టోకు ధరలు ఐదేళ్ల కనిష్టం
సెప్టెంబర్‌లో 2.38 శాతం
ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గిన ఫలితం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 2.38 శాతానికి పడిపోయింది. అంటే 2013 సెప్టెంబర్‌తో పోల్చితే పలు ఉత్పత్తుల టోకు ధరల మొత్తం 2014 సెప్టెంబర్‌లో కేవలం 2.38 శాతమే పెరిగాయన్నమాట. ఇంతే స్థాయిలో ధరలు పెరుగుదల రేటు నమోదు కావడం ఐదేళ్లలో ఇదే మొదటిసారి. టోకున ఆహార ఉత్పత్తులు ధరల స్పీడ్ తగ్గడం మొత్తం సూచీపై సానుకూల ప్రభావం చూపిందని గణాంకాలు పేర్కొన్నాయి. నాలుగు నెలల నుంచీ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. ఆగస్టు నెలలో ఈ రేటు 3.74 శాతం. 2013 సెప్టెంబర్‌లో ఈ స్పీడ్ 7.05 శాతం. మంగళవారం నాడు విడుదల చేసిన సెప్టెంబర్ డబ్ల్యూపీఐ
గణాంకాల ముఖ్యాంశాలు...
విభాగాల వారీగా...
మొత్తం డబ్ల్యూపీఐలో 14 శాతం వాటా ఉన్న ఆహార ఉత్పత్తుల ధరల విభాగంలో ద్రవ్యోల్బణం సెప్టెం బర్‌లో 33 నెలల కనిష్ట స్థాయిలో 3.52 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు 5.15 శాతం. 2013 ఆగస్టులో ఉన్న ధరతో పోల్చి 2014 ఆగస్టులో ఉల్లిపాయల ధరలు 44.7 శాతం తగ్గితే(వార్షిక ప్రాతిపదికన), 2014లో సెప్టెంబర్‌లో ఈ కమోడిటీ ధర ఏకంగా 58.12 శాతం తగ్గింది. కూరగాయల ధరలు 14.98 శాతం తగ్గాయి. అయితే ఆలూ ధర మాత్రం ఆగస్టులో 61.61 శాతం పెరిగితే, సెప్టెంబర్‌లో 90.23 శాతం ఎగసింది. గుడ్లు, మాంసం, చేపల ధరలు ఆగస్టులో 5.87 శాతం పెరిగితే సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల రేటు 4.12 శాతమే ఉంది.మొత్తం సూచీలో దాదాపు 66 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో ఆగస్టుతో పోల్చితే 3.45% నుంచి 2.84 శాతానికి దిగివచ్చింది.
రేట్ల కోతకు అవకాశం: పరిశ్రమలు
రిటైల్, టోకు ధరలు దిగిరావడంతో ఆర్‌బీఐ పాలసీ వడ్డీరేట్లు తగ్గించడానికి ఇది సరైన అవకాశమని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వ చర్యలు ఫలించినట్లు ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు.