రిటైల్ ధరల ఊరట..!
సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 6.46%
న్యూఢిల్లీ: రిటైల్ ధరలు 2014 సెప్టెంబర్‌లో సామాన్యునికి కొంత ఊరట కలిగించాయి. రిటైల్ ధరల పెరుగుదల రేటు కేవలం 6.46 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ధరలు కేవలం 6.46 శాతం పెరిగాయన్నమాట. ఆగస్టులో ఈ రేటు 7.43 శాతంగా ఉంది.
దీపావళి పండుగ ముందు నెలలో ధరల తీవ్రత తగ్గడం- జేబులో కొంత మిగుల్చుకునే ధోరణి నెలకొనడం సామాన్యునికి కొంత ఊరటనిచ్చే అంశమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కింపును 2012 జనవరిలో ప్రారంభించారు. అటు తర్వాత ధరల స్పీడ్ ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. పళ్లు, కూరగాయల ధరలు తగడం మొత్తం సూచీపై సానుకూల ప్రభావం చూపింది. జూలై నుంచీ సీపీఐ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.
ముఖ్యాంశాలు...
* సూచీని వేర్వేరుగా చూస్తే కీలక విభాగాల్లో ఒకటైన ఆహార ఉత్పత్తుల విభాగంలో ధరల పెరుగుదల రేటు 2014 సెప్టెంబర్‌లో 7.67 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు 9.35%. 2013 సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల రేటు ఏకంగా 11.75%. ఒక్క కూరగాయల విభాగం ధరల స్పీడ్ 2014 సెప్టెంబర్‌లో 8.59%గా ఉంది. ఇది ఆగస్టులో 15.15%. పండ్లకు సంబంధించి ద్రవ్యోల్బణం రేటు ఈ 2 నెలల్లో చూస్తే 24.27% నుంచి 22.4%కి తగ్గింది. గుడ్లు, మాంసం, చేపల ధరల పెరుగుదల సైతం ఆగస్టుతో పోల్చితే సెప్టెంబర్‌లో తగ్గింది.
* కాగా 2014 సెప్టెంబర్ నెలకు సంబంధించి సీపీఐ ద్రవ్యోల్బణం పట్టణ ప్రాంతాల్లో 6.34 శాతంగా ఉంది. ఇది ఆగస్టులో 7.04 శాతంగా నమోదయ్యింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు ఇదే నెలల్లో 8.27 శాతం నుంచి 6.68 శాతంగా ఉంది.
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన ద్వైమాసిక పరపతి సమీక్షకు సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొంత వరకూ ప్రామాణికంగా తీసుకుంటోంది. 2015 మార్చి నాటికి ఈ రేటు 8 శాతానికి, 2016 మార్చి నాటికి 6 శాతానికి దిగిరావాలన్నది ఆర్‌బీఐ విధానంగా ఉంది.
ఇప్పట్లో రేట్ కట్ లేనట్లే: నిపుణులు
సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, ఆర్‌బీఐ ఇప్పట్లో కీలక పాలసీ రేటును తగ్గించకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరమే (2015-16) ఆర్‌బీఐ ‘తగ్గింపు’ నిర్ణయం తీసుకోవచ్చని వారు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం సానుకూల రీతిలో ఉన్నప్పటికీ, ఈ ధోరణి కొనసాగుతుందా? లేదా అన్నది సందేహంగా ఉందని డెలాయిట్ ఇండియా సీనియర్ డెరైక్టర్ అనిష్ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ అంశమే ఇప్పుడు కీలకమని సూచించారు. 2015 తొలి ఆరు నెలల కాలంలో రెపో రేటు అరశాతం వరకూ తగ్గే అవకాశం ఉందని బార్క్‌లేస్ రీసెర్చ్ పేర్కొంది.