టోకు ధరలూ పెరిగాయ్
♦ కూరగాయల ధరలు పెరిగిన ఎఫెక్ట్
♦ మేలో టోకు ద్రవ్యోల్బణం 0.79%
♦ ఆహార ద్రవ్యోల్బణం రేటు 7.88%
న్యూఢిల్లీ: కూరగాయల ధరలు మండిపోవడంతో మే నెల టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 0.79 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 2.20గా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో మైనస్ 0.45గా ఉన్న డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్‌లో 0.34 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 2.21 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణం ఈ ఏడాది మేలో 12.94 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం 4.23 శాతం నుంచి 7.88 శాతానికి, తయారీ ధరల ద్రవ్యోల్బణం 0.71 శాతం నుంచి 0.91 శాతానికి పెరిగాయి. ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం మేలో మైనస్ 6.14 శాతంగా, పప్పుల ద్రవ్యోల్బణం 35.56 శాతంగా ఉండగా, గుడ్లు, మాంసం, చేపల ధరల ద్రవ్యోల్బణం 9.75 శాతం పెరిగింది. ధాన్యాల ధరలు 4.6 శాతం,పండ్ల ధరలు 3.8 శాతం చొప్పున పెరిగాయి. ఉల్లిగడ్డల ధరలు 21.7 శాతం తగ్గాయి.
సరఫరా సమస్యలు
సరఫరా సమస్యల పరిష్కారానికి విధాన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాన్ని ఈ పెరిగిన ద్రవ్యోల్బణం సూచిస్తోందని నిపుణులంటున్నారు. పప్పులు, ధాన్యాలు, ఆహార పదార్ధాలు గోధుమ, ఇతర పదార్ధాల ధరలు పెరగడం కొనసాగుతోందని, దీనిని నివారించాలంటే సరఫరా సంబంధిత సమస్యలపై విధాన నిర్ణేతలు దృష్టి సారించాల్సిన అవసరముందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి. ఎస్. రావత్ చెప్పారు. సరఫరాల్లో కోత కారణంగా ధరలు పెరుగుతున్నాయని వివరించారు. పారిశ్రామికోత్పత్తి తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో తగ్గవచ్చు...
వర్షాలు విస్తారంగా కురిస్తే సమీప కాలంలో టోకు ధరల ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం .. అంతర్జాతీయ కమోడి ధరలపై ఆధారపడి ఉంటుందని వారంటున్నారు. ముడి చమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే, ఈ ఆర్థిక సంవత్సరంలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 3 శాతానికి మించవచ్చని ఇక్రా సీనియర్ ఎకనామిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ద్రవ్యోల్బణం 2-3 శాతం స్థాయిలో ఉండడం ఆందోళన కలిగించే అంశం కాదని, కేర్‌రేటింగ్స్ పేర్కొంది.
రేట్ల కోత మరింత జాప్యం
టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గడం, సోమవారం వెలువడిన వినియోగదారుల ద్రవ్యోల్బణం కూడా ఎగియడంతో, పారిశ్రామికోత్పత్తి తగ్గినప్పటికీ, రేట్ల కోతను ఆర్‌బీఐ మరింత జాప్యం చేయవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆహార పదార్ధాల ధరలు పెరగడంతో మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 21 నెలల గరిష్ట స్థాయి, 5.76 శాతానికి పెరిగింది. ద్రవ్య విధాన నిర్ణయంలో ఆర్‌బీఐ రిటైల్ ద్రవ్యోల్బణాన్నే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి 0.8 శాతానికి తగ్గింది. మూడు నెలల కాలంలో ఇదే తొలి క్షీణత.