Wholesale prices
-
పప్పుల ధరలు తగ్గించండి
న్యూఢిల్లీ: పప్పుల విక్రయాల్లో లాభాల మార్జిన్లు తగ్గించుకోవాలంటూ రిటైలర్లకు కేంద్రం కీలక సూచన చేసింది. గడిచిన నెల రోజుల్లో హోల్‌సేల్ మార్కెట్లో కందిపప్పు, మినపపప్పు, శనగపప్పు ధరలు 4 శాతం వరకు తగ్గగా.. వాటి రిటైల్ ధరలు అంత మేర తగ్గకపోవడాన్ని కేంద్రం గుర్తించింది. దీంతో సహేతుక లాభాలకు పరిమితమై, వినియోగదారులకు ఉపశమనాన్ని కలి్పంచాలంటూ రిటైలర్లను కేంద్ర ప్రభుత్వం కోరింది. అనుచిత వ్యాపార విధానాలు, లాభాపేక్షతో వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ గట్టి హెచ్చరిక పంపింది. రిటైలర్ల సమాఖ్య (ఆర్ఏఐ), రిటైల్ సంస్థలతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కందిపప్పు, శనగపప్పు నిల్వలపై ఆ శాఖ కార్యదర్శి నిధి ఖరే సమీక్ష నిర్వహించారు. ఆర్ఏఐ ప్రతినిధులు, రిలయన్స్ రిటైల్, డీమార్ట్, టాటా స్టోర్స్, స్పెన్సర్స్, వీమార్ట్ తదితర సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఆర్ఏఐ పరిధిలో 2,300 మంది సభ్యులు (రిటైలర్లు), 6 లక్షల రిటైల్ స్టోర్లు ఉన్నాయి. హోల్ సేల్ ధరలు, రిటైల్ ధరల మధ్య భిన్నమైన ధోరణులు ఉన్నాయని, రిటైలర్లు అధిక మార్జిన్లు పొందుతున్నట్టు తెలుస్తోందని నిధి ఖరే సమావేశంలో స్పష్టం చేశారు. ధరల నియంత్రణకు, వినియోగదారులకు సరసమైన ధరలకు అందించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని ఆమె రిటైలర్లను కోరారు. -
టోకు ద్రవ్యోల్బణం @ 29 నెలల కనిష్టం
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మార్చిలో 29 నెలల కనిష్టానికి దిగి వచ్చింది. 1.34 శాతానికి పరిమితమైంది. ఇంధనాలు, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గగా, ఆహార ఉత్పత్తుల భారం మాత్రం పెరిగింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.85 శాతంగాను, గతేడాది మార్చిలో 14.63 శాతంగాను నమోదైంది. ఇది తగ్గడం వరుసగా పదో నెల. చివరిసారిగా 2020 అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ ఆధారిత ధరల పెరుగుదల 1.31 శాతంగా నమోదైంది. ‘2023 మార్చిలో ద్రవ్యోల్బణం రేటు తగ్గడానికి ప్రధానంగా ప్రాథమిక లోహాలు, టెక్స్టైల్స్, ఆహారయేతర ఆర్టికల్స్, ఖనిజాలు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, క్రూడ్ పెట్రోలియం .. సహజ వాయువు, పేపర్ .. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడమే కారణం‘ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం తెలిపింది. తాజాగా ఫుడ్ బాస్కెట్లో గోధుమలు వంటి ధాన్యాల ధరలు నెమ్మదించగా.. కూరగాయలు, పండ్లు, పాలు, పప్పులు మొదలైన వాటి రేట్లు పెరిగాయని ఈక్విరస్ సెక్యూరిటీస్ ఒక నోట్లో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు కూడా వడ్డీ రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం స్థిరపడేలా చూడటంపైనా, వినియోగ ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మరింత తగ్గేలా చూడటంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని టీఐడబ్ల్యూ క్యాపిటల్ సీఈవో మోహిత్ రాల్హన్ అభిప్రాయపడ్డారు. ► ఆహార ఉత్పత్తుల రేట్ల పెరుగుదల ఫిబ్రవరిలో 3.81 శాతంగా ఉండగా, మార్చిలో 5.48 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు ఫిబ్రవరిలో 21.53 శాతం తగ్గగా (2022 ఫిబ్రవరి ధరతో పోల్చి), మార్చిలో ఈ తగ్గుదల రేటు 2.22 శాతంగానే ఉంది. ఉల్లి విషయంలో ఫిబ్రవరిలో 40.14 శాతం ధరలు తగ్గగా, మార్చిలో తగ్గుదల రేటు 36.83 శాతంగానే నమోదైంది. ► గోధుమల ధరలు 9.16 శాతం, పప్పుల రేట్లు 3.03 శాతం పెరిగాయి. -
టోకు ధరలూ మంటే..!
న్యూఢిల్లీ: టోకు ధరలు నవంబర్‌లో భగ్గుమన్నాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.93 శాతంగా నమోదయ్యింది. అంటే 2016 నవంబర్ ఉన్న టోకు బాస్కెట్ ధరతో పోల్చితే 2017 నవంబర్‌లో టోకు బాస్కెట్ ధర 3.93 శాతం పెరిగిందన్నమాట. ఇంత స్థాయిలో టోకు ద్రవ్యోల్బణం పెరగడం ఎనిమిది నెలల్లో ఇదే తొలిసారి. ఉల్లిపాయలు, కూరగాయల ధరల భారీ పెరుగుదల దీనికి కారణం. ఇదే ఏడాది అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.59 శాతం కాగా, గత ఏడాది నవంబర్‌లో 1.82 శాతంగా ఉంది. కాగా ఇటీవలే విడుదలైన నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయిలో 4.88 శాతంగా నమోదై ఆందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఉల్లి ధర 178% అప్...: ఉల్లిపాయల ధర 2016 నవంబర్‌తో పోల్చితే 2017 నవంబర్‌లో భారీగా 178% పెరిగింది. అక్టోబర్‌లో 36.61%పెరిగిన కూరగాయల ధరలు నవంబర్‌లో ఏకంగా 59.80% ఎగబాకాయి. గుడ్లు, మాసం, చేపలు మూడింటినీ కలిపి చూస్తే, నవంబర్‌లో ధర 4.73% పెరిగింది. -
టోకు ధరల మంట
ఆగస్టులో ద్రవ్యోల్బణం 3.24 శాతం ► నాలుగు నెలల గరిష్టం ► ఆహార, ఇంధన ధరల తీవ్రత కారణం న్యూఢిల్లీ: రిటైల్ ధరల తరహాలోనే (ఐదు నెలల గరిష్ట స్థాయిలో 3.36 శాతం) టోకు ధరలు కూడా ఆగస్టులో తీవ్ర స్థాయికి పెరిగాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.24 శాతం పెరిగింది. అంటే 2016 ఆగస్టు టోకు ఉత్పత్తుల బాస్కెట్ మొత్తం ధరతో పోల్చితే 2017 ఆగస్టులో ఇదే బాస్కెట్ మొత్తం ధర 3.24 శాతం ఎగిసిందన్నమాట. ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదుకావడం నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. కూరగాయలు, ఉల్లిసహా పలు నిత్యావసర ధరల తీవ్రత దీనికి కారణం. 2017 జూలైలో టోకు ద్రవ్యోల్బణం 1.88%కాగా, 2016 ఆగస్టులో ఈ రేటు 1.09%. ప్రధాన విభాగాలు చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 4.78 శాతం నుంచి 2.66 శాతానికి తగ్గింది. అయితే ఇందులో కేవలం ఫుడ్ ఆర్టికల్స్‌ను చూస్తే– రేటు 4.93 శాతం నుంచి 5.75 శాతానికి ఎగిసింది. జూలైలో ఈ రేటు 2.15 శాతంగా ఉంది. ఇక నాన్–ఫుడ్ ఆర్టికల్స్ ధరలు మాత్రం అసలు పెరక్కుండా 5.84% పెరుగుదల రేటు నుంచి – 3.60% క్షీణతకు పడిపోయాయి. ఫ్యూయల్, పవర్: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం –7.42% క్షీణత నుంచి ఏకంగా 9.99%కి చేరింది. జూలైలో ఈ రేటు 4.37 శాతం. తయారీ: మొత్తం ఇండెక్స్‌లో దాదాపు 64 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 0.92% నుంచి 2.45%కి చేరింది. నిత్యావసరాలను చూస్తే... కూరగాయల ధరలు భారీగా 44.91 శాతం పెరిగాయి. జూలైలో ఈ పెరుగుదల రేటు 21.95 శాతం. జూలై ఉల్లి ధరలు 9.50 శాతం పెరిగితే తాజా సమీక్ష నెల ఆగస్టులో 88.46 శాతం తగ్గాయి. పండ్ల ధరలు 7.35 శాతం పెరిగాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు 3.93 శాతం పెరిగాయి. తృణ ధాన్యాలు (0.21 శాతం), ధాన్యం (2.70 శాతం) ధరలూ ఎగిశాయి. అయితే ఆలూ ధరలు – 2 శాతం తగ్గాయి. పప్పు ధరలూ – 30.16 శాతం దిగివచ్చాయి. -
టోకు ధరలూ శాంతించాయ్!
♦ మే నెలలో తగ్గిన పెరుగుదల స్పీడ్ ♦ కేవలం 2.17 శాతంగా నమోదు ♦ ఐదు నెలల కనిష్టస్థాయి ♦ రేటు తగ్గింపునకు ఆర్బీఐపై ఒత్తిడి! న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణమూ మే నెలలో శాంతించింది. సూచీలోని వస్తువుల బాస్కెట్ ధర మొత్తంగా 2.17 శాతమే (2016 ఇదే నెలతో పోల్చిచూస్తే) పెరిగింది. ఇంత తక్కువ స్థాయిలో రేటు పెరుగుదల ఐదు నెలల్లో ఇదే తొలిసారి. రెండు రోజుల క్రితం వెలువడిన రిటైల్ ద్రవ్యోల్బణం కూడా దశాబ్దపు కనిష్ట స్థాయిలో 2.18 శాతంగా నమోదయ్యింది. అయితే ఇదే సమయంలో వెలువడిన ఏప్రిల్ నెల పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు మాత్రం కేవలం 3.1 శాతంగా నమోదయ్యింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, పారిశ్రామిక వృద్ధి కుంటుపడడం నేపథ్యంలో ఇది రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) తగ్గింపునకు అవకాశమని పారిశ్రామిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా క్రితం ఏడాది ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదలలేకపోగా –0.90 శాతం క్షీణతలో ఉన్న విషయం గమనార్హం. ఫ్యూయెల్ అండ్ పవర్సహా సూచీలో అధిక వెయిటేజ్ కలిగిన తయారీ రంగాలు అప్పట్లో క్షీణతలో ఉండడం దీనికి కారణం. 2017 ఏప్రిల్‌లో మాత్రం టోకు సూచీ 3.85 శాతంగా ఉంది. కీలక మూడు విభాగాలూ ఇలా... ♦ ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్‌లో రేటు అసలు పెరక్కపోగా –1.79 శాతం క్షీణించింది. ఇందులో ఒక్క ఫుడ్ ఆర్టికల్స్‌ను చూస్తే 6.82 శాతం పెరుగుదల రేటు తాజా సమీక్షా నెలలో –2.27 శాతానికి జారింది. నాన్–ఫుడ్ ఆర్టికల్స్ రేటు కూడా 4.04 శాతం నుంచి – 0.91 శాతానికి క్షీణించింది. ♦ ఇక ఫ్యూయెల్ అండ్ పవర్ విభాగంలో మాత్రం –14.87 శాతం క్షీణత నుంచి 11.69 శాతానికి చేరింది. ♦ తయారీ విభాగంలో కూడా –0.63 శాతం నుంచి 2.55 శాతానికి చేరింది. ♦ సూచీలో 697 వస్తువులు ఉంటే, 117 ప్రైమరీ ఆర్టికల్స్‌లో ఉన్నాయి. 16 ఫ్యూయల్, పవర్ విభాగంలో 564 తయారీ విభాగంలో ఉన్నాయి. ఆహార విభాగాన్ని చూస్తే... ఫుడ్ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం రేటు 2.27 శాతం ఉంటే, కూరగాయల ధరలు పెరక్కపోగా –18.51 శాతం క్షీణించాయి. ఆలూ ధరలు కూడా 44.36 శాతం క్షీణించాయి. ఉల్లి పాయల ధరలు 12.86 శాతం తగ్గాయి. తృణధాన్యాల ధరలు 4.15 శాతం పెరిగితే, పప్పు దినుసుల ధరలు 20 శాతం తగ్గాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు 1.02 శాతం క్షీణించాయి. పండ్ల ధరలు సైతం –0.73 శాతం క్షీణించాయి. పరిశ్రమల నుంచి పెరిగిన డిమాండ్.. రిటైల్‌తో పాటు టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా ఆర్బీఐ లక్ష్యం (2 శాతం ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం) తక్కువగా ఉండడంతో పారిశ్రామిక వర్గాల నుంచి మళ్లీ రెపో రేటు కోత డిమాండ్ పెరిగింది. ఉపాధి కల్పనకు పెట్టుబడులు అవసరమని, రేటు కోతతోనే పెట్టుబడులకు ఊతం ఇవ్వగలమని పారి శ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. వృద్ధికి ఊతం ఇచ్చేలా ఆగస్టు 2 నాటి పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రేటు తగ్గిస్తుందన్న విశ్వాసాన్ని ఫిక్కీ ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం మున్ముందు కూడా మరింత తగ్గుతుందన్న అభిప్రాయాన్ని అసోచామ్, ఇక్రాలు అభిప్రాయపడ్డాయి. -
30 నెలల గరిష్టానికి టోకు ధరలు
• జనవరి ద్రవ్యోల్బణం 5.25 శాతం • ఇంధన ధరల మంట ప్రధాన కారణం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2017 జనవరిలో 30 నెలల గరిష్ట స్థాయికి చేరింది. 5.25 శాతానికి పెరిగింది. అంటే 2016 జనవరితో పోల్చితే, 2017 జనవరిలో పలు కీలక వస్తు ఉత్పత్తుల బాస్కెట్ ధర టోకున 5.25 శాతం పెరిగిందన్నమాట. ఇంధన ధరల పెరుగుదల టోకు ధరలపై ప్రధానంగా ప్రభావం చూపింది. 2016 ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా (2015 జనవరి నెలతో పోల్చి) –1.07 శాతం క్షీణత నమోదయ్యింది. కాగా నవంబర్, డిసెంబర్లలో వరుసగా ద్రవ్యోల్బణం రేట్లు 3.38 శాతం, 3.39 శాతాలుగా నమోదయ్యాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు, అంతర్జాతీయంగా ఫెడ్ రేట్లు పెంచే అంచనాల నేపథ్యంలో గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపో 6.25 శాతం)ను పెంచకపోగా, ఇందుకు ఇకముందూ అవకాశాలు తక్కువేనని సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా టోకు ద్రవ్యోల్బణం తీవ్రత నమోదయ్యింది. మూడు ప్రధాన విభాగాలు ఇలా ... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్లతో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు జనవరిలో 4.30% నుంచి 1.27 శాతానికి తగ్గింది. ఇందులో భాగమైన ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణంలో అసలు పెరగలేదు. 6.46% నుంచి ఈ ద్రవ్యోల్బణం –0.56 క్షీణతలోకి జారిపోవడం గమనార్హం. ఇక నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం రేటు 9.35% నుంచి 1.98%కి తగ్గింది. కూరగాయల ధరలు జనవరిలో పెరగకపోగా –32.32% క్షీణించాయి. ప్రధానంగా ఉల్లిపాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా –28.86% క్షీణించాయి. ఇంధనం: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం –9.89 శాతం క్షీణత నుంచి భారీగా 18.14 శాతానికి పెరిగింది. తయారీ: తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం –1.17 శాతం నుంచి 3.99 శాతానికి పెరిగింది. -
టోకు ధరలకు ఇంధన సెగ!
డిసెంబర్లో 3.39 శాతం న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం డిసెంబర్ టోకు ధరల బాస్కెట్‌పై పడింది. 2016 డిసెంబర్లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.39 శాతంగా నమోదయ్యింది. అంటే 2015 డిసెంబర్‌తో పోల్చితే 2016 డిసెంబర్లో టోకు ధరల బాస్కెట్ ధర 3.39 శాతం పెరిగిందన్నమాట. కాగా నవంబర్‌లో ఈ రేటు 3.15 శాతం. గత ఏడాది ఇదే కాలంలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా – 1.06 క్షీణతలో ఉంది. మూడు భాగాలు వేర్వేరుగా... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్‌ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో రేటు 4.58 శాతం నుంచి 0.27 శాతానికి తగ్గింది. ఇక ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 7.89 శాతం నుంచి –0.70 శాతం క్షీణతకు చేరింది. (నవంబర్‌లో ఈ రేటు 1.54 శాతం) పలు నిత్యావసర ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం. ఇక నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 7.84% నుంచి 0.62%కి తగ్గింది. ఫ్యుయల్, పవర్: ఈ విభాగంలో –9.15 శాతం క్షీణత నుంచి 8.65 శాతం పెరుగుదల నమోదయ్యింది. డీజిల్ ధరలు 20.25 శాతం పెరిగితే, పెట్రోల్ ధరలు 8.52 శాతం పెరిగాయి. తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం పైగా వాటాఉన్న ఈ రంగం కూడా –1.49 శాతం క్షీణ బాట నుంచి 3.67 శాతం పెరుగుదలకు మళ్లింది. నిత్యావసరాలు హోల్‌సేల్‌గా... ఫుడ్ ఆర్టికల్స్‌లో ధరల తీరును ప్రత్యేకంగా చూస్తే... కూరగాయల ధరలు అసలు పెరక్కపోగా వార్షికంగా 2015 డిసెంబర్‌తో పోల్చిచూస్తే, – 33.11 శాతం తగ్గాయి. ఒక్క ఉల్లిపాయలు చూస్తే, ధర –37.20 శాతం తగ్గింది. చక్కెర ధర భారీగా 28.04 శాతం పెరిగింది. ఆలూ ధర 26.42 శాతం ఎగసింది. పప్పుధాన్యాల ధరలు 18.12 శాతం ఎగశాయి. గుడ్లు, మాసం, చేపల ధరలు 2.73 శాతం పెరిగాయి. -
టోకు ధరలూ పెరిగాయ్
♦ కూరగాయల ధరలు పెరిగిన ఎఫెక్ట్ ♦ మేలో టోకు ద్రవ్యోల్బణం 0.79% ♦ ఆహార ద్రవ్యోల్బణం రేటు 7.88% న్యూఢిల్లీ: కూరగాయల ధరలు మండిపోవడంతో మే నెల టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 0.79 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 2.20గా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో మైనస్ 0.45గా ఉన్న డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్‌లో 0.34 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 2.21 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణం ఈ ఏడాది మేలో 12.94 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం 4.23 శాతం నుంచి 7.88 శాతానికి, తయారీ ధరల ద్రవ్యోల్బణం 0.71 శాతం నుంచి 0.91 శాతానికి పెరిగాయి. ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం మేలో మైనస్ 6.14 శాతంగా, పప్పుల ద్రవ్యోల్బణం 35.56 శాతంగా ఉండగా, గుడ్లు, మాంసం, చేపల ధరల ద్రవ్యోల్బణం 9.75 శాతం పెరిగింది. ధాన్యాల ధరలు 4.6 శాతం,పండ్ల ధరలు 3.8 శాతం చొప్పున పెరిగాయి. ఉల్లిగడ్డల ధరలు 21.7 శాతం తగ్గాయి. సరఫరా సమస్యలు సరఫరా సమస్యల పరిష్కారానికి విధాన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాన్ని ఈ పెరిగిన ద్రవ్యోల్బణం సూచిస్తోందని నిపుణులంటున్నారు. పప్పులు, ధాన్యాలు, ఆహార పదార్ధాలు గోధుమ, ఇతర పదార్ధాల ధరలు పెరగడం కొనసాగుతోందని, దీనిని నివారించాలంటే సరఫరా సంబంధిత సమస్యలపై విధాన నిర్ణేతలు దృష్టి సారించాల్సిన అవసరముందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి. ఎస్. రావత్ చెప్పారు. సరఫరాల్లో కోత కారణంగా ధరలు పెరుగుతున్నాయని వివరించారు. పారిశ్రామికోత్పత్తి తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తగ్గవచ్చు... వర్షాలు విస్తారంగా కురిస్తే సమీప కాలంలో టోకు ధరల ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం .. అంతర్జాతీయ కమోడి ధరలపై ఆధారపడి ఉంటుందని వారంటున్నారు. ముడి చమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే, ఈ ఆర్థిక సంవత్సరంలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 3 శాతానికి మించవచ్చని ఇక్రా సీనియర్ ఎకనామిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ద్రవ్యోల్బణం 2-3 శాతం స్థాయిలో ఉండడం ఆందోళన కలిగించే అంశం కాదని, కేర్‌రేటింగ్స్ పేర్కొంది. రేట్ల కోత మరింత జాప్యం టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గడం, సోమవారం వెలువడిన వినియోగదారుల ద్రవ్యోల్బణం కూడా ఎగియడంతో, పారిశ్రామికోత్పత్తి తగ్గినప్పటికీ, రేట్ల కోతను ఆర్బీఐ మరింత జాప్యం చేయవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆహార పదార్ధాల ధరలు పెరగడంతో మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 21 నెలల గరిష్ట స్థాయి, 5.76 శాతానికి పెరిగింది. ద్రవ్య విధాన నిర్ణయంలో ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణాన్నే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి 0.8 శాతానికి తగ్గింది. మూడు నెలల కాలంలో ఇదే తొలి క్షీణత. -
టోకు ద్రవ్యోల్బణం ‘యూ’ టర్న్...
* 1- 17 నెలల తరువాత క్షీణతలో నుంచి బయటకు.. * ఏప్రిల్‌లో 0.34 శాతం * తయారీ రంగం ‘ప్లస్’ ఎఫెక్ట్.. * కొన్ని నిత్యావసరాల ధరలు పైకి.. న్యూఢిల్లీ: తయారీ రంగం అలాగే కొన్ని ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల ఫలితంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం క్షీణదశ నుంచి పెరుగుదల బాటలోకి ‘యూ’ టర్న్ తీసుకుంది. ఏప్రిల్‌లో 0.34 శాతం రేటు నమోదయ్యింది. అంటే సూచీ 2015 ఏప్రిల్‌తో పోల్చితే 2016 ఏప్రిల్‌లో 0.34 శాతం పెరిగిందన్నమాట. క్రూడ్ ఉత్పత్తుల ధరలు దిగువ స్థాయిలో ఉండడం, సూచీలో దాదాపు 65 శాతం వాటా ఉన్న తయారీ రంగం మందగమనం వంటి అంశాల నేపథ్యంలో గడచిన 17 నెలల్లో వార్షికంగా ఏ నెలలోనూ పెరుగుదల నమోదుచేసుకోలేదు. మైనస్‌లోనే వుంటూ వచ్చింది. 2015 ఏప్రిల్‌లో ఈ రేటు -2.43 శాతం. ఇటీవల విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 6%కి దగ్గరకు చేరింది. తాజా గణాంకాల నేపథ్యంలో... జూన్ 7 పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రేటు కోత అనుమానమేనని నిపుణులు కొందరు విశ్లేషిస్తున్నారు. కొన్ని నిత్యావసరాలు చూస్తే... పప్పులు (36%), ఆలూ (35%), చక్కెర (16%) ధరలు పెరిగిన వస్తువుల జాబితాలో ఉన్నాయి.కూరగాయల ధరలు 2.21% ఎగశాయి. ఉల్లి ధరలు మాత్రం 5% తగ్గాయి. పండ్ల ధరలు -2.38% తగ్గాయి. ఫుడ్ ఆర్టికల్స్, నాన్-ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ సూచీ 0.50 శాతం నుంచి 2.34 శాతానికి ఎగసింది. ఇందులో ఫుడ్ ఆర్టికల్స్ రేటు 5.90% నుంచి 4.23%కి తగ్గింది. నాన్-ఫుడ్ ఆర్టికల్స్‌కు సంబంధించి రేటు -2.9 శాతం క్షీణ దశ నుంచి 7.12 శాతం పెరుగుదల బాటకు మారింది. -
టోకు ధరలు మరింత తగ్గాయ్
ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం -2.65 శాతం క్షీణత - వరుసగా 4 నెలలుగా ఇదే ధోరణి - ఆహారోత్పత్తుల ధరలు మాత్రం పెరిగాయ్... న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్‌లో అసలు పెరక్కపోగా 2.65 శాతం (మైనస్) క్షీణించింది. అంటే 2014 ఏప్రిల్‌తో పోల్చితే మొత్తం టోకు వస్తువుల బాస్కెట్ ధరలు అసలు పెరక్కపోగా, అప్పటి నెలతో పోల్చితే 2015 ఏప్రిల్‌లో -2.65 శాతం తగ్గాయన్నమాట. 2014 నవంబర్ నుంచీ ‘జీరో’ స్థాయిలో కదులుతున్న ద్రవ్యోల్బణం రేటు జనవరి నుంచి ఏకంగా మైనస్‌లోకి జారిపోయింది. ఇది వ్యవస్థలో డిమాండ్ లేకపోవడానికి ప్రతిబింబమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మూడు విభాగాలూ చూస్తే... 2014 ఏప్రిల్ ధరలతో పోల్చి 2015 ఏప్రిల్‌లో ధర ల స్పీడ్‌కు సంబంధించి టోకు ధరల సూచీలోని ప్రధాన మూడు విభాగాల తీరునూ పరిశీలిస్తే.. ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌కు సంబంధించి ప్రాథమిక వస్తువుల (దాదాపు 20% వెయిటేజ్) తీరు- ఈ బాస్కెట్ వార్షిక ధరల పెరుగుదల రేటు కేవలం 0.25%గా నమోదయ్యింది. ఫుడ్ ఆర్టికల్స్ (14% వెయిటేజ్) ధరలు మాత్రం 5.73% ఎగశాయి. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ధరలు (వెయిటేజ్ 4%) అసలు పెరక్కపోగా -6.18% క్షీణతను నమోదు చేసుకున్నాయి. ఇక దాదాపు 15% వాటావున్న ఇంధనం- విద్యుత్ విభాగంలో ధరలు సైతం వార్షికంగా అసలు పెరక్కపోగా -13.03% క్షీణించాయి. సూచీలో 65 % వాటా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరలు (కోర్ విభాగం) సైతం అసలు పెరక్కపోగా క్షీణతలో -0.52 శాతంగా ఉన్నాయి. ముఖ్య ఆహార ఉత్పత్తుల ధరలు.. వార్షికంగా చూస్తే... 2015 ఏప్రిల్‌లో బంగాళ దుంప ధరలు 41.14% తగ్గాయి. కూరగాయల టోకు బాస్కెట్ ధరలు అసలు పెరక్కపోగా స్వల్పంగా 1.32% తగ్గాయి. బియ్యం ధరలు స్వల్పంగా 0.04% ఎగశాయి. ఉల్లి ధర 29.97% పెరిగింది. పప్పు దినుసులు (15.38%), పండ్లు (14.22%), పాలు (7.42%) వంటి ఆహార ఉత్పత్తుల సైతం ధరలు పెరిగిన వస్తువుల జాబితాలో ఉన్నాయి. వ్యవస్థలో డిమాండ్ వృద్ధికి బ్యాంకింగ్ రుణ రేటు కోత మరింత తప్పదని పరిశ్రమ చాంబర్లు డిమాం డ్ చేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రానున్న సమీక్షలో(జూన్ 2న) మరోదఫా రెపో రేటును తగ్గించాలని కోరాయి. -
‘మైనస్’లోనే టోకు ధరలు
- 2014 ఫిబ్రవరితో పోల్చితే 2015 ఫిబ్రవరిలో ధరలు డౌన్ - మైనస్ 2.06 శాతంగా నమోదు - తదుపరి రేట్ల కోతపై పరిశ్రమల ఆశలు న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2014 ఫిబ్రవరితో పోల్చితే, 2015 ఫిబ్రవరిలో (వార్షికంగా) టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు అసలు పెరక్కపోగా క్షీణతలోకి జారింది. మైనస్ (-)2.06 శాతంగా నమోదయ్యింది. ఇంత కనిష్ట స్థాయిలో ఈ రేటు నమోదుకావడం 40 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. దీనితో వరుసగా నాలుగు నెలల నుంచీ ఇదే ధోరణి కొనసాగుతున్నట్లయ్యింది. టోకు ధరల సూచీలో ప్రధాన విభాగాలైన ఆహారం, ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. నవంబర్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం -0.17%. డిసెంబర్లో ఈ రేటు -0.50%. జనవరిలో -0.39%. 2014 ఫిబ్రవరిలో ఈ రేటు 5.03 %. సామాన్యునికి భారమే..: ముఖ్యంగా సామాన్యునికి సంబంధించినంతవరకూ ఆహార ఉత్పత్తుల ధరల బాస్కెట్ వార్షిక సూచీ పెద్దగా ఊరటనివ్వడం లేదు. ఈ రేటు వార్షికంగా 7.74 శాతంగా ఉంది. ఈ బాస్కెట్లో ప్రధాన ఉత్పత్తులను వేర్వేరుగా చూస్తే... కూరగాయల ధరలు వార్షికంగా 15.54%పెరిగాయి. జనవరిలో ఈ పెరుగుదల రేటు 19.74%. తాజా పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు మళ్లీ ఆశగా ఆర్బీఐ వైపు దృష్టి సారించడం ప్రారంభించాయి. కీలక రెపో రేటును మరో దఫా తగ్గించాలని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. -
టోకు ధరలు తగ్గాయ్
* 2014 జనవరితో పోల్చితే * గడచిన నెలలో క్షీణత * మైనస్ 0.39 శాతంగా నమోదు న్యూఢిల్లీ: టోకు ధరలు జనవరిలో తగ్గాయి. 2014 జనవరితో పోల్చిచూస్తే, 2015లో అసలు పెరక్కపోగా 0.39 శాతం క్షీణించాయి. ఇది ఐదేళ్ల కనిష్ట స్థాయి. 3 నెలల్లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం క్షీణతలోకి జారడం ఇది రెండోసారి. నవంబర్‌లో తొలి అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం రేటు ‘జీరో’ అయినప్పటికీ, తాజాగా దీనిని -0.17 శాతంగా సవరించారు. తాజా సమీక్షా కాలంలో మూడు విభాగాల రేట్లూ తగ్గినా ఆహార ధరలు పెరిగాయి. నిత్యావసరాలు... ఇంకా భారమే! నిత్యావసర వస్తువుల టోకు బాస్కెట్ ధరల రేటు వార్షికంగా తగ్గినప్పటికీ (2014 జనవరిలో 8.85 శాతం స్పీడ్- 2015 ఇదే నెలలో 8 శాతం) ఇది ఇంకా సామాన్యుడికి ఇబ్బందికరమైన స్థాయిలో ఆరు నెలల గరిష్ట స్థాయిలో ఉంది. 2014 డిసెంబర్‌తో పోల్చినా... 2015 డిసెంబర్లో కూరగాయల ధరల పెరుగుదల (19.74 శాతం) రేటు అధికంగానే ఉన్నట్లు సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బియ్యం ధరలు సైతం 4 శాతం పెరిగాయి. - ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ సూచీ 6.80 శాతం నుంచి 3.27 శాతానికి తగ్గింది. - ఇంధనం, విద్యుత్ సూచీ స్పీడ్ 9.82 శాతం నుంచి 10.69 శాతం క్షీణతలోకి జారింది. - తయారీ రంగం స్పీడ్ 2.96 శాతం నుంచి 1.05 శాతానికి పడిపోయింది. -
టోకు ధరలు ఐదేళ్ల కనిష్టం
సెప్టెంబర్‌లో 2.38 శాతం ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గిన ఫలితం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 2.38 శాతానికి పడిపోయింది. అంటే 2013 సెప్టెంబర్‌తో పోల్చితే పలు ఉత్పత్తుల టోకు ధరల మొత్తం 2014 సెప్టెంబర్‌లో కేవలం 2.38 శాతమే పెరిగాయన్నమాట. ఇంతే స్థాయిలో ధరలు పెరుగుదల రేటు నమోదు కావడం ఐదేళ్లలో ఇదే మొదటిసారి. టోకున ఆహార ఉత్పత్తులు ధరల స్పీడ్ తగ్గడం మొత్తం సూచీపై సానుకూల ప్రభావం చూపిందని గణాంకాలు పేర్కొన్నాయి. నాలుగు నెలల నుంచీ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. ఆగస్టు నెలలో ఈ రేటు 3.74 శాతం. 2013 సెప్టెంబర్‌లో ఈ స్పీడ్ 7.05 శాతం. మంగళవారం నాడు విడుదల చేసిన సెప్టెంబర్ డబ్ల్యూపీఐ గణాంకాల ముఖ్యాంశాలు... విభాగాల వారీగా... మొత్తం డబ్ల్యూపీఐలో 14 శాతం వాటా ఉన్న ఆహార ఉత్పత్తుల ధరల విభాగంలో ద్రవ్యోల్బణం సెప్టెం బర్లో 33 నెలల కనిష్ట స్థాయిలో 3.52 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు 5.15 శాతం. 2013 ఆగస్టులో ఉన్న ధరతో పోల్చి 2014 ఆగస్టులో ఉల్లిపాయల ధరలు 44.7 శాతం తగ్గితే(వార్షిక ప్రాతిపదికన), 2014లో సెప్టెంబర్‌లో ఈ కమోడిటీ ధర ఏకంగా 58.12 శాతం తగ్గింది. కూరగాయల ధరలు 14.98 శాతం తగ్గాయి. అయితే ఆలూ ధర మాత్రం ఆగస్టులో 61.61 శాతం పెరిగితే, సెప్టెంబర్‌లో 90.23 శాతం ఎగసింది. గుడ్లు, మాంసం, చేపల ధరలు ఆగస్టులో 5.87 శాతం పెరిగితే సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల రేటు 4.12 శాతమే ఉంది.మొత్తం సూచీలో దాదాపు 66 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో ఆగస్టుతో పోల్చితే 3.45% నుంచి 2.84 శాతానికి దిగివచ్చింది. రేట్ల కోతకు అవకాశం: పరిశ్రమలు రిటైల్, టోకు ధరలు దిగిరావడంతో ఆర్బీఐ పాలసీ వడ్డీరేట్లు తగ్గించడానికి ఇది సరైన అవకాశమని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వ చర్యలు ఫలించినట్లు ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. -
తగ్గిన ధరల సెగ..!
జూన్‌లో టోకు ద్రవ్యోల్బణం 6.01% నుంచి 5.43%కి డౌన్ 8.28 శాతం నుంచి 7.31 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం కొన్ని నిత్యావసరాల ధరలు తగ్గిన ప్రభావం రుతుపవనాల ప్రభావంపై వీడని ఆందోళన న్యూఢిల్లీ: అటు టోకు ధరలు, ఇటు రిటైల్ ధరల వేగం జూన్‌లో కొంత తగ్గింది. వేర్వేరుగా చూస్తే- టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మేలో 6.01% ఉండగా, ఇది జూన్‌లో 5.43 శాతానికి దిగింది. ఇక వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 8.28 శాతం నుంచి 7.31%కి దిగింది. అంటే గత ఏడాది ఇదే నెలలతో (2013 మే, జూన్) పోల్చితే 2014 మే, జూన్ నెలలో ధరలు ఆ రేట్ల (శాతాల) మేరకు పెరిగాయన్నమాట. టోకు ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టంకాగా, రిటైల్ ద్రవ్యోల్బణం 30 నెలల కనిష్టం. కూరగాయలుసహా కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం ధరల స్పీడ్ తగ్గడానికి కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఎల్‌నినో, రుతుపవనాల ప్రభావం ఇంకా ఆందోళన కలిగించే అంశమేనని అంటున్నాయి. డబ్ల్యూపీఐ తీరు ఇదీ... టోకు ధరలకు సంబంధించి మొత్తం మూడు విభాగాల్లో ఒకటైన ప్రైమరీ ఆర్టికల్స్ ధరల పెరుగుదల రేటు 6.84 శాతంగా ఉంది. ఇందులో భాగమైన ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు 8.14 శాతంగా ఉంది. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు 3.49 శాతంగా నమోదయ్యింది. ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 9.04 శాతంగా నమోదయ్యింది.మొత్తం సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం ద్రవ్యోల్బణం రేటు 3.61 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఇలా... ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 7.9 శాతంగా ఉంది. వేర్వేరుగా కొన్ని ముఖ్య ఆహార ఉత్పత్తుల ధరల స్పీడ్ చూస్తే- పప్పు దినుసుల ధరలు 5.17 శాతం , ప్రొటీన్ ఆధారిత గుడ్లు, చేపలు, మాంసం ధరలు 8.27 శాతం, పాలు, పాల ఉత్పత్తుల ధరలు 11.06 శాతం, కూరగాయల ధరలు 8.73 శాతం, పండ్ల ధరలు 20.64%, ఆల్కాహాలేతర పానీ యాల ధరలు 6.31%, ప్రెపేర్డ్ మీల్స్ ధరలు 7.75 శాతం పెరిగాయి. 2013 జూన్‌తో పోల్చిచూస్తే 2014 జూన్‌లో చక్కెర ధరలు పెరగలేదు. స్వల్పంగా 0.27 శాతం (మైనస్) తగ్గాయి. పారిశ్రామిక వర్గాల హర్షం... అటు టోకు, ఇటు రిటైల్ ధరల స్పీడ్ మే నెలతో పోల్చితే జూన్ నెలలో తగ్గడం పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం చేశాయి. ధరలకు సంబంధించి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశమేనని అసోచామ్ పేర్కొంది. ఏపీఎంసీ చట్టం రద్దు, గిడ్డంగి సదుపాయాల వంటి బ్యాక్-ఎండ్ ఇన్ఫ్రా వంటి చర్యల ద్వారా మున్ముందు ధరల పెరుగుదలను అడ్డుకోవాలని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ సూచించారు. మే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ, జూన్ ద్రవ్యోల్బణం గణాంకాలు మెరుగుపడ్డం వృద్ధి రికవరీకి సంకేతంగా కనిపిస్తున్నట్లు సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. -
కంపెనీల ఆదాయంలో 11-12% వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీల ఆదాయాలు స్థిరంగా 7-9% ఉంటాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రీసెర్చ్ పేర్కొంది. కాని గత రెండు త్రైమాసికాలతో పోలిస్తే ఆదాయాల క్షీణత ఆగి స్వల్ప వృద్ధి కనిపిస్తోందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11-12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం వస్తుందన్న అంచనాతో ఆదాయం, నిర్వహణ లాభాల్లో క్షీణత ఆగి, వృద్ధి నమోదవుతోందని క్రిసిల్ ప్రెసిడెంట్ ముఖేష్ అగర్వాల్ తెలిపారు. దీనికితోడు గత 12-18 నెలల నుంచి ఆగిపోయిన ప్రాజెక్టుల్లో కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, అం తర్జాతీయంగా జీడీపీ, ఎగుమతుల్లో వృద్ధి కనపడటంతో ఈ ఏడాది ఆదాయాలు 12% వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కీలకమైన లోహాలు, ఇంధన, బొగ్గు ధరలు తగ్గడంతో కంపెనీల ఎబిట్టా మార్జిన్లు 1% పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపాయి క్షీణత వల్ల ఐటీ, ఫార్మా, రెడీమేడ్ గార్మెంట్స్, కాటన్ యార్న్ రంగాల ఆదాయాలు బాగా పెరగనున్నాయి. అలాగే గత 3 త్రైమాసికాల నుంచి వృద్ధి బాటలోకి వచ్చిన టెలికం, రిటైల్, మీడియా రంగాలు ఇదే విధమైన ధోరణిని కొనసాగిస్తాయని క్రిసిల్ పేర్కొంది.