న్యూఢిల్లీ: భారత్ తాజా స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు నవంబర్‌లో కేవలం 1.4 శాతంగా ఉంది. ఇక డిసెంబర్‌లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా 5.59 శాతానికి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న శ్రేణి కన్నా (2–6 శాతం) ఇది తక్కువగానే ఉన్నప్పటికీ ఎగువముఖ పయనం ఆందోళన కలిగిస్తోంది.
సూచీ కదలికలు ఇలా...
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) గణాంకాల ప్రకారం 2020 నవంబర్‌లో ఐఐపీ సూచీ 126.7 వద్ద ఉంది. 2021 నవంబర్‌లో ఈ సూచీ 128.5కు ఎగసింది. అంటే వృద్ధి రేటు 1.4 శాతమన్నమాట. 2019 నవంబర్లో సూచీ 128.8 పాయింట్ల వద్ద ఉంటే. అంటే కోవిడ్–19 దేశంలోకి ప్రవేశించిక ముందు నవంబర్ నెలతో పోల్చితే ఇంకా పారిశ్రామిక వృద్ధి దిగువలోనే ఉందని గ ణాంకాలు సూచిస్తున్నాయి. 2020 నవంబర్‌లో పారిశ్రామిక రంగం ఉత్పత్తి (–1.6%) క్షీణతలో ఉన్నా, తాజా సమీక్షా నెల (నవంబర్ 2021) ఈ విభాగం పేలవ పనితీరునే కనబరచడం గమనార్హం.
కీలక రంగాలు చూస్తే..
► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా ఉన్న ఈ విభాగంలో వృద్ధి (2020 నవంబర్‌తో పోల్చి) కేవలం 0.9 శాతంగా నమోదయ్యింది.
► మైనింగ్: ఈ రంగంలో మాత్రం కొంచెం సానుకూల వృద్ధి రేటు 5 శాతం నమోదయ్యింది.
► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాలు, డిమాండ్‌కు సంబంధించిన ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 3.7 శాతం క్షీణత నెలకొంది.
► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం 5.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది.
► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, పెర్‌ఫ్యూమ్స్ వంటి ఎంఎఫ్‌సీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) విభాగంలో వృద్ధి 0.8 శాతం.
నవంబర్–డిసెంబర్ మధ్య ‘బేస్ ఎఫెక్ట్’
ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి 17.4%గా నమోదైంది. దీనికి ‘లో బేస్’ ఎఫెక్ట్ ప్రధాన కారణం. ‘పోల్చు తున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదవడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కు వగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్.
2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట...
మహమ్మారి కరోనా భయాలతో కఠిన లాక్‌డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7%) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది.
ధరల తీవ్రత
మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం అప్పర్ బాండ్ 6 శాతం దిశగా కదులుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్‌లో 4.91 శాతంగా ఉన్న రిటైల్ ఉత్పత్తుల ధరల బాస్కెట్, డిసెంబర్‌లో ఏకంగా 5.59 శాతానికి (2020 ఇదే నెలతో పోల్చి) చేరింది. తాజా సమీక్షా నెల్లో ఒక్క వస్తు, సేవల ధరలు (ఆహార, ఇంధన రంగాలు కాకుండా) ఏకంగా 6.2 శాతానికి చేరడం గమనార్హం. 2021 డిసెంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 4.05 శాతంగా ఉంది.
నవంబర్‌లో రేటు 1.87 శాతం. తృణ ధాన్యాలు, ఉత్పత్తులు, గుడ్లు, పాలు–పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, ప్రెపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ ధరలు నవంబర్‌తో పోల్చితే పెరిగాయి. అయితే కూరగాయలు, పండ్లు, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ధరలు మాత్రం కొంత తక్కువగా ఉన్నాయి. ఇంధనం, లైట్ క్యాటగిరీలో ద్రవ్యోల్బణం 10.95 శాతంగా ఉంటే, నవంబర్‌లో ఈ రేటు 13.35 శాతంగా ఉంది. 2021 జూలైలో 5.59 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం అటు తర్వాత తగ్గుతూ వచ్చినా, తిరిగి 2021 అక్టోబర్ నుంచి పెరుగుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment