వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయించాలనే వాదనలు పెరుగుతున్నాయి. ఇటీవల ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదికలో సీపీఐ ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ఠానికి చేరి ఏకంగా 6.1 శాతంగా నమోదైంది. అయితే అందుకు ప్రధాన కారణం ఆహార ద్రవ్యోల్బణం పెరగడమేనని ఆర్‌బీఐ తెలిపింది. సీపీఐ ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయిస్తే మెరుగైన గణాంకాలు కనిపించే వీలుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆహార ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి దీన్ని సీపీఐలో కొనసాగించాల్సిందేనని ఇంకొందరు చెబుతున్నారు.
తగ్గుతున్న పంటల సాగు
దేశవ్యాప్తంగా చాలాచోట్ల విభిన్న వాతావరణ మార్పుల వల్ల ఆశించినమేర వ్యవసాయ దిగుబడి రావడంలేదు. దాంతో ఆహార పదార్థాల సప్లై-చెయిన్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. దానికితోడు ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు ఎత్తివేసింది. దాంతో దళారులు కృత్రిమకొరతను సృష్టించి ధరల పెరుగుదలకు కారణం అవుతున్నారు. వర్షాభావం కారణంగా మహారాష్ట్ర వంటి అధికంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో పంటసాగు వెనకబడుతుంది. వంట నూనెలకు సంబంధించి ముడిఆయిల్ దిగుమతులపై ప్రభుత్వం ఇటీవల సుంకాన్ని పెంచింది. దాంతో నూనె ధరలు అమాంతం పెరిగాయి. పాతస్టాక్‌ను 45 రోజుల్లో క్లియర్ చేసి కొత్త సరుకుకు ధరలు పెంచేలా నిబంధనలున్నాయి. కానీ ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే కంపెనీలు ధరల పెరుగుదలను అమలు చేశాయి.
ప్రకృతి విపత్తుల వల్ల తీవ్ర నష్టం
భౌగోళిక స్వరూపం ప్రకారం భారత్‌లో మొత్తం సుమారు 70 రకాల పంటలు పండించవచ్చని గతంలో పలు సర్వేలు తెలియజేశాయి. కానీ గరిష్ఠంగా దాదాపు 20 రకాల పంటలనే ఎక్కువగా పండిస్తున్నారు. అందులోనూ కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంటలే అధికంగా పండుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షాలు, తుపానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే పంట తీవ్రంగా దెబ్బతింటుంది. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులపై ధరల ప్రభావం పడుతుంది.
ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధం
ఆహార ద్రవ్యోల్బణం కీలకం
ఆర్థికసర్వే సూచనల ప్రకారం ప్రభుత్వం ఆహార ద్రవ్యోల్బణాన్ని సీపీఐ నుంచి తొలగించే ఆలోచన చేయకుండా దాన్ని తగ్గించేందుకు అవసరమయ్యే మార్గాలను అన్వేషించాలని నిపుణులు కోరుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని పెద్దగా పరిగణించరు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు అది కీలకం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment