టోకు ధరలకు ఇంధన సెగ!
డిసెంబర్‌లో 3.39 శాతం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం డిసెంబర్ టోకు ధరల బాస్కెట్‌పై పడింది. 2016 డిసెంబర్‌లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.39 శాతంగా నమోదయ్యింది. అంటే 2015 డిసెంబర్‌తో పోల్చితే 2016 డిసెంబర్‌లో టోకు ధరల బాస్కెట్ ధర 3.39 శాతం పెరిగిందన్నమాట. కాగా నవంబర్‌లో ఈ రేటు 3.15 శాతం. గత ఏడాది ఇదే కాలంలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా – 1.06 క్షీణతలో ఉంది.
మూడు భాగాలు వేర్వేరుగా...
ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్‌ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో రేటు 4.58 శాతం నుంచి 0.27 శాతానికి తగ్గింది. ఇక ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 7.89 శాతం నుంచి –0.70 శాతం క్షీణతకు చేరింది. (నవంబర్‌లో ఈ రేటు 1.54 శాతం) పలు నిత్యావసర ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం. ఇక నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 7.84% నుంచి 0.62%కి తగ్గింది.
ఫ్యుయల్, పవర్: ఈ విభాగంలో –9.15 శాతం క్షీణత నుంచి 8.65 శాతం పెరుగుదల నమోదయ్యింది. డీజిల్ ధరలు 20.25 శాతం పెరిగితే, పెట్రోల్ ధరలు 8.52 శాతం పెరిగాయి.
తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం పైగా వాటాఉన్న ఈ రంగం కూడా –1.49 శాతం క్షీణ బాట నుంచి 3.67 శాతం పెరుగుదలకు మళ్లింది.
నిత్యావసరాలు హోల్‌సేల్‌గా...
ఫుడ్ ఆర్టికల్స్‌లో ధరల తీరును ప్రత్యేకంగా చూస్తే... కూరగాయల ధరలు అసలు పెరక్కపోగా వార్షికంగా 2015 డిసెంబర్‌తో పోల్చిచూస్తే, – 33.11 శాతం తగ్గాయి. ఒక్క ఉల్లిపాయలు చూస్తే, ధర –37.20 శాతం తగ్గింది. చక్కెర ధర భారీగా 28.04 శాతం పెరిగింది. ఆలూ ధర 26.42 శాతం ఎగసింది. పప్పుధాన్యాల ధరలు 18.12 శాతం ఎగశాయి. గుడ్లు, మాసం, చేపల ధరలు 2.73 శాతం పెరిగాయి.