టోకు ధరలూ శాంతించాయ్!
♦ మే నెలలో తగ్గిన పెరుగుదల స్పీడ్
♦ కేవలం 2.17 శాతంగా నమోదు
♦ ఐదు నెలల కనిష్టస్థాయి
♦ రేటు తగ్గింపునకు ఆర్‌బీఐపై ఒత్తిడి!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణమూ మే నెలలో శాంతించింది. సూచీలోని వస్తువుల బాస్కెట్ ధర మొత్తంగా 2.17 శాతమే (2016 ఇదే నెలతో పోల్చిచూస్తే) పెరిగింది. ఇంత తక్కువ స్థాయిలో రేటు పెరుగుదల ఐదు నెలల్లో ఇదే తొలిసారి. రెండు రోజుల క్రితం వెలువడిన రిటైల్ ద్రవ్యోల్బణం కూడా దశాబ్దపు కనిష్ట స్థాయిలో 2.18 శాతంగా నమోదయ్యింది. అయితే ఇదే సమయంలో వెలువడిన ఏప్రిల్ నెల పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు మాత్రం కేవలం 3.1 శాతంగా నమోదయ్యింది.
ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, పారిశ్రామిక వృద్ధి కుంటుపడడం నేపథ్యంలో ఇది రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) తగ్గింపునకు అవకాశమని పారిశ్రామిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా క్రితం ఏడాది ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదలలేకపోగా –0.90 శాతం క్షీణతలో ఉన్న విషయం గమనార్హం. ఫ్యూయెల్ అండ్ పవర్‌సహా సూచీలో అధిక వెయిటేజ్ కలిగిన తయారీ రంగాలు అప్పట్లో క్షీణతలో ఉండడం దీనికి కారణం. 2017 ఏప్రిల్‌లో మాత్రం టోకు సూచీ 3.85 శాతంగా ఉంది.
కీలక మూడు విభాగాలూ ఇలా...
♦ ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్‌లో రేటు అసలు పెరక్కపోగా –1.79 శాతం క్షీణించింది. ఇందులో ఒక్క ఫుడ్ ఆర్టికల్స్‌ను చూస్తే 6.82 శాతం పెరుగుదల రేటు తాజా సమీక్షా నెలలో –2.27 శాతానికి జారింది. నాన్–ఫుడ్ ఆర్టికల్స్ రేటు కూడా 4.04 శాతం నుంచి – 0.91 శాతానికి క్షీణించింది.
♦ ఇక ఫ్యూయెల్ అండ్ పవర్ విభాగంలో మాత్రం –14.87 శాతం క్షీణత నుంచి 11.69 శాతానికి చేరింది.
♦ తయారీ విభాగంలో కూడా –0.63 శాతం నుంచి 2.55 శాతానికి చేరింది.
♦ సూచీలో 697 వస్తువులు ఉంటే, 117 ప్రైమరీ ఆర్టికల్స్‌లో ఉన్నాయి. 16 ఫ్యూయల్, పవర్ విభాగంలో 564 తయారీ విభాగంలో ఉన్నాయి.
ఆహార విభాగాన్ని చూస్తే...
ఫుడ్ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం రేటు 2.27 శాతం ఉంటే, కూరగాయల ధరలు పెరక్కపోగా –18.51 శాతం క్షీణించాయి. ఆలూ ధరలు కూడా 44.36 శాతం క్షీణించాయి. ఉల్లి పాయల ధరలు 12.86 శాతం తగ్గాయి. తృణధాన్యాల ధరలు 4.15 శాతం పెరిగితే, పప్పు దినుసుల ధరలు 20 శాతం తగ్గాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు 1.02 శాతం క్షీణించాయి. పండ్ల ధరలు సైతం –0.73 శాతం క్షీణించాయి.
పరిశ్రమల నుంచి పెరిగిన డిమాండ్..
రిటైల్‌తో పాటు టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా ఆర్‌బీఐ లక్ష్యం (2 శాతం ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం) తక్కువగా ఉండడంతో పారిశ్రామిక వర్గాల నుంచి మళ్లీ రెపో రేటు కోత డిమాండ్ పెరిగింది. ఉపాధి కల్పనకు పెట్టుబడులు అవసరమని, రేటు కోతతోనే పెట్టుబడులకు ఊతం ఇవ్వగలమని పారి శ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. వృద్ధికి ఊతం ఇచ్చేలా ఆగస్టు 2 నాటి పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ రేటు తగ్గిస్తుందన్న విశ్వాసాన్ని ఫిక్కీ ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం మున్ముందు కూడా మరింత తగ్గుతుందన్న అభిప్రాయాన్ని అసోచామ్, ఇక్రాలు అభిప్రాయపడ్డాయి.