టోకు ధరల మంట
ఆగస్టులో ద్రవ్యోల్బణం 3.24 శాతం
► నాలుగు నెలల గరిష్టం
► ఆహార, ఇంధన ధరల తీవ్రత కారణం
న్యూఢిల్లీ: రిటైల్ ధరల తరహాలోనే (ఐదు నెలల గరిష్ట స్థాయిలో 3.36 శాతం) టోకు ధరలు కూడా ఆగస్టులో తీవ్ర స్థాయికి పెరిగాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.24 శాతం పెరిగింది. అంటే 2016 ఆగస్టు టోకు ఉత్పత్తుల బాస్కెట్ మొత్తం ధరతో పోల్చితే 2017 ఆగస్టులో ఇదే బాస్కెట్ మొత్తం ధర 3.24 శాతం ఎగిసిందన్నమాట. ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదుకావడం నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. కూరగాయలు, ఉల్లిసహా పలు నిత్యావసర ధరల తీవ్రత దీనికి కారణం. 2017 జూలైలో టోకు ద్రవ్యోల్బణం 1.88%కాగా, 2016 ఆగస్టులో ఈ రేటు 1.09%.
ప్రధాన విభాగాలు చూస్తే...
ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 4.78 శాతం నుంచి 2.66 శాతానికి తగ్గింది. అయితే ఇందులో కేవలం ఫుడ్ ఆర్టికల్స్‌ను చూస్తే– రేటు 4.93 శాతం నుంచి 5.75 శాతానికి ఎగిసింది. జూలైలో ఈ రేటు 2.15 శాతంగా ఉంది. ఇక నాన్–ఫుడ్ ఆర్టికల్స్ ధరలు మాత్రం అసలు పెరక్కుండా 5.84% పెరుగుదల రేటు నుంచి – 3.60% క్షీణతకు పడిపోయాయి.
ఫ్యూయల్, పవర్: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం –7.42% క్షీణత నుంచి ఏకంగా 9.99%కి చేరింది. జూలైలో ఈ రేటు 4.37 శాతం.
తయారీ: మొత్తం ఇండెక్స్‌లో దాదాపు 64 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 0.92% నుంచి 2.45%కి చేరింది.
నిత్యావసరాలను చూస్తే...
కూరగాయల ధరలు భారీగా 44.91 శాతం పెరిగాయి. జూలైలో ఈ పెరుగుదల రేటు 21.95 శాతం. జూలై ఉల్లి ధరలు 9.50 శాతం పెరిగితే తాజా సమీక్ష నెల ఆగస్టులో 88.46 శాతం తగ్గాయి. పండ్ల ధరలు 7.35 శాతం పెరిగాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు 3.93 శాతం పెరిగాయి. తృణ ధాన్యాలు (0.21 శాతం), ధాన్యం (2.70 శాతం) ధరలూ ఎగిశాయి. అయితే ఆలూ ధరలు – 2 శాతం తగ్గాయి. పప్పు ధరలూ – 30.16 శాతం దిగివచ్చాయి.