ఆర్‌బీఐ అంచనాలను మించి ద్రవ్యోల్బణం | UBS sees CPI overshooting by 60 bps this quarter to 6. 8 pc | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ అంచనాలను మించి ద్రవ్యోల్బణం

Published Thu, Sep 14 2023 6:27 AM | Last Updated on Thu, Sep 14 2023 6:27 AM

UBS sees CPI overshooting by 60 bps this quarter to 6. 8 pc - Sakshi

ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్‌) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలకు మించి నమోదవుతుందని యూబీఎస్‌ అంచనాలు వేస్తోంది. 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనావేస్తుండగా, క్యూ2లో  6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా.

వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతం. అయితే క్యూ2లో అంచనాలకు మించి 6.8 శాతం వినియోగ ద్రవ్యోల్బణం నమోదవుతందన్నది యూబీఎస్‌ తాజా అంచనా. సెపె్టంబర్‌లో 6 శాతం పైబడి సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం నమోదవుతుందని భావిస్తున్నట్లు యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా చీఫ్‌ ఎకనమిస్ట్‌ తన్వీ గుప్తా జైన్‌ పేర్కొన్నారు. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతానికి తగ్గినప్పటికీ ఈ స్థాయి సైతం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయికన్నా 83 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) అధికంగా ఉండడం గమనార్హం.

పలు నిత్యావసర వస్తువులు సామాన్యునికి అందని తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఫుడ్‌ బాస్కెట్‌ ద్రవ్యోల్బణం 9.94 శాతంగా ఉంది. ఒక్క కూరగాయల ధరల పెరుగుదల చూస్తే, 2023 ఆగస్టులో 26.14 శాతంగా ఉంది.  ఆగస్టులో ఆయిల్, ఫ్యాట్స్‌ విభాగం (మైనస్‌ 15.28 శాతం) మినహా అన్ని విభాగాల్లో ధరలూ పెరుగుదనే సూచించాయి. వీటిలో  తృణధాన్యాలు (11.85 శాతం), మాంసం–చేపలు (3.68 శాతం), గుడ్లు (4.31 శాతం), పాలు–పాల ఉత్పత్తులు (7.73 శాతం), పండ్లు (4.05 శాతం), కూరగాయలు (26.14 శాతం), పుప్పు దినుసులు (13.04 శాతం), చక్కెర, సంబంధిత ఉత్పత్తులు (3.80 శాతం), సుగంధ ద్రవ్యాలు (23.19 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (3.67 శాతం), ప్రెపేర్డ్‌ మీల్స్, స్నాక్స్, స్వీట్స్‌ విభాగం  (5.31 శాతం), ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ (9.19 శాతం), పాన్, పొగాకు, మత్తు ప్రేరిత ఉత్పత్తులు (4.10 శాతం) ఉన్నాయి.  దుస్తులు, పాదరక్షల విభాగంలో ఆగస్టు వినియోగ ద్రవ్యోల్బణం 5.15 శాతంగా ఉంది.  హౌసింగ్‌ విభాగంలో ధరల పెరుగుదల 4.38 శాతం. ఫ్యూయెల్‌ అండ్‌ లైట్‌లో 4.31 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement