
న్యూఢిల్లీ: దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉండడం, కొన్ని ఆహార ఉత్పత్తులు మినహా దాదాపు అన్ని విభాగాల్లో అసలు వినియోగ డిమాండ్ లేకపోవడం వంటి అంశాలతో మేలో హోల్‌సేల్ మార్కెట్ క్షీణతలోకి జారింది. ఇందుకు సంబంధించిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 3.21% క్షీణించింది (2019 మే నెలలో ఈ బాస్కెట్ ధర మొత్తంతో పోల్చి). దీన్ని ప్రతి ద్రవ్యోల్బణం అంటారు. వ్యవస్థలో అసలు వినియోగ డిమాండ్‌లేని పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. నాలుగున్నర సంవత్సరాల్లో ఇలాంటి స్థితి ఆర్థిక వ్యవస్థలో ఎన్నడూ నెలకొనలేదు. సూచీలోని మూడు ప్రధాన విభాగాలకు సంబంధించి వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాలను చూస్తే..
► ప్రైమరీ ఆర్టికల్స్: ఆహార, ఆహారేతర విభాగాలతో కూడిన ఈ సెక్టార్‌లో –2.92 శాతం ప్రతి ద్రవ్యోల్బణం నమోదయ్యింది. అయితే ఇందులో 1.13% ఆహార ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఆహారేతర విభాగం విషయంలో మా త్రం మైనస్ 3.53% ప్రతి ద్రవ్యోల్బణం ఉంది.
► ఫ్యూయెల్ అండ్ పవర్: ఈ విభాగంలో ఏకంగా ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 19.83%గా ఉంది.
► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న ఈ తయారీ రంగంలో మైనస్ 0.42 శాతం ప్రతి ద్రవ్యోల్బణం నమోదయ్యింది.
ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే...
మొత్తం సూచీలో 1.13% ద్రవ్యోల్బణం నమోదయితే, పప్పు దినుసుల ధరలు 11.91% (2019 మేతో పోల్చి) ఎగశాయి. ఆలూ ధరలు 52.25 శాతం ఎగశాయి. అయితే కూరగాయలు మొత్తంగా ధరల రేటు మైనస్12.48% తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment