
జనవరిలో 4.3 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కూరగాయలు, గుడ్లు, పప్పు ధాన్యాల ధరల క్షీణతతో జనవరిలో మరికాస్త తగ్గి 4.31 శాతానికి పరిమితమైంది. ఇది అయిదు నెలల కనిష్టం. చివరిసారిగా 2024 ఆగస్టులో ఇది 3.65 శాతంగా నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాది జనవరిలో 5.1 శాతంగాను, డిసెంబర్‌లో 5.22 శాతంగాను ఉంది.
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం జనవరిలో ఆహార పదార్థాల బాస్కెట్ ద్రవ్యోల్బణం 6.02 శాతంగా ఉంది. గత ఆగస్టులో నమోదైన 5.66 శాతం తర్వాత ఇది కనిష్టం. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గినట్లు ఎన్‌ఎస్‌వో తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో ఆర్‌బీఐ త్వరలో మరోసారి కీలక వడ్డీ రేట్లను మరో పావు శాతం తగ్గించే అవకాశాలు ఉన్నాయి.