దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఏరియల్ ట్యాక్సీలు నడిచేందుకు వీలుగా ‘వెర్టిపోర్ట్’(ఎయిర్ టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే ప్రదేశం)లను ఏర్పాటు చేసేందుకు అక్కడి స్థానిక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అంగీకారం తెలిపారు. దాంతో దుబాయ్ మొదటిసారి అర్బన్ ఏరియల్ ట్రాన్స్‌పోర్ట్ సేవలందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది.
3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే వెర్టిపోర్ట్‌లో టేకాఫ్, ల్యాండింగ్ జోన్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, టాక్సీ పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేయనున్నారు. ఏటా సుమారు 1,70,000 మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ప్రపంచ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఎయిర్ కండిషన్డ్ వెర్టిపోర్ట్‌లను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ కంపెనీల సహకారం తీసుకోనున్నారు. జాబీ ఏవియేషన్, సైపోర్ట్ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌కు తమ సేవలందించనున్నాయి. జాబీ ఏవియేషన్ విమానాల తయారీ, కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. స్కైపోర్ట్ మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్వహణను పర్యవేక్షిస్తుంది. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టీఏ) కొత్త ప్రాజెక్ట్‌ను ప్రస్తుత రవాణా వ్యవస్థలతో అనుసంధానిస్తుంది. ఈ ఎయిర్‌ట్యాక్సీ సర్వీసులను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులు
జాబీ ఏవియేషన్ తయారు చేసిన ఏరియల్ టాక్సీ ఎస్4 మోడల్ సున్నా ఉద్గారాలతో పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనంగా ప్రసిద్ధి చెందింది. అది నిలువుగా టేకాఫ్, ల్యాండ్ అవ్వగలదు. దీని గరిష్ట వేగం 321 కిమీ/గం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 160 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఎస్4 ఒక పైలట్, నలుగురు ప్రయాణీకులను తీసుకువెళ్లగలదు. సంప్రదాయ హెలికాప్టర్‌ల కంటే చాలా తక్కువ శబ్దం చేస్తూ ప్రయాణిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆర్‌టీఏ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జీసీఏఏ), దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (డీసీఏఏ), స్కైపోర్ట్, జాబీ ఏవియేషన్‌లు ఏరియల్ టాక్సీ సేవలకు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment