retail prices
-
ఆర్థిక వ్యవస్థ శుభ సంకేతాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో తాజా గణాంకాలు ఉత్సాహాన్ని నింపాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 4.25 శాతంగా నమోదయ్యింది. అంటే 2022 మేతో పోల్చితే 2023 మేలో రిటైల్ ధరల బాస్కెట్ 4.25 శాతమే పెరిగిందన్నమాట. గడచిన రెండేళ్ల కాలంలో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడ్డం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం 2 ప్లస్ లేదా 2 మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే 6 శాతం పైబడకూడదు. అయితే 2022 నవంబర్, డిసెంబర్, 2023 మార్చి, ఏప్రిల్, మే మినహా మిగిలిన అన్ని నెలలూ 6 శాతం ఎగువనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగింది. తాజా సమీక్షా నెల్లో 2021 ఏప్రిల్ కనిష్టాన్ని (4.23 శాతం) చూసింది. గడచిన నాలుగు నెలల నుంచీ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుండగా, వరుసగా మూడవనెల నిర్దేశిత 6 శాతం దిగువన నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో గత మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటును ఆర్బీఐ 6.5 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం అదుపు నేపథ్యంలో గడచిన రెండు త్రైమాసికాల్లో యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల ధోరణి కొనసాగితే, ఆర్బీఐ 2023లో రెపో రేటును పెంచే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.7 శాతం కాగా, గత ఏడాది మే నెల్లో 7.04 శాతంగా ఉంది. కీలకాంశాలు ఇవీ... ఒక్క ఆహార విభాగాన్ని పరిశీలిస్తే, మే నెల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.91 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఇది 3.84 శాతం. మొత్తం సూచీలో దీని వెయిటేజ్ దాదాపు 50 శాతం. ఆయిల్, ఫ్యాట్స్ ధరల స్పీడ్ తాజా సమీక్షా నెల్లో 16 శాతం తగ్గింది. కూరగాయల ధరలు 8.18 శాతం దిగివచ్చాయి. అయితే తృణధాన్యాలు, పప్పుదినుసుల ధరలు వరుసగా 12.65 శాతం, 6.56 శాతంగా ఉన్నాయి. ► ఫ్యూయెల్ లైట్ విభాగంలో ధరల స్పీడ్ ఏప్రిల్ లో 5.52% ఉంటే, మేలో 4.64 శాతం. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా. జూన్ త్రైమాసికంలో 4.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్‌లో తయారీ, మైనింగ్ చక్కని పనితీరు ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి నెల ఏప్రిల్‌లో పారిశ్రామిక రంగం మంచి ఫలితాన్ని నమోదుచేసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (సీపీఐ) వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదయ్యింది. తయారీ, మైనింగ్ రంగాలు మంచి వృద్ధిరేటును నమోదుచేసుకున్నట్లు అధికా రిక గణాంకాలు తెలిపాయి. 2023 మార్చితో పోల్చితే (1.7 శాతం వృద్ధి) గణాంకాల తీరు బాగున్నప్పటికీ, 2022 ఏప్రిల్‌తో పోల్చితే (6.7 శాతం) వృద్ధి రేటు తక్కువగా ఉండడం గమనార్హం. అయితే అప్పటి గణాంకాల్లో బేస్ తక్కువగా ఉండడం మరోఅంశం. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన తాజా అంకెలను పరిశీలిస్తే... -
సామాన్యులకు శుభవార్త, భారీగా తగ్గిన వంట నూనెల ధరలు
వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్చిలో ఉక్రెయిన్‌పై రష్యా దా డుల కారణంగా మన దేశానికి ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గిపోయాయి. ఈ కారణంగా వంట నూనెల ధరలు గణనీయంగా పెరి గాయి. సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇ బ్బందులు పడ్డారు. పల్లి, సన్‌ఫ్లవర్, పామాయిల్ నూనెలను వంటలో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ నూనె గింజల ఉత్పత్తి మన దేశంలో తక్కువగా ఉండటంతో పొరుగు దేశాల నుంచి దిగుమతి అవుతుంది. దిగుమతులు తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తు తం నెల రోజుల వ్యవధిలోనే ధరలు భారీగా తగ్గడంతో సామాన్యులపై భారం తప్పింది. గతంలో సన్‌ఫ్లవర్ నూనె లీటర్‌కు రూ.210గా ఉండగా, ఇప్పుడు రూ.150కి చేరింది. పల్లి నూనె లీటర్‌కు రూ.220 పలుకగా రూ.165కి తగ్గింది. పామాయిల్ ధర లీటర్‌కు రూ.150 నుంచి రూ.95కు తగ్గింది. పామాయిల్‌న్ గతంలో పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ దుకాణా ల్లో తక్కువ ధరకు విక్రయించేవారు. సబ్సిడీ భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ నూనె సరఫరాను నిలిపివేసింది. ప్రస్తుతం నూనె ధరలు రూ.55 నుంచి రూ.60 వరకు తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ధరలు మళ్లీ పెరగకుండా చూడాలని కోరుతున్నారు. చదవండి👉 చమురు ఉత్పత్తికి ఒపెక్ కోత, దేశంలో మళ్లీ పెట్రో ధరల మంట? -
కేంద్రం శుభవార్త, వంటనూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు
వంటనూనెల వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రాబోయే రోజుల్లో వంటనూనెలు మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వివిధ రకాల నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వంటనూనెల ధరలు పెరగుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్‌లలో తగ్గిపోయిన సోయా ఉత్పత్తి, ఇండోనేషియాలో పెరిగిన పామాయిల్ రేట్లు పెరిగాయి. దీంతో రాబోయే రోజుల్లో వంటనూనెల ధరలు పెరుగుతాయనే అంచనాల నడుమ కేంద్రం వాటి ధరల్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ముడి పామాయిల్‌పై ఉన్న 10% దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి, ముడి సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ఉన్న 7.5% సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించింది. ఇక అన్ని రకాల రిఫైన్డ్ ఆయిల్స్‌పై ఉన్న దిగుమతి సుంకాన్ని 37.75% నుంచి 32.5 శాతానికి కుదించడంతో.. తాజా ముడి నూనెలపై దిగుమతి సుంకంతో కలుపుకొని మొత్తం పన్నులు 24.75 శాతానికి తగ్గనున్నాయి. ఇక రిఫైన్డ్ ఆయిల్స్‌పై ఉన్న పన్ను 35.75 శాతానికి చేరనుండగా దిగుమతి సుంకం తగ్గింపుతో వంటనూనెల ధరలు మరితం తగ్గనున్నాయి. చదవండి: ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్ -
మార్కెట్‌కు రిలయన్స్ అండ
ముంబై: అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు నాలుగు శాతానికి పైగా లాభపడటంతో సూచీలు రెండు రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కూడా సూచీల లాభాలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 222 పాయింట్ల లాభంతో 51,532 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 15,173 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు ఆల్‌టైం హై కావడం విశేషం. కన్జూమర్, ఐటీ, మెటల్, ఫార్మా, ప్రైవేట్ రంగ బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆటో, ఆర్థిక, మీడియా, రియల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 435 పాయింట్ల పరిధిలో 51,157 – 51,592 శ్రేణిలో కదలాడగా.., నిఫ్టీ 123 పాయింట్ల రేంజ్లో 15,065 –15,188 స్థాయిల మధ్య ట్రేడైంది. ఆర్థిక వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప జేసే డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), జనవరి రిటైల్ ధరల(సీపీఐ) ఆర్థిక గణాంకాలు నేడు (శుక్రవారం) విడుదల అవుతాయి. ఇన్వెస్టర్లు ఈ స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి సారించనున్నారు. మార్కెట్లో మూమెంటమ్ ఇలాగే కొనసాగితే నిఫ్టీ తనకు కీలక నిరోధంగా ఉన్న 15,250 స్థాయిని ఛేదించవచ్చని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నాలుగు శాతానికి పైగా లాభపడ్డ రిలయన్స్ ... ఫ్యూచర్ రిటైల్‌లో రిలయన్స్ వాటా కొనుగోలు ఒప్పందానికి అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పును వెల్లడించడంతో గత కొన్ని రోజులుగా నష్టాన్ని చవిచూస్తున్న రిలయన్స్ షేరు గురువారం రాణించింది. ఈ షేరు బీఎస్ఈలో రూ.1,980 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో 4.55 శాతం ఎగిసి రూ.2064 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి 4.13 శాతం లాభంతో రూ.2056 వద్ద స్థిరపడింది. రిలయన్స్ రిటైల్‌తో రూ.24,718 కోట్ల ఒప్పందం విషయంలో అమెజాన్‌కు అనుకూలంగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై మంగళవారం ఢిల్లీ డివిజనల్ బెంచ్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ మార్కెట్లకు పావెల్ వ్యాఖ్యల జోష్... అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు, కొత్త ఉద్యోగాల సృష్టి ఆశించిన స్థాయికి చేరుకునే వరకు అవసరమైతే భవిష్యత్తులో కీలక వడ్డీ రేట్లను మరింత తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు చైర్మన్ జెరోమ్ పావెల్ వెల్లడించారు. పావెల్ వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో చైనా, జపాన్, సౌత్ కొరియా మార్కెట్లకు గురువారం సెలవు రోజు. మార్కెట్లో మరిన్ని సంగతులు... 1. మెరుగైన క్యూ3 ఫలితాలను ప్రకటించడంతో హిందా ల్కో షేరు ఆరు శాతం లాభపడింది 2. రూట్ మొబైల్ షేరు ఇంట్రాడేలో 20 శాతం ఎగసి రూ.1,527 వద్ద అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యింది. 3. డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు మెప్పించినా ఎంఆర్ఎఫ్ షేరు ఏడు శాతం పతనమై రూ.90,084 వద్ద స్థిరపడింది. 4. ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఐటీసీ షేరు అరశాతం క్షీణించి రూ.227 వద్ద ముగిసింది. -
రిటైల్‌కు రెక్కలొచ్చాయ్!
సాక్షి, హైదరాబాద్ : దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వస్తు, సేవల రిటైల్ ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడిని ధరాఘాతం తాకుతోంది. జీవనవ్యయం పెరిగి జేబుపై ఆర్థికభారం పడుతోంది. అక్టోబర్ నెలలో దేశంలో ద్రవ్యోల్బణం 7.61 శాతానికి చేరుకోగా, తెలంగాణ రాష్ట్రంలో అది ఏకంగా 10.37 శాతానికి ఎగబాకింది. దీంతో ద్రవ్యోల్బణం రేటులో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉంది. గత ఏడాది ఒకనెలతో పోల్చితే (ఉదాహరణకు అక్టోబర్ 2019– అక్టోబర్ 2020 మధ్య తేడా), ఈ ఏడాది అదేనెలలో వినియోగదారుల ధరల సూచీలో పెరుగుదల రేటునే ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం పెరిగినపుడు... ప్రజల జీవన వ్యయం పెరిగిపోతుంది. రూపాయి కొనుగోలు శక్తి తగ్గుతుంది. కేంద్ర గణాంక, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌పీఐ) అక్టోబర్ నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణం గణాంకాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం 2020 అక్టోబర్‌లో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 10.37 శాతానికి చేరింది. పశ్చిమబెంగాల్ 10.89 శాతం ద్రవ్యోల్బణంతో దేశంలో అగ్రస్థానంలో నిలవగా, 10.14 శాతంతో ఒడిశా, 10.03 శాతంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ రెండో స్థానంలో ఉండటాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో రిటైల్ ధరలు రాకెట్ వేగంతో పెరిగిపోయాయని స్పష్టమవుతోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం గత కొంతకాలంగా దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేస్తూ వస్తోంది. గత మార్చి నెలలో దేశంలో ద్రవ్యోల్బణం 5.91 శాతం నమోదు కాగా, 8.12 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. పల్లెల్లో బతుకుభారం గత అక్టోబర్‌లో గ్రామీణ తెలంగాణలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. 11.98 శాతం ద్రవ్యోల్బణం రేటుతో గ్రామీణ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ పట్టణ ప్రాంతాలు 9.05 శాతం ద్రవ్యోల్బణంతో జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచాయి. మరో విధంగా చెప్పాలంటే తెలంగాణ పల్లెల్లో రిటైల్ ధరలు దాదాపు 12 శాతం, పట్టణాల్లో 9.05 శాతం పెరిగాయి. ద్రవ్బోల్బణం పెరిగితే రూపాయి విలువ క్షీణించి ప్రజల కొనుగోలు శక్తిని హరిస్తుంది. కూరగాయలు, ఉల్లి ధరలే ప్రధానకారణం ప్రధానంగా కూరగాయలు, ఉల్లి, ఇతర ఆహారపదార్థాల ధరలు అసాధారణంగా పెరగడంతో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది. వినియోగదారుల ధరల సూచిక (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ప్రకారం గతేడాదితో పోల్చితే ప్రస్తుతం జాతీయ స్థాయిలో కూరగాయల ధరలు 22.51 శాతం, పప్పు ధాన్యాల ధరలు 18.34 శాతం, మాంసం, చేపల ధరలు 18.70 శాతం, గుడ్ల ధరలు 21.81 శాతం, నూనెల ధరలు 15.17 శాతం వరకు పెరిగిపోయాయి. కరోనా మహమ్మారి నియంత్రణకు లాక్డౌన్ విధించిన నాటి నుంచి కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. చాలా కూరగాయలు కిలో సగటున రూ.60 నుంచి 100 వరకు ఎగబాకాయి. ఇక ఉల్లి ధరలకు రెక్కలు వచ్చి ఒకదశలో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలికింది. భారీ వర్షాలతో ఉల్లి, కూరగాయల పంటలు దెబ్బతినడంతో మార్కెట్లో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక ధరలు పెరుగుదలకు దారితీసిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణలో వరిసాగు పెరడమే కారణం తెలంగాణ రాష్ట్రం కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, చేపలు, మాంసం వంటి ఆహార పదార్థాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. స్థానికంగా ఉన్న డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో రాష్ట్రంలో వీటి ధరలు దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా అధికంగా ఉంటున్నాయని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 2011–12లో రాష్ట్రంలో రూ.9,317.47 కోట్ల విలువ చేసే పండ్లు, కూరగాయల ఉత్పత్తి జరగగా, 2017–18 వచ్చేసరికి ఈ ఉత్పత్తుల విలువ రూ.5,737.41 కోట్లకు తగ్గిపోయిందని కేంద్ర గణాంక, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో గత దశాబ్దకాలంగా పండ్లు, కూరగాయల ఉత్పత్తి దాదాపు సగానికి తగ్గిపోయిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో వరిసాగు ఏటేటా గణనీయంగా పెరిగిపోతోంది. వివిధ సాగునీటి ప్రాజెక్టుల కింద దశాబ్దాలుగా బీడువారిన లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ఏడాది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని సరఫరా చేసి స్థిరీకరించారు. గతంలో కూరగాయలు, పప్పుదినుసులు, ఇతర పంటలు పండించిన రైతులు సాగునీరు వచ్చేసరికి వరి సాగువైపు మళ్లారు. దీంతో ఈ ఏడాది రాష్ట్రంలో కూరగాయల సాగు మరింతగా తగ్గిపోవడంతో... సరఫరా తగ్గి వీటి ధరలు గణనీయంగా పెరిగిపోయాయని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన నియంత్రిత పంటల సాగు విజయవంతమై... స్థానిక అవసరాలకు తగ్గట్టు ఇక్కడే కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు పెరిగితే ధరలు దిగి వచ్చే అవకాశముంది. డిమాండ్‌కు తగ్గట్టు సప్లై లేదు ఆర్థిక మాంద్యం, కరోనా మహమ్మారి, లాక్డౌన్, నిరుద్యోగం కారణంగా ప్రజల జేబుల్లో డబ్బులు లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారులు లేక డిమాండ్ పతనమై ధరలు తగ్గాల్సింది పోయి... పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టు ఆహారపదార్థాల సరఫరా లేకపోవడం ధరలు పెరగడానికి దోహదపడింది. దేశానికే ధాన్య భండాగారంగా పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం, కూరగాయలు, పండ్లు, ఉల్లి, పప్పులు, మసాల దినుసులు, ఇతర ఆహారపదార్థాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతోంది. ఇతర రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన ధరలు కొద్దిగా పెరిగినా తెలంగాణలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతోంది. ప్రధానంగా పేద, బలహీనవర్గాల ప్రజల జీవనం దుర్భరంగా మారిందని ద్రవ్యోల్బణం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణకు అవసరమైన పండ్లు, కూరగాయలు, పప్పులు వంటి వాటి ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కూరగాయలు, ఉల్లిని పేదలకు సబ్సిడీపై సరఫరా చేయాలి. లేకుంటే పేద ప్రజలకు రెండు పూటల కడుపు నిండా తిండి కూడా లభించదు. – పీఎస్ఎం రావు, ఆర్థికవేత్త -
అదుపులోకిరాని రిటైల్ ధరలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనికి రావడంలేదు. 2020 అక్టోబర్‌లో 7.61 శాతంగా నమోదయ్యింది. అంటే సూచీలోని ఉత్పత్తుల బాస్కెట్ ధర 2019 అక్టోబర్‌తో పోల్చితే 2020 అక్టోబర్‌లో 7.61 శాతం పెరిగిందన్నమాట. ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల మొత్తం సూచీపై ప్రభావం చూపిస్తోంది. సెప్టెంబర్‌లో సూచీ 7.27 శాతంగా ఉంది. సూచీలోని ప్రధాన విభాగాల్లో ఒకటైన ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 10.68 శాతం ఉంటే, అక్టోబర్‌లో 11.07 శాతంగా నమోదయ్యింది. కూరగాయల ధరలు వార్షికంగా చూస్తే, అక్టోబర్‌లో 22.51 శాతం పెరిగాయి. వడ్డీరేట్ల తగ్గింపు కష్టమే! రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనికిరాని పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4శాతం) మరింత తగ్గించే అవకాశాలు లేనట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్ట్, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. తగ్గుతుందన్న విశ్వాసం... అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. వ్యవసాయ రంగం పరిస్థితి ఆశాజనకంగా ఉండడం, ముడి చమురు ధరలు ఒక నిర్దిష్ట శ్రేణితో తిరుగుతుండడం, లాక్డౌన్ నిబంధనల సడలింపులతో సరఫరాల వ్యవస్థ మెరుగుపడుతుండడం ఆర్బీఐ అంచనాలకు ప్రధాన కారణాలు. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ తన పాలసీ సమీక్షలో భావించింది. ఈ అంచనాల నేపథ్యంలో వృద్ధికి దోహదపడే సరళతర ద్రవ్య విధానంవైపే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. మరోవైపు ఇప్పటికే ఏడాది ఆపైన కాలపరిమితుల స్థిర డిపాజిట్ రేటు 4.90 నుంచి 5.50 శాతం శ్రేణిలో ఉన్నాయని, ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోల్చితే ఇది నెగటివ్ రిటర్న్స్ అనీ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. -
పారిశ్రామిక ఉత్పత్తిపై తయారీ దెబ్బ
► ఫిబ్రవరిలో అసలు వృద్ధిలేకపోగా మైనస్ 1.2 శాతం క్షీణత ► నాలుగు నెలల కనిష్ట స్థాయి ►తయారీ రంగం ఉత్పత్తి మైనస్ 2 శాతం పతనం న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఫిబ్రవరిలో పేలవ పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు పెరుగుదల లేకపోగా –1.2 శాతం (2016 ఫిబ్రవరితో పోలిస్తే) క్షీణించింది. నాలుగు నెలల్లో ఇలాంటి ఫలితం రావడం ఇదే తొలిసారి. తాజా ఫలితానికి మొత్తం సూచీలో దాదాపు 75 శాతంగా ఉన్న తయారీ రంగం ప్రతికూలతే కారణం. ఈ విభాగంలో సైతం అసలు వృద్ధిలేకపోగా –2 శాతం క్షీణత నమోదయ్యింది. తయారీ రంగంలోని 22 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల వృద్ధిరేటును నమోదుచేసుకున్నాయి. క్యాపిటల్ గూడ్స్, వినియోగ విభాగాల్లో ఉత్పత్తుల ధోరణి కూడా నిరాశే. 2016 ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధిరేటు 1.99 శాతం గాకా, ఈ ఏడాది జనవరిలో 3.27 శాతంగా నమోదయ్యింది. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను చూస్తే... క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు సూచికయిన ఈ విభాగం 2016 ఫిబ్రవరిలో భారీగా –9.3 శాతం క్షీణత నమోదుచేస్తే, 2017లో ఈ క్షీణ రేటు –3.4 శాతంగా ఉంది. వినియోగ ఉత్పత్తులు: వార్షికంగా 0.6 శాతం వృద్ధి 5.6 శాతం క్షీణతకు పడిపోయింది. ఇందులో ఒక భాగమైన నాన్–డ్యూరబుల్ కన్జూమర్ గూడ్స్ – 4.9 శాతం క్షీణత నుంచి మరింతగా –8.6 క్షీణ రేటుకు జారిపోయింది. డ్యూరబుల్ సెగ్మెంట్ విషయంలో 10.4% వృద్ధి –0.9% క్షీణతకు జారింది. 11 నెలల్లో... గడచిన ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకూ 11 నెలల కాలంలో (2016 ఏప్రిల్–2017 ఫిబ్రవరి) పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 0.4 శాతంగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఈ రంగం వృద్ధి 2.6 శాతం. కాగా తాజా పారిశ్రామిక ఉత్పత్తి ఫలితాల నేపథ్యంలో తిరిగి పారిశ్రామిక వర్గాల నుంచి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) కోత డిమాండ్ ప్రకటనలు వెలువడుతున్నాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 15 శాతంగా ఉన్న పారిశ్రామిక రంగం పునరుత్తేజానికి రేటు కోత తప్పదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. రిటైల్ ధరల సెగ మార్చిలో 3.81 శాతం అప్ ఐదు నెలల గరిష్టం న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2017 మార్చిలో 3.81 శాతంగా నమోదయ్యింది. అంటే రిటైల్ ధరల బాస్కెట్ మొత్తంగా 2016 మార్చితో పోల్చితే 2017 మార్చిలో 3.81 శాతం పెరిగాయన్నమాట. మార్చికి ముందు గడచిన ఐదు నెలల కాలంలో రిటైల్ ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. ఫిబ్రవరిలో ఈ రేటు 3.65 శాతంగా ఉంది. గత ఏడాది మార్చి రేటు 4.83 శాతం. బుధవారంనాడు విడుదల చేసిన మార్చి గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు.. ► ఆహార ఉత్పత్తుల విషయానికి వస్తే– పాల ధరలు 4.69 శాతం పెరిగితే, పాల ఉత్పత్తుల ధరలు 3.21 శాతం ఎగశాయి. ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ ధరలు 5.65 శాతం ఎగశాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం అసలు పెరక్కపోగా – 7.24 శాతం క్షీణించాయి. ► ఇంధనం, లైట్ కేటగిరీలో ద్రవ్యోల్బ ణం 5.56 శాతంగా ఉంది. ► కాగా గ్రామీణ ప్రాంతంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 3.74 శాతంగా ఉంటే, పట్టణ ప్రాంతంలో 3.88 శాతంగా నమోదయ్యింది. -
నిత్యావసరాల ధరల మంట..
♦ జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.77 శాతం ♦ 22 నెలల గరిష్ట స్థాయి ♦ గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువ న్యూఢిల్లీ : రిటైల్ ధరలు సామాన్యునిపై మరింత భారంగా మారాయి. 2015 జూన్‌తో పోల్చితే 2016 జూన్‌లో దేశం మొత్తానికి సంబంధించి వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) సూచీ 5.77 శాతం పెరిగింది. ఇది 22 నెలల గరిష్ట స్థాయి. ఈ ఏడాది మేనెలతో పోల్చితే (5.76 శాతం) ఇది ఒక బేస్ పాయింట్ (100 బేస్ పాయింట్లు ఒక శాతం) అధికం. 2015 జూన్‌లో రేటు 5.40 శాతం. చక్కెర, పప్పు దినుసులు, కూరగాయలుసహా పలు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడం రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతకు కారణం. కాగా జూన్ రిటైల్ ద్రవ్యోల్బణం గ్రామీణ (6.2 శాతం) ప్రాంతంలో మరింత తీవ్రంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 5.26 శాతంగా నమోదయ్యింది. ఆగస్టు 9 పరపతి విధానం సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు కోత (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణ రేటు- ప్రస్తుతం 6.5 శాతం) అంచనాకు తాజా గణాంకాలు విఘాతం కలిగిస్తాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విభాగాల వారీగా చూస్తే... ⇒ ఆహారం... పానీయాలు: ఇందులో ఒక్క ఆహార విభాగాన్ని చూస్తే... ద్రవ్యోల్బణం మేలో 7.47 శాతం ఉండగా, జూన్‌లో 7.79 శాతానికి ఎగసింది. ఆహారం, పానీయాలు రెండింటినీ కలిపి చూస్తే.. ద్రవ్యోల్బణం రేటు 7.28 శాతంగా ఉంది. భారీగా ధరలు పెరిగిన ఉత్పత్తుల్లో పప్పు దినుసులు (27 శాతం), చక్కెర (17 శాతం), కూరగాయలు (15 శాతం) ఉన్నాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 9 శాతం, గుడ్ల ధరలు 6 శాతం పెరిగాయి. ⇒ పాన్, పొగాకు, ఇతర మత్తు ప్రేరితాల ధరలు ఏడు శాతం ఎగశాయి. ⇒ దుస్తులు, పాదరక్షలు, హౌసింగ్ ధరలు 5 శాతం ఎగశాయి. ⇒ఇంధనం లైట్ విభాగంలో రేటు 3% పెరిగింది. -
రిటైల్ ధరలు పైపైకి...
♦ డిసెంబర్లో ద్రవ్యోల్బణం 5.61 శాతంగా నమోదు ♦ వరుసగా ఐదో నెలా పెరుగుదల... న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్లో 5.61 శాతం పెరిగింది. అంటే 2014 డిసెంబర్‌తో పోల్చితే 2015 డిసెంబర్లో రిటైల్ ధరల బాస్కెట్ మొత్తం 5.61 శాతం ఎగసిందన్నమాట. గడచిన ఐదు నెలలుగా ఈ రేటు పెరుగుతూ వస్తోంది. నవంబర్‌లో ఈ రేటు 5.41 శాతంగా ఉంది. కూరగాయలు, పప్పు దినుసుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. ఫిబ్రవరి 2న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో... ఈ తరహా గణాంకాలు వెలువడ్డం... తదుపరి రెపో రేటు కోత ఆశలను నీరుకారుస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. జనవరి 2016 నాటికి ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక సగటు లక్ష్యం 6 శాతం. సూచీలో విభాగాలను చూస్తే... ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 6.40 శాతం పాన్, పొగాకు, ఇతర హానికారక ఉత్పత్తుల ధరలు 9.27 శాతం ఎగశాయి దుస్తులు, పాదరక్షల విభాగం రేటు 5.74 శాతం ఎగసింది. హౌసింగ్ విభాగం రేటు 5.06 శాతం పెరిగింది. ఒక్క ఆహార ధరలను చూస్తే... పప్పులు, సంబంధిత ఉత్పత్తుల ధరలు తీవ్రంగా 46% పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 10.83% ఎగశాయి. వంటనూనెల ధరలు 7.06%, కూరగాయల ధరలు 4.63% ఎగశాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 4% పెరిగాయి. పెరిగిన జాబితాలో మాంసం-చేపలు(6.57%), తృణ ధాన్యాలు (2. 12%) ఆల్కాహాలేతర పానీయాలు(4.45%) ఉన్నుుా. చక్కెర ధరలు మాత్రం 6.16% తగ్గాయి. -
రిటైల్ ధరలకు మళ్లీ రెక్కలు..!
- జూన్‌లో 5.4 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం - ఎనిమిది నెలల గరిష్టం న్యూఢిల్లీ: రిటైల్ ధరల జూన్‌లో భగ్గుమన్నాయి. రిటైల్ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో 5.4 శాతంగా నమోదయ్యింది. అంటే 2014 జూన్‌లో ఈ వస్తువుల మొత్తం బాస్కెట్ ధరతో పోల్చితే... 2015 జూన్ నెలలో ఆ బాస్కెట్ ధర 5.4 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఎనిమిది నెలలుగా ఇంత స్థాయిలో ధరలు ఉండడం ఇదే తొలిసారి. ఒక్క చక్కెర, తీపి ఉత్పతులు తప్ప, మిగిలిన అన్ని వస్తువుల ధరలూ ఎంతోకొంత పెరిగాయి. చక్కెర ధరలు అసలు పెరక్కపోగా 8.55 శాతం క్షీణించాయి. పప్పు ధాన్యాల ధరలు మాత్రం భారీగా 22.24 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 9.71 శాతం ఎగశాయి. మేలో రిటైల్ ధరల పెరుగుదల రేటు 5.01 శాతంకాగా, గత ఏడాది జూన్ నెలలో 6.77 శాతం. కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... వచ్చే నెల పావుశాతం రేటు కోత... ఆర్బీఐ రానున్న పాలసీ సమీక్ష(ఆగస్టు 14)లో రెపోరేటును పావు శాతం తగ్గించే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్(బీఓఎఫ్ఏ-ఎంఎల్) అంచనావేసింది. అయితే తగిన వర్షపాత పరిస్థితులు ఉంటేనే ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. కాగా సంస్కరణలకన్నా... తక్షణం రెపో రేటు తగ్గింపే మధ్యకాలికంగా దేశ అభివృద్ధికి దారితీస్తుందని అభిప్రాయపడింది. -
రిటైల్ ధరలు కూల్..
⇒ ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.87 శాతం ⇒ నాలుగు నెలల కనిష్ట స్థాయికి తగ్గుదల.. న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్‌లో 4.87 శాతంగా ఉంది. అంటే 2014 ఏప్రిల్ ధరలతో పోల్చితే ఆయా వినియోగ వస్తువుల బాస్కెట్ రిటైల్ ధరలు 2015 ఏప్రిల్‌లో 4.87 శాతం పెరిగాయన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో ధరల వృద్ధిరేటు నమోదుకావడం నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి. మార్చిలో పోల్చితే ఏప్రిల్‌లో పళ్లు, కూరగాయలు, పాలు, సంబంధిత ఉత్పత్తుల ధరల పెరుగుదల స్పీడ్ తగ్గడం దీనికి కారణం. కాగా మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.25 శాతం. ముఖ్యాంశాలు... ఆహారం, పానీయాల ధరల పెరుగుదల రేటు ఏప్రిల్‌లో 5.36 శాతంగా ఉంది. ఒక్క ఆహార ఉత్పత్తులనే తీసుకుంటే ఈ రేటు మార్చిలో 6.14 శాతం ఉండగా, ఏప్రిల్‌లో 5.11 శాతానికి తగ్గింది. ఈ విభాగాన్ని వేర్వేరుగా చూస్తే- వార్షికంగా చక్కెర (-5.99 శాతం), గుడ్లు (-1.46 శాతం) ధరలు తగ్గాయి. పప్పు దినుసుల ధరలు రెండంకెల స్థాయి (12.52 శాతం)లోనే పెరిగింది. అయితే తృణధాన్యాలు (2.15 శాతం), మాంసం, చేపలు (5.50 శాతం), పాలు-పాల ఉత్పత్తులు (8.21 శాతం), చమురు, వెన్న (1.77 శాతం), పండ్లు (5.08 శాతం), కూరగాయలు (6.63 శాతం), సుగంధ ద్రవ్యాలు (8.70 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (4.68 శాతం) ప్రెపేర్డ్ మీల్స్ (7.68 శాతం) రెండంకెల కన్నా తక్కువ ధరల స్పీడ్‌ను నమోదుచేసుకున్నాయి. ⇒ పాన్, పొగాకు తదితర మత్తుప్రేరిత ఉత్పత్తుల ధరలు 9.22% ఎగశాయి. ⇒ దుస్తులు, పాదరక్షల ధరలు 6.15 శాతం పెరిగాయి. ⇒ హౌసింగ్‌కు సంబంధించి రేటు 4.65 శాతంగా ఉంది. ⇒ ఇంధనం, లైట్ ధరలు 5.60 శాతం ఎగశాయి. -
రిటైల్ ధరలు 3 నెలల కనిష్టం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ధరల పెరుగుదల రేటు వార్షికంగా మార్చిలో 5.17%గా నమోదయ్యింది. అంటే ఈ బాస్కెట్‌లోని మొత్తం వస్తువులు సంబంధిత విభాగాల ధరలు 2014 మార్చి నెలతో పోల్చితే 2015 మార్చిలో 5.17 శాతం పెరిగాయన్నమాట. ఇంత కనిష్ట పెరుగుదల రేటు నమోదుకావడం మూడు నెలల తరువాత ఇదే తొలిసారి. 2014 డిసెంబర్లో ఈ వార్షిక ద్రవ్యోల్బణం రేటు 5 శాతం. జనవరిలో 5.19 శాతం కాగా, ఫిబ్రవరిలో 5.37 శాతం. సోమవారం కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. కూరగాయల ధరలు భారమే... వరుసగా రెండు నెలలతో పోల్చితే(2015 ఫిబ్రవరి, మార్చి) ధరల రేటు తగ్గినప్పటికీ, వార్షికంగా చూస్తే, కూరగాయలు, పప్పు దినుసులు, పాలు-పాల ఉత్పత్తుల ధరలు తీవ్రంగానే ఉన్నాయి. ఫిబ్రవరిలో కూరగాయల ధరలు (వార్షిక ప్రాతిపదికన) 13.01% పెరిగితే, మార్చి నెలలో ఈ రేటు 11.26%. పప్పు దినుసుల ధర లు మార్చిలో వార్షికంగా 11.48% పెరిగాయి. ఫిబ్రవరిలో ఈ రేటు 10.61%గా ఉంది. పాలు- పాల పదార్థాల విషయంలో ఈ రేటు 9.21% నుంచి 8.35%కి తగ్గింది. కాగా, గ్రామీణ ప్రాం తాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.58%గా, పట్టణ ప్రాంతాల్లో 4.75%గా నమోదైంది. -
స్వల్పంగా పెరిగిన ధరలు
డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం * నవంబర్‌లో ఈ రేటు 4.38 శాతం * ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల కారణం న్యూఢిల్లీ: రిటైల్ ధరలు 2014 డిసెంబర్లో స్వల్పంగా పెరిగాయి. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం వృద్ధి రేటు 5 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 డిసెంబర్‌తో పోల్చితే 2014 డిసెంబర్లో రిటైల్ ధరలు 5 శాతం పెరిగాయన్నమాట. 2014 నవంబర్‌లో ఈ రేటు 4.38 శాతంగా ఉంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా ఈ ధరల పెరుగుదల శాతాన్ని లెక్కిస్తారు. డిసెంబర్లో ద్రవ్యోల్బణం పెరగడానికి పళ్లు, కూరగాయలుసహా కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుదలే కారణమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య,పరపతి విధాన సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఈ గణాంకాలు వెలువడ్డాయి. వివిధ విభాగాల్లో ఉత్పత్తుల పెరుగుదల రేట్లు ఇలా... * ఆహార పానీయాల విభాగం మొత్తంగా చూసుకుంటే, ధరలు రెండు వరుస నెలల్లో 3.5 శాతం నుంచి 5 శాతానికి చేరాయి. విడివిడిగా ఉత్పత్తులను చూస్తే, 2014 నవంబర్‌లో కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా (2013 నవంబర్‌తో పోల్చితే) 10.9 శాతం క్షీణించగా, గత డిసెంబర్లో మాత్రం 0.58 శాతం పెరిగాయి * కాగా పట్టణాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.69 శాతం ఉంటే, ఇది డిసెంబర్లో 5.32 శాతానికి చేరింది. గ్రామీణ ప్రాంతంలో ఈ రేటు 4.09 శాతం నుంచి 4.71 శాతానికి చేరింది. -
రిటైల్ ధరల ఊరట..!
సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 6.46% న్యూఢిల్లీ: రిటైల్ ధరలు 2014 సెప్టెంబర్‌లో సామాన్యునికి కొంత ఊరట కలిగించాయి. రిటైల్ ధరల పెరుగుదల రేటు కేవలం 6.46 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ధరలు కేవలం 6.46 శాతం పెరిగాయన్నమాట. ఆగస్టులో ఈ రేటు 7.43 శాతంగా ఉంది. దీపావళి పండుగ ముందు నెలలో ధరల తీవ్రత తగ్గడం- జేబులో కొంత మిగుల్చుకునే ధోరణి నెలకొనడం సామాన్యునికి కొంత ఊరటనిచ్చే అంశమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కింపును 2012 జనవరిలో ప్రారంభించారు. అటు తర్వాత ధరల స్పీడ్ ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. పళ్లు, కూరగాయల ధరలు తగడం మొత్తం సూచీపై సానుకూల ప్రభావం చూపింది. జూలై నుంచీ సీపీఐ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు... * సూచీని వేర్వేరుగా చూస్తే కీలక విభాగాల్లో ఒకటైన ఆహార ఉత్పత్తుల విభాగంలో ధరల పెరుగుదల రేటు 2014 సెప్టెంబర్‌లో 7.67 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు 9.35%. 2013 సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల రేటు ఏకంగా 11.75%. ఒక్క కూరగాయల విభాగం ధరల స్పీడ్ 2014 సెప్టెంబర్‌లో 8.59%గా ఉంది. ఇది ఆగస్టులో 15.15%. పండ్లకు సంబంధించి ద్రవ్యోల్బణం రేటు ఈ 2 నెలల్లో చూస్తే 24.27% నుంచి 22.4%కి తగ్గింది. గుడ్లు, మాంసం, చేపల ధరల పెరుగుదల సైతం ఆగస్టుతో పోల్చితే సెప్టెంబర్‌లో తగ్గింది. * కాగా 2014 సెప్టెంబర్ నెలకు సంబంధించి సీపీఐ ద్రవ్యోల్బణం పట్టణ ప్రాంతాల్లో 6.34 శాతంగా ఉంది. ఇది ఆగస్టులో 7.04 శాతంగా నమోదయ్యింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు ఇదే నెలల్లో 8.27 శాతం నుంచి 6.68 శాతంగా ఉంది. * రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ద్వైమాసిక పరపతి సమీక్షకు సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొంత వరకూ ప్రామాణికంగా తీసుకుంటోంది. 2015 మార్చి నాటికి ఈ రేటు 8 శాతానికి, 2016 మార్చి నాటికి 6 శాతానికి దిగిరావాలన్నది ఆర్బీఐ విధానంగా ఉంది. ఇప్పట్లో రేట్ కట్ లేనట్లే: నిపుణులు సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, ఆర్బీఐ ఇప్పట్లో కీలక పాలసీ రేటును తగ్గించకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరమే (2015-16) ఆర్బీఐ ‘తగ్గింపు’ నిర్ణయం తీసుకోవచ్చని వారు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం సానుకూల రీతిలో ఉన్నప్పటికీ, ఈ ధోరణి కొనసాగుతుందా? లేదా అన్నది సందేహంగా ఉందని డెలాయిట్ ఇండియా సీనియర్ డెరైక్టర్ అనిష్ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ అంశమే ఇప్పుడు కీలకమని సూచించారు. 2015 తొలి ఆరు నెలల కాలంలో రెపో రేటు అరశాతం వరకూ తగ్గే అవకాశం ఉందని బార్క్లేస్ రీసెర్చ్ పేర్కొంది.