న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టానికి పెరిగింది. మే నెలలో ఈ ద్రవ్యోల్బణం 4.87 శాతంగా నమోదైనట్టు ప్రభుత్వ డేటాలో వెల్లడైంది. ఆహార ఉత్పత్తులు, ఇంధన ధరలకు అనుగుణంగా ఏప్రిల్‌లో 4.58 శాతంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం, మే నెలకు వచ్చే సరికి 4.87 శాతంగా నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారంగా ఈ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని గణిస్తారు. గతేడాది ఇదే నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.18 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ధరల విషయంలో సీపీఐను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రధాన అంశంగా తీసుకుంటుంది.
ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాలతోనే మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. గ్లోబల్ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణ అంచనాలను ఇది పెంచింది. అంతేకాక 2018-19కు చెందిన సీపీఐ ద్రవ్యోల్బణ అంచనాలను సైతం ఆర్‌బీఐ సమీక్షించింది. ఏప్రిల్-సెప్టెంబర్‌లో 1.8 శాతం నుంచి 4.9 శాతంగా ఈ ద్రవ్యోల్బణం నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనావేస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో 4.7 శాతంగా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో కూరగాయల ధరలు 8.04 శాతానికి పెరిగాయని, ఇంధన ధరలు 5.80 శాతానికి పెరిగినట్టు ప్రభుత్వ డేటా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment