‘మైనస్’లోనే టోకు ధరలు
- 2014 ఫిబ్రవరితో పోల్చితే 2015 ఫిబ్రవరిలో ధరలు డౌన్
- మైనస్ 2.06 శాతంగా నమోదు
- తదుపరి రేట్ల కోతపై పరిశ్రమల ఆశలు
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2014 ఫిబ్రవరితో పోల్చితే, 2015 ఫిబ్రవరిలో (వార్షికంగా) టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు అసలు పెరక్కపోగా క్షీణతలోకి జారింది.
మైనస్ (-)2.06 శాతంగా నమోదయ్యింది. ఇంత కనిష్ట స్థాయిలో ఈ రేటు నమోదుకావడం 40 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. దీనితో వరుసగా నాలుగు నెలల నుంచీ ఇదే ధోరణి కొనసాగుతున్నట్లయ్యింది. టోకు ధరల సూచీలో ప్రధాన విభాగాలైన ఆహారం, ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. నవంబర్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం -0.17%. డిసెంబర్‌లో ఈ రేటు -0.50%. జనవరిలో -0.39%. 2014 ఫిబ్రవరిలో ఈ రేటు 5.03 %.
సామాన్యునికి భారమే..: ముఖ్యంగా సామాన్యునికి సంబంధించినంతవరకూ ఆహార ఉత్పత్తుల ధరల బాస్కెట్ వార్షిక సూచీ పెద్దగా ఊరటనివ్వడం లేదు. ఈ రేటు వార్షికంగా 7.74 శాతంగా ఉంది. ఈ బాస్కెట్‌లో ప్రధాన ఉత్పత్తులను వేర్వేరుగా చూస్తే... కూరగాయల ధరలు వార్షికంగా 15.54%పెరిగాయి. జనవరిలో ఈ పెరుగుదల రేటు 19.74%. తాజా పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు మళ్లీ ఆశగా ఆర్‌బీఐ వైపు దృష్టి సారించడం ప్రారంభించాయి. కీలక రెపో రేటును మరో దఫా తగ్గించాలని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి.