రిటైల్ ధరలకు మళ్లీ రెక్కలు..!
- జూన్‌లో 5.4 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం
- ఎనిమిది నెలల గరిష్టం
న్యూఢిల్లీ: రిటైల్ ధరల జూన్‌లో భగ్గుమన్నాయి. రిటైల్ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో 5.4 శాతంగా నమోదయ్యింది. అంటే 2014 జూన్‌లో ఈ వస్తువుల మొత్తం బాస్కెట్ ధరతో పోల్చితే... 2015 జూన్ నెలలో ఆ బాస్కెట్ ధర 5.4 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఎనిమిది నెలలుగా ఇంత స్థాయిలో ధరలు ఉండడం ఇదే తొలిసారి. ఒక్క చక్కెర, తీపి ఉత్పతులు తప్ప, మిగిలిన అన్ని వస్తువుల ధరలూ ఎంతోకొంత పెరిగాయి. చక్కెర ధరలు అసలు పెరక్కపోగా 8.55 శాతం క్షీణించాయి. పప్పు ధాన్యాల ధరలు మాత్రం భారీగా 22.24 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 9.71 శాతం ఎగశాయి. మేలో రిటైల్ ధరల పెరుగుదల రేటు 5.01 శాతంకాగా, గత ఏడాది జూన్ నెలలో 6.77 శాతం. కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం...
వచ్చే నెల పావుశాతం రేటు కోత...
ఆర్‌బీఐ రానున్న పాలసీ సమీక్ష(ఆగస్టు 14)లో రెపోరేటును పావు శాతం తగ్గించే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్(బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) అంచనావేసింది. అయితే తగిన వర్షపాత పరిస్థితులు ఉంటేనే ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. కాగా సంస్కరణలకన్నా... తక్షణం రెపో రేటు తగ్గింపే మధ్యకాలికంగా దేశ అభివృద్ధికి దారితీస్తుందని అభిప్రాయపడింది.