న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో తాజా గణాంకాలు ఉత్సాహాన్ని నింపాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 4.25 శాతంగా నమోదయ్యింది. అంటే 2022 మేతో పోల్చితే 2023 మేలో రిటైల్ ధరల బాస్కెట్ 4.25 శాతమే పెరిగిందన్నమాట. గడచిన రెండేళ్ల కాలంలో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడ్డం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం 2 ప్లస్ లేదా 2 మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే 6 శాతం పైబడకూడదు.
అయితే 2022 నవంబర్, డిసెంబర్, 2023 మార్చి, ఏప్రిల్, మే మినహా మిగిలిన అన్ని నెలలూ 6 శాతం ఎగువనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగింది. తాజా సమీక్షా నెల్లో 2021 ఏప్రిల్ కనిష్టాన్ని (4.23 శాతం) చూసింది. గడచిన నాలుగు నెలల నుంచీ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుండగా, వరుసగా మూడవనెల నిర్దేశిత 6 శాతం దిగువన నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో గత మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటును ఆర్‌బీఐ 6.5 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం అదుపు నేపథ్యంలో గడచిన రెండు త్రైమాసికాల్లో యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల ధోరణి కొనసాగితే, ఆర్‌బీఐ 2023లో రెపో రేటును పెంచే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.7 శాతం కాగా, గత ఏడాది మే నెల్లో 7.04 శాతంగా ఉంది.
కీలకాంశాలు ఇవీ...
ఒక్క ఆహార విభాగాన్ని పరిశీలిస్తే, మే నెల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.91 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఇది 3.84 శాతం. మొత్తం సూచీలో దీని వెయిటేజ్ దాదాపు 50 శాతం. ఆయిల్, ఫ్యాట్స్ ధరల స్పీడ్ తాజా సమీక్షా నెల్లో 16 శాతం తగ్గింది. కూరగాయల ధరలు 8.18 శాతం దిగివచ్చాయి. అయితే తృణధాన్యాలు, పప్పుదినుసుల ధరలు వరుసగా 12.65 శాతం, 6.56 శాతంగా ఉన్నాయి.
► ఫ్యూయెల్ లైట్ విభాగంలో ధరల స్పీడ్ ఏప్రిల్ లో 5.52% ఉంటే, మేలో 4.64 శాతం.
►ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా. జూన్ త్రైమాసికంలో 4.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది.
ఏప్రిల్‌లో తయారీ, మైనింగ్ చక్కని పనితీరు
ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి నెల ఏప్రిల్‌లో పారిశ్రామిక రంగం మంచి ఫలితాన్ని నమోదుచేసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (సీపీఐ) వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదయ్యింది. తయారీ, మైనింగ్ రంగాలు మంచి వృద్ధిరేటును నమోదుచేసుకున్నట్లు అధికా రిక గణాంకాలు తెలిపాయి. 2023 మార్చితో పోల్చితే (1.7 శాతం వృద్ధి) గణాంకాల తీరు బాగున్నప్పటికీ, 2022 ఏప్రిల్‌తో పోల్చితే (6.7 శాతం) వృద్ధి రేటు తక్కువగా ఉండడం గమనార్హం. అయితే అప్పటి గణాంకాల్లో బేస్ తక్కువగా ఉండడం మరోఅంశం. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన తాజా అంకెలను పరిశీలిస్తే...
Comments
Please login to add a commentAdd a comment