస్తే గ్రామాల్లో ఉంటూ ఏ రుణం లభ్యమయ్యే అవకాశం లేనివారే ఎక్కువన్నారు. అత్యధిక సంఖ్యలో ఉన్న ఈ వర్గం కోసమే తాము ఎస్‌ఎల్‌ఐని ఆరంభించామని, వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఎస్ఎల్ఐ కార్యక్రమం కూడా బ్రేక్ ఈవెన్ దశకు చేరుకుంటుందని చెప్పారాయన. ప్రస్తుతం దేశంలోని 24 రాష్ట్రాల్లో 439 క్లస్టర్లలో ఎస్ఎల్ఐ సేవలు అందుతున్నట్లు చెప్పారు. 20 లక్షలమందికి రుణాలు ఇప్పటిదాకా 20 లక్షల మందికి ఎస్ఎల్ఐ పథకం కింద హెచ్డీఎఫ్సీ బ్యాంకు రుణాలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా 20 లక్షల ఖాతాదారైన చోము గ్రామానికి చెందిన సజ్నాదేవిని ఆదిత్యపురి, బ్యాంకు సీనియర్ అధికారులు అభినందించారు. తనకు ఇప్పటిదాకా బ్యాంకు అంటే తెలియదని, తొలిసారి తాను ఎస్ఎల్ఐ పథకం కింద రుణం తీసుకున్నాక దాంతో ఆవుల్ని కొనుగోలు చేశానని, ప్రస్తుతం పొదుపు కూడా చేయగలుగుతున్నానని సజ్నాదేవి చెప్పారు. రుణం తిరిగి చెల్లించడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదని, ఒకవేళ ఆవు మరణించినా దానికి బీమా ఉందని, తన కుటుంబంలోని భార్యాభర్తలిద్దరికీ కూడా బీమా సౌకర్యం కల్పించారని విలేకరులడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారామె. జైపూర్ నుంచి మంథా రమణమూర్తి -
మళ్లీ ‘మైక్రో’భూతం
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : ఎలాంటి ష్యూరిటీలు లేకుండా బ్యాంకుల కంటే సులభంగా రుణాలివ్వడంతోపాటు వారంవారం కిస్తీలు చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తామంటూ మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు మహిళలను ఆకర్షించినట్లు సమాచారం. మరోవైపు రుణం పొందేందుకు బ్యాంకుల చుట్టు తిరగాల్సిన అవసరం లేకుండా ఇళ్ల వద్దకు ఇచ్చి అడిగినంత డబ్బు ఇస్తామనడంతో పలువురు మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకునేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. సిరిసిల్లలో 2008 వరకు పలు మైక్రోఫైనాన్స్ సంస్థలు వడ్డీ వ్యాపారం సాగించాయి. మహిళా సంఘాలకు రూ.కోట్లలో రుణాలిచ్చి అప్పుల ఊబిలోకి నెట్టివేశాయి. అప్పులు చెల్లించేక, వేధింపుల భరించలేక పలువురు బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో అప్పటి వైఎస్సార్ సర్కారు మైక్రోఫైనాన్స్ రుణాలపై మారటోరియం విధించింది. సంపూర్ణ ఆర్థిక చేకూర్పు ద్వారా స్వశక్తి సంఘాలకు పావలావడ్డీ రుణాలందించి అప్పుల ఊబి నుంచి గట్టెక్కించింది. ఇటీవల బ్యాంకుల నుంచి అప్పులు పుట్టకపోవడంతో మహిళలు ఆర్థిక అవసరాల కోసం మళ్లీ మైక్రోఫైనాన్స్‌ల వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా సిరిసిల్లలో తిరిగి రంగప్రవేశం చేసేందుకు పలు సంస్థలు ఉబలాటపడుతున్నాయి. ఒక్కసారి మైక్రో ఉచ్చులో చిక్కుకుంటే పీకల్లోతు అప్పుల్లో మునిగిపోవడం ఖాయం. ఇదే జరిగితే మళ్లీ నేతన్న కుటుంబాలు ఆర్థికంగా ‘చితికి’పోయే ప్రమాదముందని గత అనుభవాలు హెచ్చరిస్తున్నాయి. ఐదేళ్ల కిందట.. 2008లో సిరిసిల్లలో వరుస ఆత్మహత్యలకు మైక్రోఫైనాన్స్ వేధింపులే కారణమని అధికారులు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేల్లో తేల్చారు. సిరిసిల్లలో స్వయంకృషి, షేర్ముల్లా, స్పందన, కృషిబేసిక్స్ వంటి మైక్రోఫైనాన్స్‌లు వేల మందికి రూ.కోట్లలో రుణాలిచ్చాయి. పదిమంది సభ్యులు గల మహిళా గ్రూపులకు ఒక్కొక్కరికి రూ.పదివేల చొప్పున రూ.లక్ష వరకు అప్పులిచ్చాయి. రుణాల వసూళ్లలోనూ అంతే కఠినంగా వ్యవహరించాయి. వారం వారం వాయిదాలు చెల్లించకుంటే సంఘ సభ్యులపై ఒత్తిళ్లు తెచ్చి బాధితుల ఇళ్ల ముందు ధర్నాలు చేయించి వారి పరువు మర్యాదలను రోడ్డుకీడ్చాయి. ఇలాంటి ఒత్తిళ్లతో మానసికవేదనకు గురై సిరిసిల్లలో అనేకమంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వరుస ఆత్మహత్యల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రుణాల వసూళ్లపై 2008లో మారటోరియం విధించారు. మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలివ్వాలందించారు. ఒక్కో మహిళకు రూ.50 వేలకు తగ్గకుండా 1400 సంఘాల్లోని 15వేల మంది మహిళలకు రూ.70 కోట్లను ఏకకాలంలో 2009 జనవరి 1న హైదరాబాద్‌లో అందించారు. దీంతో మైక్రోఫైనాన్స్‌ల ఆగడాలు ఆగిపోయాయి. ఆదర్శ సిరిసిల్లకు అందని వడ్డీమాఫీ రుణాలు తిరిగి చెల్లించడంతో సిరిసిల్ల మహిళా సంఘాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ వారికి వడ్డీమాఫీ మాత్రం మంజూరు కావడం లేదు. గతంలో పావలావడ్డీ మంజూరు కాగా, జీరో వడ్డీ అమలుకు సర్కారు బడ్జెట్ విడుదల చేయడం లేదు. సిరిసిల్లలో 1636 సంఘాలు ఉండగా, ఇందులో 20,926 మంది సభ్యులున్నారు. వీరికి రూ.105.43 కోట్లు రుణాలివ్వగా, జీరోవడ్డీగా రూ.7 కోట్లు ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. జీరో వడ్డీ రాకపోవడంతో మహిళా సంఘాల నిర్వహణ భారంగా మారింది. అప్పులు తీసుకున్న మహిళలు వడ్డీతో సహా చెల్లిస్తుండగా, సంఘాల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. బ్యాంకు రుణం అన్న పేరేగాని వడ్డీ రాయితీ లేక నెలనెలా వాయిదాలు చెల్లించలేకపోతున్నామని పలువురు మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వం జీరో వడ్డీ అమలు చేసి తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేస్తే మహిళా సంఘాలకు భరోసా ఇచ్చినట్లవుతుంది. మహిళా బ్యాంకు జాడేదీ? సిరిసిల్లలో స్వశక్తి సంఘాలకు ప్రత్యేకంగా మహిళా బ్యాంకును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన బుట్టదాఖలవుతోంది. ఇప్పటికే స్త్రీనిధి పరస్పర సహకార బ్యాంకు ద్వారా రూ.3.33 కోట్లు సిరిసిల్లకు మంజూరు కాగా, ఆ డబ్బును ఎప్పట్లాగే స్లమ్ సమాఖ్యలకు పంపిణీ చేశారు. మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేస్తే రుణాల మంజూరు, రికవరీ సులభవుతుందని ప్రతిపాదనలు పంపగా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. బ్యాంకు రుణాల మంజూరులో జాప్యం కారణంగానే మైక్రోఫైనాన్స్లకు మళ్లీ అవకాశం ఇచ్చినట్లవుతుందని కొందరు మహిళలు పేర్కొంటున్నారు. పట్టణంలో మళ్లీ మైక్రో భూతం చొరబడకుండా చూడాల్సిన బాధ్యత పట్టణ పేదరిక నిర్మూలన సంస్థపై ఉంది. రుణాల్లో జాప్యం లేదు - ఎం.రాజేశం, మెప్మా పీఆర్పీ సిరిసిల్లలో రుణాల మంజూరులో ఎలాంటి జాప్యం లేదు. ఇటీవలే స్త్రీనిధి మంజూరైంది. 335 సంఘాలకు రూ.3.33 కోట్లు వచ్చాయి. కమ్యూనిటీ ఫండ్‌గా రూ.9 లక్షలు వచ్చాయి. ఎప్పటికప్పుడు మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. మైక్రోఫైనాన్స్ మాయలో పడొద్దు. రుణాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి.