హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో సూక్ష్మ రుణ (మైక్రోఫైనాన్స్) రంగంపై కోవిడ్–19 తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జనవరి–మార్చిలో పరిశ్రమ రూ.69,719 కోట్ల రుణాలను వినియోగదార్లకు మంజూరు చేయగా.. ఏప్రిల్–జూన్‌లో ఇది రూ.6,046 కోట్లకే పరిమితమైంది. అంటే మార్చి త్రైమాసికంతో పోలిస్తే జూన్ త్రైమాసికంలో రుణాలు 91 శాతం తగ్గాయి. అలాగే 2019 జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఇది 88 శాతం తగ్గింది. సూక్ష్మ రుణ పరిశ్రమ భారత్‌లో జూన్ నాటికి రూ.2,26,600 కోట్లుగా ఉంది. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఇది 2.4 శాతం తగ్గుదల. ఆర్‌బీఐ నుంచి లైసెన్స్ కలిగిన క్రెడిట్ బ్యూరో అయిన సీఆర్‌ఐఎఫ్ హై మార్క్ మూడు నెలలకోసారి మైక్రోలెండ్ పేరుతో భారత్‌లో సూక్ష్మరుణ రంగ సమాచారాన్ని ముద్రిస్తోంది.
బ్యాంకులదే పైచేయి..
మైక్రోలెండ్ నివేదిక ప్రకారం.. మొత్తం పరిశ్రమలో బ్యాంకుల వాటా అత్యధికంగా 41.62 శాతం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ–మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ వాటా 30.89 కాగా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వాటా 17.54 శాతం. ఇతరులకు 9.96 శాతముంది. ఈ సంస్థలు 2020 జనవరి– మార్చి త్రైమాసికంలో 189 లక్షల లోన్లను జారీ చేశాయి. జూన్ త్రైమాసికానికి వచ్చేసరికి 21 లక్షల లోన్లకే పరిమితమయ్యాయి. రూ.60,000 ఆపైన ఇచ్చే రుణాల్లో బ్యాంకులదే హవా. ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐలు రూ.30–40 వేల మధ్య ఉండే రుణాల్లో పోటీపడుతున్నాయి. 2020 జనవరి–మార్చిలో రూ.40 వేలు, ఆపైన విలువగల లోన్ల వాటా 70 శాతముంటే.. ఏప్రిల్–జూన్‌లో రూ.20 వేలలోపు విలువగల లోన్ల వాటా 60 శాతముంది. జనవరి–మార్చిలో రూ.20 వేలలోపు విలువగల లోన్ల వాటా 15 శాతమే.
నిలిచిన వసూళ్లు..
ఈ ఏడాది జనవరి– మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో బ్యాంకులు ఇచ్చిన రుణాల విలువ 88 శాతం తగ్గితే, ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐలు విషయంలో ఇది 97 శాతం తగ్గుదల నమోదైంది. ఇక ఏప్రిల్–జూన్‌లో ఇచ్చిన రుణాల్లో విలువ పరంగా 68.77 శాతం వాటాతో బ్యాంకుల హవా కొనసాగుతోంది. ఈ విషయంలో ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులే ముందున్నాయి. సగటు లోన్ విలువ ఏడాదిలో రూ.31,700 నుంచి రూ.34,200లకు ఎగసింది. రుణాల్లో రైట్ ఆఫ్ అయిన మొత్తం 1.3 శాతం నుంచి ఏకంగా 2.9 శాతానికి చేరింది. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు సమయంలోనూ పరిశ్రమ దెబ్బతిన్నదని, ఇప్పుడు కోవిడ్–19 తన ప్రతాపం చూపిస్తోందని నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో వసూళ్లతోపాటు కొత్త వ్యాపారమూ తగ్గిందని తెలిపింది. దేశ ఆర్థికాభివృద్ధితోనే పరిశ్రమ పురోగమిస్తుదని అభిప్రాయపడింది.
సూక్ష్మ రుణాలపై కోవిడ్ –19 దెబ్బ
Published Sat, Oct 10 2020 6:13 AM | Last Updated on Sat, Oct 10 2020 6:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment