WPI
-
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2023–24 ఆర్థిక సంవత్సరంలో (2022–23తో పోల్చి) 5.8 శాతం పురోగమించింది. మార్చిలో 4.9 శాతంగా నమోదైంది. 2023 ఫిబ్రవరి (5.6 శాతం) కన్నా మార్చితో స్పీడ్ తగ్గినప్పటికీ, 2023 మార్చి కన్నా (1.9 శాతం) పురోగమించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే వృద్ధి స్వల్పంగా 5.2 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది. భారత్ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక్క తయారీ రంగం వాటా దాదాపు 70 శాతం. రంగాల వారీగా..(శాతాల్లో) విభాగం 2024 2023 మార్చి మార్చి తయారీ 5.2 1.5 మైనింగ్ 1.2 6.8 విద్యుత్ ఉత్పత్తి 8.6 – 1.6 క్యాపిటల్ గూడ్స్ 6.1 10 కన్జూమర్ డ్యూరబుల్స్ 9.5 – 8.0 కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ 4.9 –1.9 ఇన్ఫ్రా/నిర్మాణం 6.9 7.2 ప్రైమరీ గూడ్స్ 2.5 3.3 ఇంటరీ్మడియట్ గూడ్స్ 5.1 1.8 -
టోకు ధరలు కూల్.. కూల్!
న్యూఢిల్లీ: దేశ ఎకానమీకి ధరల తగ్గుదల ఊరటనిస్తోంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంకెల దిగువ బాటలోనే టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా నడిచాయి. డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం కేవలం 4.95 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన 22 నెలల కాలంలో (2021 ఫిబ్రవరిలో 4.83 శాతం) ఇంత తక్కువ స్థాయి గణాంకాల నమోదు ఇదే తొలిసారి. ఫుడ్ ఆర్టికల్స్ ప్రత్యేకించి కూరగాయలు, ఆయిల్‌సీడ్స్ ధరలు తగ్గడం మొత్తం టోకు ద్రవ్యోల్బణం గణాంకల తగ్గుదలకు కారణం. 2022 సెప్టెంబర్ వరకు వరుసగా 18 నెలలు టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైన కొనసాగింది. అక్టోబర్ నుంచి గడచిన మూడు నెలల్లో రెండంకెల దిగువకు చేరింది. డిసెంబర్లో ఫుడ్ బాస్కెట్ ధర తగ్గడం మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. నవంబర్‌లో 5.88 శాతంగా నమోదుకాగా, డిసెంబర్లో మరింత తగ్గి 5.72%కి (2021 డిసెంబర్‌తో పోల్చి) చేరడం ఎకానమీకి ఊరటనిచ్చింది. చదవండి: సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్! -
చుక్కలు చూపిస్తున్న హోల్ సేల్ ధరలు
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ ఆగస్టులో 11.39 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే ఈ బాస్కెట్ ఉత్పత్తుల ధర 11.39 శాతం పెరిగిందన్నమాట. సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ధరలుసహా అన్ని విభాగాల్లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఒక్క ఆహార ఉత్పత్తుల విభాగం మాత్రం ఊరటనిస్తోంది. వరుసగా ఐదు నెలల నుంచీ టోకు ద్రవ్యోల్బణం రెండంకెల్లో కొనసాగుతోంది. ముఖ్య విభాగాలు ఇలా... ♦ఆహార ఉత్పత్తుల ధరలు వరుసగా నాల్గవ నెలా తగ్గాయి. ఆగస్టులో అసలు పెరక్కపోగా 1.29 శాతం దిగివచ్చాయి. అయితే ఉల్లి (62.78 శాతం), పప్పు దినుసుల (9.41 శాతం) ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కూరగాయల ధరలు 13.30 శాతం తగ్గాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీ రేటు రెపోకు (ప్రస్తుతం 4 శాతం) ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో పూర్తి అదుపులోకి (5.3 శాతం) వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం ఈ శ్రేణి 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలి. ♦క్రూడ్, పెట్రోలియం, సహజవాయువుల ధరలు 40.03 శాతం ఎగశాయి. ఫ్యూయల్, పవర్ విషయంలో ద్రవ్యోల్బణం 26.1 శాతంగా ఉంది. ఎల్పీజీ (48.1 శాతం), పెట్రోల్ (61.5 శాతం), డీజిల్ (50.7 శాతం) ధరలు భారీగా ఎగశాయి. ♦తయారీ ఉత్పత్తుల ధరలు 11.39% పెరిగాయి. జూలైలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 11.20%గా ఉంది. వరుసగా నాలుగు నెలల నుంచీ తయారీలో ధరల స్పీడ్ రెండు అంకెలపైన కొనసాగుతోంది. -
హోల్‌సేల్ మార్కెట్ కుదేలు
న్యూఢిల్లీ: దేశం మొత్తం లాక్డౌన్లో ఉండడం, కొన్ని ఆహార ఉత్పత్తులు మినహా దాదాపు అన్ని విభాగాల్లో అసలు వినియోగ డిమాండ్ లేకపోవడం వంటి అంశాలతో మేలో హోల్‌సేల్ మార్కెట్ క్షీణతలోకి జారింది. ఇందుకు సంబంధించిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 3.21% క్షీణించింది (2019 మే నెలలో ఈ బాస్కెట్ ధర మొత్తంతో పోల్చి). దీన్ని ప్రతి ద్రవ్యోల్బణం అంటారు. వ్యవస్థలో అసలు వినియోగ డిమాండ్‌లేని పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. నాలుగున్నర సంవత్సరాల్లో ఇలాంటి స్థితి ఆర్థిక వ్యవస్థలో ఎన్నడూ నెలకొనలేదు. సూచీలోని మూడు ప్రధాన విభాగాలకు సంబంధించి వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాలను చూస్తే.. ► ప్రైమరీ ఆర్టికల్స్: ఆహార, ఆహారేతర విభాగాలతో కూడిన ఈ సెక్టార్లో –2.92 శాతం ప్రతి ద్రవ్యోల్బణం నమోదయ్యింది. అయితే ఇందులో 1.13% ఆహార ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఆహారేతర విభాగం విషయంలో మా త్రం మైనస్ 3.53% ప్రతి ద్రవ్యోల్బణం ఉంది. ► ఫ్యూయెల్ అండ్ పవర్: ఈ విభాగంలో ఏకంగా ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 19.83%గా ఉంది. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న ఈ తయారీ రంగంలో మైనస్ 0.42 శాతం ప్రతి ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే... మొత్తం సూచీలో 1.13% ద్రవ్యోల్బణం నమోదయితే, పప్పు దినుసుల ధరలు 11.91% (2019 మేతో పోల్చి) ఎగశాయి. ఆలూ ధరలు 52.25 శాతం ఎగశాయి. అయితే కూరగాయలు మొత్తంగా ధరల రేటు మైనస్12.48% తగ్గింది. -
ఉల్లి, ఆలూ ధరలు ప్రియం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి గణాంకాలు ఒకవైపు ఆహార ధరల తీవ్రతను, మరోవైపు కీలక తయారీ రంగంలో మందగమనాన్ని సూచించాయి. 2020 జనవరిలో సూచీ రేటు మొత్తంగా 3.1 శాతంగా నమోదయితే, ఒక్క తయారీ రంగంలో ధరల పెరుగుదల రేటు 0.34 శాతంగా ఉంది. కాగా 2019 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.76 శాతం. ఇక 2019 ఏప్రిల్‌లో 3.18 శాతం టోకు ద్రవ్యోల్బణం నమోదయిన తర్వాత, మళ్లీ ఆ స్థాయి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. శుక్రవారం విడుదలైన ఈ గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 10.01 శాతంగా ఉంది. అంటే 2019 జనవరితో (అప్పట్లో 3 శాతం) పోల్చితే ఈ బాస్కెట్ మొత్తం ధర 10.01 శాతం పెరిగిందన్నమాట. ఇక ఇందులో ఒకటైన ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ధర 2.41 శాతం (2019 జనవరిలో) నుంచి 11.51 శాతానికి పెరిగింది. సామాన్యునిపై నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని ఈ రేటు సూచిస్తోంది. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు 2.32% నుంచి 7.05 శాతానికి ఎగసింది. ♦ ఫ్యూయల్ అండ్ పవర్: మొత్తం సూచీలో దాదాపు 13 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 1.85 శాతం నుంచి 3.42 శాతానికి పెరిగింది. ♦ తయారీ ఉత్పత్తులు: ఐఐపీలో దాదాపు 64 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగ ఉత్పత్తుల్లో ద్రవ్యోల్బణం రేటు 2.79 శాతం నుంచి 0.34 శాతానికి దిగింది. ఆర్థిక వ్యవస్థలో మందగమన ధోరణిని సూచిస్తున్న అంశమిది. కూరగాయల ధరలు 53 శాతం అప్... కూరగాయల ధరలు భారీగా 52.72 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 293 శాతం ఎగశాయి. ఆలూ ధరలు 87.84 శాతం ఎగశాయి. ఈ వారం మొదట్లో వెలువడిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణ 6 సంవత్సరాల గరిష్టస్థాయిలో 7.59 శాతంగా నమోదవడం తెలిసిందే. -
టోకు ద్రవ్యోల్బణానికి ఉల్లి సెగ
న్యూఢిల్లీ: ఉల్లి, బంగాళదుంప తదితర కూరగాయల ధరలు భారీగా పెరగడంతో డిసెంబర్లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసింది. 2.59 శాతంగా నమోదైంది. నవంబర్‌లో ఇది 0.58 శాతంగా ఉండగా, 2018 డిసెంబర్లో 3.46 శాతంగా నమోదైంది. 2019 ఏప్రిల్‌లో 3.24 శాతం తర్వాత మళ్లీ ఆ స్థాయి నమోదు కావడం డిసెంబర్లోనే కావడం గమనార్హం. డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం అయిదున్నరేళ్ల గరిష్టమైన 7.35 శాతంగా ఉన్న నేపథ్యంలో తాజాగా డబ్ల్యూపీఐ కూడా ఎగియడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక సలహాదారు కార్యాలయం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం .. ఆహారపదార్థాల విభాగంలో కూరగాయల ధరలు అత్యధికంగా 69.69 శాతం ఎగిశాయి. ఉల్లి, బంగాళదుంప రేట్లే ఇందుకు కారణం. ఉల్లి రేటు 456 శాతం పెరగ్గా, బంగాళదుంప ధర 45 శాతం పెరిగింది. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని ఇటీవలి దాకా ఉల్లి రేటు చాలా ప్రాంతాల్లో రూ. 100 పైగా పలికిన సంగతి తెలిసిందే. తాజాగా దిగుమతులతో పాటు కొత్త పంట కూడా చేతికి రావడంతో క్రమంగా ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆహార పదార్థాల ధరల పెరుగుదల నవంబర్‌లో 11 శాతంగా ఉండగా, డిసెంబర్లో 13.12 శాతంగా ఉంది. ఆహారేతర ఉత్పత్తుల ద్రవ్యోల్బణం నవంబర్‌లో నమోదైన 1.93 శాతంతో పోలిస్తే సుమారు నాలుగు రెట్లు పెరిగి 7.72 శాతంగా నమోదయ్యాయి. -
అన్నీ మంచి శకునాలే..!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరంగా మారిన రెండు కీలక అంశాలకు సంబంధించి గతవారంలో ఒకేసారి సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా–చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదరడం, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేందుకు మార్గం సుగమం కావడం వంటి అనుకూల అంశాలతో గత వారాంతాన దేశీ స్టాక్ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. అమెరికా దిగుమతి చేసుకుంటున్న చైనా ఉత్పత్తుల విషయంలో తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. వాణిజ్య, ఆర్థిక అంశాల పరంగా మొదటి దశ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఈ సానుకూల అంశం నేపథ్యంలో దేశీ మార్కెట్ మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. ట్రేడ్ డీల్ ఒక కొలిక్కి రావడం, బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడం వంటి మార్కెట్ ప్రభావిత అంశాలు బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ తెలిపారు. నిఫ్టీకి 12,200 – 12,250 స్థాయిలో ప్రధాన నిరోధం ఎదురుకావచ్చని అంచనా వేశారు. ఇక తాజా పరిణామాలు మార్కెట్‌కు సానుకూలంగా ఉన్నందున ర్యాలీకి ఆస్కారం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈవారంలోనే.. పరోక్ష పన్నుల విధానంలో ఆదాయాన్ని పెంచేందుకు ఈవారంలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం కానుంది. బుధవారం జరిగే 38వ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వాల నష్టపరిహారం అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా మినహాయింపు అంశాలపై సమీక్ష, రేట్లలో మార్పులు ఉండేందుకు ఆస్కారం ఉందని ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. వీటికి ప్రభావితం అయ్యే రంగాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఆర్బీఐ మినిట్స్ వెల్లడి..: ఈ నెల మొదటి వారంలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశ మినిట్స్‌ను ఆర్బీఐ బుధవారం విడుదల చేయనుంది. ఇక నవంబర్ నెల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సోమవారం వెల్లడికానుంది. -
టోకు ధరలు దిగొచ్చాయ్!
సాక్షి, న్యూఢిల్లీ : టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో కేవలం 1.08 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూలైతో పోల్చితే 2019 జూలైలో సూచీలోని వస్తువుల బాస్కెట్ మొత్తం ధర కేవలం 1.08 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 25 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో (2017జూన్‌లో 0.9 శాతం) టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార వస్తువుల ధరలు అదుపులోఉండడం దీనికి ప్రధాన కారణం. గత ఏడాది జూన్‌లో టోకు ద్రవ్యోల్బణం 5.27 శాతం అయితే, ఈ ఏడాది జూన్‌లో ఈ రేటు 2.02 శాతంగా ఉంది. -
టోకు ధరలూ దిగి వచ్చాయ్!
న్యూఢిల్లీ: రిటైల్ ధరల తరహాలోనే టోకు ధరల స్పీడ్ కూడా జనవరిలో తగ్గింది. గురువారం కేంద్రం విడుదల చేసిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 2.76 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జనవరితో (ఆ నెల్లో 3.02 శాతం) పోలిస్తే టోకు వస్తువుల బాస్కెట్ ధర 2019 జనవరిలో కేవలం 2.76 శాతమే పెరిగింది. పది నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఇప్పటికే విడుదలైన గణాంకాల ప్రకారం, జనవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్ట స్థాయిని నమోదుచేసి, కేవలం 2.05 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజా గణాంకాలను విశ్లేషిస్తే ఆహారం, ఇంధనం, విద్యుత్ రంగాల్లో ధరల స్పీడ్ తగ్గడం మొత్తం సూచీపై ప్రభావం చూపింది. ముఖ్యాంశాలు చూస్తే... ∙ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 2.96 శాతం (2018 జనవరి) నుంచి 2.61 శాతానికి తగ్గింది. ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 4.73 శాతం నుంచి 1.85 శాతానికి తగ్గింది. నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో మాత్రం జనవరి 2019లో ధరల పెరుగుదల రేటు 4.06 శాతంగా ఉంది. 2018 జనవరిలో – 1.31 శాతంగా ఉంది. కాగా డిసెంబర్లో టోకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ 8.38 శాతంగా ఉంది. ∙ఫ్యూయెల్ అండ్ పవర్: ఈ రంగంలో రేటు 3.15 శాతం నుంచి 2.34 శాతానికి తగ్గింది. ∙తయారీ: సూచీలో దాదాపు 60 శాతంగా ఉన్న ఈ విభాగంలో మాత్రం ద్రవ్యోల్బణం 2.53 శాతం నుంచి 3.54 శాతానికి పెరిగింది. -
టోకు ధరల మంట
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5.28 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 అక్టోబర్‌తో పోల్చితే 2018 అక్టోబర్‌లో టోకున ధరలు 5.28 శాతం పెరిగాయన్నమాట. టోకు ధరలు ఈ స్థాయిలో నమోదుకావడం వరుసగా ఇది నాల్గవనెల. 2017 సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 5.13 శాతంకాగా, గత ఏడాది అక్టోబర్‌లో 3.68 శాతంగా ఉంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాలను చూస్తే.... ►టోకున ఆహార ఉత్పత్తుల ధరలు అక్టోబర్‌లో అసలు పెరక్కపోగా 1.49 శాతం తగ్గాయి. కూరగాయల ధరలు 18.65 శాతం తగ్గాయి. సెప్టెంబర్ నెలలో ఈ తగ్గుదల 3.83 శాతం. అయితే ఆలూ ధరలు భారీగా 93.65 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 31.69 శాతం తగ్గగా, పప్పు దినుసుల ధరలూ 13.92 శాతం తగ్గాయి. ►ఇంధనం, విద్యుత్ బాస్కెట్లో ధరల పెరుగుదల రేటు 18.44 శాతంగా ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 19.85 శాతం, 23.91 శాతం చొప్పున పెరిగాయి. -
టోకు ధరలూ దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణంతోపాటు ఫిబ్రవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణమూ ఊరట నిచ్చింది. ఈ రేటు ఫిబ్రవరిలో 2.48 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 ఫిబ్రవరితో పోల్చితే 2018 ఫిబ్రవరిలో టోకు వస్తువుల బాస్కెట్ ధర 2.48 శాతమే పెరిగిందన్నమాట. (2017లో టోకు ద్రవ్యోల్బణం 5.51 శాతం) ఏడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. కూరగాయలుసహా ఫుడ్ ఆర్టికల్స్ బాస్కెట్ ధరలు ఫిబ్రవరిలో తగ్గడం సానుకూలం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.44 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన టోకు ద్రవ్యోల్బణ సూచీలో ప్రధాన మూడు విభాగాలనూ చూస్తే... ►ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 4.01 శాతం నుంచి 0.79 శాతానికి తగ్గింది. ►ఇందులో ఫుడ్ ఆర్టికల్స్ రేటు 2.55 శాతం నుంచి 0.88 శాతానికి తగ్గింది. జనవరిలో ఈ రేటు 3 శాతంగా ఉంది. ఒక్క కూరగాయలు ధరలు చూస్తే, జనవరిలో ధరల పెరుగుదల రేటు 40.77 శాతం ఉంటే, ఫిబ్రవరిలో ఈ రేటు 15.26 శాతానికి పడింది. పప్పు దినుసుల ధరలు పెరక్కపోగా 24.51 శాతం తగ్గాయి. ►ఇక నాన్–ఫుడ్ ఆర్టికల్స్ రేటు అసలు పెరక్కపోగా –2.66 శాతం తగ్గింది. 2017 ఫిబ్రవరిలో ఈ రేటు 4.65 శాతం. ►ఫ్యూయెల్ అండ్ పవర్: ద్రవ్యోల్బణం రేటు 25.17 శాతం నుంచి 3.81 శాతానికి తగ్గింది. ► తయారీ: ఈ విభాగంలో రేటు 3.23 శాతం నుంచి 3.04 శాతానికి తగ్గింది. -
జనవరిలో టోకు ధరల ఉపశమనం!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2018 జనవరిలో 2.84 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 జనవరితో పోల్చితే 2018 జనవరిలో టోకు ధరలు 2.84 శాతం పెరిగాయన్నమాట. గడచిన ఆరు నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే కూరగాయల ధరలు మాత్రం టోకున సామాన్యునికి భారంగానే ఉన్నాయి. కాగా 2017 డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం 3.58 శాతం అయితే, జనవరిలో ఈ రేటు 4.26 శాతంగా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... మూడు ప్రధాన విభాగాలూ వేర్వేరుగా... ♦ ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 2.37 శాతంగా ఉంది. ఇందులో ఫుడ్ ఆర్టికల్స్‌కు సంబంధించి ఈ రేటు 3 శాతంగా ఉంటే, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌లో మాత్రం ధరలు అసలు పెరక్కపోగా –1.23 శాతం తగ్గాయి. ♦ ఫ్యూయెల్ అండ్ పవర్: ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 4.08 శాతంగా ఉంది. ♦ తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం ఉన్న ఈ విభాగంలో రేటు 2.78 శాతంగా ఉంది. ఉల్లి ధర... కన్నీరు! డిసెంబర్ 2017లో 4.72 శాతంగా ఉన్న ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు జనవరిలో 3 శాతానికి తగ్గింది. కూరగాయల ధరలు 56.46 శాతం (డిసెంబర్) నుంచి 40.77 శాతానికి తగ్గినా, ఇదీ సామాన్యునికి భారంగానే ఉంటుందన్నది గమనార్హం. ఇక ఉల్లి ధర జనవరిలో ఏకంగా 194 శాతం పెరిగింది. పప్పు దినుసుల ధరలు 30.43 శాతం తగ్గాయి. గోధుమల ధరలు 6.94 శాతం తగ్గగా, తృణ ధాన్యాల ధరలు 1.98 శాతం తగ్గాయి. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 0.37 శాతం తగ్గితే, పండ్ల ధరలు 8 శాతం పైగా పెరిగాయి. ఈ వారం ప్రారంభంలో ప్రభుత్వం విడుదల చేసిన జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం 5.07 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. -
ఆందోళనకరంగా టోకు ధరల సూచి
సాక్షి, ముంబై: ఆగస్ట్ నెల ద్రవ్యోల్బణం మరోసారి ఆందోళనకరస్థాయిలో రికార్డయింది. గురువారం వెల్లడైన గణాంకాలు ప్రకారం ఆగస్టు నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ)3. 24 శాతం నమోదైంది. జూలైతో పోల్చితే భారీగా పెరిగి 3.24 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం, ఇంధన ఉత్పత్తుల ధరలు పెరగడంతో నాలుగు నెలల గరిష్టాన్ని తాకింది. ఆహార ద్రవ్యోల్బణం 5.75గా నమోదైంది. మరోవైపు టోకుధరల సూచి (డబ్ల్యుపీఐ) గణాంకాలు, చమురు ద్రవ్యోల్బణం.. ఆహార ద్రవ్యోల్బణం గణాంకాలు నిరుత్సాహకరంగా వెలువడటంతో బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో లాభాలతో జోష్‌గా ఉన్న మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ తదితర ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో 32,218 దగ్గర ఉండగా.. నిఫ్టీ 3పాయింట్ల నష్టంతో 10076 వద్ద కొనసాగుతున్నాయి. ట్రేడవుతోంది. -
టమాటా దెబ్బ: డబ్ల్యుపీఐ 1.88శాతం
న్యూఢిల్లీ: జూలై నెలకు సంబంధించి టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ) ఆందోళనకరంగా నమోదైంది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం ఇది 1.88శాతంగా నిలిచింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2011-12 సంవత్సరానికి సవరించిన బేస్ ఇయర్‌తో టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) జులై 2017 నాటికి 0.88 శాతం నుంచి 1.88 శాతానికి పెరిగింది.ఆహార ధరలు బాగా ప్రియంకావడంతో టోకు ధరల సూచీ కూడా భారీగా పెరిగింది. జూన్ నెలలో ఇది. 0.9శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 2.15 శాతానికి ఎగిసింది. గత నెలలో-3.4 శాతంగా ఉంది. ఫుడ్ ఇండెక్స్ మంత్ ఆన్‌మంత్ 6.2 శాతానికి ఎగిసింది. ఆ హారేతర వస్తువుల ద్రవ్బోల్బణం-6.32శాతంగా. గత నెలలో ఇది 5.15 శాతం. కూరగాయల ద్రవ్యోల్బణం భారీగా ఎగిసింది. 21.95 శాతంతో ఆందోళనకర నెంబర్స్‌ను రికార్డ్ చేసింది. గత నెల ఇది 21.16 శాతంగా నమోదైంది. ప్రధానంగా టమాటా ధరలు దీన్ని ప్రభావితం చేసినట్టు ఎనలిస్టుల అంచనా. ఫ్యూయల్ అండ్ పవర్ 4.37 శాతంగా నిలిచింది. ఫుడ్ ఇండెక్స్ ఆధారంగా ప్రైమరీ ఆర్టికల్ గ్రూపు , ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణ రేటు జూలై నెలలో 1.25 శాతం నుంచి 2.12 శాతానికి పెరిగింది. దీంతో వచ్చే ఆర్బీఐ రివ్యూలో వడ్డీ రేట్లకోత తప్పదనే అంచనాలను మార్కెట్ వర్గాలు వ్యక్తం చేశాయి. -
తగ్గిన డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం
♦ జూన్‌లో 0.90 శాతానికి డౌన్ ♦ ఇది ఎనిమిది నెలల కనిష్టం న్యూఢిల్లీ: కూరగాయలు సహా ఇతర ఆహారపదార్థాల రేట్ల తగ్గుదలతో జూన్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం 0.90 శాతానికి క్షీణించింది. బేస్ ఇయర్‌ను 2011–12కి మార్చిన తర్వాత నుంచి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇది 8 నెలల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2016 నవంబర్‌లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 1.82 శాతంగా నమోదైంది. ఇది ఈ ఏడాది మే లో 2.17 శాతంగాను, గతేడాది జూన్‌లో మైనస్ 0.09 శాతంగానూ నమోదైంది. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రికార్డు కనిష్ట స్థాయి 1.54 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం తగ్గుదలతో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించాలంటూ పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం .. ♦ ఆహారపదార్థాల ధరలు వార్షిక ప్రాతిపదికన 3.47 శాతం క్షీణించాయి. కూరగాయల ధరల ద్రవ్యోల్బ ణం మైనస్ 21.16 శాతంగా నమోదైంది. ♦ బంగాళదుంప రేట్లు గణనీయంగా 47.32 శాతం మేర క్షీణించాయి. పప్పు ధాన్యాల ధరలు తర్వాత స్థాయిలో 25.47 శాతం మేర క్షీణించాయి. ఇక ఉల్లి రేట్లు 9.47 శాతం తగ్గాయి. ♦ తృణధాన్యాల ధరలు 1.93 శాతం, గుడ్లు.. మాంసం.. చేపలు మొదలైన వాటి రేట్లు 1.92 శాతం మేర పెరిగాయి. -
టోకు ధరలూ శాంతించాయ్!
♦ మే నెలలో తగ్గిన పెరుగుదల స్పీడ్ ♦ కేవలం 2.17 శాతంగా నమోదు ♦ ఐదు నెలల కనిష్టస్థాయి ♦ రేటు తగ్గింపునకు ఆర్బీఐపై ఒత్తిడి! న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణమూ మే నెలలో శాంతించింది. సూచీలోని వస్తువుల బాస్కెట్ ధర మొత్తంగా 2.17 శాతమే (2016 ఇదే నెలతో పోల్చిచూస్తే) పెరిగింది. ఇంత తక్కువ స్థాయిలో రేటు పెరుగుదల ఐదు నెలల్లో ఇదే తొలిసారి. రెండు రోజుల క్రితం వెలువడిన రిటైల్ ద్రవ్యోల్బణం కూడా దశాబ్దపు కనిష్ట స్థాయిలో 2.18 శాతంగా నమోదయ్యింది. అయితే ఇదే సమయంలో వెలువడిన ఏప్రిల్ నెల పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు మాత్రం కేవలం 3.1 శాతంగా నమోదయ్యింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, పారిశ్రామిక వృద్ధి కుంటుపడడం నేపథ్యంలో ఇది రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) తగ్గింపునకు అవకాశమని పారిశ్రామిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా క్రితం ఏడాది ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదలలేకపోగా –0.90 శాతం క్షీణతలో ఉన్న విషయం గమనార్హం. ఫ్యూయెల్ అండ్ పవర్సహా సూచీలో అధిక వెయిటేజ్ కలిగిన తయారీ రంగాలు అప్పట్లో క్షీణతలో ఉండడం దీనికి కారణం. 2017 ఏప్రిల్‌లో మాత్రం టోకు సూచీ 3.85 శాతంగా ఉంది. కీలక మూడు విభాగాలూ ఇలా... ♦ ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్‌లో రేటు అసలు పెరక్కపోగా –1.79 శాతం క్షీణించింది. ఇందులో ఒక్క ఫుడ్ ఆర్టికల్స్‌ను చూస్తే 6.82 శాతం పెరుగుదల రేటు తాజా సమీక్షా నెలలో –2.27 శాతానికి జారింది. నాన్–ఫుడ్ ఆర్టికల్స్ రేటు కూడా 4.04 శాతం నుంచి – 0.91 శాతానికి క్షీణించింది. ♦ ఇక ఫ్యూయెల్ అండ్ పవర్ విభాగంలో మాత్రం –14.87 శాతం క్షీణత నుంచి 11.69 శాతానికి చేరింది. ♦ తయారీ విభాగంలో కూడా –0.63 శాతం నుంచి 2.55 శాతానికి చేరింది. ♦ సూచీలో 697 వస్తువులు ఉంటే, 117 ప్రైమరీ ఆర్టికల్స్‌లో ఉన్నాయి. 16 ఫ్యూయల్, పవర్ విభాగంలో 564 తయారీ విభాగంలో ఉన్నాయి. ఆహార విభాగాన్ని చూస్తే... ఫుడ్ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం రేటు 2.27 శాతం ఉంటే, కూరగాయల ధరలు పెరక్కపోగా –18.51 శాతం క్షీణించాయి. ఆలూ ధరలు కూడా 44.36 శాతం క్షీణించాయి. ఉల్లి పాయల ధరలు 12.86 శాతం తగ్గాయి. తృణధాన్యాల ధరలు 4.15 శాతం పెరిగితే, పప్పు దినుసుల ధరలు 20 శాతం తగ్గాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు 1.02 శాతం క్షీణించాయి. పండ్ల ధరలు సైతం –0.73 శాతం క్షీణించాయి. పరిశ్రమల నుంచి పెరిగిన డిమాండ్.. రిటైల్‌తో పాటు టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా ఆర్బీఐ లక్ష్యం (2 శాతం ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం) తక్కువగా ఉండడంతో పారిశ్రామిక వర్గాల నుంచి మళ్లీ రెపో రేటు కోత డిమాండ్ పెరిగింది. ఉపాధి కల్పనకు పెట్టుబడులు అవసరమని, రేటు కోతతోనే పెట్టుబడులకు ఊతం ఇవ్వగలమని పారి శ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. వృద్ధికి ఊతం ఇచ్చేలా ఆగస్టు 2 నాటి పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రేటు తగ్గిస్తుందన్న విశ్వాసాన్ని ఫిక్కీ ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం మున్ముందు కూడా మరింత తగ్గుతుందన్న అభిప్రాయాన్ని అసోచామ్, ఇక్రాలు అభిప్రాయపడ్డాయి. -
ఆహార ధరలు క్రాష్: ద్రవ్యోల్బణం మరింత కిందకి
న్యూఢిల్లీ : టోకుధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) కూడా ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. ఆహార ధరలు భారీగా పడిపోవడంతో మే నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.17 శాతంగా నమోదైంది. గత నెలలో ఈ ద్రవ్యోల్బణం 3.85 శాతంగా ఉంది. పప్పులు, తృణధాన్యాల ధరల్లో వృద్ధి కూడా చాలా తక్కువగా నమోదైందని నేడు ప్రభుత్వం విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) కూడా ఇటీవల రికార్డు కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. అది కూడా 2.18 శాతానికి పడిపోయింది. ఈ రెండు సూచీలు దిగిరావడంతో ఆర్బీఐ రేట్ల కోత అంచనాలు పెరుగుతున్నాయి. ఆగస్టులో కచ్చితంగా ఆర్బీఐ రేట్లలో కోత పెట్టవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటాలో ఆహార ధరల ముఖ్యంగా బంగాళదుంపలు, పప్పులు, ఉల్లిపాయల ధరలు వరుసగా మూడో నెలలో కూడా కిందకి పడిపోయినట్టు తెలిసింది. ఈ సూచీలో ఇవి ప్రైమరీ ఆర్టికల్స్ గా ఉంటాయి. మే నెలలో ఆహారోత్పత్తుల దరలు 2.27 శాతానికి పడిపోయాయి. కూరగాయలు ధరలు -18.51 శాతంగా నమోదయ్యాయి. బంగాళదుంపలు ధరలు కూడా 44.36 శాతం డీప్లేషన్ లో ఉన్నాయి. ఉల్లిపాయల రేట్లు 12.86 శాతం కిందకి పడిపోయినట్టు వెల్లడైంది. అయితే గతేడాది -14.78శాతంగా ఉన్న ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది 11.69 శాతం పైకి ఎగిసింది. కొత్త బేస్ ఇయర్ 2011-12 ఆధారితంగా ఈ ద్రవ్యోల్బణాన్ని గణించారు. -
మే 9న ఐఐపీ కొత్త బేస్ ఇయర్
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)కి బేస్ ఇయర్ మారనుంది. 2011–12 బేస్ ఇయర్‌తో మే 9వ తేదీన కొత్త ఐఐపీ సిరీస్ ప్రారంభం కానుందని ఒక ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. ప్రస్తుతం ఐఐపీకి 2004–05 బేస్ ఇయర్‌గా ఉంది. తాజా సిరీస్‌ను చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ ప్రారంభిస్తారని సీనియర్ అధికారి పేర్కొన్నారు. దీనివల్ల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలకు మరింత పారదర్శకత చేకూరుతుందని కూడా ఆయన తెలిపారు. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) బేస్ ఇయర్ కూడా 2011–12గా మార్చేందుకు మదింపు జరుగుతోందని ఉన్నతాధికారి వెల్లడించారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) బేస్ ఇయర్ ఇప్పటికే మారిన సంగతి తెలిసిందే. దీనితోపాటు వినియోగ సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలకూ బేస్ ఇయర్‌గా 2011–12ను అమలు చేస్తున్నారు. -
మార్చిలో తగ్గిన ధరల వేగం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో ఫిబ్రవరితో పోలిస్తే తగ్గింది. 2017 ఫిబ్రవరిలో 6.55 శాతంగా ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం (2016 ఫిబ్రవరి టోకు ధరల బాస్కెట్‌తో పోల్చితే) 2017 మార్చిలో 5.7 శాతానికి తగ్గింది. 2016 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం అసలు పెరక్కపోగా –0.45 క్షీణతలో ఉంది. ప్రధాన విభాగాలను వేర్వేరుగా చూస్తే... పైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 4.63 శాతంగా ఉంది. ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 3.12 శాతంగా ఉంది. నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణం 4.91 శాతంగా ఉంది. సూచీలో ఈ విభాగం వెయిటేజ్ దాదాపు 20 శాతం. ఆహార విభాగంలో కూరగాయల ధరలు 5.70 శాతం పెరిగాయి. పండ్ల ధరలు 7.62 శాతం ఎగశాయి. గుడ్లు, మాంసం, చేపలు 3.12 శాతం పెరిగాయి. ► ఫ్యూయెల్ అండ్ పవర్: మార్చిలో ద్రవ్యోల్బణం 18.16 శాతంగా ఉంది. సూచీలో ఈ విభాగం వెయిటేజ్ 20 శాతం. ఫిబ్రవరిలో ఈ రేటు 21.02 శాతం. ► తయారీ: సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 2.99 శాతంగా ఉంది. మార్చిలో ఈ రేటు 3.66 శాతంగా ఉంది. -
మూడేళ్ల గరిష్టంలో టోకు ధరల ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : దేశీయ టోకు ధరల ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్టానికి ఎగిసింది. అంచనావేసిన దానికంటే పెరిగి ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణం ఏడాది ఏడాదికి 6.55 శాతంగా నమోదైంది. జనవరి నెలలో ఈ ద్రవ్యోల్బణం 5.25 శాతంగా ఉంది. మినరల్స్, ప్యూయల్ ధరలు పెరగడంతో పాటు ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో ఈ టోకు ధరల ద్రవ్యోల్బణం పెరిగినట్టు ప్రభుత్వ డేటా పేర్కొంది. మంగళవారం ప్రభుత్వం ఈ డేటాను విడుదల చేసింది. రాయిటర్స్ పోల్స్ అంచనాల ప్రకారం ఈ డేటా 5.90 శాతంగా నమోదవుతుందని అంచనావేసింది. ఈ రెండున్నర ఏళ్లలో టోకు ధరలు భారీగా పెరిగినట్టు తెలిసింది. గత నెల టోకు విక్రయాల ఆహార ధరలు యేటికేటికి 2.69 శాతం పెరిగాయి. జనవరిలో ఇవి 0.56 శాతం పడిపోయాయి. మినరల్ ధరలు కూడా 31 శాతం పెరిగాయి. అంతేకాక సమీక్షించిన పెట్రోల్, డీజిల్ ధరలు పైకి ఎగియడంతో ప్యూయల్ 21 శాతం కాస్ట్ లీగా మారిందని ప్రభుత్వ డేటా వెల్లడించింది. -
30 నెలల గరిష్టానికి టోకు ధరలు
• జనవరి ద్రవ్యోల్బణం 5.25 శాతం • ఇంధన ధరల మంట ప్రధాన కారణం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2017 జనవరిలో 30 నెలల గరిష్ట స్థాయికి చేరింది. 5.25 శాతానికి పెరిగింది. అంటే 2016 జనవరితో పోల్చితే, 2017 జనవరిలో పలు కీలక వస్తు ఉత్పత్తుల బాస్కెట్ ధర టోకున 5.25 శాతం పెరిగిందన్నమాట. ఇంధన ధరల పెరుగుదల టోకు ధరలపై ప్రధానంగా ప్రభావం చూపింది. 2016 ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా (2015 జనవరి నెలతో పోల్చి) –1.07 శాతం క్షీణత నమోదయ్యింది. కాగా నవంబర్, డిసెంబర్లలో వరుసగా ద్రవ్యోల్బణం రేట్లు 3.38 శాతం, 3.39 శాతాలుగా నమోదయ్యాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు, అంతర్జాతీయంగా ఫెడ్ రేట్లు పెంచే అంచనాల నేపథ్యంలో గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపో 6.25 శాతం)ను పెంచకపోగా, ఇందుకు ఇకముందూ అవకాశాలు తక్కువేనని సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా టోకు ద్రవ్యోల్బణం తీవ్రత నమోదయ్యింది. మూడు ప్రధాన విభాగాలు ఇలా ... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్లతో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు జనవరిలో 4.30% నుంచి 1.27 శాతానికి తగ్గింది. ఇందులో భాగమైన ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణంలో అసలు పెరగలేదు. 6.46% నుంచి ఈ ద్రవ్యోల్బణం –0.56 క్షీణతలోకి జారిపోవడం గమనార్హం. ఇక నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం రేటు 9.35% నుంచి 1.98%కి తగ్గింది. కూరగాయల ధరలు జనవరిలో పెరగకపోగా –32.32% క్షీణించాయి. ప్రధానంగా ఉల్లిపాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా –28.86% క్షీణించాయి. ఇంధనం: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం –9.89 శాతం క్షీణత నుంచి భారీగా 18.14 శాతానికి పెరిగింది. తయారీ: తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం –1.17 శాతం నుంచి 3.99 శాతానికి పెరిగింది. -
పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: 2016 డిసెంబర్ నెల టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) లేదా టోకు ద్రవ్యోల్బణం 3.39గా నమోదైంది. మునుపటి నెలలో 3.15 శాతంతో పోలిస్తే ఇది 1.06 శాతం ఎక్కువ. ఆహార ద్రవ్యోల్బణం రేటు (ఇయర్ ఆన్ ఇయర్ ) -0.70 శాతంగా నమోదైంది. గత నెల 1.54తో పోలిస్తే క్షీణించి 2015 ఆగస్టు తరువాత మొదటి సారి నెగిటివ్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఈ వివరాలను వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ నెలలో 'ఆల్ కమోడిటీస్' టోకు ధర సూచిక 182.8 (తాత్కాలిక) గా నమోదైంది. గత నెలలో (తాత్కాలిక) 183.1 తో పోలిస్తే 0.2 శాతం తగ్గింది. కాగా డిసెంబర్ 31, 2016తో ముగిసిన డీమానిటైజేషన్ నేపథ్యంలో డబ్ల్యుపిఐ గణాంకాలు కీలకంగా మారనున్నాయి. -
టోకు ధరలు ‘కూల్’...
• అక్టోబర్‌లో 3.39 శాతం • రేటు తగ్గింపునకు పరిశ్రమల డిమాండ్ న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో కొంత శాంతించింది. సెప్టెంబర్‌లో 3.57%గా ఉన్న ఈ రేటు అక్టోబర్‌లో 3.39%కి దిగివచ్చింది. అంటే సెప్టెంబర్‌లో ఉన్న ఆహార ధరల పెరుగుదల వేగం (గత ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) అక్టోబర్‌లో తగ్గిందన్నమాట. ఆహార ధరలు అదుపులో ఉండడం దీనికి ఒక కారణం. గత ఏడాది ఇదే నెలలో ఆహార ద్రవ్యోల్బణం అసలు పెరుగుదలలో లేకపోగా -3.70% క్షీణతలో ఉంది. తాజాగా ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 7 ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటును ఆర్బీఐ తగ్గించాలని పరిశ్రమలు డిమాండ్ చేస్తున్నారుు. ముఖ్య విభాగాలను వార్షికంగా చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్-ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 0.04% నుంచి 3.31 %కి పెరిగింది. ఇందులో ఒక భాగమైన ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 3.33% నుంచి 4.34%కి చేరింది. సెప్టెంబర్‌లో ఈ బాస్కెట్లో ధరల పెరుగుదల వేగం 5.75%. ఇక నాన్-ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 5.10% నుంచి 1.13%కి తగ్గింది. ఫ్యూయెల్ అండ్ పవర్: -16.32% క్షీణత నుంచి 6.18%కి ఎగసింది. తయారీ: మొత్తం సూచీలో 60% ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం -1.67% క్షీణత నుంచి 2.67%కి పెరిగింది. పరిశ్రమలు ఏమంటున్నాయంటే... ప్రస్తుత పరిస్థితుల్లో రెపో కోత 0.50% అవసరమని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్థన్ నోతియా పేర్కొన్నారు. హౌసింగ్, ఆటోమోబైల్, వినియోగ వస్తువుల విభాగాల్లో పెరుగుదలకు తక్షణం ఈ చర్య తీసుకోవాలని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు వచ్చే రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత తగ్గుదలకు దోహదపడుతుందని ఐసీఆర్ఏ సీనియర్ ఎకనమిస్ట్ అదితినయ్యర్ అన్నారు. -
దిగి వస్తున్న టోకు ధరల సూచీ
న్యూఢిల్లీ: టోకు ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో దిగి వచ్చింది. వార్షిక ధరల పెరుగుదల రేటు ప్రతిబింబించే టోకు ధరల సూచీ 3.57 శాతం తగ్గింది. ఫుడ్ఆర్టికల్స్, కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇది స్వల్పంగా తగ్గుముఖంపట్టింది. టోకు ధరల సూచీ గత ఆగస్టు నెలలో రెండేళ్ల గరిష్టాన్ని తాకింది. ఆగస్టులో 3.74 శాతంగా నమోదైంది. 2015 సెప్టెంబర్ లో ఇది 4.59 శాతంగా నమోదైంది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రకారం తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 64.97, ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 4.76, ఇంధన ద్రవ్యోల్బణం 5.58 ఆహార ద్రవ్యోల్బణం 10.91 వద్ద సెప్టెంబర్ డబ్ల్యుపిఐ ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 5.75 శాతంగా ఉంది. ఆగస్టులో ఇది 8.23శాతంగా నమోదైంది. కాగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ గతవారం 25 బేసిస్ పాయింట్లకు వడ్డీరేట్లలో కోత పెట్టిన సంగతి తెలిసిందే. -
సరఫరాల సమస్యలతో ధరలకు రెక్కలు!
• జూలై టోకు ధరల పెరుగుదల 3.55% • 23 నెలల గరిష్ట స్థాయి - నిత్యావసరాల ధరల తీవ్రత • 12 శాతం పైకి... కూరగాయల ధర 28 శాతం రయ్ ! న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు జూలైలో భారీగా పెరిగింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చిచూస్తే.. ఈ బాస్కెట్లో వస్తువుల మొత్తం ధర 3.55 శాతం ఎగసింది. ఇది 23 నెలల గరిష్ట స్థాయి. అంటే 2014 ఆగస్టు (3.74 శాతం) తరువాత మళ్లీ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. టోకు ధరల సూచీలో ఒక భాగమైన నిత్యావసర ధరలు భారీగా పెరగడం మొత్తం సూచీ పెరుగుదలకు ఒక కారణం. సరఫరాల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని తాజా గణాంకాలు సూచిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. జూన్‌లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ట స్థాయిలో 6.07 శాతంగా నమోదయిన నేపథ్యంలోనే తాజా గణాంకాలు వెలువడ్డాయి. కాగా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం జూన్‌లో 1.62 శాతం నమోదవగా, గత ఏడాది జూలైలో అసలు పెరుగుదల లేకపోగా -4% క్షీణతలో ఉంది. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కీలక విభాగాలను పరిశీలిస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఆహార, ఆహారేతర వస్తువుల బాస్కెట్ మొత్తంగా ద్రవ్యోల్బణం రేటు 9.38 శాతంగా ఉంది. గత ఏడాది జూలైలో ఈ రేటు -3.98 శాతంగా ఉంది. ఇక ఇందులో భాగమైన ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు -1.2 శాతం క్షీణత నుంచి 12 శాతానికి పెరిగింది. నాన్-ఫుడ్ ఆర్టికల్స్ రేటు -1 శాతం నుంచి 9.5 శాతానికి చేరింది. ఇంధనం, విద్యుత్: -12 శాతం క్షీణత -1 శాతం క్షీణతకు చేరింది. తయారీ: మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో రేటు -1.54 శాతం క్షీణత నుంచి 1.82 పైకి మళ్లింది. కొన్ని నిత్యావసరాలను చూస్తే... వార్షికంగా టోకున పప్పుల ధరలు 37% పెరిగాయి. బంగాళాదుంపలు ఏకంగా 59% పెరిగాయి. కూరగాయలు 28 శాతం ఎగశాయి. టోకునే ధరల పెరుగుదల ఈ తీరున ఉంటే.. ఇక రిటైల్ స్థాయికి చేరే సరికి ఏ స్థాయిలో పెరుగుదల ఉంటుందో అర్థం చేసుకోవచ్చని విమర్శ.